కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 1/8 పేజీలు 8-10
  • ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వయస్సు, లింగము, వారసత్వము
  • కొలెస్ట్రాల్‌ కారకం
  • కూర్చుని ఉండి పనిచేసే జీవనశైలి
  • అధిక రక్తపోటు, అధిక బరువు, మధుమేహము
  • పొగత్రాగడం
  • ఒత్తిడి
  • మీ ఆహారపుటలవాట్లు అవి మిమ్మల్ని చంపగలవా?
    తేజరిల్లు!—1997
  • హృద్రోగం ప్రాణానికి ముప్పు
    తేజరిల్లు!—1997
  • అధిక రక్తపోటు నివారణ, అదుపు
    తేజరిల్లు!—2002
  • రోగలక్షణాలను గుర్తించి, చర్యగైకొనడం
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 1/8 పేజీలు 8-10

ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు?

కరోనరీ ధమనుల వ్యాధి (CAD) అనేది జన్యు, పరిసర, జీవనశైలి సంబంధమైన అనేక కారకాలతో జోడించబడుతుంది. వీటిలో ఒకటి లేక అంతకన్నా ఎక్కువ కారకాలతో సంబంధముండే ప్రమాదాలనుండి CAD మరియు గుండెపోటులు పరిణమించవచ్చు. ఆ ప్రమాదాలు దశాబ్దాలు కాకపోయినా సంవత్సరాల నుండి ఉంటుండవచ్చు.

వయస్సు, లింగము, వారసత్వము

వయస్సు పెరుగుతుండే కొలది గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దాదాపు 55 శాతం గుండెపోటులు 65 సంవత్సరాలు పైబడిన వారికే వస్తాయి. గుండెపోటుల వలన చనిపోయేవారిలో దాదాపు 80 శాతంమంది 65 లేక అంతకు ఎక్కువ వయస్సు గలవారే.

50 సంవత్సరాలకు తక్కువ వయస్సుగల పురుషులు అదే వయస్సుగల స్త్రీలకంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. మెనోపాజ్‌ తరువాత, సంరక్షక హార్మోన్‌ అయిన ఈస్ట్రోజన్‌లో తీవ్ర తగ్గుదల సంభవించడం వలన స్త్రీకి గుండెపోటు రాగల ప్రమాదం పెరుగుతుంది. కొన్ని అంచనాల ప్రకారం, ఈస్ట్రోజన్‌ను తిరిగి భర్తీ చేసే చికిత్స స్త్రీలలో కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని పెంచినప్పటికీ గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని 40 లేక అంతకు ఎక్కువ శాతం వరకు తగ్గించవచ్చు.

వారసత్వం కీలకమైన పాత్రను పోషించగలదు. 50 సంవత్సరాల వయస్సు రాకముందు తలిదండ్రులకు గుండెపోటు వస్తే వారి పిల్లలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. తలిదండ్రులకు 50 సంవత్సరాల వయస్సు తర్వాత గుండెపోటు వచ్చినప్పటికీ వారి పిల్లలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కుటుంబంలో గుండెకు సంబంధించిన సమస్య ఉంటే సంతానానికీ అటువంటి సమస్యలు ఉండే అవకాశం ఎక్కువ ఉంది.

కొలెస్ట్రాల్‌ కారకం

ఒక రకమైన క్రొవ్వు పదార్థమైన కొలెస్ట్రాల్‌ ప్రాణానికి ఆవశ్యకమైనది. దీనిని కాలేయం ఉత్పత్తి చేస్తుంది, రక్తం లిపోప్రోటీన్‌లు అని పిలువబడే అణువులలో దీనిని కణాల వద్దకు తీసుకెళ్తుంది. లిపోప్రోటీన్‌లు రెండు రకాలు, అవి లో-డెన్సిటీ లిపోప్రోటీన్‌లు (LDL కొలెస్ట్రాల్‌), హై-డెన్సిటీ లిపోప్రోటీన్‌లు (HDL కొలెస్ట్రాల్‌). LDL కొలెస్ట్రాల్‌ రక్తంలో అధికంగా కేంద్రీకృతమైనప్పుడు, కరోనరీ ధమనుల వ్యాధి CADకి కొలెస్ట్రాల్‌ ఒక ప్రమాద కారకంగా తయారౌతుంది.

ధాతువులలోనుండి కొలెస్ట్రాల్‌ను తీసివేసి, దానిని కాలేయం వద్దకు తీసుకుపోవడం ద్వారా HDL సంరక్షక పాత్రను పోషిస్తుందని భావించబడుతుంది, కాలేయం వద్ద ఆ కొలెస్ట్రాల్‌ మార్పు చెంది తరువాత శరీరం నుండి విసర్జించబడుతుంది. ఒకవేళ పరీక్షలలో LDL ఎక్కువవుండి, HDL తక్కువ ఉన్నట్లు తేలితే గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అర్థం. LDL మోతాదును తగ్గించడం వలన ప్రమాదం గణనీయంగా తగ్గవచ్చు. ఆహార నియమాలతో కూడిన చర్యలు చికిత్సకు కీలకం, మరి వ్యాయామం సహాయకరం కాగలదు. వివిధ మందులు మంచి ఫలితాలను తేగలవు, కానీ కొన్ని అవాంఛనీయమైన సైడ్‌ ఎఫెక్టులను కలుగజేయగలవు.a

కొలెస్ట్రాల్‌ మరియు సంతృప్త క్రొవ్వులు తక్కువ ఉన్న ఆహారం సిఫారసు చేయబడుతుంది. వెన్న వంటి సంతృప్త క్రొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అవి తక్కువున్న ఆహారంతో, ఉదాహరణకు కనోలా నూనెను లేక ఆలివ్‌ నూనెను వాడడం LDLను తగ్గించి HDLను స్థిరంగా ఉంచగలదు. మరోవైపు, చాలా మట్టుకు మార్జరీన్‌లలోను, వనస్పతిలోను కనుగొనబడే పూర్తి లేక పాక్షికంగా హైడ్రోజనీకరణం చేయబడిన వంట నూనెలు LDLను పెంచి HDLను తగ్గించగలవని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ చెబుతుంది. క్రొవ్వు అధికంగా ఉన్న మాంసాన్ని తగ్గించి, దానికి బదులుగా తక్కువ క్రొవ్వువున్న చికెన్‌ లేక టర్కీ మాంసాన్ని తీసుకోమని సిఫారసు చేయబడుతుంది.

అధ్యయనాలు విటమిన్‌ E, బీటా-కెరోటీన్‌, విటమిన్‌ Cలు జంతువులలో ఎథిరోస్‌క్లీరోసిస్‌ గతిని తగ్గించగలదని చూపించాయి. ఇవి మానవుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలను కూడా తగ్గించగలవని ఒక అధ్యయనం నిర్ధారించింది. బీటా-కెరోటిన్‌, మరితర కెరోటినాయిడ్లు మరియు విటమిన్‌ C సమృద్ధిగా ఉన్న టమాటోలు, ముదురాకుపచ్చ ఆకుకూరలు, మిరియాలు, క్యారెట్లు, చిలగడ దుంపలు వంటి కూరగాయలు, పుచ్చకాయ వంటి పండ్లు CAD నుండి కొంత రక్షణను అందించగలవు.

విటమిన్‌ B6, మెగ్నీషియమ్‌లు కూడా ఉపయోగపడతాయని చెప్పబడుతుంది. బార్లీ, ఓట్‌లు వంటి పూర్ణ ధాన్యాలు, ఆలాగే చిక్కుడు, లెంటిల్‌ గింజలు, మరితర గింజలు, విత్తులు సహాయకరంగా ఉండగలవు. వీటికితోడు, సాల్మన్‌, మాకెరల్‌, హెరింగ్‌, లేక ట్యూనా వంటి చేపలను కనీసం వారానికి రెండు సార్లు తినడం CAD వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదని తలంచబడుతుంది, ఎందుకంటే వీటిలో ఒమేగా-3 బహుళాసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి.

కూర్చుని ఉండి పనిచేసే జీవనశైలి

కూర్చుని ఉండి పనిచేసే ప్రజలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. వారు దినంలో ఎక్కువ భాగం శారీరకంగా క్రియాశీలురై ఉండరు, క్రమంగా వ్యాయామం చేయరు. ఇంట్లో పని, తోట పని కష్టపడి చేయడం, జాగింగ్‌ చేయడం, బరువైన వస్తువులు ఎత్తడం, లేక మంచును తొలగించడంవంటి శ్రమతో కూడిన పనులు చేస్తే ఇలాంటి వారికి తరచు గుండెపోటులు వస్తాయి. కానీ క్రమంగా వ్యాయామం చేసేవారికి ప్రమాదం తగ్గుతుంది.

వారానికి మూడు లేక నాలుగుసార్లు 20 నుండి 30 నిమిషాలు వడిగా నడవడం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదు. క్రమంగా వ్యాయామం చేయడం గుండెకున్న పంపు చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది, కొలెస్ట్రాల్‌ మోతాదులను తగ్గించి, రక్తపోటును తగ్గించగలదు.

అధిక రక్తపోటు, అధిక బరువు, మధుమేహము

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌) ధమనుల గోడలను గాయపరిచి, ధమనుల లోపలి పొరలోకి LDL కొలెస్ట్రాల్‌ ప్రవేశించేలా చేసి, ప్లాక్‌ పేరుకుపోవడాన్ని అభివృద్ధి చేయగలదు. ప్లాక్‌ నిక్షేపాలు పెరుగుతుండే కొలది, రక్త ప్రవాహం ఎక్కువగా నిరోధించబడుతుంది, అందువలన రక్తపోటు పెరుగుతుంది.

రక్తపోటును క్రమంగా పరీక్ష చేయించుకోవాలి, ఎందుకంటే బయటకు కన్పించే సూచనలు ఏమీ ఉండకపోవచ్చు. డయాస్టోలిక్‌ ఒత్తిడి (క్రింది సంఖ్య)లో ఒక్కో పాయింటు తగ్గే ప్రతీసారీ, గుండెపోటు వచ్చే ప్రమాదం 2 నుండి 3 శాతం తగ్గించబడగలదు. రక్తపోటును తగ్గించడానికి మందులు తీసుకోవడం ప్రభావవంతంగా ఉండగలదు. బరువును తగ్గించుకోవడానికి క్రమంగా వ్యాయామం చేయడంతోపాటు ఆహార నియమాలను పాటించడం—కొన్ని కేసుల్లో ఉప్పును తగ్గించడం—అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయం చేయగలదు.

అధిక బరువు అధిక రక్తపోటును, క్రొవ్వు పదార్థాలలో అసాధారణ మోతాదులను వృద్ధి చేయగలదు. స్థూలకాయాన్ని నివారించడం లేక దానికి చికిత్స చేయించుకోవడం మధుమేహాన్ని నివారించడానికి ఒక ప్రాథమిక మార్గం. మధుమేహం CAD రావడాన్ని వేగిరపర్చి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది.

పొగత్రాగడం

CAD వృద్ధి చెందడానికి సిగరెట్టు త్రాగడం ఒక బలమైన కారకంగా ఉంటుంది. అమెరికాలో, హృద్రోగాలతో సంభవించే మరణాలలో దాదాపు 20 శాతానికీ, 55 సంవత్సరాలకు తక్కువ వయస్సుగల స్త్రీలలో ఇంచుమించు 50 శాతం గుండెపోటులకు సిగరెట్లు త్రాగడమే అసలైన కారణం. సిగరెట్టు త్రాగడం రక్తపోటును పెంచి నికోటిన్‌, బొగ్గుపులుసు వాయువు వంటి విషయుక్త రసాయనాలను రక్త ప్రవాహంలోనికి ప్రవేశపెడ్తుంది. తత్ఫలితంగా ఈ రసాయనాలు ధమనులకు నష్టం వాటిల్లజేస్తాయి.

పొగత్రాగేవారు తాము విడిచే పొగను పీల్చేవారిని కూడా ప్రమాదానికి గురిచేస్తారు. పొగత్రాగే వారితో కలిసి జీవించే పొగత్రాగని వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువలన, పొగత్రాగడం మానివేయడం ద్వారా ఒక వ్యక్తి ప్రమాదం నుండి తనను తాను కాపాడుకోవడం మాత్రమే కాక పొగత్రాగని తన ప్రియమైన వారి జీవితాలను కూడా కాపాడగలడు.

ఒత్తిడి

తీవ్రమైన భావోద్రేక లేక మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆరోగ్యవంతమైన ధమనులు ఉన్నవారికన్నా CAD ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం, దానివలన ఆకస్మిక మరణంపాలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, ప్లాక్‌తో నిండివున్న ధమనులను ఒత్తిడి సంకుచితం చేయగలదు, ఇది రక్త ప్రవాహాన్ని 27 శాతం వరకు తగ్గిస్తుంది. వ్యాధి తీవ్రత అంతగా లేని ధమనులలో కూడా ఇలా సంకుచితమవ్వడం ప్రాముఖ్యంగా కనబడింది. తీవ్రమైన ఒత్తిడి ధమనుల గోడలలోని ప్లాక్‌ విచ్ఛేదమయ్యే వాతావరణాన్ని సృష్టించవచ్చని మరొక అధ్యయనం సూచించింది.

కన్స్యూమర్‌ రిపోర్ట్స్‌ ఆన్‌ హెల్త్‌ ఇలా అంటుంది: “కొంతమంది చెడు వైఖరితో జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నట్లు ఉంది. వారు రంధ్రాన్వేషులు, కోపపడతారు, ఊరికే ఉద్రేకపడతారు. అనేకమందైతే విసుగు తెప్పించే చిన్న విషయాలను అలక్ష్యం చేయగా, ఉద్రేకులు న్యాయోచితం కాని రీతిలో అతిగా ప్రతిస్పందిస్తారు.” విపరీతమైన కోపము, ఉద్రేకము రక్తపోటును హెచ్చించి, గుండె రేటును పెంచి, కొలెస్ట్రాల్‌ను రక్తప్రవాహంలోనికి వెల్లువలా ప్రవహించేలా కాలేయాన్ని ప్రేరేపిస్తుంది. ఇది కరోనరీ ధమనులను నష్టపరచి, CADకి దోహదపడుతుంది. కోపం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని రెండింతలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు, ఇది కనీసం రెండు గంటల వరకు కొనసాగే అత్యంత ప్రమాదకరమైనదిగా ఉంది. ఏది సహాయం చేయగలదు?

ద న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రకారం, భావోద్రేక సంఘర్షణల్లో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించేవారు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోగలరు అని డా. మరీ మిటల్‌మన్‌ అన్నాడు. ఇది శతాబ్దాల క్రితం బైబిలులో నమోదు చేయబడిన మాటలవలెనే ధ్వనిస్తుంది: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము.”—సామెతలు 14:30.

ఒత్తిడితో ఉండడమంటే ఏంటో అపొస్తలుడైన పౌలుకు తెలుసు. ప్రతిదినము తాను అనుభవించిన చింతల గురించి ఆయన మాట్లాడాడు. (2 కొరింథీయులు 11:24-28) కానీ ఆయన దేవుని నుండి సహాయాన్ని పొంది, ఇలా వ్రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”—ఫిలిప్పీయులు 4:6, 7.

గుండె సమస్యలకు సంబంధించిన ఇతర కారకాలు కూడా ఉన్నప్పటికీ, ఇక్కడ చర్చించబడినవి ఒక వ్యక్తి సరైన చర్యను గైకొనగల్గేలా ప్రమాదాన్ని గుర్తించడానికి సహాయం చేయగలవు. అయితే గుండెపోటు వచ్చిన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందన్న విషయం గురించి కొందరు ఆలోచించారు. కోలుకోవడం ఎంతవరకు సాధ్యమౌతుంది?

[అధస్సూచీలు]

a తేజరిల్లు! వైద్య, వ్యాయామ, లేక ఆహార నియమాలతో కూడిన చికిత్సలను సిఫారసు చేయదు కానీ చక్కని పరిశోధన చేయబడిన సమాచారాన్ని అందిస్తుంది. ప్రతివ్యక్తి తాను చేయదల్చుకున్నది తానే నిర్ణయించుకోవాలి.

[9వ పేజీలోని చిత్రాలు]

పొగత్రాగడం, ఊరికే కోపపడడం, క్రొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని తినడం, ఎప్పుడూ కూర్చుని ఉండే జీవితాన్ని గడపడం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి