రోగలక్షణాలను గుర్తించి, చర్యగైకొనడం
గుండెపోటు లక్షణాలు కన్పించినప్పుడు వెంటనే వైద్య సహాయం పొందడం కీలకం, ఎందుకంటే గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే మరణం సంభవించే ప్రమాదం అత్యంత అధికంగా ఉంటుంది. త్వరితగతిన చికిత్సను పొందడం గుండె కండరాన్ని మరలా మరమ్మతు చేయలేని నష్టం నుండి కాపాడుతుంది. గుండె కండరం ఎంతగా రక్షించబడితే, గుండెపోటు తర్వాత అంత ప్రభావవంతంగా గుండె రక్తాన్ని పంపు చేస్తుంది.
అయితే, కొన్ని గుండెనొప్పులు పైకి ఎటువంటి లక్షణాలు కనపర్చకుండా వస్తుంటాయి. ఈ కేసుల్లో ఒక వ్యక్తి తనకు కరోనరీ ధమనుల వ్యాధి (CAD) ఉందన్న విషయం గుర్తెరుగకపోవచ్చు. విషాదకరంగా, కొంతమందికి గుండె సమస్య ఉందన్న విషయం పెద్ద గుండెపోటు రావడంతోటే తెలియవచ్చు. కార్డియాక్ అరెస్టు సంభవించినప్పుడు (గుండె పంపు చేయడం ఆపివేస్తుంది), సంరక్షక సిబ్బందిని వెంటనే పిలిచి, ప్రథమ చికిత్సగా కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) అప్పటికప్పుడు అన్వయించకపోతే బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.
CAD లక్షణాలు ఉన్న అనేకమందిలో దాదాపు సగం మంది వెంటనే వైద్య సహాయం పొందడానికి నిరాకరిస్తారని హార్వర్డ్ హెల్త్ లెటర్ నివేదిస్తుంది. ఎందుకు? “సాధారణంగా ఎందుకంటే వారు తమ రోగలక్షణాలు ఏమి సూచిస్తున్నాయో గుర్తించరు లేక వాటిని గంభీరంగా తీసుకోరు.”
గుండెపోటు బాధితుడును, యెహోవాసాక్షులలో ఒకడును అయిన జాన్a ఇలా ప్రాధేయపడుతున్నాడు: “మీకు వంట్లో బాగా లేదని మీరు గ్రహించినప్పుడు, అతిగా నటిస్తున్నట్లుగా కనబడతారని భయపడి వైద్య సహాయం పొందడంలో మీరు ఆలస్యం చేయవద్దు. నేను కావలసినంత త్వరగా చర్య తీసుకోలేదు గనుక నేను నా ప్రాణాన్ని పోగొట్టుకున్నంత పనయ్యింది.”
ఇదీ జరిగింది
జాన్ ఇలా వివరిస్తున్నాడు: “నాకు గుండెపోటు రావడానికి ముందు సంవత్సరంన్నర క్రితం నాకున్న అధిక కొలెస్ట్రాల్ గురించి ఒక వైద్యుడు నన్ను హెచ్చరించాడు, ఇది CADలోని పెద్ద ప్రమాద కారకం. కానీ నేను ఆ విషయాన్ని లెక్క చేయలేదు. ఎందుకంటే నా వయస్సు 40 లోపే గనుక యౌవనంగా ఉన్నాను, మంచి ఆరోగ్యంతో ఉన్నాను అని భావించాను. నేను అప్పుడు చర్య తీసుకోలేదని చాలా బాధపడుతున్నాను. శారీరకంగా శ్రమపడినప్పుడు ఊపిరి అందకపోవడం, అజీర్తి మూలంగా కల్గాయని నేను అనుకున్న నొప్పులు, గుండెపోటు రావడానికి కొన్ని నెలల ముందు తీవ్రమైన అలసట రావడం వంటి ఇతర హెచ్చరికా సూచనలు నాకు కన్పించాయి. వీటిలో చాలామట్టుకు నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి ఎక్కువ ఉండడమేనని అనుకున్నాను. నాకు గుండెపోటు రావడానికి మూడు రోజుల ముందు నాకు ఛాతీలో వచ్చిన నొప్పి కండరాల ఈడ్పు అని అనుకున్నాను. మూడు రోజుల తర్వాత విపరీతంగా వచ్చే దానికి ముందు వచ్చిన చిన్న గుండెపోటు అది.”
గుండెపోటు వచ్చే వారిలో దాదాపు సగం మందికి ఆంజైనా అని పిలువబడే ఛాతీ నొప్పి లేక ఒత్తిడి హెచ్చరికనిస్తుంది. కరోనరీ స్తంభనం మూలంగా సరిపడినంత ప్రాణవాయువు గుండెకు అందడం లేదన్నదాన్ని సూచించే లక్షణాలుగా కొంతమందికి ఊపిరి అందకపోవడం లేక అలసిపోవడం, బలహీనత కలగడం జరుగుతాయి. గుండెను పరీక్ష చేయించుకోవడానికి ఈ హెచ్చరికా సూచనలు ఎవరినైనా వైద్యుని దగ్గరికి వెళ్లేలా చేయాలి. డా. పీటర్ కోన్ ఇలా పేర్కొంటున్నాడు: “ఒక్కసారి ఆంజైనాకు చికిత్స చేయబడితే, గుండెపోటు నివారించబడుతుందన్న గ్యారెంటీ లేదు, కానీ కనీసం త్వరలోనే గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.”
గుండెపోటు
జాన్ ఇలా కొనసాగిస్తున్నాడు: “ఆ రోజు మేము సాఫ్ట్‌బాల్ ఆడడానికి వెళ్తున్నాము. మధ్యాహ్న భోజనం కొరకు ఒక హామ్‌బర్గర్‌ను, వేయించిన బంగాళాదుంపలను గబగబా తిని వెళ్తుండగా కాస్త అసౌకర్యంగా, వికారంగా, శరీరం పైభాగంలో బిగుతుగా ఉన్నట్లుగా అనిపించినా అంతగా పట్టించుకోలేదు. కానీ బంతాట ఆడే పార్కుకు చేరుకుని, ఆడడం మొదలుబెట్టినప్పుడు, ఏదోలావుందన్నది మాత్రం చెప్పగల్గాను. ఆ మధ్యాహ్నం నుండి పరిస్థితి క్షీణిస్తున్నట్లు అనిపించింది.
“అనేకసార్లు నేను ఆటగాళ్ల బెంచీలపైన వెల్లకిలా పడుకుని నా ఛాతీ కండరాలను సడలించడానికి ప్రయత్నించాను, కానీ అవి మరింత బిగుసుకుపోనారంభించాయి. నేను ఆడుతుండగా, ‘బహుశ నాకు ఫ్లూ వచ్చినట్లుంది’ అనుకున్నాను, ఎందుకంటే కొన్నిసార్లు జ్వరం వచ్చినట్లుగాను, బలహీనంగాను భావించాను. నేను పరుగెత్తినప్పుడు నాకు ఊపిరి అందకపోవడం స్పష్టంగా తెల్సింది. నేను మరలా బెంచిపైన పడుకున్నాను. నేను లేచి కూర్చున్నప్పుడు, నేను గంభీరమైన సమస్యలో చిక్కుకున్నానన్నది స్పష్టమయ్యింది. నా కుమారుడు జేమ్స్‌తో, ‘నేను ఆసుపత్రికి వెళ్లాలి, ఇప్పుడే!’ అని కేకవేసి చెప్పాను. నా ఛాతీ లోపలికి కుదించుకుపోయినట్లు భావించాను. నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే నేను పైకి లేవలేకపోయాను. నేననుకున్నా, ‘ఇది గుండెపోటు అయ్యుండదులే, అదిగానీ కాదు కదా? నాకు కేవలం 38 సంవత్సరాలేనే!’”
అప్పుడు 15 సంవత్సరాలవాడైన జాన్ కుమారుడు ఇలా వివరిస్తున్నాడు: “కొద్ది నిమిషాల్లోనే మా నాన్న తన శక్తిని కోల్పోయాడు, అందుకని మేము ఆయనను కారు దగ్గరికి ఎత్తుకుని తీసుకెళ్లవలసి వచ్చింది. తాను అనుభవిస్తున్న స్థితిని గురించి ఆయనకు తెల్పుతూ ఉండడానికి నాన్నను ప్రశ్నలను అడుగుతూ, నా స్నేహితుడు కారును నడిపాడు. చివరికి, నాన్న జవాబు చెప్పలేదు. ‘జాన్!’ నా స్నేహితుడు అరిచాడు. అయినా నాన్న ఇంకా ప్రతిస్పందించలేదు. తరువాత మెలికలు తిరిగిపోతూ వాంతులు చేసుకుంటూ నాన్న తన సీట్లో నుండి అదిరిపడ్డాడు. ‘నాన్నా! నువ్వంటే నాకెంతో ఇష్టం! దయచేసి చనిపోకు నాన్నా!’ అని నేను పదేపదే అన్నాను. తనకు అకస్మాత్తుగా వచ్చిన ఈ నొప్పి తరువాత, ఆయన శరీరమంతా కారు సీట్లో నిస్సత్తువగా పడివుంది. ఆయన చనిపోయారని నేను అనుకున్నాను.”
ఆసుపత్రివద్ద
“మేము సహాయం కోసం ఆసుపత్రిలోపలికి పరుగెత్తాము. నాన్న చనిపోయారని నేను అనుకున్న తరువాత రెండు మూడు నిమిషాలు గడిచిపోయాయి, కానీ ఆయన బ్రతికేలా చేయవచ్చని నేను ఆశించాను. బంతాట ఆడే పార్కు దగ్గరున్న దాదాపు 20 మంది తోటి యెహోవాసాక్షులు వేచివుండు గదిలో ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. వారు నన్ను ఆదరించారు, ప్రేమను చూపారు, అది అటువంటి దుఃఖదాయక సమయంలో గొప్ప సహాయాన్ని అందించింది. దాదాపు 15 నిమిషాల తర్వాత, ఒక వైద్యుడు వచ్చి, ‘మేము మీ నాన్నగారు బ్రతికేలా చేయగల్గాము, కానీ ఆయనకు పెద్ద గుండెపోటు వచ్చింది. ఆయన బ్రతుకుతాడని మేము రూఢీగా చెప్పలేము’ అని వివరించాడు.
“తర్వాత నేను నాన్నను కొంచెంసేపు చూడడానికి ఆయన అనుమతించాడు. మా కుటుంబం కొరకైన నాన్నగారి ప్రేమ వ్యక్తీకరణలు నన్ను ముంచెత్తాయి. గొప్ప బాధతో ‘బాబూ, నీపట్ల నాకూ ఎంతో ప్రేమ ఉంది. మన జీవితాల్లో యెహోవా అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తియని ఎల్లప్పుడూ గుర్తుంచుకో. ఆయనను సేవించడాన్ని ఎన్నడూ ఆపకు, నీ తల్లీ, సహోదరులు ఆయనను సేవించడాన్ని ఎన్నడూ ఆపకుండేలా సహాయం చేయి. మనకు పునరుత్థానమందు దృఢమైన నిరీక్షణ ఉంది, మరి నేను చనిపోయినా, నేను తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్నందరినీ చూడాలనుకుంటున్నాను’ అని అన్నాడు. మేమిద్దరమూ ప్రేమా, భయము, నిరీక్షణలతో కూడిన అశ్రువులను రాల్చుతున్నాము.”
జాన్ భార్య మేరీ ఒక గంట తర్వాత అక్కడకు చేరుకుంది. “నేను అత్యవసర గదిలోనికి వెళ్లినప్పుడు, ‘మీ భర్తకు పెద్ద గుండెపోటు వచ్చింది’ అని వైద్యుడు అన్నాడు. నేను విభ్రాంతి చెందాను. జాన్ గుండె ఎనిమిది సార్లు డిఫిబ్రిల్లేట్ చేయబడిందని ఆయన వివరించాడు. ఈ డిఫిబ్రిల్లేట్ ఒక అత్యవసర చర్య. ఈ ప్రక్రియలో గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడాన్ని ఆపి, సాధారణ లయను పునరుద్ధరించడానికి ఎలక్ట్రికల్ వోల్టేజిని ఉపయోగించడం ఇమిడివుంటుంది. CPR, ప్రాణవాయువు సరఫరా, ఇంట్రావీనస్ మందులతోపాటు డిఫిబ్రిల్లేషన్ అనేది ప్రాణాన్ని కాపాడే ఒక ఆధునికమైన పద్ధతి కూడా ప్రయోగించబడింది.
“నేను జాన్‌ని చూసినప్పుడు, నా హృదయం ఆవేదనతో ద్రవించిపోయింది. ఆయన ముఖం పాలిపోయి ఉంది, ఆయన శరీరానికి అనేక నాళాలు, వైర్లు ఉన్నాయి. అవి మానిటర్లకు అమర్చబడ్డాయి. మా ముగ్గురు కుమారుల కోసం అయినా ఈ పరీక్షను తట్టుకోవడానికి శక్తినివ్వమని నేను యెహోవాకు మౌనంగా ప్రార్థించాను, ముందుముందు జరగనైయున్న వాటి విషయమై జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి నడిపింపునివ్వమని కూడా ప్రార్థించాను. నేను జాన్ పడక దగ్గరికి వస్తుండగా నేను, ‘ఇటువంటి సమయంలో నీ ప్రియమైనవానికి ఏమి చెబుతావు? మేము నిజంగా ప్రాణాపాయకరమైన పరిస్థితి కొరకు సిద్ధపడివున్నామా?’ అని అనుకున్నాను.
“‘ప్రియతమా, నేను బ్రతుకకపోవచ్చన్న విషయం నీకు తెలుసు. కానీ నీవు, నీతోపాటు పిల్లలూ యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం ప్రాముఖ్యం, ఎందుకంటే త్వరలోనే ఈ విధానం అంతమౌతుంది, మరి తర్వాత రోగాలుండవు మరణం ఉండదు. నేను ఆ నూతన విధానంలో మేల్కొని నిన్ను, మన పిల్లల్ని అక్కడ చూడాలనుకుంటున్నాను’ అని జాన్ అన్నాడు. మా ముఖాలపై కన్నీళ్లు కాలువల్లా ప్రవహించాయి.”
వైద్యుడు వివరిస్తున్నాడు
“వైద్యుడు తర్వాత నన్ను వేరుగా పిల్చి, పూర్వ అవరోహిత ఎడమ ధమని (లెఫ్ట్ ఆంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ)లో వంద శాతం అవరోధం ఏర్పడడం వల్ల జాన్‌కు గుండెపోటు వచ్చిందని పరీక్షలు చూపించాయని వివరించాడు. ఆయనకు మరొక ధమనిలో కూడా అవరోధం ఏర్పడింది. జాన్ చికిత్స విషయమై నేను ఒక నిర్ణయం తీసుకోవాలని వైద్యుడు నాకు చెప్పాడు. అందుబాటులో ఉన్న రెండు ఎంపికలు ఏమిటంటే మందులు వాడడం మరియు ఆంజియోప్లాస్టీ. రెండవది మంచిదని ఆయన అభిప్రాయపడడంతో మేము అంజియోప్లాస్టీనే ఎంచుకున్నాము. కానీ ఇటువంటి గుండెపోటును తట్టుకుని బ్రతికేవారు చాలా తక్కువ గనుక వైద్యులు వాగ్దానాలేమీ చేయలేదు.”
ఆంజియోప్లాస్టీ అనేది బుడగ వంటి కొన ఉన్న గొట్టం ఒక కరోనరీ ధమనిలోనికి చొప్పించబడి, తరువాత అవరోధాన్ని తెరవడానికి అది వ్యాకోచించేలా చేసే ఒక శస్త్రచికిత్సా పద్ధతి. రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడంలో ఈ ప్రక్రియ మంచి ఫలితాలను సాధించింది. అనేక ధమనుల్లో అవరోధం ఎక్కువగావుంటే సామాన్యంగా బైపాస్ శస్త్రచికిత్స సిఫారసు చేస్తారు.
అంధకారంతో నిండివున్న భవిష్యత్తు
ఆంజియోప్లాస్టీ చేసిన తరువాత, జాన్ జీవితం తరువాతి 72 గంటల వరకూ త్రాసులో ఊగిసలాడుతూ ఉంది. చివరికి, ఆయన గుండె విషమ పరిస్థితి నుండి కోలుకోవడం మొదలుపెట్టింది. కానీ జాన్ గుండె మునుపటి కంటే సగం సామర్థ్యంతో మాత్రమే పంపు చేస్తుంది. మరి దానిలో ఎక్కువ భాగం స్కార్ టిష్యూగా తయారయ్యింది, కాబట్టి గుండె సంబంధిత వైకల్యంగల వానిగా అయ్యే అవకాశం దాదాపు అనివార్యంగా ఉంది.
సింహావలోకనం చేసుకుంటూ జాన్ ఇలా సలహా ఇస్తున్నాడు: “హెచ్చరికలను లక్ష్యపెట్టి, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం మన సృష్టికర్తకు, మన కుటుంబాలకు, మన ఆత్మీయ సహోదర సహోదరీలకు, మరియు మనకు మనమే బద్ధులమై ఉన్నాము. ప్రత్యేకంగా ఒకవేళ మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఇది మరింత వాస్తవమై ఉంటుంది. సంతోషానికి లేక దుఃఖానికి మనమే ఎక్కువమట్టుకు కారకులము కాగలము. ఎంపిక మనదే.”
జాన్ కేసు తీవ్రమైంది, సత్వర అవధానం ఇవ్వవలసి వచ్చింది. కానీ గుండెలోనిమంటవంటి అసౌకర్యంగా ఉండే అన్ని సందర్భాలలో వైద్యుని దగ్గరకు పరుగెత్తాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, ఆయన అనుభవం ఒక హెచ్చరిక, తమకు రోగలక్షణాలు ఉన్నాయని భావిస్తున్నవారు పరీక్ష చేయించుకోవాలి.
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఏమి చేయగలం? తరువాతి శీర్షిక దీన్ని చర్చిస్తుంది.
[అధస్సూచీలు]
a ఈ శీర్షికలలోని పేర్లు మార్చబడ్డాయి.
[6వ పేజీలోని బాక్సు]
గుండెపోటు లక్షణాలు
• ఒత్తుతున్నట్లు, పిండేస్తున్నట్లు, లేక ఛాతీలో కొద్ది నిమిషాల కంటె ఎక్కువసేపు నొప్పి ఉన్నట్లూ అసౌకర్యంగా ఉండే ఒక భావన. అజీర్తి వలన గుండెలో కల్గే తీవ్రమైన మంట అని పొరబడే అవకాశముంది
• దవడ, మెడ, భుజాలు, చేతులు, మోచేతులు, లేక ఎడమ అరచేయి వంటి శరీర భాగాలకు వ్యాపించగల నొప్పి లేక వీటిలో కేవలం ఒకదానిలో మాత్రమే ఉండే నొప్పి
• కడుపు పైభాగంలో సుదీర్ఘంగా ఉండే నొప్పి
• ఊపిరి అందకపోవడం, తలతిరగడం, స్పృహ కోల్పోవడం, చెమటలు పట్టడం, లేక జ్వరం వచ్చినట్లు అనిపించడం
• అలసట—బహుశ గుండెపోటుకు కొన్ని వారాలముందే దాన్ని అనుభవించవచ్చు
• వికారము లేక వాంతులు
• అలసిపోయినందున కాక తరచూ ఛాతీనొప్పులు రావడం
లక్షణాలు తీవ్రమైనవి కావచ్చు, కాకపోవచ్చు. గుండెపోటు వచ్చిన ప్రతి ఒక్కరిలో ఇవన్నీ సంభవించకపోవచ్చు. కానీ వీటిలో ఏవైనా కొన్ని కలిసి వస్తే త్వరగా సహాయం పొందండి. అయితే, కొన్ని సందర్భాలలో లక్షణాలు కన్పించవు; వీటినే నిశ్శబ్ద గుండెపోటులు అంటారు.
[7వ పేజీలోని బాక్సు]
బ్రతకడానికి గైకొనవల్సిన చర్యలు
మీరు లేక మీకు తెలిసినవారు ఎవరైనా గుండెపోటు లక్షణాలను కనబరిస్తే:
• లక్షణాలను గుర్తించండి.
• మీరు ఏ పని చేస్తున్నా సరే దాన్ని ఆపివేసి, కూర్చోండి లేక పడుకోండి.
• లక్షణాలు కొద్ది నిమిషాల కంటే ఎక్కువసేపు ఉన్నప్పుడు, స్థానిక అత్యవసర టెలిఫోను నెంబరుకు ఫోను చేయండి. గుండెపోటు వచ్చినట్లు మీరు అనుమానిస్తున్నారని అవతలి వ్యక్తికి చెప్పి, మీరెక్కడున్నారో కనుగొనడానికి అవసరమైన సమాచారాన్నివ్వండి.
• మీరే వాహనాన్ని నడిపిస్తూ బాధితున్ని ఆసుపత్రి ఎమర్జెన్సీ గదికి మరింత త్వరగా తీసుకెళ్లగల్గితే తీసుకువెళ్లండి. మీకు గుండెపోటు వచ్చిందని మీకనిపిస్తే, మిమ్మల్ని అక్కడికి వాహనంలో తీసుకెళ్లమని ఎవరినైనా అడగండి.
అత్యవసర వైద్య సిబ్బంది కొరకు మీరు వేచివుంటే:
• బెల్టు లేక టైతోపాటుగా బిగుతుగా ఉన్న బట్టలు వదులు చేయాలి. బాధితుడు సౌకర్యంగా ఉండేలా చూడండి. అవసరమైతే తలదిండ్లను ఆసరాగా పెట్టండి.
• ప్రశాంతంగా ఉండండి, మీరు బాధితులైనా లేక సహాయకులైనా. ఉద్రేకం చెందడం ప్రాణానికి ముప్పు వాటిల్లజేసే ఎరిథ్మియా సంభవించే అవకాశాన్ని పెంచగలదు. ప్రశాంతంగా ఉండడానికి ప్రార్థన శక్తిని చేకూర్చగల సహాయకంగా ఉండగలదు.
ఒకవేళ బాధితుడు ఊపిరి పీల్చుకోవడం ఆపేస్తున్నట్లనిపిస్తే:
• పెద్ద స్వరంతో, “నేను మాట్లాడేది మీకు వినబడుతుందా?” అని అడగండి. ప్రతిస్పందన లేకపోయి, బాధితుడు ఊపిరి పీల్చుకోకపోతుంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR)ను మొదలుపెట్టండి.
• CPRలోని మూడు ప్రాథమిక చర్యలను గుర్తుంచుకోండి:
1. బాధితుని గడ్డాన్ని పైకి లేపండి, ఇలా చేయడం ద్వారా గాలి కొరకు మార్గం సరాళమౌతుంది.
2. గాలి కొరకు మార్గం సరాళమైన తర్వాత, బాధితుని ముక్కును మూసి ఉంచుతూ, ఛాతీ ఎత్తుగా వచ్చేంత వరకు రెండు సార్లు నోట్లోనికి నెమ్మదిగా ఊదండి.
3. గుండెలోనుండి, ఛాతీలోనుండి రక్తాన్ని బయటికి త్రోసివేయడానికి చన్మొనల మధ్యనున్న ఛాతీని 10 నుండి 15 సార్లు నొక్కండి. ఊపిరి తిరిగి అందేంత వరకు లేక అత్యవసర సిబ్బంది వచ్చేంత వరకు, రెండు సార్లు గాలి ఊది, 15 సార్లు నొక్కుతూ, ఇలా ప్రతి 15 క్షణాలకు ఒకసారి చేస్తూ కొనసాగించండి.
CPRను చేయడంలో శిక్షణ పొందిన వారిచే అది చేయబడాలి. కానీ శిక్షణ పొందిన వారెవరూ అందుబాటులో లేనప్పుడు, “అసలు ఎవరూ లేకపోవడం కన్నా ఎవరో ఒకరు CPRను చేయడం నయం” అని అత్యవసర హృద్రోగ చికిత్స డైరెక్టరు డా. ఆర్. కమింజ్ అంటున్నాడు. ఎవరో ఒకరు ఈ చర్యలను చొరవ తీసుకుని ప్రారంభించకపోతే బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సహాయం అందేంత వరకూ CPR వ్యక్తిని సజీవంగా ఉంచుతుంది.
[5వ పేజీలోని చిత్రం]
గుండెపోటు వచ్చిన తర్వాత వెంటనే చేసే చికిత్స ప్రాణాన్ని కాపాడి, గుండెకు వాటిల్లే నష్టాన్ని తగ్గించగలదు