బైబిలు ఉద్దేశము
భార్య చూపించే విధేయత దాని భావం ఏమిటి?
దేవుని వాక్యమైన బైబిలు ఎఫెసీయులు 5:22 నందు ఇలా చెబుతుంది: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.” కచ్చితంగా దీని భావం ఏమిటి? ఏది ఏమైనా భర్త కోరిన ప్రతి దాన్నీ భార్య అంగీకరించాలా? ఆమె ఎప్పుడూ చొరవ తీసుకోకూడదా లేక అతని అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉండలేదా?
అబీగయీలును గురించిన బైబిలు వృత్తాంతాన్ని పరిశీలించండి. ఆమె జ్ఞానంతో ప్రవర్తించింది, అయితే ఆమె సంపన్నుడైన భర్త నాబాలు అభిప్రాయాలకు భిన్నంగా ప్రవర్తించింది. దేవుడు దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా ఎంచుకున్నాడు. దావీదు అనుచరులు నాబాలు ఎడల దయ చూపినప్పటికీ, “అతడు వారితో కఠినముగా మాట లాడెను.” నాబాలు యొక్క కృతఘ్నతనుబట్టి ఉగ్రుడైన దావీదు అతన్ని చంపేందుకు సంసిద్ధమయ్యాడు. తన కుటుంబమంతా ప్రమాదంలో ఉందని అబీగయీలు గ్రహించింది. ఆమె దావీదును చల్లబర్చింది. ఎలా?—1 సమూయేలు 25:2-35.
నాబాలు ‘పనికిమాలిన వాడని’ అబీగయీలు దావీదు ఎదుట అంగీకరించింది మరియు నాబాలు ఇవ్వకుండా వెనుదీసిన భోజన పదార్థాలను ఆమె దావీదుకు ఇచ్చింది. సాధారణంగా, భర్త గానీ భార్య గానీ తన జత యొక్క లోపాలను గురించి అందరి ముందూ మాట్లాడటం తప్పే. ఆ విధంగా మాట్లాడటంలో ప్రవర్తించటంలో అబీగయీలు తిరుగుబాటుదారురాలయ్యిందా? లేదు. ఆమె నాబాలు ప్రాణాన్ని, అతని కుటుంబపువారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ఎల్లప్పుడూ అమర్యాదగా ప్రవర్తించేదని లేక స్వతంత్రురాలిగా ఉండేదని ఎక్కడా సూచించబడలేదు. సులభంగా ప్రీతి చెందని నాబాలు, తన పెద్ద ఎస్టేటును చూసుకునే విషయంలో ఆమె చేసే సహాయాన్ని గూర్చి ఎలాంటి అసంతృప్తినీ వ్యక్తం చేయలేదు. అయితే ఈ విపత్కర పరిస్థితిలో, ఆమె తన స్వంతగా చొరవ తీసుకోవడమే జ్ఞానయుక్తం. అంతేకాక, అబీగయీలు చేసిన దాని గురించి బైబిలు అంగీకారపూర్వకంగా మాట్లాడుతుంది.—1 సమూయేలు 25:3, 25, 32, 33.
అబీగయీలు కాలానికి ఎంతో ముందు, పితరుల భార్యలు తమ భర్తలు కోరిన దానికి భిన్నమైన దృక్పథాలను వ్యక్తం చేసిన సందర్భాలు, చర్యలను గైకొన్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ, “దేవుని ఆశ్రయించిన” ఈ “పరిశుద్ధ స్త్రీలు” విధేయత విషయంలో క్రైస్తవ స్త్రీలకు మాదిరులుగా ఉన్నారు. (1 పేతురు 3:1-6) ఉదాహరణకు, అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు మూలంగా తమ కుమారుడైన ఇస్సాకునకు ముప్పు వాటిల్లేటట్లుందని శారా గమనించినప్పుడు, ఇష్మాయేలును పంపివేయాలని ఆమె తీర్మానించుకుంది. ఆ విషయం “అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.” అయితే దేవుడు అబ్రాహాముకు ఇలా చెప్పాడు: “ఈ చిన్నవానిబట్టి . . . నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము.”—ఆదికాండము 21:11, 12.
వివేకము అవసరము
అది ఎంతో అవివేకమైనదని లేక దైవిక సూత్రాలకు విరుద్ధమైనదని తనకు తెలిసినా విధేయత పేరుతో దాన్ని చేసేందుకు ఒత్తిడి చేయబడుతున్నానని భావించడం భార్యకు మంచిది కాదు. అబీగయీలు మరియు శారాలు చేసిన విధంగా ఏదైనా ఒక ప్రాముఖ్యమైన విషయంలో చొరవ తీసుకున్నందుకు తాను తప్పు చేశానని ఆమె భావించేలా చేయబడకూడదు.
భార్య చూపించే విధేయత అంటే ఆమె భర్త కోరిన ప్రతి దాన్నీ అంగీకరించాలని కాదు. దీనిలో తేడా ఏమిటి? సరైన సూత్రాలకు ముప్పు వాటిల్లే సమయంలో, ఆమె తన భర్తతో తను ఏకీభవించడం లేదని వ్యక్తం చేయవచ్చు. అయినప్పటికీ, మొత్తం మీద భార్య చూపించే విధేయతా స్ఫూర్తిని ఆమె చూపాలి.
అయితే భార్య బుద్ధిపూర్వకంగా, పగతో లేక ఇతర చెడు దృక్పథంతో తన భర్త కోరికలను పెడచెవిని పెట్టకుండా జాగ్రత్త వహించాలి. ఆమె వివేకం కలిగి ఉండాలి, అబీగయీలు వలె “సుబుద్ధిగలదై” ఉండాలి.—1 సమూయేలు 25:3.
భర్త బాధ్యతవహించేందుకు నిరాకరిస్తే
భార్య చూపించే దైవిక విధేయత వెనుకగల ప్రాథమిక లక్ష్యం, స్ఫూర్తి ఏమంటే, తన భర్తతో సహకరించడం మరియు ఆయన నిర్ణయాలకు మద్దతునివ్వడం ద్వారా యెహోవాను ప్రీతిపర్చడమే. భర్త ఆత్మీయంగా పరిణతి చెంది ఉంటే అది చాలా సులభం. అతను అలా ఉండకపోతే అది ఒక సవాలుకాగలదు.
ఈ పరిస్థితిలో ఆమె ఎలా వ్యవహరించగలదు? ఆమె అతన్ని హృదయపూర్వకంగా వేడుకోవచ్చు లేక కుటుంబానికి ఏ నిర్ణయాలు అత్యంత ప్రయోజనకరం కాగలవో సలహా ఇవ్వవచ్చు. అతనే ‘నావను నడిపేలా’ ఆమె అనుమతిస్తే, బహుశ అతడు దానిలో మరింత సమర్థుడు కావచ్చు. భర్తను ఎడతెగక వేధించడం సరైన విధేయతా స్ఫూర్తిని భంగపర్చుతుంది. (సామెతలు 21:19) అయినప్పటికీ, అతని పద్ధతి ద్వారా కుటుంబ సంక్షేమానికి ముప్పు వాటిల్లేలా ఉంటే, శారా చేసిన విధంగా ఆమె సరైన మార్గాన్ని గురించి సలహా ఇవ్వవచ్చు.
ఒకవేళ భర్త అవిశ్వాసి అయితే, భార్యకుగల సవాలు మరింత కష్టతరమైనది అవుతుంది. అయినా, ఆమె బైబిలు నియమాలను ఉల్లంఘించాలని అతడు కోరనంతవరకూ ఆమె అతనికి విధేయురాలై ఉంటుంది. ఒకవేళ అతడలా చేస్తే, ఒక క్రైస్తవ భార్య యొక్క ప్రతిస్పందన, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించమని ఒక న్యాయసభ శిష్యులను అడిగినప్పుడు వారు ఇచ్చిన ఈ సమాధానం వలె ఉండాలి: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.”—అపొస్తలుల కార్యములు 5:29.
అయితే, అనుభవం లేకపోవడం పరిమిత జ్ఞానం మూలంగా, సమర్థులైన భర్తలు మరియు భార్యలు కూడా తమ హద్దులు మీరవచ్చు. భర్త ఆమెను పరిగణించకపోవచ్చు; భార్య తన మాటే చెల్లాలని మొండిపట్టు పట్టవచ్చు. ఏది సహాయం చేస్తుంది? “అనేకవిషయములలో మనమందరము తప్పి”పోతాము గనుక, ఇరువురు కూడా తమను గురించి తాము తక్కువగా అంచనావేసుకోవడం ప్రాముఖ్యం.—యాకోబు 3:2.
ఒక భార్య ఆలోచనాపూర్వకంగా యథార్థమైన చొరవ తీసుకుంటే అనేకమంది పురుషులు దాన్ని క్రమేపి ఇష్టపడతారు. ఒకవేళ ఇరువురూ తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పుకుంటే సహకారం వృద్ధి అవుతుంది. మన అనుదిన తప్పిదాలను యెహోవా క్షమిస్తున్న విధంగా మనం కూడా ఇతరులను క్షమించాలి. “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను . . . నీయొద్ద క్షమాపణ దొరుకును.”—కీర్తన 130:3, 4.
“ఒకనికొకడు లోబడియుండుడి”
కాబట్టి, మనందరి పరస్పర శ్రేయస్సు విషయమై, లేఖనాలు ఇలా సలహా ఇస్తున్నాయి: “క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.” ఒకరికొకరు ప్రేమపూర్వక పరస్పర గౌరవాన్ని ఇచ్చుకోండి; అణచివేయకండి లేక పోటీపడకండి. ఆ వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు.”—ఎఫెసీయులు 5:21-23.
ఎఫెసీయులు 5:21, 22 నందు పౌలు ఉపయోగించిన గ్రీకు పదం, తనను తాను లోబరచుకోవడం అనే భావాన్ని సూచిస్తుంది, కానీ లోబడేందుకు బలవంతపెట్టబడడమని కాదు. మరి ఆ విధేయత వివాహ సామరస్యం కొరకు మాత్రమే కాదు, అది ప్రభువు నిమిత్తం చూపబడుతోంది. క్రీస్తు యొక్క అభిషిక్త సంఘం తనను తాను స్వచ్ఛందంగాను ఆనందంతోను క్రీస్తుకు లోబరచుకుంటుంది. ఒక భార్య తన భర్త ఎడల అలాగే చేస్తే, అప్పుడు వివాహం తప్పకుండా సంతోషభరితంగాను విజయవంతంగాను ఉంటుంది.
లేఖనాలు ఇంకా ఇలా చెబుతున్నాయి: “ప్రతి [భర్త] తననువలె తన భార్యను” ఉదారంగా “ప్రేమింపవలెను.” (ఎఫెసీయులు 5:33; 1 పేతురు 3:7) భర్త తాను కూడా తన శిరస్సుకు లోబడి ఉండాలనే విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలి, ఎందుకంటే బైబిలు ఇలా చెబుతుంది: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు.” అవును, పురుషుడు క్రీస్తు బోధలకు లోబడి ఉండాలి. క్రీస్తు దానికి ప్రతిగా, తన శిరస్సుకు లోబడి ఉంటాడు: “క్రీస్తునకు శిరస్సు దేవుడు.” అలా, యెహోవా తప్ప ప్రతి ఒక్కరికీ శిరస్సు ఉన్నాడు. అయితే యెహోవా కూడా తన స్వంత నియమాలకు అనుగుణంగా ఉంటాడు.—1 కొరింథీయులు 11:3; తీతు 1:2; హెబ్రీయులు 6:18.
క్రైస్తవ విధేయత సమతూకమైనది మరియు స్త్రీపురుషులకు ఇరువురికీ ప్రయోజనకరమైనది. అది మన ప్రేమగల సృష్టికర్త మాత్రమే ఇవ్వగల సామరస్యాన్ని మరియు సంతృప్తిని వివాహానికి తెస్తుంది.—ఫిలిప్పీయులు 4:7.
[14వ పేజీలోని చిత్రసౌజన్యం]
Leslie’s