ప్రపంచ పరిశీలన
బైబిలు చదవడం ప్రయోజనాలను తెస్తుంది
అసోసియేటెడ్ ప్రెస్ నివేదించిన అధ్యయనం ప్రకారం, బైబిలును అంత తరచుగా చదవని వారికన్నా వారానికి కనీసం ఒకసారైనా బైబిలు చదివే అమెరికన్లు మరింత ఆనందంగా, సంతృప్తిగా, జీవితంలో మరి గొప్ప ఉద్దేశం ఉన్నట్లుగా భావిస్తారు. ఇలనోయిజన్ స్టేట్‌లోని మార్కెట్ ఫ్యాక్ట్స్ ఇన్‌కార్పొరేటెడ్ అమెరికాలోని పలుప్రాంతాల్లోని వయోజనులపై నిర్వహించిన సర్వేలో, బైబిలును నెలకొకసారి కన్నా తక్కువగా చదివే 58 శాతం మందితో పోల్చితే, బైబిలును తరచూ చదివే 90 శాతం మంది తమకు ఎల్లవేళలా లేదా చాలా వరకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పారు. అంతేకాక, ఇతరుల అంగీకారాన్ని గురించి విచారించే క్రమంగా బైబిలు చదవని 28 శాతం మందితో పోల్చితే, బైబిలును క్రమంగా చదివేవారిలో 15 శాతం మంది మాత్రమే దాని గురించి విచారిస్తారు. అంత తరచుగా బైబిలు చదవని 22 శాతం మందితో పోల్చితే తరచూ చదివే 12 శాతం మంది మాత్రమే మరణాన్ని గురించి కొన్నిసార్లు లేదా బాగా కలవరపడతారు.
స్వర సంరక్షణ
ఉపాధ్యాయులు మొదలుకొని, తమ స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించే ప్రతి ఒక్కరి స్వరానికి హాని కలిగే, స్వరం కోల్పోయే ప్రమాదముందని ద టొరొంటో స్టార్ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. అలాగే, కోలాహలంగా ఉండే పరిసరాల్లో ఇతరులకు వినిపించేందుకు ఎడతెగక గట్టిగా అరవడం కూడా స్వరతంతువులకు హాని కలిగించగలదు. గుసగుసలాడడం, అలవాటుగా గొంతు సవరించుకుంటూ ఉండడం కూడా మీ స్వరానికి హానికరం కాగలవు అని మాటా మరియు భాషా పాథాలజిస్ట్ అయిన బానీ మ్యాన్ అంటున్నారు. సమస్య తీవ్రంగా మారేదాక చర్య తీసుకోకుండా ఉండవద్దనీ, మెడ మరియు భుజాల్లోని బిగువును సడలించుకునేందుకు సరైన భంగిమలో ఉండాలనీ ఆమె సలహా ఇస్తోంది. ఆమె ఇంకా ఇలా అంటోంది: “అన్నింటికన్నా ముఖ్యంగా మీ గొంతును తడిగా ఉంచుకోవడం ప్రాముఖ్యం.” మీరు మీ స్వరాన్ని చాలా విరివిగా ఉపయోగించవలసి ఉంటే మీరు రోజంతా కూడా కొంచెం కొంచెం నీళ్ళు చప్పరిస్తూనే ఉండాలి.
“ఆఫీస్ జబ్బు”
యూనివర్సిటీ ఆఫ్ సైనా పోస్చర్ సెంటర్ డైరెక్టరైన ప్రొఫెసర్ మౌరీట్సియో రీచార్డ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 80 శాతం కన్నా ఎక్కువ మంది ఇటలీ దేశస్థులు సదా కూర్చుని పని చేసే జీవిత విధానం వల్ల కొన్ని భంగిమల్లో సమస్యలను అనుభవిస్తున్నారు. ఇలా “ఆఫీస్ జబ్బు”తో బాధపడుతున్నవారిలో సగం కన్నా ఎక్కువ మందికి, వెన్నునొప్పి, తలనొప్పి, ఏదో వికారంగా తోచడమూ, తల తిరుగుతున్నట్లు ఉండడమూ, శరీర సమతుల్య సమస్యలు, రక్తపోటులో అస్థిరత, అతిసారం, మలబద్దకము, పెద్దప్రేగు వాపు, జీర్ణకోశ వాపు కూడా ఉన్నాయని ఈల్ మస్సాజెరో వార్తాపత్రిక నివేదిస్తోంది. ఈ సమస్యలను ఎదిరించేందుకుగానూ “పని చేస్తున్న ప్రతి గంటకొకసారి, జపానీయులు మరియు చైనీయులు చిన్న వ్యాయామాలు చేస్తారు” అనీ, “మనకైతే కాఫీ త్రాగే సమయంలో మాత్రమే కాస్త విరామం దొరుకుతుంది” అని రీచార్డీ వ్రాస్తున్నారు.
టిబెట్ వాతావరణాన్ని గమనించడం
ఆసియా-పసిఫిక్ భూభాగంలోని పది దేశాలు ఋతుపవనాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగాలను సంస్థీకరించాయని న్యూ సైంటిస్ట్ పత్రిక నివేదిస్తుంది. ఆసియాలోని పెద్ద ప్రాంతాల్లోని వ్యవసాయం ఋతుపవనాలు తెచ్చే వర్షాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ఋతుపవనాలు ఒక్కో సంవత్సరం మారుతూ ఉంటాయి. టిబెట్ పీఠభూమి ఋతుపవన వర్షాలకు ముఖ్య కారణమని మీటియోరాలజిస్ట్‌లు నమ్ముతారు. కానీ విశ్లేషణకు అవసరమైన సమాచారం టిబెట్ నుండి ఇంతవరకూ రాలేదు. చైనాతో ఒప్పందం చేసుకున్న తర్వాత, టిబెట్‌లోని ఉష్ణోగ్రతను, తేమని, గాలిని, హిమాలయ సంబంధమైన మరితర వాతావరణ కారకాంశాలను పరిశీలించేందుకు ఇప్పుడు ఇక్కడ యంత్రోపకరణాన్ని అమర్చారు. అందిన సమాచారం ఆసియా ఋతుపవనాలను గూర్చిన మెరుగైన అవగాహనకు నడిపిస్తుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.
మందులాగ చీమలు
1947లో యుద్ధం జరుగుతున్నప్పుడు, చైనా మిలటరీ సర్జన్ అయిన వు జీచన్ గాయపడిన సైనికులకు వస్తున్న ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించవలసి వచ్చింది. కానీ ఆయన దగ్గరున్న మందుల స్టాకు అయిపోయింది. నిరాశతో, ఆయన స్థానిక వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. ఆయన సాంప్రదాయ చైనీస్ మందును—గాయాలను శుభ్రం చేసేందుకు చీమలు వేసి మరిగించిన నీటినీ, ప్రత్యేక తరహా చీమల నుండి తయారు చేసిన మందును—నిర్దేశించాడు. చైనా టుడే ప్రకారం, అలా చేయడం వలన కలిగిన ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నందువల్ల, డాక్టర్ వు చీమల వల్ల ఉన్న వైద్య ఉపయోగాలను గురించి పరిశోధించే దీర్ఘకాల వృత్తిని ఆరంభించాడు. చీమల మందులు రోగప్రతిరోధక వ్యవస్థను సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని ఆయన నమ్ముతాడు. ఆయనిలా అంటాడు: “చీమ చిన్నపాటి పోషక గిడ్డంగి. మానవ శరీరానికి అవసరమైన 50 పోషకాలు, 28 అమినో ఆసిడ్‌లూ, విభిన్న ఖనిజాలూ, రసాయనిక మిశ్రమాలూ దానిలో ఉన్నాయి.”
పంజాబీలు మరియు మూత్రపిండంలో రాళ్ళు
ప్రపంచంలోని మరే సమాజంలోని ప్రజలకన్నా ఇండియాలో, పంజాబ్‌లోని అలాగే దాని చుట్టుప్రక్కలా ఉన్న ప్రజలకు ఎక్కువగా మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడే వైనం ఎక్కువగా కనిపిస్తోందని ఇండియా టుడే ఇంటర్‌నేషనల్ నివేదిస్తుంది. పంజాబీలు కష్టపడి పనిచేస్తారనీ, చాలా ఆసక్తిగా భోజనం చేస్తారని పేరు, అయితే కమిలే వేసవి నెలల్లో కావలసినన్ని నీళ్ళు త్రాగరనీ ఆ నివేదిక చెబుతుంది. ఈ కారణాన, ఇటీవలి అంతర్జాతీయ యూరోలజికల్ కాన్ఫరెన్స్ వాళ్ళ ప్రాంతాన్ని ప్రపంచంలోని “రాళ్ళ ప్రాంతం” అని వర్ణించింది. యూరప్, అమెరికాల్లో మూత్రపిండంలోని రాళ్ళ ఒక సెంటీ మీటర్ [అర అంగుళం కన్నా తక్కువ] పరిమాణంతో పోల్చి చూస్తే, ఇక్కడి మూత్రపిండపు రాయి సగటు పరిమాణం రెండు లేదా మూడు సెంటీమీటర్లకు మధ్య [దాదాపు ఒక అంగుళం] ఉంటుంది. అనేక మంది భారతీయులు చిన్న నొప్పులను నిర్లక్ష్యం చేసి, చికిత్సను వాయిదావేసే వైఖరే దీనికి కారణమని నివేదిక చెబుతుంది. ఆరోగ్యవంతులైన ప్రజలు ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల మంచి నీటిని త్రాగాలి అని యూరాలజిస్టులు చెబుతున్నారు.
వలసదారులు మరణించే ప్రమాదం
ప్రతి సంవత్సరం వేలకొలది చట్టవిరుద్ధ వలసదారులు దక్షిణాఫ్రికాలో ఉద్యోగం కొరకైన మరియు మెరుగైన జీవన ప్రమాణం కొరకైన అన్వేషణలో తమ జీవితాలను ప్రమాదంలో పడవేసుకుంటున్నారు. వందలాది మంది లిమ్‌పోపో నది అవతలకు చేరుకునేందుకు ఆ నదిలో ఈదుతుండగా మొసళ్ళు వారిని భక్షించాయని చెప్పబడుతుంది. మిగతావాళ్ళు క్రూగర్ నేషనల్ పార్క్‌లో గుండా కాలినడకన వెళ్తుండగా ఏనుగులు తొక్కివేయడమో, సింహాలు చంపివేయడమో జరిగింది. పార్క్ అధికారులు ఇటీవలే మనుష్య భక్షకులుగా మారిన ఐదు సింహాలను కాల్చి చంపారు. “ఆ ఐదు సింహాలపై పోస్ట్‌మార్టమ్‌లు చేయగా ఆ జంతువుల జీర్ణ వ్యవస్థల్లో మానవ అవశిష్టాలు కనిపించాయి” అని జోహన్నస్‌బర్గ్ వార్తాపత్రికయైన ద స్టార్ నివేదిస్తోంది. క్రూర మృగాలు చంపిన చట్టవిరుద్ధ వలసదారుల కచ్చితమైన సంఖ్య తెలియదు. “క్రమంగా పహరా కాస్తున్నవాళ్ళకు మానవుల అడుగులు కనిపించాయి. కానీ, అవి అకారణంగా ఆగిపోయాయి. పూర్తిగా ఎదిగిన ఒక మగ [సింహం] ఒక్కసారే 70 కిలోగ్రాముల మాంసాన్ని భక్షించగలదు. దానికి రుజువుగా మానవ అవశేషాలు మిగిలే సాధ్యత చాలా తక్కువ. ముఖ్యంగా, సింహం తినగా మిగిలినదానిని సివంగులు, నక్కలు తినడానికి అక్కడికి చేరుకున్న తర్వాతి విషయమైతే ఇక చెప్పనక్కర్లేదు” అని ఆ వార్తాపత్రిక చెబుతుంది.
సహస్రాబ్దం ఇప్పటికే ముగిసిందా?
పండితుల అభిప్రాయం ప్రకారం, “సహస్రాబ్దం ఎన్నో సంవత్సరాల క్రితం ముగిసింది. క్షమించాలి, మనమెవరమూ దాన్ని గ్రహించలేకపోయాము” అని న్యూస్‌వీక్ పత్రిక పేర్కొంటోంది. కారణం? మన క్యాలెండర్ “ఇష్టానుసారంగా చేసిన కాల విభజనపై ఆధారపడి ఉంది,” క్రీస్తు జన్మించిన సంవత్సరం ఏదని ఊహించబడిందో ఆ సంవత్సరంపై ఆధారపడి ఉంది. కానీ, నిజానికి “క్రీస్తు పూర్వం” ఎన్నో సంవత్సరాల క్రితమే యేసు జన్మించాడని ఆధునిక పండితులు నమ్ముతున్నారని ఆ శీర్షిక పేర్కొంటోంది. న్యూస్‌వీక్ ప్రకారం, “మనం ఇప్పటికే మూడవ సహస్రాబ్దంలో ఉన్నామని అర్థం.” ఒక ప్రామాణిక పూజా క్యాలెండర్‌ను తయారు చేయమని పోప్ జాన్ I క్రీ. శ. 525లో నియమించిన డైనోస్యస్ ద షోర్ట్ వల్ల తప్పు జరిగింది. డైనోస్యస్ యేసు జన్మదినాన్ని ముఖ్యమైన రోజుగా ఉపయోగించాలనుకున్నాడు, కానీ దాన్ని లెక్కించడంలో పొరపాటుపడ్డాడు. “యేసు ఎప్పుడు జన్మించాడో చరిత్రకారులకు కచ్చితంగా తెలియదు. ఆయన జన్మదినాన్ని జరుపుకునే క్రిస్మస్ తేదీ కూడా ఇష్టానుసారం నిర్ణయించినదే. చర్చి డిసెంబర్ 25ను ఎంచుకున్నది అన్యులకు సంబంధించిన దక్షిణాయణ వేడుకల అదే సమయంలో వాటికి సరితూగేలా ఉండేందుకేనని పండితులు నమ్ముతున్నారు.” సా. శ. పూ. 2వ సంవత్సరంలో యేసు జన్మించాడని బైబిలు కాలవృత్తాంతం సూచిస్తుంది.
తప్పుదారి పట్టిన భక్తా?
1997, జూన్ 1న, మెక్సికో భూగర్భ రైల్వేస్టేషన్‌లలో ఒకదానిలో ఒక గోడ మీద ఒక చిత్రంలా అనిపించే ఒక ఆకృతి ఏర్పడింది. అది తేమవల్ల ఏర్పడిందన్నది స్పష్టమే. అంకితభావం గల అనేక మంది క్యాథలిక్‌ల దృష్టిలో ఇది గ్వాడలూప్ కన్య—మెక్సీకోలో కన్య మేరీకి ఇవ్వబడిన పేరు—మానవాతీతంగా ప్రత్యక్షమవ్వడమే. “క్యాథలిక్ చర్చి భూగర్భ రైల్వేస్టేషన్ గోడమీది కన్య ప్రత్యక్షతను విశ్వసనీయమైన అద్భుతంగా భావించక, ఆ స్టేషన్ గోడలపై నీళ్ళు దిగి పోవడం వల్లే అలా సహజమైన చిత్రం ఏర్పడిందని భావిస్తుంది” అని ఎల్ యూనీవర్సాల్ అనే వార్తాపత్రిక పేర్కొంది. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు దాన్ని ఆరాధించేందుకు దాని ముందు ఆగుతారు. ఆ ఆకారాన్ని “గంటకు వెయ్యికన్నా ఎక్కువ మంది సందర్శిస్తున్నారు.” ఆ ఆకారం కోసం ఒక చిన్న గూడు నిర్మించబడింది. ఒక క్యాథలిక్ ప్రీస్ట్ దాని ప్రారంభోత్సవం జరిపారు.
మత్తుమందుల వ్యాపారంలో లాభాలు పొందడం
ఐక్యరాజ్య సమితి అభిప్రాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల మంది మత్తుమందు వ్యసనపరులేనని అంచనా. జార్నల్ డ టర్డాలో నివేదించినదాని ప్రకారం, “22.75 కోట్ల వినియోగదార్లు లేదా దాదాపు నాలుగు శాతం ప్రపంచ జనాభా ఆశ్రయించే ట్రాన్క్విలైజర్లు, సెడెటివ్‌లు మొదటి శ్రేణిలో ఉంది. 14.1 కోట్ల మంది వ్యసనపరులు, భూగోళ జనాభాలో మొత్తం 2.5 శాతం మంది ఆశ్రయించే మారవానా రెండవ శ్రేణికి వస్తుంది.” అలాగే చట్టవిరుద్ధ మత్తుమందుల్లో కేవలం 5 నుండి 10 శాతం వరకు మాత్రమే పోలీసులు పట్టుకోగలుగుతున్నారని అంచనా. మత్తుమందుల అమ్మకం ప్రతి సంవత్సరం 400 కోట్ల అమెరికా డాలర్ల లాభమిస్తుంది. కొన్ని లావాదేవీల్లో, వర్తకులు 300 శాతం దాకా కూడా లాభాలను పొందుతున్నారు—“మరే వ్యాపారంలోనూ పొందలేనంత లాభం” అని ఆ వార్తాపత్రిక చెబుతుంది.