రుమేనియాలో యెహోవా కాలములను రుతువులను మారుస్తున్నాడు
తూర్పు ఐరోపాలో 1989 నందు గొప్ప మార్పులు సంభవించాయి. కంచుకోటలవలె నిలిచిన ప్రభుత్వాలు కొన్ని నెలల్లోనే కుప్పకూలిపోయినవి. రాజకీయ మార్పులతోసహా, ఆర్థిక, సామాజిక మరియు యెహోవాసాక్షులకు మహాగొప్ప ఆసక్తినిచ్చే మతపరమైన మార్పులు సంభవించాయి. ఒకదేశము తరువాత మరొకదేశములో యెహోవాసాక్షులకు అధికార గుర్తింపు, మతపరమైన కార్యక్రమాలు జరుపుకొనే స్వాతంత్ర్యము వారికి ఇవ్వబడింది.
కాని రుమోనియాలో మాత్రం అలా జరగదేమో అనిపించింది. ప్రభుత్వము ప్రజలపై ఎంతటి గట్టిపట్టు కలిగియుండెనంటే మార్పును పురికొల్పే గాలులు దానిపై ఏమంత ప్రభావం చూపవన్నట్లు కనిపించింది. అక్కడున్న యెహోవాసాక్షులు ఇతర తూర్పు ఐరోపా దేశాలలో జరుగుతున్న దానిని గూర్చి విన్నప్పుడు, వారిలా అనుకున్నారు, “హార్‌మెగిద్దోనుకు ముందు మనమెన్నడైనా స్వాతంత్ర్యమును అనుభవించగలమా?” వారి ఆత్మీయ సహోదర సహోదరీలతో క్రైస్తవ కూటములలో కూడుకొనుటకు, బహిరంగంగా సువార్తను ప్రకటించుటకు మరియు తమ బైబిలు ప్రచురణలను ఎల్లవేళల దాచిపెట్టనవసరం లేకుండా బాహాటంగా పఠించేందుకు వారి హృదయాలు పరితపించాయి. అదంతా ఒక కలవలె అనిపించింది.
కాని వారి కల నిజమైంది! అది డిశంబరు 1989లో జరిగింది. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించే రీతిగా, కౌసెస్కూ ప్రభుత్వము హఠాత్తుగా పడిపోయింది. అకస్మాత్తుగా, అక్కడి క్రైస్తవ సహోదరులకు ఉపశమనం దొరికింది. ఏప్రిల్ 9, 1990లో యెహోవాసాక్షులు ఒక మత సంస్థగా చట్టపరమైన గుర్తింపును పొందారు. అక్కడున్న 17,000 చురుకైన సాక్షులకు యెహోవా కాలములను రుతువులను మార్చివేసాడు.—దానియేలు 2:21 పోల్చండి.
దీర్ఘకాల చరిత్ర
కారోల్ సోబో మరియు యోసిఫ్ కిస్, 1911లో అమెరికానుండి రుమేనియాకు తిరిగి వచ్చారు. వారు అమెరికాలో బైబిలు సత్యమును నేర్చుకుని యెహోవా చిత్తమును చేయుటకు తమ జీవితములను సమర్పించుకొన్నారు. వారు తమ దేశవాసులతో సత్యమును పంచుకోవాలనుకున్నారు. రుమేనియా చేరుకోగానే, వారు వెంటనే ప్రకటించుట కారంభించారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు వారు చేస్తున్న సేవనుబట్టి బంధించబడ్డారు. అయినప్పటికి, వారు నాటిన విత్తనములు ఫలితములను ఇవ్వనారంభించాయి. ఆ పిమ్మట 1920లో సేవ తిరిగి సంస్థీకరించబడినప్పుడు, రుమేనియాలో సుమారు 1,800 మంది రాజ్య ప్రచారకులుండిరి.
ఆ సమయానికి బల్కాన్స్ ప్రాంతంలో చెలరేగిన విప్లవాత్మక ధోరణి రుమేనియాలో కూడా అధికంగా కనిపించనారంభించింది, మరి అలజడులు అధికమయ్యాయి. కష్టమైన పరిస్థితులున్నప్పటికీ, మన ఆత్మీయ సహోదరులు పనిని కొనసాగించారు. రుమేనియా, హంగేరి, బల్గేరియా, యుగోస్లావియా మరియు అల్బేనియాల్లో పనిని చూడడానికి వాచ్‌టవర్ సొసైటీ 1924లో క్లుజ్ సపోకాలోని 26 రెజీనా మారియా వీధిలో ఒక కార్యాలయాన్ని తెరిచింది.
అయితే, రాజకీయ పరిస్థితి ఆందోళనకరంగా తయారయింది, మరియు అధికారులనుండి వచ్చే సమస్యలకు తోడు, సంస్థలో కూడా సమస్యలు ఉత్పన్నమైనవి. అప్పటి 1930 ఇయర్ బుక్ ఇలా నివేదించింది: “సొసైటీ అక్కడకు పంపిన వాని విశ్వాసఘాతుకం కారణంగా, స్నేహితులు చెల్లాచెదురయ్యారు, మరియు వారి విశ్వాసము ఎంతగానో సడలింది. సంస్థ ఆ దేశంలో పనిని పునఃస్థాపించే అవకాశం కొరకు కనిపెట్టింది, కాని ప్రాంతీయ అధికారులు ప్రతిదానిని నిషేధించారు, కావున ప్రభువు మనకొరకు ఇంకా అనుకూలమైన మార్గమును ఏర్పరచునంతవరకు మనం వేచియుండవలెను.” ఆ పిమ్మట, 1922లో బాప్తిస్మము తీసుకొన్న రుమేనియా సాక్షియైన మార్టిన్ మాగ్యరోషి 1930లో బ్రాంచి సేవకునిగా నియమించబడ్డాడు, తరువాత కార్యాలయము 33 క్రిసానా స్ట్రీట్, బుకారెస్ట్‌కు తరలించబడింది. సుదీర్ఘ పోరాటం తరువాత చివరకు 1933లో సంస్థ చట్టపరమైన కార్పోరేషన్‌గా రిజిస్టరు చేయబడింది.
కష్టాలు కొనసాగాయి
రుమేనియాలోని సాక్షులకు తీవ్రమైన కష్టాలు కొనసాగాయి. ఇయర్ బుక్ 1936 ఇలా నివేదించింది: “నిస్సందేహంగా రుమేనియాలోని సహోదరులు క్లిష్ట పరిస్థితులందు పనిచేస్తున్నంతగా భూవ్యాప్తముగా వేరెక్కడా పని చేయడంలేదు.” అన్ని సమస్యలున్నప్పటికిని, 1937 సేవా రిపోర్టులో 856 ప్రచారకులుగల 75 సంఘాలు రుమేనియాలో ఉన్నట్టు చూపబడింది. జ్ఞాపకార్థ దినమునకు, 2,608 మంది హాజరయ్యారు.
రెండవ ప్రపంచ యుద్ధం రుమేనియాపై కూడ ప్రభావం చూపింది. సెప్టెంబర్ 1940లో జనరల్ యాన్ ఆన్టోనెస్కు ప్రభుత్వ అధికారమును చేజిక్కించుకుని హిట్లర్ వలెనే పరిపాలించసాగాడు. భయాందోళన కలిగించే చర్యలు సామాన్యమైపోయాయి. మన సహోదరులలో వందలాది మంది, బంధించబడి, కొట్టబడి, హింసించబడ్డారు. సెప్టెంబర్ 1942లో సహోదరుడైన మాగ్యరోసి అరెస్టుచేయబడ్డాడు, కాని ఆయన జైలులోనుండి ట్రాన్సిల్వేనియా పనిని సమన్వయపర్చగలిగాడు.
హిట్లర్ సైన్యాలు 1944లో దేశాన్ని జయించినప్పుడు హింసకొనసాగింది. నాజీ పరిపాలనక్రింద ఉన్న పరిస్థితులను బుకారెస్టునుండి వచ్చిన ఈ నివేదిక వివరించింది: “ఈ దేశములోని యెహోవాసాక్షులు ఘోరంగా హింసించబడ్డారు. కమ్యూనిస్టులతో బందించబడి, కమ్యూనిస్టులకన్నా హీనమైన వారమని హిట్లరుకు మద్దతునిచ్చిన మతనాయకులచేత ఆరోపించబడిన, మాలో అనేకులము, 25 సంవత్సరాల జైలుశిక్ష నుండి యావజ్జీవ కారాగారశిక్ష లేక మరణశిక్షను అనుభవించాము.”
చివరకు యుద్ధం అంతమైంది, మరియు జూన్ 1, 1945లో బుకారెస్టులో సొసైటీ కార్యాలయము నందు పని ప్రారంభించారు. కాగితము సంపాదించుట కష్టమైనప్పటికిని, సహోదరులు 8,60,000 చిన్నపుస్తకములు మరియు 85,000 ప్రతుల ది వాచ్టవర్లను రుమేనియా మరియు హంగేరి భాషలలో ప్రచురించారు. యెహోవా వారి శ్రమను బహుగా ఆశీర్వదించాడు. మరి 1946 వచ్చేసరికి సుమారు 1,630 మంది క్రొత్తవారు బాప్తిస్మం పొందారు. సెప్టెంబర్ 28, 29లో బుకారెస్టులో జరిగిన జాతీయ సమావేశము ఆ సంవత్సరం యొక్క ఉన్నతాంశము. క్రైస్తవ మతనాయకులు అంతరాయము కలిగించుటకు, ఈ సమావేశమును ఆపుచేయుటకు ప్రయత్నించినను వారి ప్రయత్నాలు ఫలించలేదు, కాని 15,000 మంది బహిరంగ ప్రసంగానికి హాజరయ్యారు. రుమేనియాలోని సహోదరులు అటువంటి సమావేశమును మొట్టమొదటిసారిగా నిర్వహించగలిగారు.
సొసైటీ ఆల్ఫ్రెడ్ ర్యూటిమాన్ అనే సహోదరుని స్విస్ బ్రాంచినుండి రుమేనియాకు పంపించింది. ఆగస్టు 1947లో ఆయన 16 ప్రాంతాలలో 4,500 కంటె ఎక్కువమంది సహోదరుల నుద్దేశించి, మున్ముందు జరుగనైయున్న దాని గూర్చి వారిని బలపరుస్తూ ప్రసంగించగల్గాడు. అయితే త్వరలోనే సాక్షులపై మరల వత్తిడులు రానైయున్నవి, ఈసారి కమ్యూనిస్టు పాలననుండి. ఫిబ్రవరి 1948లో అధికారులు మన ముద్రణాపనిని, ప్రకటించు కార్యక్రమమాన్ని నిషేధించారు. తరువాత, 38 ఆలియాన్ స్ట్రీట్‌లో ఉన్న కార్యాలయాన్ని ఆగస్టు 1949లో జప్తుచేశారు. దాని తరువాత సహోదరుడైన మాగ్యరోసితో సహా అనేకమంది సహోదరులు బంధించబడ్డారు. ఈసారి సామ్రాజ్యవాదులని వారిపై ఆరోపణ మోపి వారిని జైలుకు లేక లేబర్ క్యాంపులకు పంపించారు. అటు తరువాత 40 సంవత్సరములవరకు పని నిషేధించబడింది, దానిమూలంగా యెహోవాసాక్షులెంతగానో బాధననుభవించారు. సంస్థలోనేవున్న శత్రుప్రేరేపణా సమస్యలు బాధనధికం చేశాయి. చివరికి 1989లో కౌసెస్కూ ప్రభుత్వము కూలిపోయింది, తద్వారా వారు స్వతంత్రులయ్యారు! తమకు లభించిన స్వాతంత్ర్యములతో వారిప్పుడు ఏమి చేస్తారు?
మరియొకసారి బహిరంగంగా ప్రకటించుట
సాక్షులు సమయమును ఏమాత్రం వృధా చేయలేదు. వెంటనే వారు ఇంటింట ప్రకటించుట మొదలుపెట్టారు. కాని అనేక సంవత్సరాలనుండి ధైర్యముతో రహస్యంగా తటస్థసాక్ష్యమిచ్చిన ఈ సహోదరులకు ఇది అంత సులభమనిపించలేదు. బహిరంగంగా ప్రకటించగల్గుతున్నందుకు వారిప్పుడు బిడియపడుతున్నారు. వారిలో అనేకులు దీనినెప్పుడూ చేయలేదు, వారిలో ఎవరైన చివరిసారిగా ఇంటింట ప్రకటించియుంటే అది 1940 దశకంలోనే. వారు ఎటువంటి ఫలితాలను పొందుతున్నారు? మనం చూద్దాము.
ఇరవైఐదు లక్షల నివాసులున్న రాజధాని నగరమైన బుకారెస్టు ఆరంభించడానికి సముచితమైన స్థలం. రెండు సంవత్సరాల క్రితం ఆ పట్టణంలో కేవలం నాలుగు సంఘాలుండేవి. ఇప్పుడక్కడ పది సంఘాలున్నాయి, మరియు 1992 ప్రభువు రాత్రిభోజన ఆచరణకు 2,100 మంది హాజరయ్యారు. ప్రగతిపూర్వక బైబిలు పఠనములనేకం నిర్వహించబడుతున్నని గనుక మరికొన్ని క్రొత్త సంఘాలు త్వరలో స్థాపించబడవచ్చును.
క్రైయోవా అనే పట్టణము దాదాపు 3,00,000 మంది నివాసులను కలిగి అది దేశానికి దక్షిణ భాగాన ఉంది. పట్టణమంతటిలో 1990 వరకు షుమారు 80 మంది సాక్షులుండేవారు. తరువాత పయినీరు సేవపై ఉత్సాహం పెరిగినందున సేవ వేగం పుంజుకుంది. మరి 1992లోనే 74 మంది వ్యక్తులు బాప్తిస్మము పొందారు, 150 కంటే ఎక్కువ బైబిలు పఠనాలు నిర్వహించబడుతున్నాయి. ఇప్పుడు 200 మంది ప్రచారకులతో వారు ఒక అనువైన రాజ్యమందిరం కొరకు ఆసక్తితో వెదకుతున్నారు.
టిర్గు-మ్యూర్స్లో, సాక్షియైన ఒక సహోదరి ఇద్దరు సహోదరులు, ఆమె పేరును చర్చి సభ్యులజాబితానుండి తీసివేయాలని అడగడానికి ఆర్థడాక్స్ పాదిరి దగ్గరికి వెళ్లారు. వారువచ్చిన ఉద్దేశాన్ని తెలుసుకొన్న తరువాత ఆ పాదిరి వారిని లోనికి ఆహ్వానించాడు, మంచి చర్చ జరిగింది. పిమ్మట ఆ పాదిరి యిలా అన్నాడు: “మీపై నాకు అసూయ కలుగుతుంది కాని చెడుగా కాదు. మీరు చేసే సేవ మేము చేయాల్సింది. ఆర్థడాక్స్ చర్చి నిద్రిస్తున్న రాక్షసిలాంటిదని చెప్పడానికి విచారిస్తున్నాను.” త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే బ్రోషూరును, ది వాచ్‌టవర్‌ను ఆయన స్వీకరించాడు. “నిద్రిస్తున్న రాక్షసితో” ఇప్పుడు తనకెలాంటి సంబంధం లేనందుకు ఆ సహోదరి సంతోషించింది.—ప్రకటన 18:4.
గమనించదగిన విషయమేమనగా ఈనాడు సత్యము నేర్చుకునే వారిలో అనేకులు యౌవనస్థులున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు ఏదో మేలు జరుగుతుందని వారు అపేక్షించారు, కాని వారు నిరుత్సాహపడ్డారు. మన సమస్యలకు కేవలం యెహోవా రాజ్యం మాత్రమే చిరకాల పరిష్కారాన్ని తెస్తుందని తెలుసుకొనుటకు వారు సంతోషించారు.—కీర్తన 146:3-5.
చిన్నస్థలాల్లో గొప్ప సంఘటనలు సంభవిస్తున్నాయి
ఒకోలిష్ ఉత్తర రుమేనియాలోని ఒక చిన్న గ్రామము. పింటేయా మెయిసే అనే పేరుగల వ్యక్తి, యుద్ధబందీగా కొనిపోబడి 1920లో రష్యానుండి తిరిగి వచ్చాడు. అతడు ఒకప్పుడు కాథోలిక్ మతానికి చెందినవాడు, కాని తాను అక్కడినుండి రాకమునుపు బాప్టిస్టు అయ్యాడు. మూడు వారాల తరువాత బైబిలు విద్యార్థులు అని అప్పట్లో పిలువబడిన యెహోవాసాక్షులు ఆయనను దర్శించారు. ఆ దర్శనము తరువాత ఆయన ఇలా అన్నాడు: “నేనిప్పుడు దేవునిగూర్చిన సత్యాన్ని తెలుసుకున్నాను!” మరి 1924 వచ్చేసరికి ఒకోలిష్లో 35 మందిగల గుంపు తయారయింది.
ఈనాడు, అక్కడున్న 473 జనాబాలో, 170 మంది రాజ్య ప్రచారకులున్నారు. ప్రతి ప్రచారకునికి వ్యక్తిగత క్షేత్రముగా రెండు ఇండ్లు నియమించబడ్డాయి, మరి చుట్టు ప్రక్కలనున్న గ్రామాలను కూడా వారు సందర్శిస్తారు. అయినప్పటికి వారు ఆశాభావంతో ఉన్నారు. వారిటీవలనే 400 మంది కూర్చోగల ఒక సుందరమైన రాజ్యమందిరాన్ని నిర్మించారు. దానికి సంబంధించిన పనినంతా ప్రాంతీయ సాక్షులే చేశారు.
సహోదరులు సాబో మరియు కిస్ 1914లో వాలియా లార్గాలో స్థిరపడ్డారు. అందున్న 3,700 మంది జనాబాలో 1991 నాటికి ఎనిమిది సంఘాలు మరియు 582 రాజ్య ప్రచారకులున్నారు. మరి 1992లో జరిగిన జ్ఞాపకార్థ దినమున 1,082 మంది—దాదాపు ఆ లోయ ప్రాంతమందలి ప్రతి ముగ్గురిలో ఒకరు—హాజరయ్యారు.
ప్రత్యేక పయినీర్లు మార్గమును సరాళంచేశారు
మారుమూల ప్రాంతాలలో జీవించు ప్రజలకు సువార్తనందించుటలో ప్రత్యేక పయినీర్లు ప్రముఖ పాత్ర వహించారు. ప్రకటించుటకు స్వాతంత్ర్యము లభించిన వెంటనే యోనెల్ అల్బాన్ రెండు పట్టణాలలో పనిచేయడం ప్రారంభించాడు, ప్రతివారం రెండురోజులు ఒర్సోవాలో, ఐదురోజులు తుర్నూ-సెవరిన్లో ఆయన గడిపేవాడు.
యోనెల్ వచ్చేటప్పటికి ఓర్సొవాలో సాక్షులెవరూలేరు. మొదటి వారంలో ఒక 14 ఏండ్ల అబ్బాయితో అతను బైబిలు పఠనం ప్రారంభించాడు. ఆ అబ్బాయి రెండు నెలల్లోనే ఎన్ని మార్పులు చేసుకున్నాడంటే అతని మిత్రుడు మరొక పొరుగువాడు కూడా పఠించడం మొదలు పెట్టారు. పొరుగువాడైన రోనాల్డ్ కాథోలిక్ మతస్థుడైననూ ఆశ్చర్యకరమైన ప్రగతిని చూపాడు. కేవలం నెలా పదిహేను రోజులకే అతడు యోనెల్తో ప్రకటించుపనికి రావడం మొదలుపెట్టాడు, మరియు ఐదవనెలలో బాప్తిస్మము పొందాడు. వెంటనే అతడు పూర్తికాల సేవలో ప్రవేశించాడు. అతని తల్లి కూడా పఠించనారంభించి, 1992 “వెలుగు ప్రకాశకులు” జిల్లాసమావేశములో బాప్తిస్మము తీసుకుంది. ఇప్పుడు ఒర్సోవాలో పదిమంది ప్రచారకులున్నారు, వారు 30 గృహ బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు.
తుర్నూ-సెవరిన్లో సత్యాన్ని స్వీకరించిన మొదటి వ్యక్తి యోనెల్ నివసిస్తున్న హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేసేవ్యక్తే. రెండునెలల్లోనే అతడు బాప్తిస్మము తీసుకొని ప్రచారకుడయ్యాడు, మరి మూడు నెలల తరువాత బాప్తిస్మము పొందాడు. అతడిప్పుడు అక్కడున్న 32 ప్రచారకులలో ఒకడు, వారందరుకలిసి మొత్తం 84 గృహ బైబిలు పఠనములను నిర్వహిస్తున్నారు.
మరియొక ప్రత్యేక పయినీరు, ఎవరనగా గాబ్రియేలా జేకా, మనపని నిషేధములో ఉన్నపుడు కూడ ఆమె క్రమపయినీరుగా పనిచేసింది. ఎక్కడ అవసరత ఎక్కువ ఉన్నదో అక్కడ పనిచేయాలని ఆమె ఆశించింది. ఆమెకు ఒక పెద్ద క్షేత్రము అప్పగించబడింది. ఆమె కొన్నిసార్లు ఆసక్తిగలవారిని కలుసుకొనడానికి 100 నుండి 160 కిలోమీటర్లు ప్రయాణించేది. ఆమె పనిచేసిన ఒక పట్టణము మోట్రు, అక్కడ కేవలం నలుగురు సాక్షులున్నారు. “మోట్రులో మన పని విస్తృతంగా జరుగనారంభించినపుడు, పాదిరులు యితర మతగుంపులు మమ్మల్ని ఎదిరించ సాగారు,” అని ఆమె చెబుతుంది. “వాళ్లు నగరాధికారిని, పోలీసులను పురికొల్పి నాకు యిల్లిచ్చిన కుటుంబాలపై వత్తిడితెచ్చి నన్ను బయిటికి నెట్టేవారు. అలా ప్రతి రెండునెలలకు నేను వేరే ఇల్లు చూసుకోవాల్సివచ్చేది.”
ఒర్సొవాలో నాకు బైబిలుపైన లేక మతముపైన ఆసక్తిలేదు అని చెప్పిన ఒక నాస్తికురాలితో గాబ్రియేలా బైబిలు పఠనము ఆరంభించింది. అయితే కేవలం నాలుగు నెలలు పఠించిన తరువాత, ఆ స్త్రీ బైబిలును సమర్థించడం మొదలుపెట్టింది. ఒకరాత్రి ఆమె భర్త ఆమెను ఇంటికి రాకుండా తాళమువేసి, విడాకులిస్తానని లేదా చంపుతానని బెదిరించినా, ఆమె తన యథార్థతను కాపాడుకుంది. బాప్తిస్మము పొందకముందే ఆమె పది బైబిలు పఠనములను నిర్వహించింది.
అద్భుత ఉత్తరాపేక్షలు ముందున్నాయి
ఆగష్టు 1992లో రుమేనియాలో 286 సంఘాలలో 24,752 ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్యను చేరుకుంది. జ్ఞాపకార్థ దినమునకు 66,000 కంటె ఎక్కువమంది హాజరయ్యారు. బుకారెస్టులోని చిన్న కార్యాలయంలో 17 మంది తమ ఆత్మీయ సహోదరుల అవసరతలను తీర్చుటకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే వారు పెద్ద బ్రాంచిని నిర్మించ మొదలుపెట్టుటకు ఎదురు చూస్తున్నారు.
రుమేనియాలోని సహోదరులు ఇటీవలి సంవత్సరములలో జరుగుతున్న మార్పులను బట్టి ఆశ్చర్యపడకుండా ఉండలేక పోతున్నారు. వారు యెహోవా నామమును ధరించి ప్రజలకు ఆయనను గూర్చిన ఆయన మార్పులేని సంకల్పములను గూర్చిన అనుభవజ్ఞానము అందిస్తున్న అంతర్జాతీయ సంఘములో భాగమైయున్నందుకు వారాయనకు కృతజ్ఞులైయున్నారు. ఎన్నో సంవత్సరముల హింస, మరియు బాధననుభవించిన తరువాత, యెహోవా కాలములను రుతువులను మార్చినందుకు ఆయనపట్ల వారెంత కృతజ్ఞతాభావాన్ని కలిగియున్నారు!
[23వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
హంగేరి
రుమేనియా
బుకారెస్టు
క్లజ్-నపోకా
క్రైయెవా
టిర్గూ-మ్యూరెస్
ఓర్సొవా
టుర్ను-సెవరిన్
మోట్రు
టుర్డా
బల్గేరియా
[24, 25వ పేజీలోని చిత్రాలు]
1. షుమారు 700 మంది సహోదరులు 1947లో అరణ్యమందు కలుసుకొన్నారు
2. ఒక బహిరంగ ప్రసంగానికి 1946లో యివ్వబడిన ఆహ్వానపత్రము
3. ఆల్బా ఇలియాలో 1992 నందు జరిగిన సమావేశము
4. ఈనాడు క్లుజ్-నపోకాలో సాక్ష్యమిచ్చుట
5. టుర్డా సమీపంలో రాజ్యమందిరము
6. బుకారెస్టులో బేతేలు పరివారము