801 విమానం నుండి తప్పించుకున్నాను
గ్వామ్‌లో దిగేందుకుగాను మేము క్రిందికి వెళ్తుండగా, నేను కిటికీలో గుండా బయటికి చూశాను. ‘వింతగా ఉందే,’ ‘మరీ చీకటిగా ఉందే,’ అనుకున్నాను. నిజమే, అప్పటికి అర్థరాత్రి దాటిపోయింది, భారీ వర్షం వల్ల అంతా మసకగా ఉంది. కానీ దీవిలోని పరిచితమైన లైట్లేవి, ఎయిర్‌పోర్ట్ యొక్క ప్రకాశమానమైన రన్‌వేలు ఏవి? మా జంబో జెట్ రెక్కల నుండి కనిపిస్తున్న మసక లైట్లు మాత్రమే నేను చూడగల్గాను.
విమానం క్రిందికిదిగేందుకు సిద్ధమౌతుండగా మా ఫ్లైట్ అటెండెంట్లు మామూలుగా చేసే అనౌన్స్‌మెంట్ చేశారు. ప్లేన్‌లోని ల్యాండింగ్ గియర్ పడిన శబ్దం విన్నాను. అకస్మాత్తుగా, మా ఎయిర్‌క్రాఫ్ట్ నేలను రాసుకుపోతున్న శబ్దం గట్టిగా వినిపించింది. విమానం నియంత్రణాతీతంగా ఊగిపోయింది, ప్రయాణికులు తమ ఆర్మ్‌రెస్ట్‌లను గట్టిగా పట్టుకుని, “ఏమి జరుగుతోంది?” అని గట్టిగా అరిచారు.
కొన్ని క్షణాల తర్వాత, ఎయిర్‌పోర్ట్‌కు ఐదు కిలోమీటర్ల ఇవతల ఉన్న కొండ మధ్యభాగంలో మా బోయింగ్ 747 ఢీకొంది. అది మా పైలెట్ తప్పుడు అంచనావల్లే అలా జరిగిందన్నది స్పష్టం. 1997, ఆగస్టు 6న జరిగిన ఆ ఎయిర్‌లైన్ ప్రమాదం వల్ల మొత్తం 228 మంది ప్రయాణికులూ, విమాన సిబ్బందిలోని సభ్యులూ మరణించారు. తప్పించుకున్న 26 మందిలో నేను ఒకరిని.
కొరియాలోని, సీయోల్‌లో నేను విమానం ఎక్కకముందు, ఎయిర్‌లైన్ ప్రతినిధి నా కోచ్ సీట్ నియామకాన్ని అప్‌గ్రేడ్ చేసి, ఫస్ట్ క్లాస్‌లో చివరికి మిగిలిన ఒక సీట్‌ను నాకు ఇచ్చాడు. నాకు చాలా సంతోషం కలిగింది, నేను నా భార్య సూన్ డక్‌కు ఫోను చేసి ఈ విషయం చెప్పాను. ఆమె గ్వామ్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో నన్ను కలవనుంది. ఆ సీటు మారడం నేను కలలో కూడా ఊహించలేనంత ప్రయోజనాన్ని చేకూర్చింది.
కూలిపోవడమూ, ఆ తర్వాతి దృశ్యమూ
మసకగా ఉన్నందువల్లే, విమాన సిబ్బంది రానున్న అపాయన్ని తెలుసుకోలేక పోయి ఉండవచ్చు. అంతా అకస్మాత్తుగా జరిగిపోయింది! ఒక్క క్షణం, రాబోతున్న కీడుకు మానసికంగా సిద్ధమయ్యాను. నేను విమానం వెలుపల నేలమీద ఉన్నానన్నది తర్వాత నాకు తెలిసిన విషయం, అయితే అప్పటికీ నేను నా సీటులో బెల్టు బిగించుకున్న అవస్థలోనే ఉన్నాను. స్పృహతప్పిపోయానో లేదో నాకు సరిగా తెలియదు.
‘ఇది కలా?’ అని ఆశ్చర్యపోయాను. అది కల కాదని నేను గ్రహించినప్పుడు, ఇలా విమానం కూలిపోయిందని విన్నప్పుడు నా భార్య ఎలా రియాక్టవుతుందన్నదే నాకు వచ్చిన మొదటి ఆలోచన. తను తన నిరీక్షణను వదులుకోలేదని ఆమె తర్వాత చెప్పింది. కేవలం ఏడు మంది ప్రయాణికులు మాత్రమే సజీవంగా ఉన్నారని ఎయిర్‌పోర్టులో ఎవరో అంటుండగా విన్నప్పుడు కూడా నేను ఆ ఏడుగురిలో ఒకరినని ఆమె నమ్మింది.
మా విమానం నాలుగు విడిభాగాలుగా విరిగిపోయి ఎత్తుపల్లాలుగా ఉన్న అడవి ప్రదేశంలో ఛిన్నాభిన్నంగా పడిపోయాయి. దేహాలు అన్నిచోట్లా చెల్లాచెదరుగా పడిపోయాయి. ఎయిర్‌క్రాఫ్ట్ భాగాలు మంట రగులుకోగా, భయంకరమైన హాహాకారాలు, ఏడ్పులతోపాటు ప్రేలుడు శబ్దాన్ని విన్నాను. “రక్షించండి! రక్షించండి!” అని వేడుకుంటున్న కేకలు వినిపించాయి. నా సీటు ఆరడుగుల ఎత్తున్న సా గ్రాస్ మీద పడింది. భయంకరమైన మంటల్లో నేను దగ్గర్లో ఉన్న నిట్టనిలువైన కొండను చూడగల్గాను. అప్పటికి రాత్రి దాదాపు 2 గంటలయ్యింది. వర్షం పడుతూనే ఉంది.
జరిగినదాన్ని బట్టి ఎంత నిర్ఘాంతపోయానంటే, ఒక చిన్న అమ్మాయి తల పైభాగం తల వెనుక వ్రేలాడివుండడాన్ని చూసేంతవరకూ కూడా నాకు దెబ్బ తగిలివుంటుందన్న విషయం నాకు తట్టలేదు. వెంటనే నా తలదగ్గరకు చేతిని తీసుకువెళ్ళినప్పుడు నా ఎడమ కంటికి పైభాగంలో రక్తం కారుతోందని తెలిసింది. నేను నా శరీరాన్నంతటినీ పరిశీలించి చూడడం మొదలుపెట్టినప్పుడు మరనేక చిన్నచిన్న గాయాలు కనిపించాయి. కానీ, ఏవీ అంత తీవ్రమైనట్లు అనిపించకపోవడం మేలైంది. అయితే, నా కాళ్ళకు నిస్సత్తువతో కూడిన నొప్పి ఉండడంవల్ల కదలడం అసాధ్యమైంది. రెండు కాళ్ళు విరిగాయి.
తర్వాత, నేను ఆసుపత్రి చేరుకున్న తర్వాత, డాక్టర్లు నాకు కలిగిన గాయాలు చాలా “స్వల్పమైనవి” అని చెప్పారు. బ్రతికివున్న మిగిలినవాళ్ళతో పోల్చితే, నిజంగానే అవి స్వల్పమైనవే. ధ్వంసమైన విమాన భాగాల నుండి పైకిలాగబడిన ఒక వ్యక్తి తన కాళ్ళను కోల్పోయాడు. ఇతరులు శరీరం కాలి, తీవ్రమైన వేదనను అనుభవించారు. వాళ్ళలో ముగ్గురు విమానం కూలిపోయినప్పుడు బ్రతికే ఉన్నా, తర్వాతి కొన్ని వారాలు భయంకరమైన వేదనననుభవించి చనిపోయారు.
మంటల గురించి బాధపడడం
నా గాయాల గురించిన బాధకన్నా, రక్షించడానికి వచ్చేవాళ్ళు సమయానికి వస్తారా అన్న చింతే నాకు ఎక్కువయ్యింది. నాకు మొదట ఇవ్వబడిన సీటు ఉన్న విమాన మధ్య భాగాలు అన్నీ దాదాపు పూర్తిగా నాశనమైపోయాయి. మిగిలిన భాగాలు మంటలో పడగా, లోపల చిక్కుకున్న ప్రయాణికులు భయంకరమైన మరణాన్ని అనుభవించారు. సహాయం కొరకైన వాళ్ళ కేకలను నేనెన్నటికీ మరవలేను.
నా సీటు విమానం యొక్క ముందు భాగానికి సమీపంలో ఉంది. నేను చెయ్యి చాచితే అందే దూరంలో కూలిపోయిన విమాన భాగాలు ఉన్నాయి. నేను తల వెనక్కి తిప్పి చూడడం ద్వారా మంటలను చూడగలిగాను. మంటలు త్వరగా నా దాకా రాగలవని భయపడ్డాను. కానీ అలా జరగలేదు.
చివరికి రక్షించబడ్డాను!
క్షణం ఒక యుగంలా గడిచింది. అలా గంటకన్నా ఎక్కువే గడిచిపోయింది. రక్షించడానికి వచ్చిన కొందరు విమానం ఢీకొన్న స్థలాన్ని చివరకు ఉదయం 3 గంటలకు కనుగొన్నారు. కొండమీద నుండి, తాము చూసిన విషయాలను బట్టి తమకు కలిగిన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ వాళ్ళు మాట్లాడుకోవడాన్ని నేను వినగల్గాను. వారిలో ఒకరు ఇలా కేకవేశారు: “ఎవరైనా అక్కడున్నారా?”
“ఇక్కడ నేనున్నాను, రక్షించండి!” అని బదులుగా అరిచాను. మిగతా ప్రయాణికులు కూడా ప్రతిస్పందించారు. రక్షించడానికి వచ్చినవారిలో ఒకరు మరొకరిని “టెడ్” అని సంభోదించాడు. కనుక, “హే టెడ్, నేను ఇక్కడ ఉన్నాను,” అనీ “టెడ్, వచ్చి మాకు సహాయం చెయ్యి!” అని కేకలు పెట్టడం మొదలుపెట్టాను.
“మేము క్రిందికి వస్తున్నాం! కొంచెం వేచి ఉండండి,” అని జవాబు వచ్చింది.
కుండపోతగా కురిసిన వర్షం నిటారుగా ఉన్న ఏటవాళ్ళను దిగడాన్ని ఆటంకపరచింది—బహుశా, ఆ వర్షమే మాలో చాలా మందిని మంటల నుండి కాపాడి ఉండవచ్చు—దాని ఫలితంగా, రక్షించడానికి బయలుదేరిన వ్యక్తులు బ్రతికివున్న వారిని చేరుకునేందుకు మరో గంట పట్టింది. నన్ను కనుగొనడానికి వాళ్ళకు అనంతకాలం పట్టినట్లు నాకనిపించింది.
“మేము ఇక్కడికి చేరుకున్నాం,” అనీ “కంగారు పడవద్దు” అనీ ఫ్లాష్‌లైట్లతో వచ్చిన ఇద్దరు రక్షకులు అన్నారు. మరో ఇద్దరు రక్షకులు వచ్చి వాళ్ళతో చేరారు. వాళ్ళు కలిసి కట్టుగా నన్ను అక్కడి నుండి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. ఇద్దరు నా రెండు రెక్కలను పట్టుకున్నారు. మరో ఇద్దరు చెరో కాలును పట్టుకున్నారు. ఆ విధంగా తీసుకువెళ్ళడం వల్ల విపరీతమైన నొప్పి కలిగింది. ముఖ్యంగా వాళ్ళు మట్టిలో జారిపోతున్నందువల్ల విపరీతంగా నొప్పి కలిగేది. కొంత దూరం వెళ్ళాక వాళ్ళు నన్ను క్రింద పెట్టారు. వారిలో ఒకరు స్ట్రెచ్చర్ కోసం వెళ్ళారు. కొండ శిఖరాన ఉన్న ఆంబులెన్స్ దగ్గరకు తీసుకువెళ్ళే సైనిక హెలికాప్టర్‌లోకి నన్ను తరలించారు.
చివరికి నాభార్యను చూడడం!
ఉదయం 5.30 గంటలకు నేను ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ రూమ్‌కు చేరుకున్నాను. నా గాయాల తీవ్రత వల్ల, ఫోన్ చేయడానికి డాక్టర్లు నన్ను అనుమతించలేదు. కనుక ఆ ఉదయం 10:30 గంటల వరకూ, అంటే, విమానం కూలిపోయిన దాదాపు తొమ్మిది గంటల వరకూ కూడా, నేను తప్పించుకున్నానన్న విషయం నా భార్యకు తెలియలేదు. తప్పించుకున్నవారి లిస్టులో నా పేరు చూసిన ఆమె స్నేహితురాలొకరు ఆమెకు తెలియజేశారు.
సాయంకాలం నాలుగు గంటలకు నన్ను చూడడానికి చివరికి నా భార్యకు అనుమతి లభించినప్పుడు నేను ఆమెను వెంటనే గుర్తుపట్టలేకపోయాను. నొప్పిని మరిపించే మందులవల్ల నా ఇంద్రియాలు మందగించాయి. “బ్రతికి ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు” అన్నది ఆమె చెప్పిన మొట్ట మొదటి మాటలు. మా సంభాషణ నాకు గుర్తులేదు. “కృతజ్ఞతలు నాకు చెప్పవద్దు. యెహోవాకు చెప్పు” అని నేను బదులిచ్చానని తర్వాత నాతో చెప్పారు.
ప్రాధాన్యతలను క్రమంలో ఉంచడం
నేను ఆసుపత్రిలో అస్వస్థత నుండి కోలుకుంటుండగా, నేను అనుభవించిన నొప్పి నాకు సుపరిచితమే. 1987లో గ్వామ్ నుండి కొరియాకు తరలివెళ్ళి ఒక సంవత్సరం కూడా గడవక ముందు, నేను భవన నిర్మాణ ప్రమాదంలో నాలుగవ అంతస్థు నుండి స్కాఫోల్డ్ మీది నుండి పడి నా రెండు కాళ్ళు విరిగాయి. అది నా జీవితంలో ఒక మలుపుగా నిరూపించబడింది. మా అక్క ఒక యెహోవాసాక్షి, బైబిలు పఠించమని ఆమె నన్ను ప్రోద్బలపరచేది. నేను కోలుకుంటున్న ఆ ఆరునెలల వ్యవధిలో ఆ పనిచేసే అవకాశం నాకు లభించింది. దాని ఫలితంగా, ఆ సంవత్సరమే, నేను నా జీవితాన్ని యెహోవా దేవునికి అర్పించుకుని, నా సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా తెలియజేశాను.
విమానం ఢీకొన్నప్పటినుండి, నాకు చాలా ప్రీతికరమైన లేఖనాన్ని గురించి తలస్తున్నాను. ఆ లేఖనం ఇలా చెబుతుంది: “ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:33) విమాన ప్రమాదం నుండి కోలుకుంటుండగా, నా జీవిత విలువను మళ్ళీ మదింపుచేసుకునే అవకాశం నాకు దొరికింది.
చాలా శక్తివంతమైన విధంగా, విమానం 801 తునాతునకలైన సంఘటన జీవితం ఎంత మూల్యమైనదన్న విషయాన్ని నా హృదయంపై చెరగని ముద్రగా చేసింది. నేను చాలా సులభంగా చనిపోయి ఉండేవాడ్ని! (ప్రసంగి 9:11) సాధారణంగా అవసరమైనట్లే, నా శరీరాన్ని బాగు చేయడానికి అనేక ఆపరేషన్‌లు అవసరమయ్యాయి. నేను తిరిగి కోలుకునేందుకు ఒక నెల కన్నా ఎక్కువే ఆసుపత్రిలో గడిపాను.
మన గొప్ప సృష్టికర్తయైన దేవుడు అద్భుతమైన బహుమతిగా ఇచ్చిన జీవితం ఎడల, మానవులు భౌమిక పరదైసులో నిత్యజీవాన్ని ఆస్వాదించేందుకు ఆయన చేసిన ఏర్పాటుతో సహా నాకున్న మెప్పుదలను ఆయనకు చూపించాలని నేను కోరుకుంటున్నాను. (కీర్తన 37:9-11, 29; ప్రకటన 21:3, 4) అలాంటి మెప్పుదలను చూపించే శ్రేష్ఠమైన మార్గం నా జీవితంలో రాజ్యాసక్తులను మొదట ఉంచడంలో కొనసాగడమేనని నేను గ్రహిస్తున్నాను.—ఉచిత వ్యాసం.
[22వ పేజీలోని చిత్రసౌజన్యం]
US Navy/Sipa Press