కోలుకోవడానికి మార్గం
గుండెపోటు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి భయపడడం, చింతించడం సహజమే. నాకు మరొకసారి గుండెపోటు వస్తుందా? నేను అంగవైకల్యుడనౌతానా లేక నొప్పితోను, శక్తిలేమితోను, నిస్సత్తువతోను ఉండిపోతానా?
మా రెండవ శీర్షికలో పేర్కొనబడిన జాన్, కాలం గడిచే కొలది రోజూ ఉండే అసౌకర్యము, ఛాతీలో నొప్పి ఉపశమిస్తాయని ఎదురుచూశాడు. కానీ కొన్ని నెలల తర్వాత ఆయనిలా అన్నాడు: “ఇప్పటివరకు అవి తగ్గలేదు. నేను త్వరగా అలసిపోవడం, నా గుండె లయతప్పడం వంటివి ‘నాకు మరోసారి గుండెపోటు రాబోతుందా?’ అని తదేకంగా నన్ను నేను ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి.”
యౌవనములో విధవయైన గుండెపోటు వచ్చిన అమెరికావాసి జేన్ ఇలా ఒప్పుకుంది: “నేను జీవించబోనని లేదా నాకు మరొకసారి గుండెపోటు వచ్చి చనిపోతానని అనుకున్నాను. భయాందోళన నన్ను ఆవరించింది, ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలున్నారు. నేను వాళ్లను పెంచాలి.”
జపాన్‌లోని హీరోషీ ఇలా వివరించాడు: “నా గుండె ఇంతకుముందు పనిచేసిన రీతిలో ఇక ఏమాత్రం పనిచేయదని నాకు చెప్పినప్పుడు నేను దిగ్భ్రాంతి చెందాను; నా గుండె పంపుచేసే రేటు 50 శాతం పడిపోయింది. యెహోవాసాక్షుల్లో పరిచారకునిగా ఉన్న నేను నా కార్యకలాపాలను కొంతమట్టుకు తగ్గించాల్సి ఉంటుందని దాదాపు స్పష్టమయ్యింది, ఎందుకంటే నేను ఇంతవరకూ చేస్తున్న దానిలో సగం కంటే తక్కువే చేయగల్గుతున్నాను.”
ఎవరి శక్తి అయినా పరిమితం చేయబడినప్పుడు, వారిని క్రుంగుదల, పనికిరానివారమనే భావనలు ఆవరించవచ్చు. యెహోవాసాక్షుల పూర్తికాల ప్రకటనా పనికి తనను తాను సమర్పించుకున్న మరీ అనే 83 ఏండ్ల ఆస్ట్రేలియావాసి ఇలా విలపించింది: “మునుపటివలె నేను చురుకుగా ఉండలేని నా అసమర్థత నన్ను విషాదభరితురాలిని చేసింది. ఇతరులకు సహాయం చేయడానికి బదులుగా, ఇప్పుడు నాకు సహాయం అవసరం.” దక్షిణ ఆఫ్రికాలోని హరల్డ్ ఇలా వ్యాఖ్యానించాడు: “నేను మూడు నెలల వరకు పని చేయలేకపోయాను. అప్పుడు నేను చేయగల్గిందల్లా కేవలం ఇంట్లోని తోటలో అటూ ఇటూ తిరగడం మాత్రమే. అది నిరాశాజనకమే!”
ఆస్ట్రేలియాలోని థామస్‌కు రెండవసారి గుండెపోటు వచ్చిన తర్వాత బైపాస్ శస్త్రచికిత్స అవసరమైంది. ఆయనిలా అన్నాడు: “నొప్పిని తట్టుకునే శక్తి నాలో లేదు, మరి పెద్ద శస్త్రచికిత్సను పొందడం గురించి నేను తలంచలేకపోయాను.” బ్రెజిల్‌లోని జార్జ్ తన గుండె శస్త్రచికిత్స అయిన తర్వాత ఉన్న పరిస్థితిపై ఇలా వ్యాఖ్యానించాడు: “నా ఆర్థిక దుస్థితి మూలంగా నేను నా భార్యను ఏ ఆధారమూ లేని ఒంటరిదాన్ని చేస్తానేమోనని భయపడ్డాను. నేను ఎంతో కాలం బ్రతకనని భావించాను.”
కోలుకోవడం
అనేకమంది తిరిగి కోలుకోవడానికి, స్థిరంగా ఉండేలా చేయడానికి సహాయపడింది ఏమిటి? జేన్ ఇలా గమనించింది: “నాకు ఆందోళన కల్గినప్పుడల్లా నేను యెహోవాకు ప్రార్థించి, నా భారాలన్నీ ఆయనపైనే మోపి ఆయనకే విడిచిపెట్టేదాన్ని.” (కీర్తన 55:22) చింతలను ఎదుర్కొన్నప్పుడు ఒక వ్యక్తికి అత్యంతావశ్యకమైన శక్తిని, మనఃశ్శాంతిని పొందడానికి ప్రార్థన సహాయం చేస్తుంది.—ఫిలిప్పీయులు 4:6, 7.
జాన్, హీరోషీ పునరుద్ధరించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంచి ఆహారం, వ్యాయామం వారి గుండెలను బలపర్చాయి, ఆ విధంగా వారు తిరిగి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. తాము మానసికంగా, భావోద్రేకంగా తిరిగి కోలుకోవడాన్ని వారు దేవుని ఆత్మయొక్క ఆసరా ఇచ్చే శక్తికి ఆపాదించారు.
తన క్రైస్తవ సహోదరుల మద్దతు ద్వారా థామస్ తన శస్త్రచికిత్స చేయించుకోవడానికి ధైర్యాన్ని పొందాడు. ఆయనిలా అన్నాడు: “ఆపరేషనుకు ముందు ఒక పైవిచారణకర్త నన్ను కలవడానికి వచ్చి, నాతోపాటు ప్రార్థించాడు. నన్ను బలపర్చమని చాలా భావావేశంతో యెహోవాను అడిగాడు. ఆ రాత్రి నేను ఆయన ప్రార్థనపైన అవధానాన్ని నిలిపి అటువంటి పెద్దలను కలిగివుండడం ఎంతో ఆశీర్వాదకరమని భావించాను, భావావేశపూరిత సమయాల్లో ఆయన తదనుభూతి స్వస్థతా ప్రక్రియలో ఒక భాగమయ్యింది.”
ఇటలీలోని ఆన్నా తన క్రుంగుదలను ఈ విధంగా ఎదుర్కొంది: “నేను నిరుత్సాహం చెందినప్పుడు దేవుని సేవకులలో ఒకదానిగా నేను అప్పటికే పొందిన ఆశీర్వాదాలన్నింటి గురించి, దేవుని రాజ్యం క్రింద రాబోయే ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తాను. ఇది నేను ప్రశాంతతను తిరిగి పొందడానికి సహాయం చేస్తుంది.”
మరీ యెహోవా సహాయం నిమిత్తం కృతజ్ఞురాలై ఉంది. ఆమె కుటుంబము ఆమెకు అండగా నిల్చింది, మరి ఆమె ఈ విధంగా చెబుతుంది: “నా ఆత్మీయ సహోదర సహోదరీలు, ప్రతి ఒక్కరికి తాము మోయాల్సిన భారాలున్నా నన్ను సందర్శించడానికి, టెలిఫోనులో మాట్లాడడానికి, లేక కార్డులను పంపడానికి వీలు కల్పించుకున్నారు. ఇంత ప్రేమ చూపించబడుతున్నప్పుడు నేను విషాదంగా ఎలా ఉండగలను?”
ఒంటరి హృదయాలు కాకూడదు
స్వస్థతనొందుతున్న హృదయం ఒంటరి హృదయం కాకూడదని అంటారు. అక్షరార్థంగాను, సూచనార్థకంగాను బాగుపడాల్సిన హృదయాలు ఉన్నవారు కోలుకోవడానికి కుటుంబ మద్దతు, స్నేహితుల మద్దతు ఓ ప్రముఖమైన, అనుకూలమైన పాత్రను నిర్వహిస్తుంది.
దక్షిణ ఆఫ్రికాలోని మైఖేల్ ఇలా వ్యాఖ్యానించాడు: “నిరాశాపూరితులుగా ఉంటే ఎలా ఉంటుందో ఇతరులకు వివరించడం కష్టం. కానీ నేను రాజ్యమందిరంలోనికి వచ్చినప్పుడు, సహోదరులు చూపించే శ్రద్ధ నాకు ఎంతో హృదయానందకరంగాను, ప్రోద్బలంగాను ఉంది.” ఆస్ట్రేలియాలోని హెన్రీ కూడా తన సంఘం వ్యక్తం చేసిన గాఢమైన ప్రేమ, అవగాహన చేత బలపర్చబడ్డాడు. ఆయనిలా అన్నాడు: “ప్రోత్సాహాన్నిచ్చే ఆ మృదువైన మాటలు నాకు నిజంగా అవసరమయ్యాయి.”
జార్జ్ తాను తిరిగి పనిచేయగల్గేంత వరకు తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తూ ఇతరులు చూపించిన లోతైన శ్రద్ధ ఎడల మెప్పుదలను కనపర్చాడు. అదేవిధంగా స్వీడన్‌లోని ఓల్గా తనకు, తన కుటుంబానికి అనేకమంది ఆత్మీయ సహోదర సహోదరీలు ఇచ్చిన ఆచరణాత్మకమైన మద్దతు ఎడల మెప్పుదలను కనపర్చింది. కొందరు తన కొరకు షాపింగ్ చేయగా, ఇతరులు ఆమె ఇంటిని శుభ్రం చేశారు.
తరచూ, గుండెజబ్బు ఉన్నవారు తాము ప్రియంగా ఎంచిన కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని పరిమితం చేయవలసివచ్చింది. స్వీడన్‌లోని స్వెన్ ఇలా వివరించాడు: “విపరీతమైన గాలులు ఉన్నప్పుడు లేక వాతావరణం మరీ చలిగా ఉన్నప్పుడు రక్తనాళాల్లో ఈడ్పు కలుగుతుంది గనుక కొన్నిసార్లు నేను పరిచర్యలో భాగం వహించకుండా ఉండవలసి వచ్చింది. ఈ విషయంలో నా తోటి సాక్షులు చూపించిన అవగాహనను నేను మెచ్చుకుంటాను.” మంచం మీదినుండి లేవలేని పరిస్థితిలో కూడా స్వెన్ కూటాలను వినగల్గేవాడు, ఎలా అంటే సహోదరులు ప్రేమపూర్వకంగా వాటిని టేప్‌పైన రికార్డు చేసేవారు. “సంఘంలోని సంగతులన్నింటి గురించి వారు నాకు చెప్పేవారు, దానిలో నేను పాల్గొన్న వానిగానే భావించేలా అది చేస్తుంది.”
మంచానికే పరిమితమైన మరీ తాను ఎవరితో అయితే బైబిలు పఠనాలు నిర్వహిస్తుందో వారు తన దగ్గరికే వస్తున్నందుకు ఆశీర్వదించబడినట్లు భావిస్తుంది. ఈ విధంగా తాను ఎదురుచూసే అద్భుతమైన భవిష్యత్తు గురించి చర్చించడాన్ని ఆమె కొనసాగించగలదు. థామస్ తన పట్ల చూపబడిన శ్రద్ధ ఎడల కృతజ్ఞుడై ఉన్నాడు: “పెద్దలు ఎంతో దయతో వ్యవహరించారు, వారు నాకు ఇచ్చే నియామకాలను తగ్గించారు.”
కుటుంబాలకు మద్దతు అవసరం
బాధితునికి ఎలా ఉంటుందో అలాగే కుటుంబ సభ్యులకు కూడా పరిస్థితి కష్టతరంగా ఉండవచ్చు. వారు తీవ్రమైన ఒత్తిడికి భయానికి లోనౌతారు. తన భార్య అనుభవించే చింతను గూర్చి దక్షిణ ఆఫ్రికాలోని ఆల్ఫ్రెడ్ ఇలా గమనించాడు: “నేను ఆసుపత్రినుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నేను బాగా ఉన్నానో లేనో చూడడానికి నా భార్య రాత్రిపూట అనేకసార్లు నన్ను నిద్ర లేపేది, ప్రతి మూడు నెలలకు పరీక్ష చేయించుకోవడానికి వైద్యున్ని కలవమని ఆమె నన్ను ఒత్తిడిచేసేది.”
‘హృదయములోని విచారము దాని క్రుంగజేస్తుంది’ అని సామెతలు 12:25 చెబుతుంది. ఇటలీవాసియైన కార్లో తనకు గుండెపోటు వచ్చినప్పటినుండి ప్రేమమయురాలైన, ఆసరా ఇచ్చే తన భార్య “క్రుంగుదలకు లోనైంది” అని అంటున్నాడు. ఆస్ట్రేలియాలోని లారెన్స్ ఇలా అన్నాడు: “మీ జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధవహిస్తున్నారని మీరు నిశ్చయపర్చుకోవాలి. భాగస్వామిపైన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండవచ్చు.” అదే విధంగా, పిల్లలతో సహా కుటుంబంలోని అందరి అవసరాలను మనం మనస్సులో ఉంచుకోవాలి. ఆ పరిస్థితి వారిపైన భావోద్రేకమైన, శారీరకమైన ప్రభావం చూపగలదు.
మా రెండవ శీర్షికలో ప్రస్తావించబడిన జేమ్స్ తన తండ్రి గుండెపోటు తర్వాత మితభాషి అయిపోయాడు. ఆయనిలా అన్నాడు: “నేను ఏమాత్రం సరదాగా ఉండలేనని అనుకునేవాడిని, ఎందుకంటే నేనలా ఉన్న మరుక్షణాన ఏదో కీడు జరిగిపోతుందని భావించేవాడిని.” తన భయాన్ని తన తండ్రికి వ్యక్తపర్చి, ఇతరులతో మంచిగా సంభాషిస్తూ ఉండడం తన ఆందోళనను ఉపశమింపజేయడానికి సహాయపడింది. ఆ సమయంలో జేమ్స్ తన జీవితంపై గొప్ప ప్రభావం కలుగజేసిన ఒక పని చేశాడు. ఆయనిలా అన్నాడు: “నేను నా వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని, మన క్రైస్తవ కూటాలకు సిద్ధపడడానికైన సమయాన్ని పెంచాను.” మూడు నెలల తర్వాత ఆయన తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, దానిని నీటి బాప్తిస్మం ద్వారా సూచించాడు. “అప్పటినుండి, నేను యెహోవాతో చాలా సన్నిహిత సంబంధాన్ని అభివృద్ధి చేసుకున్నాను. ఆయనకు ఎంతో కృతజ్ఞతలు చెప్పాల్సివుంది” అని ఆయన అంటున్నాడు.
గుండెపోటు వచ్చిన తర్వాత, తన జీవితాన్ని పునఃపరిశీలించుకోవడానికి ఒక వ్యక్తికి సమయం ఉంటుంది. ఉదాహరణకు, జాన్ దృక్పథాలు మారాయి. ఆయనిలా అన్నాడు: “లోక ఆశయాల వ్యర్థతను మీరు చూస్తారు, కుటుంబ ప్రేమ, స్నేహితుల ప్రేమ ఎంత ప్రాముఖ్యమన్నది, యెహోవాకు మనం ఎంత ప్రాముఖ్యమన్నది మీరు తెలుసుకుంటారు. యెహోవాతో, నా కుటుంబంతో, నా ఆత్మీయ సహోదర సహోదరీలతో నా సంబంధం ఇప్పుడు మరింత ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.” తాను అనుభవించిన విషమ పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ ఆయనింకా ఇలా అన్నాడు: “ఈ విషయాలు సరిదిద్దబడే సమయం ఉందనే నిరీక్షణ లేకుండా దీనిని ఎదుర్కోవడాన్ని నేను ఊహించలేను. నేను క్రుంగిపోయినప్పుడు నేను భవిష్యత్తును గురించి ఆలోచిస్తాను. ఆ విధంగా ఇప్పుడు ఏమి జరుగుతుందనేది తక్కువ ప్రాముఖ్యమైనదిగా కన్పిస్తుంది.”
గుండెపోటు వచ్చి తప్పించుకున్నవారు కోలుకునే స్థితిలో ఎగుడుదిగుడులను అనుభవిస్తుండగా, తమ విశ్వాసం యేసుక్రీస్తు ప్రార్థించమని చెప్పిన దేవుని రాజ్యంపై దృఢంగా ఉండేలా చేసుకుంటారు. (మత్తయి 6:9, 10) దేవుని రాజ్యం మానవులకు పరదైసు భూమిపైన పరిపూర్ణతతో కూడిన నిత్యజీవితాన్ని తెస్తుంది. అప్పుడు గుండెపోటు మరితర అంగవైకల్యాలు ఇక మరెన్నడూ ఉండకుండా నిర్మూలించబడతాయి. నూతనలోకం అతి సమీపంలో ఉంది. నిజంగానే, జీవితంలోని శ్రేష్ఠమైనది ఇంకా రావలసియున్నది!—యోబు 33:25; యెషయా 35:5, 6; ప్రకటన 21:3-5.
[13వ పేజీలోని చిత్రం]
కోలుకోవడానికి కుటుంబ మద్దతు, స్నేహితుల మద్దతు ఓ అనుకూలమైన పాత్రను నిర్వహిస్తుంది