వైరస్ హంతకి జైరీపై దాడి చేయడం
ఆఫ్రికాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
జైరీలోని కీక్‌విట్, ఓ ఉష్ణమండల అడవిని ఆనుకొని ఉన్న విస్తరిస్తున్న గ్రామం. పట్టణం వెలుపల జీవించే నలభై రెండు సంవత్సరాల గాస్పార్డ్ మేంగా కీటాంబాలా తన కుటుంబమంతటిలోనూ తను మాత్రమే ఓ యెహోవాసాక్షి. మేంగా బొగ్గు అమ్మేవాడు. ఆయన తన బొగ్గును అడవి మధ్యలో తయారు చేసి దాన్ని మూటకట్టి తన తలపై మోసుకుని కీక్‌విట్‌కు తెచ్చేవాడు.
1995 జనవరి 6న ఆయనకు జబ్బు చేసింది. అడవినుండి ఇంటికి వచ్చే మార్గంలో ఆయన రెండుసార్లు క్రిందపడ్డాడు. ఆయన ఇల్లు చేరిన తర్వాత తనకు తలనొప్పి, జ్వరం వచ్చాయని అన్నాడు.
తర్వాతి కొన్ని దినాల్లో, ఆయన పరిస్థితి క్షీణించింది. జనవరి 12న ఆయన కుటుంబం ఆయనను కీక్‌విట్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. మేంగా హాజరయ్యే సంఘంలోని సాక్షులు, ఆసుపత్రిలో ఆయన ఎడల శ్రద్ధ వహించేందుకు ఆయన కుటుంబానికి సహాయం చేశారు. అయితే దుఃఖకరంగా ఆయన పరిస్థితి క్షీణించింది. ఆయన రక్తం కక్కడం ప్రారంభించాడు. ఆయన ముక్కు, చెవుల్లో నుండి రక్తం ధారగా ప్రవహించింది. జనవరి 15న ఆయన మరణించాడు.
ఆయన కుటుంబ సభ్యుల్లో ఇతరులు, అంటే మేంగా శరీరాన్ని ముట్టిన వారు అస్వస్థులయ్యారు. మార్చి మొదటి వారంలో, మేంగాకు సన్నిహిత సంబంధులైన 12 మంది మరణించారు, అందులో ఆయన భార్య మరియు వారి ఆరుగురు పిల్లల్లో ఇద్దరు కూడా ఉన్నారు.
ఏప్రిల్ మధ్యకల్లా, ఆసుపత్రి సభ్యులు మరియు ఇతరులు, మేంగా మరియు ఆయన కుటుంబ సభ్యులకు వలెనే అస్వస్థులై మరణించారు. త్వరలో ఆ వ్యాధి ఆ ప్రాంతంలోని ఇతర రెండు గ్రామాలకు ప్రాకింది. బయటినుండి సహాయం అవసరమన్న విషయం స్పష్టమైంది.
జైరీ దేశపు ప్రముఖ వైరాలజిస్ట్ అయిన ముయెంబె అనే పండితుడు మే 1న కిక్‌విట్‌కు వెళ్లాడు. తర్వాత అతను తేజరిల్లు!కు ఇలా చెప్పాడు: “కిక్‌విట్ రెండు తెగుళ్లవలన పీడింపబడుతుందని మేము తీర్మానించాము: ఒకటి బ్యాక్టీరియా వలన కలిగిన విరోచనం, మరొకటి ఒక వైరస్ వలన వచ్చిన తీవ్రమైన రక్తస్రావ జ్వరం. మేము ఈ పరీక్షలను తీర్మానించుకోవలసిన అవసరం ఉందన్న విషయం వాస్తవమే. కాబట్టి మేము రోగులనుండి కొంత రక్తాన్ని సేకరించి, అమెరికాలోని అట్లాంటా నందలి సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్‌లో (సీడీసీ) (వ్యాధులను నియంత్రించే కేంద్రాలు) పరీక్షించేందుకు పంపాము.”
సీడీసీలు, ముయెంబె మరియు జైరీలోని ఇతర వైద్యులు ఇదివరకే అనుమానించిన దాన్ని ధృవీకరించాయి. అది ఇబోలా వ్యాధి.
ఓ ప్రాణాంతకమైన వ్యాధి
ఇబోలా వైరస్ భయంకరమైనది. అది త్వరగా చంపగలదు. దాన్ని నివారించేందుకు ఎలాంటి టీకాలూ లేవు, దాని బాధితులను నయం చేసేందుకు ఏ చికిత్సా లేదు.
1976లో ఇబోలా మొదటిసారి గుర్తించబడింది. జైరీలోని ఒక నది యొక్క పేరు పెట్టబడిన ఆ వ్యాధి దక్షిణ సుడాన్‌పై, తర్వాత కొంత కాలానికి ఉత్తర జైరీపై దాడి చేసింది. 1979లో అది మళ్లీ సుడాన్‌లో అల్ప స్థాయిలో వచ్చింది. దాని తర్వాత, ఇబోలా వంటి సూచనల మూలంగా ప్రజలు మరణించిన అక్కడక్కడి కొన్ని కేసుల మినహా, ఆ వ్యాధి ఏళ్ల తరబడి మాయమైంది.
ఇబోలా వైరస్ ఎంత ప్రాణాంతకమైనదంటే, అట్లాంటాలో దాని గురించి అధ్యయనాలు జరిపే వైజ్ఞానికులు, గాలి ద్వారా వచ్చిన ఏ సూక్ష్మ జీవులైనా బయటికి వెళ్లకుండా నివారించే గాలి ప్రసరణ వ్యవస్థతో నిర్మింపబడిన పూర్తి భద్రతగల పరిశోధనాశాలల్లో తమ అధ్యయనాలు జరుపుతారు. పరిశోధనాశాలలోకి ప్రవేశించే ముందు, వైజ్ఞానికులు పరిరక్షక “స్పేస్ సూట్‌లను” ధరిస్తారు. వారు అందులోనుండి బయటికి వచ్చేటప్పుడు క్రిమినాశక ద్రవంతో స్నానం చేస్తారు. కీక్‌విట్‌కు వచ్చిన వైద్యుల బృందం, తమతోపాటు పరిరక్షక వస్త్రాలను తెచ్చుకున్నారు—ఒకసారి మాత్రమే ఉపయోగించి పడవేయవలసిన గ్లవ్సు, క్యాపులు, కళ్లజోళ్లు మరియు వైరస్ లోనకు చొచ్చుకు పోయేందుకు అనుమతించని ప్రత్యేక కవరాల్స్ (పూర్తిగా కప్పేసే బట్టలు) అందులో ఉన్నాయి.
దానికి భిన్నంగా, కీక్‌విట్‌లోని అనేకమంది నివాసులకు, తమను ఎలా కాపాడుకోవాలో తెలియదు మరియు తమను కాపాడుకునేందుకు తగినన్ని పరికరాలు లేవు. ఇతరులు, అనారోగ్యులైన తమ ప్రియమైన వారి ఎడల శ్రద్ధ వహించడంలో తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు లేక తమ ప్రాణాలను మొత్తానికే పోగొట్టుకున్నారు. స్నేహితులు మరియు కుటుంబీకులు ఎలాంటి రక్షణా లేకుండానే, అనారోగ్యంగా ఉన్న వారిని మరియు మరణించిన వారిని తమ వీపులపై లేక భుజాలపై మోసుకెళ్లారు. దాని ఫలితమే తీవ్రమైన ప్రాణ నష్టం; ఆ వైరస్ పూర్తి కుటుంబాలనే నాశనం చేసింది.
వైరస్ వ్యాప్తిని అరికట్టడం
సహాయం కొరకైన కిక్‌విట్ మొరకు ప్రతిస్పందనగా అంతర్జాతీయ సమాజం డబ్బు మరియు వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చింది. యూరప్ దక్షిణాఫ్రికా మరియు అమెరికా నుండి పరిశోధకుల బృందాలు వచ్చాయి. వారు ఇక్కడికి రావడం వెనుక రెండు ఉద్దేశాలు ఉన్నాయి: మొదటిదేమంటే వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సహాయం చేయడం; రెండవదేమంటే తెగుళ్ల మధ్య అంటే, తెగులు ఒకసారి వ్యాపించి తగ్గిపోయిన తర్వాత మరియు రెండవసారి వ్యాపించక ముందు, ఈ మధ్య కాలంలో వైరస్ ఎక్కడ జీవించిందో తెలుసుకోవడం.
తెగులును ఆపడంలో సహాయం చేసేందుకు, ఆరోగ్య కార్యకర్తలు ప్రతి వీధిని వెదికి, ఈ వ్యాధికిగల సూచనలను కలిగివున్న వారిని వెలికి తీశారు. అనారోగ్యంగా ఉన్న వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లారు, అక్కడ వారిని ప్రత్యేకంగా ఉంచి, వారి ఎడల ఎంతో శ్రద్ధవహించడం జరిగింది. చనిపోయిన వారిని ప్లాస్టిక్ షీట్‌లలో చుట్టి, వెంటనే పాతి పెట్టారు.
ఆరోగ్య సంరక్షక కార్యకర్తలకు మరియు సాధారణ ప్రజలకు ఆ వ్యాధిని గురించిన కచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు విస్తృతంగా ప్రచారం చేయబడింది. ఆ వర్తమానంలో భాగంగా, సాంప్రదాయిక భూస్థాపన ఆచారాలను చేయవద్దని గట్టిగా చెప్పడం జరిగింది, ఆ ఆచారాల్లో మృతులను ముట్టడం, ఆచారబద్ధంగా స్నానం చేయించడం వంటివి ఉంటాయి.
మూల కారణాన్ని వెదకడం
ఆ వైరస్ ఎక్కడనుండి వచ్చిందో వైజ్ఞానికులు తెలుసుకోవాలనుకున్నారు. కేవలం ఇంతే తెలుసు: ఈ వైరస్‌లు తిని, త్రాగి తమ స్వంతగా విస్తరించగల స్వేచ్ఛా జీవులు మాత్రం కావు. అవి జీవించి, ఉత్పత్తి చేయాలంటే, జీవకణం యొక్క సంక్లిష్ట ఆకారాన్ని అవి ఆక్రమించి, దాని నుండి లాభం పొందాలి.
ఒక వైరస్ ఓ జంతువుకు సోకినప్పుడు, తరచూ వాటి మధ్యగల సంబంధం అవి కలిసి జీవించేందుకు తోడ్పడుతుంది—అంటే ఆ జంతువు వైరస్‌ను చంపదు అలాగే ఆ వైరస్ జంతువును చంపదు. అయితే వైరస్ సోకిన జంతువు మానవుని వద్దకు వస్తే, మరి ఎలాగో ఆ వైరస్ మానవునిలోకి ప్రవేశిస్తే, అప్పుడు ఆ వైరస్ ప్రాణాంతకమైనది కావచ్చు.
ఇబోలా వైరస్ ప్రజలను మరియు కోతులను చాలా త్వరగా చంపుతుంది గనుక, వైరస్ ఇతర జీవుల్లో గమనం సాగిస్తుందని వైజ్ఞానికులు భావిస్తున్నారు. ఆ వైరస్ ఏ విధమైన జీవిలో గమనం సాగిస్తుందో ఆరోగ్య కార్యకర్తలు గనుక కనుగొనగల్గితే, భవిష్యత్తులో అది మళ్లీ రాకుండా అప్పుడు వారు ప్రభావవంతంగా అదుపు చేయగలరు మరియు నివారణాచర్యలు తీసుకోగలరు. ఇబోలాను గురించిన జవాబు దొరకని ప్రశ్న ఏమిటంటే, మానవ తెగుళ్ల మధ్య, అంటే తెగులు ఒకసారి వ్యాపించి తగ్గిపోయిన తర్వాత మరియు రెండవసారి వ్యాపించక ముందు, ఈ మధ్య కాలంలో ఆ వైరస్ ఎక్కడ నివాసం చేస్తుంది?
ఆ ప్రశ్నకు జవాబు లభించాలంటే, పరిశోధకులు ఆ వైరస్ యొక్క మూల స్థలాన్ని కనుగొనాలి. ఇంతకు పూర్వం ఈ వ్యాధి వ్యాపించినప్పుడు, ఈ వ్యాధిని ఏ జంతువు మోసుకొచ్చిందో కనుగొనేందుకు జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే, కిక్‌విట్‌లో వచ్చిన తెగులు సరిక్రొత్త అవకాశాన్ని అందించింది.
కిక్‌విట్‌లో వచ్చిన తెగులు యొక్క మొదటి బాధితుడు గాస్పార్డ్ మేంగాయేనని వైజ్ఞానికులు భావించారు. అయితే ఆయనకు అదెలా సోకింది? ఒకవేళ అది ఏదైనా ఒక జంతువు ద్వారా అయితే, అది ఏ జాతికి చెందిన జంతువు? మేంగా ఏ అడవిలో పని చేశాడో ఆ అడవిలో జవాబు దొరుకుతుందనేది సహేతుకమైన విషయం. మేంగా బొగ్గు తయారు చేసేందుకు ఎక్కడ పని చేశాడో ఆ స్థలంలో సేకరణ బృందాలు 350 వలలను ఉంచాయి. వారు రోడంట్‌లు (ఎలుక జాతికి చెందినవి), చుంచులు, కప్పలు, బల్లులు, పాములు, దోమలు, జోరీగలు, కుక్క పిడుగులు, నల్లులు, పేలు, కొణుసులు మరియు మిణ్ణల్లులను పట్టి బంధించారు, అవి మొత్తం 2,200 చిన్న జంతువులు మరియు 15,000 కీటకాలు. పరిరక్షక వస్త్రాలను ధరించిన వైజ్ఞానికులు ఆ జంతువులను అనెస్తెటిక్ వాయువుతో చంపారు. తర్వాత వారు ఆ కణజాల స్యాంపుల్‌లను అమెరికాకు పంపారు, అక్కడ వారు వాటిలో ఆ వైరస్ ఉందేమో చూస్తారు.
వైరస్ దాగి ఉండే స్థలాలు కోకొల్లలు గనుక, ఆ మూలం కనుగొనబడుతుందన్న నిశ్చయత ఏమీ లేదు. సీడీసీ యొక్క ప్రత్యేక పాతోజన్ విభాగానికి అధికారి అయిన డా. సీ. జే. పీటర్ ఇలా అన్నాడు: “ఇబోలా యొక్క మూలాన్ని మనం కనుగొనగలమనే సాధ్యత కేవలం 50 శాతమే ఉంది.”
తెగులు అంతరించింది
ఆగస్టు 25న, తెగులు అంతమొందిందని అధికారికంగా ప్రకటించబడింది, ఎందుకంటే 42 దినాలుగా ఎలాంటి క్రొత్త కేసులూ రాలేదు, ఆ 42 దినాలు పూర్తి ఇన్‌క్యుబేషన్ పీరియడ్‌కు (రోగం శరీరంలోకి ప్రవేశించినది మొదలు దాని ప్రధమ లక్షణాలు బయటికి కనిపించేవరకు పట్టే కాలం) రెండంతలు. ఆ వ్యాధి విస్తారంగా ఎందుకు వ్యాపించలేదు? ఆ తెగులును అరికట్టేందుకు చేయబడిన అంతర్జాతీయ వైద్య ప్రయత్నాలు ఒక కారణం. తెగులును తగ్గించిన మరొక కారణం ఏమంటే, ఆ వ్యాధి యొక్క తీవ్రతే. అది అంత త్వరగా అవతరించి, చంపింది గనుక మరియు అది అతి దగ్గరగా వచ్చినప్పుడే సోకుతుంది గనుక అది ఎక్కువమంది ప్రజలకు సోకలేదు.
ఈ వ్యాధి 315 మందికి వచ్చిందని మరియు వారిలోని 244 మంది మరణించారని అధికారిక రికార్డులు చూపుతున్నాయి, అది అతి భయంకరమైన 77 శాతం రేటు. ఇబోలా కొద్ది కాలం వరకూ సద్దుమణిగి ఉంది. యెహోవా నూతన లోకంలో, అది నిరంతరంగా నిశ్శబ్దమైపోతుంది. (యెషయా 33:24 చూడండి.) అంతలో, ‘మళ్లీ చంపేందుకు ఇబోలా పునఃప్రత్యక్షమౌతుందా?’ అని ప్రజలు ఆలోచిస్తున్నారు. బహుశ అవుతుందేమో. కానీ, ఎప్పుడూ మరియు ఎక్కడా అనేది ఎవ్వరికీ తెలియదు.
[23వ పేజీలోని బాక్సు]
ఇతర వాటితో తెగులును పోల్చి చూస్తే
ఇబోలా ఓ హంతకి, అయిననూ, తక్కువ ప్రఖ్యాతి గాంచిన వ్యాధులనుండే ఆఫ్రికా వారికి ప్రమాదం పొంచివుంది. ఇబోలా వ్యాపించినప్పుడు ఇతర వ్యాధులు నిశ్శబ్దంగా ప్రాణాలను బలిగొన్నాయి. కిక్‌విట్‌కు తూర్పు వైపున కొన్ని వందల కిలోమీటర్లలో, 250 మంది ప్రజలు ఇటీవలనే పోలియోకు గురయ్యారని నివేదించబడింది. దానికి వాయవ్యాన, కలరా యొక్క ఒక ప్రాణాంతకమైన రకం మలీని చీల్చి ఛండాడింది. దక్షిణాన అంగోలాలో, 30,000 మంది ప్రజలకు అతినిద్రా వ్యాధి సోకింది. పశ్చిమ ఆఫ్రికాలోని విస్తారమైన ప్రాంతంలో, వేలకొలది మంది మెదడు వాపు వ్యాధి వలన మరణించారు. ద న్యూయార్క్ టైమ్స్ ఇలా పేర్కొన్నది: “[ఆఫ్రికా యొక్క] ప్రతి దిన, భయంకరమైన మరియు అధిక శాతం నివారించగల వ్యాధులతో వారు పోరాడటం, ప్రపంచం యొక్క ఆసక్తిని ఎందుకు రేకెత్తించదన్న కలతపరిచే ప్రశ్న ఆఫ్రికా వారిలో తలెత్తుతుంది.”
[22వ పేజీలోని చిత్రం]
వైరస్ హంతకి మూలం కొరకు వైజ్ఞానికులు వెదకుతున్నారు