జూన్ 1-7, 2026
పాట 111 మన సంతోషానికి కారణాలు
ప్రజలు ద్వేషించినా, మీరు ఎందుకు సంతోషంగా ఉండవచ్చు?
‘ప్రజలు మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.’—లూకా 6:22.
ముఖ్యాంశం
యెహోవాను ఆరాధిస్తున్నందుకు ప్రజలు మనల్ని ద్వేషించినా, మనం ఎందుకు సంతోషంగా ఉండవచ్చో చూస్తాం.
1. యేసు అన్న ఏ మాటలు వినేవాళ్లకు ఆశ్చర్యంగా అనిపించి ఉంటాయి?
కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: ‘ప్రజలు మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.’ (లూకా 6:22) ఆ మాటలు విన్నవాళ్లకు అవి ఆశ్చర్యంగా అనిపించి ఉంటాయి. ఎందుకంటే, ఒకరు మనల్ని ద్వేషించినప్పుడు మనం సంతోషంగా ఉండడం కష్టం. మరి యేసు ఎందుకు అలా అన్నాడు? ఆ ప్రశ్న గురించి ఆలోచించడం మంచిదే. ఎందుకంటే, ఈ రోజుల్లో చాలామంది ప్రజలు యేసు అనుచరుల్ని ద్వేషిస్తున్నారు. అసలు ప్రజలు మనల్ని ఎందుకు ద్వేషిస్తారో, అలా ద్వేషించినా మనం ఎందుకు సంతోషంగా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
ప్రజలు మనల్ని ఎందుకు ద్వేషిస్తారు?
2-3. నిజక్రైస్తవులు హింసలు పడడానికి ఒక కారణం ఏంటి? అది తెలుసుకున్నప్పుడు, మనల్ని వ్యతిరేకించేవాళ్ల గురించి మనకు ఏమనిపిస్తుంది? (యోహాను 16:2, 3)
2 యెహోవాను ఆరాధిస్తున్నందుకు ప్రజలు మనల్ని ద్వేషిస్తారు. తన అనుచరుల్ని హింసించేవాళ్ల గురించి, ఆఖరికి చంపేవాళ్ల గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “వాళ్లు తండ్రిని గానీ నన్ను గానీ తెలుసుకోలేదు కాబట్టి అలా చేస్తారు.” (యోహాను 16:2, 3 చదవండి.) వాళ్లు తండ్రిని ఎందుకు తెలుసుకోవట్లేదు? దానికి ముఖ్య కారణం, సాతానే. అతను “ఈ లోక దేవుడు.” (2 కొరిం. 4:3, 4) యెహోవా గురించిన సత్యాన్ని తెలియనివ్వకుండా అతను ప్రజల కళ్లకు గంతలు కట్టేస్తున్నాడు. అంతేకాదు, ఎవరైతే యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ని ప్రేమిస్తున్నారో వాళ్లను వ్యతిరేకించేలా ప్రజల్ని ఉసిగొల్పుతున్నాడు. (యోహా. 8:42-44) ఈ మాట విన్నప్పుడు మనల్ని వ్యతిరేకించేవాళ్ల గురించి మనకు ఏమనిపిస్తుంది? సాతాను మాయలో పడడం వల్లే ప్రజలు అలా చేస్తున్నారని తెలుసుకున్నప్పుడు, మనం తిరిగి వాళ్లను ద్వేషించం.
3 పాల్a అనే బ్రదర్ ఉదాహరణ చూడండి. మన పనిని నిషేధించిన ఒక దేశంలో ఆయన ఉంటున్నాడు. యెహోవాను నమ్మకంగా ఆరాధిస్తున్నందుకు ఆయన్ని అరెస్టు చేసి, ఇష్టమొచ్చినట్టు కొట్టి, ఒక జైలు గదిలో ఒంటరిగా కొన్ని నెలలపాటు ఉంచేశారు. ఆయన ఇప్పుడు ఇలా అంటున్నాడు: “హింసకు కారణం సాతానుకు, అతని చెడ్డదూతలకు సత్యారాధన అంటే గిట్టకపోవడమే. అంతేగానీ జైల్లో పని చేస్తున్నవాళ్లకు, నాకు పాత కక్షలేం లేవు. వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు అంతే.” క్రొయేషియాలో ఉంటున్న ఇంకో బ్రదర్ ఉదాహరణ చూడండి. ఆయన సత్యంలోలేని తల్లిదండ్రుల నుండి భయంకరమైన హింసను ఎదుర్కొన్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నా శత్రువు సాతానే గానీ, నా తల్లిదండ్రులు కాదని నేను అర్థం చేసుకున్నాను.”—ఎఫె. 6:12.
4. యేసు నుండి, స్తెఫను నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
4 మనల్ని వ్యతిరేకించేవాళ్లను మనం ద్వేషించం. నిజానికి, వాళ్ల కోసం ప్రార్థిస్తాం. (మత్త. 5:44) ఈ విషయంలో యేసు నుండి, స్తెఫను నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. రోమా సైనికులు తనను కొయ్యకు వేలాడదీసినప్పుడు, యేసు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, వీళ్లను క్షమించు.” (లూకా 23:34) అధిపతి ఆజ్ఞ ప్రకారం తనని చంపుతున్న ఆ రోమా సైనికుల్ని క్షమించమని యేసు యెహోవాను అడుగుతున్నాడు. అలాగే, మతనాయకులు ఉసిగొల్పడం వల్ల యేసును చంపేయాలని ఎవరైతే అరిచారో ఆ ప్రజల్ని క్షమించమని కూడా అడుగుతుండవచ్చు. వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలీదని యేసు గుర్తించాడు. యేసులాగే స్తెఫను కూడా, తనను చంపేవాళ్లను క్షమించమని దేవుణ్ణి అడిగాడు. (అపొ. 7:58-60) మరి, యేసు అలాగే స్తెఫను చేసిన ప్రార్థనల్ని యెహోవా విన్నాడా? విన్నాడు. యేసును విచారించడంలో, ఆయన్ని చంపడంలో చేతులు కలిపిన చాలామంది కొంతకాలానికి పశ్చాత్తాపపడ్డారు, యేసుమీద విశ్వాసం ఉంచారు, బాప్తిస్మం కూడా తీసుకున్నారు. (అపొ. 2:36-41) అంతేకాదు, స్తెఫనును చంపడానికి మద్దతు ఇచ్చినవాళ్లలో ఒకరైన తార్సుకు చెందిన సౌలు క్రైస్తవుడు అయ్యాడు. ఆయన తెలియక చేసిన దారుణాల్ని గుర్తుచేసుకుని ఆ తర్వాత కుమిలిపోయాడు.—1 తిమో. 1:13.
యేసు అలాగే స్తెఫను తమను హింసించినవాళ్ల కోసం ప్రార్థించినట్టే, మనం కూడా మనల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థించవచ్చు (4వ పేరా చూడండి)
5. జాన్ అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
5 ఈ రోజుల్లో కూడా మనల్ని వ్యతిరేకించేవాళ్ల కోసం ప్రార్థిస్తే, యెహోవా ఆ ప్రార్థనలకు జవాబిస్తాడు. వెనిజ్యులాలో ఉంటున్న జాన్ అనే బ్రదర్ ఉదాహరణ చూడండి. వాళ్ల నాన్న సత్యాన్ని విపరీతంగా వ్యతిరేకించేవాడు. జాన్ ఇలా అంటున్నాడు: “ఒక భార్యగా, తల్లిగా ఏమేం చేయాలో అవన్నీ మా అమ్మ చేసింది. మా అమ్మ దేవుని రాజ్యానికి ఎప్పుడూ మొదటిస్థానం ఇచ్చేది, అలాగని మా నాన్నకు ఏదీ తక్కువ చేయలేదు. నాకు, నా తోబుట్టువులకు నాన్నను గౌరవించమని చెప్పేది. దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేయమంటే తప్ప, అన్ని విషయాల్లో ఆయన మాట వినమని చెప్పేది.” సంవత్సరాలు గడుస్తుండగా, వాళ్ల నాన్న మనసు మెత్తబడింది. జాన్ ఇంకా ఇలా అంటున్నాడు: “ఒకరోజు నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్న తర్వాత, మా నాన్నను బైబిలు స్టడీ తీసుకోవడం ఇష్టమేనా అని అడిగాను. ఆయన దానికి సరే అన్నప్పుడు, నాకు ఎంత సంతోషంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను.” కొంతకాలానికి జాన్ వాళ్ల నాన్న బాప్తిస్మం తీసుకున్నాడు. అయితే, మనల్ని వ్యతిరేకించే ప్రతీఒక్కరు మారతారని మనం చెప్పలేం. కానీ, మనం మర్యాదగా మాట్లాడే మాటలు, మన మంచి ప్రవర్తన చూసి కొంతమందికైనా మనసు కరగవచ్చు. అలా జరిగితే మనం ఎంత సంతోషిస్తామో కదా! మన కరుణగల దేవుడు, “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు,” అలాంటివాళ్లను తన దగ్గరికి ఆకర్షించుకునే రోజు కోసం మనం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం.—ఆది. 18:25.
6. యోహాను 15:20, 21 ప్రకారం, ప్రజలు మనల్ని ద్వేషించడానికి ఇంకో కారణం ఏంటి?
6 యేసుకు మద్దతిస్తున్నందుకు ప్రజలు మనల్ని ద్వేషిస్తారు. తన “పేరు కారణంగా” ప్రజలందరూ నిజక్రైస్తవుల్ని ద్వేషిస్తారని యేసు చెప్పాడు. (యోహాను 15:20, 21, అధస్సూచి చదవండి.) ఇక్కడ “పేరు” అంటున్నప్పుడు దానర్థం ఏంటి? యేసుకున్న పేరుప్రతిష్ఠల్ని, దేవుని రాజ్యానికి రాజుగా ఆయనకున్న అధికారాన్ని అది సూచిస్తుంది. ఈ విశ్వాన్ని పరిపాలించడానికి యెహోవా ఎంచుకున్న యేసుక్రీస్తును కాకుండా, ప్రజలు మానవ నాయకుల్ని నమ్ముకుంటారు. అందుకే వాళ్లు మనల్ని ద్వేషిస్తారు. కానీ మన పరిస్థితి ఎప్పుడూ ఇలానే ఉండదు. 1914 నుండి దేవుని రాజ్యానికి రాజుగా యేసు పరిపాలిస్తున్నాడు. అతిత్వరలో, ఆయన అధికారాన్ని వద్దనుకున్న ప్రభుత్వాలన్నిటినీ ఆయన తీసేస్తాడు.
7-8. కొంతమంది యెహోవా ప్రజలు ఎందుకు ఎగతాళికి గురౌతున్నారు? (యోహాను 15:18-20) (చిత్రాలు కూడా చూడండి.)
7 ఈ సాతాను లోకంతో కలవనందుకు, ప్రజలు మనల్ని ద్వేషిస్తారు. తన అనుచరులు “లోకానికి చెందినవాళ్లు కాదు” కాబట్టి, ప్రజలు వాళ్లను ద్వేషిస్తారని యేసు చెప్పాడు. (యోహాను 15:18-20 చదవండి.) మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే, మనం కూడా లోకస్థుల ఆలోచనల్ని, మాటల్ని, ప్రవర్తనను ఒంటపట్టించుకోం. దీనివల్ల, చాలామంది బ్రదర్స్‌సిస్టర్స్ వాళ్లు పనిచేస్తున్న దగ్గర లేదా స్కూళ్లలో ఎగతాళికి గురౌతున్నారు. (1 పేతు. 4:3, 4) కానీ ఒక మంచి విషయం ఏంటంటే, అలా వ్యతిరేకించేవాళ్లలో కొంతమంది చివరికి మనసు మార్చుకుని, మనల్ని గౌరవించే అవకాశం ఉంది.
8 సెంట్రల్ అమెరికాలో ఉంటున్న హెన్రీ అనుభవం చూడండి. ఆయనకున్న ఉన్నత ప్రమాణాల వల్ల, స్కూల్లో ఒక మాస్టారు ఆయన్ని కొన్ని సంవత్సరాలపాటు ఎగతాళి చేశాడు. కానీ కొంతకాలానికి, తన స్కూల్ చదువు అయిపోయి వెళ్లిపోతున్నప్పుడు హెన్రీతో ఆ మాస్టారు ఇలా అన్నాడు: “చుట్టూ ఇంత ఘోరమైన పరిస్థితులున్నా, నువ్వు బైబిలు ప్రమాణాల ప్రకారం ఎలా జీవించగలుగుతున్నావు?” అప్పుడు హెన్రీ, దేవుని ప్రమాణాల్ని ఒక రక్షణ కవచంలా చూస్తానని ఆయనతో అన్నాడు. తర్వాత ఆ మాస్టార్ని మీటింగ్‌కి పిలిచాడు. ఆశ్చర్యకరంగా, ఆ మాస్టారు మీటింగ్‌కి వచ్చాడు! సంఘంలో ఉన్న ప్రేమను చూసి ఆయన ఎంతగా పులకరించిపోయాడు అంటే, ఆయన మీటింగ్స్‌కి రావడం ఆపలేదు. తర్వాత, ఆయన బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాక స్వయంగా ఆయనకే వ్యతిరేకత వచ్చింది. కానీ ఆయన ఆధ్యాత్మికంగా ఏ మాత్రం వెనకబడకుండా బాప్తిస్మం తీసుకున్నాడు.
వయసుతో సంబంధం లేకుండా మనం ధైర్యంగా ఉండవచ్చు, మన విశ్వాసం గురించి మాట్లాడవచ్చు (8వ పేరా చూడండి)b
9-10. (ఎ) ఇంకా ఏ విషయంలో కూడా మనం సాతాను లోకానికి వేరుగా ఉంటాం? (బి) అపొస్తలుడైన పౌలు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
9 మనం ఇంకో విషయంలో కూడా సాతాను లోకానికి వేరుగా ఉంటాం. అదేంటంటే మనం రాజకీయాల్లో తలదూర్చం, యుద్ధాలు చేయం. (యోహా. 18:36) రోమీయులు 13:1లో ఉన్న సలహాను పాటిస్తూ, మనం చట్టానికి లోబడే పౌరులుగా ఉండడానికి కృషిచేస్తాం. కానీ, క్రైస్తవులుగా మనం రాజకీయాల్లో ఎవరి వైపూ ఉండం. అందుకే, ఎన్నికల్లో పోటీ చేయం లేదా రాజకీయ నాయకులకు ఓటు వేయం. ఎందుకు? ఎందుకంటే మన పూర్తి మద్దతును యెహోవాకు, అలాగే క్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యానికే ఇస్తాం. దానివల్లే, చాలామంది యెహోవాసాక్షులు జైలు పాలౌతున్నారు. వాళ్లు జైల్లో ఉన్నా, ప్రీచింగ్ చేయడం ఆపట్లేదు. అలా వాళ్లు అపొస్తలుడైన పౌలును ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు గృహ నిర్బంధంలో, జైల్లో ఉన్నాడు. (అపొ. 24:27; 28:16, 30) ఆయన జైలుపాలైనా, వినే వాళ్లందరికీ మంచివార్త ప్రకటించాడు. జైలు కాపలాదారులకు, ఆస్థాన అధికారులకు, అధిపతులకు, రాజులకు ప్రకటించాడు. బహుశా, రోమా చక్రవర్తి అయిన నీరో కిందున్న అధికారులకు కూడా ఆయన ప్రకటించి ఉంటాడు.—అపొ. 9:15.
10 అదేవిధంగా, జైల్లో ఉన్న మన బ్రదర్స్‌సిస్టర్స్ వినేవాళ్లందరికీ అంటే జడ్జీలకు, ప్రభుత్వ అధికారులకు, జైలు గార్డులకు ప్రకటిస్తున్నారు. ఒక బ్రదర్ రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉన్నందుకు అరెస్టు అయ్యి, ఆరు సంవత్సరాలకు పైగా జైల్లో గడిపాడు. ఆయన ఆ సమయాన్ని ఒక శిక్షలా చూడలేదు గానీ, గొర్రెల్లాంటి ప్రజల్ని వెదకడానికి యెహోవా ఇచ్చిన నియామకంలా చూశానని చెప్పాడు. అలాంటివాళ్లకు మంచివార్త చెప్పడం కోసం యెహోవా మనల్ని ఉపయోగించుకుంటే, మనం ఎంత సంతోషిస్తామో కదా! (కొలొ. 4:3) ప్రజలు మనల్ని ద్వేషించినా మనం ఎందుకు సంతోషంగా ఉండవచ్చో కొన్ని కారణాల్ని ఇప్పుడు చూద్దాం.
ప్రజలు ద్వేషించినా మనం ఎందుకు సంతోషంగా ఉండవచ్చు?
11. హింస వల్ల మన విశ్వాసం ఎలా రెట్టింపు అవుతుంది? ఒక ఉదాహరణ చెప్పండి.
11 ప్రజలు మనల్ని ద్వేషించడం, బైబిలు ప్రవచన నెరవేర్పు అని మనకు తెలుసు. సాతాను, అతని సంతానం అంటే అతన్ని అనుసరించేవాళ్లు మనల్ని ద్వేషిస్తారని యెహోవా మొట్టమొదటి ప్రవచనంలోనే చెప్పేశాడు. (ఆది. 3:15) దేవుణ్ణి ప్రేమించి, ఆయన్ని సేవించే ప్రజలు ద్వేషించబడతారని యేసు కూడా చాలాసార్లు చెప్పాడు. ఆ విషయాన్ని నాలుగు సువార్త పుస్తకాల రచయితలు రాశారు. (మత్త. 10:22; మార్కు 13:9-12; లూకా 6:22, 23; యోహా. 15:20) ఇతర బైబిలు రచయితలు కూడా అదే రాశారు. (2 తిమో. 3:12; యాకో. 1:2; 1 పేతు. 4:12-14; యూదా 3, 17-19) కాబట్టి హింస వచ్చినప్పుడు మనం షాక్ అవ్వం గానీ, బైబిలు ప్రవచనం నెరవేరుతున్నందుకు సంతోషిస్తాం. మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనడానికి ఆ హింసే ఒక రుజువు. మన పనిని నిషేధించిన దేశంలో ఉంటున్న ఒక సిస్టర్ ఇలా చెప్తుంది: “నేను యెహోవాకు సమర్పించుకున్న రోజే, నాకు ఎప్పటికైనా హింసలు వస్తాయని తెలుసు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు నేను భయపడలేదు, షాక్ అవ్వలేదు.” ఆమెను వ్యతిరేకించిన చాలామందిలో ఆమె భర్త కూడా ఉన్నాడు. ఆయన ఆమెను అవమానించి బైబిల్ని, బైబిలు ప్రచురణల్ని కాల్చేశాడు. ఆమె భయంతో వెనకడుగు వేసే బదులు, రెట్టింపు విశ్వాసంతో ముందడుగు వేసింది. (హెబ్రీ. 10:39) ఆమె ఇలా అంటుంది: “హింస వస్తుందని ప్రవచనాలు చెప్పాయి కాబట్టి, అది తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. నేను వాటిని అనుభవించాక, ఇదే సత్యం అని నాకు ఇంకా బాగా నమ్మకం కుదిరింది.”
12. హింసను సహించడానికి ఒక బ్రదర్‌కి ఏది సహాయం చేసింది?
12 మనకు హింసలు వస్తాయని తెలిసినా, వాటిని సహించడం మనకు కష్టంగా ఉండవచ్చు. జైల్లో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ ఒక బ్రదర్ ఇలా అన్నాడు: “కొన్నిసార్లు నేను కృంగిపోయేవాడిని, ఆందోళన పడేవాడిని, ఏడ్చేవాడిని.” మరి, ఆ బ్రదర్‌కి ఏది సహాయం చేసింది? ఆయన ఇలా అన్నాడు: “నేను ఎప్పుడూ ప్రార్థించేవాడిని. నా రోజును ప్రార్థనతోనే మొదలుపెట్టేవాడిని. నాకు రోజు మొత్తంలో కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, అలా ప్రార్థించేవాడిని. ఇంకా నా తోటి ఖైదీలు నన్ను ఇబ్బందిపెట్టి, కోపం తెప్పించినప్పుడు నేను బాత్రూమ్‌కి వెళ్లిపోయి, గడి పెట్టుకుని, ప్రార్థన చేసేవాడిని.” అంతేకాకుండా, పాతకాలంలో అలాగే మన కాలంలో యథార్థంగా ఉన్న వాళ్ల ఉదాహరణల్ని ఆయన ధ్యానించాడు. హింసను సహించడానికి, అలాగే యేసు తన అనుచరులకు మాటిచ్చిన శాంతిని పొందడానికి అది ఆయనకు సహాయం చేసింది.—యోహా. 14:27; 16:33.
13. ద్వేషాన్ని తట్టుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?
13 ద్వేషానికి మించిన గొప్ప ప్రేమ మన దగ్గర ఉంది. యేసు తన చివరిశ్వాస వరకు, తన తండ్రిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. యేసు తన స్నేహితుల్ని కూడా చాలా ప్రేమించాడు. (యోహా. 13:1; 15:13) మనం కూడా యెహోవా మీద, మన బ్రదర్స్‌సిస్టర్స్ మీద అలాంటి ప్రేమను పెంచుకుంటే, ఎంతటి ద్వేషాన్ని అయినా సునాయాసంగా తట్టుకోగలుగుతాం. అదెలా? అపొస్తలుడైన పౌలు ఉదాహరణ చూడండి.
14. చావు తన కళ్ల ముందే ఉన్నా, ధైర్యంగా ఉండడానికి పౌలుకు ఏది సహాయం చేసింది?
14 పౌలు చనిపోవడానికి కాస్త ముందు, తన ప్రియ స్నేహితుడైన తిమోతికి ఇలా రాశాడు: “దేవుడు ఇచ్చే పవిత్రశక్తి మనలో పిరికితనాన్ని కాదుగానీ శక్తిని, ప్రేమను పుట్టిస్తుంది.” (2 తిమో. 1:7) ఆ మాటలకు అర్థం ఏంటి? యెహోవా మీదున్న బలమైన ప్రేమ వల్లే, ఒక క్రైస్తవుడు ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకోగలుగుతాడు అని పౌలు అంటున్నాడు. (2 తిమో. 1:8) చావు తన కళ్ల ముందు ఉన్నా, యెహోవా మీదున్న ప్రేమ వల్లే పౌలు ధైర్యంగా ఉన్నాడు, సత్యారాధనను వదిలేయలేదు. అందులో ఏ సందేహం లేదు.—అపొ. 20:22-24.
15. మన కాలంలోని బ్రదర్స్‌సిస్టర్స్ ఒకరి మీద ఒకరు నిస్వార్థమైన ప్రేమను ఎలా చూపించారు? (చిత్రం కూడా చూడండి.)
15 హింసలు ఎదుర్కొంటున్నా స్థిరంగా నిలబడుతున్న మన బ్రదర్స్‌సిస్టర్స్ అంటే మనకు చాలా ఇష్టం. అకుల, ప్రిస్కిల్ల పౌలు కోసం తమ ప్రాణాల్ని అడ్డేసినట్టే, ఆ బ్రదర్స్‌సిస్టర్స్ కోసం కొంతమంది తమ ప్రాణాల్ని ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు. (రోమా. 16:3, 4) ఉదాహరణకు, రష్యాలో అరెస్ట్ అయిన తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని పలకరించడానికి చాలామంది మనవాళ్లు కోర్టుకు వెళ్లారు. అలా అరెస్ట్ అయిన ఒక సహోదరిని ప్రోత్సహించడానికి డజన్ల కొద్దీ బ్రదర్స్‌సిస్టర్స్ వెళ్లారు. వాళ్లను చూసి ఆ సహోదరికి సంతోషంతో నోట మాటరాలేదు. తోటి బ్రదర్స్‌సిస్టర్స్ చూపించిన నిస్వార్థమైన ప్రేమ ఆమెకు ఎంతో బలాన్ని ఇచ్చింది. నిజానికి, అది ఆ టైమ్‌లో ఆమెకు చాలా అవసరమైంది కూడా. అవును, ద్వేషాన్ని మించిన గొప్ప ప్రేమ మన దగ్గర ఉన్నందుకు మనకు ఎంత సంతోషంగా ఉందో కదా!
మన పనిపై నిషేధం లేదా ఆంక్షలు ఉన్న దేశాల్లో కూడా, తోటి క్రైస్తవుల మీద మన బ్రదర్స్‌సిస్టర్స్ నిస్వార్థమైన ప్రేమను చూపించారు (15వ పేరా చూడండి)c
16. ప్రజలు ద్వేషిస్తున్నా సంతోషంగా ఉండవచ్చని అపొస్తలుడైన పేతురు ఎందుకు అన్నాడు? (1 పేతురు 4:14)
16 ద్వేషాన్ని సహిస్తే దేవుని ఆమోదం పొందుతామని మనకు తెలుసు. (1 పేతురు 4:14 చదవండి.) దేవుణ్ణి సేవిస్తున్నందుకు ప్రజలు మనల్ని ద్వేషించి, హింసించినా సంతోషంగా ఉంటామని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. అదెలా? అలాంటి హింసలు వస్తున్నాయంటే, దేవుని పవిత్రశక్తి ‘మన మీద ఉందని’ అర్థం. దేవుని ఆమోదం పొందడం, హింసను సహించడం ఎలా ఉంటుందో పేతురుకు బాగా తెలుసు. క్రీస్తు శకం 33 పెంతెకొస్తు తర్వాత కొన్ని రోజులకు, పరిచర్య చేస్తున్నందుకు పేతురును, ఇతర అపొస్తలుల్ని యూదా ఆలయ రక్షక భటులు బంధించారు. కానీ పేతురు మాత్రం, తన విశ్వాసాన్ని ధైర్యంగా సమర్థించాడు. (అపొ. 5:24-29) పేతురును, అతనితో ఉన్న తోటి అపొస్తలుల్ని కొట్టినా వాళ్లు పరిచర్య చేయడం ఆపలేదు. బదులుగా, “యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం వాళ్లకు దక్కిందని” సంతోషించారు. మనం కూడా కష్టాల్ని సహిస్తున్నప్పుడు సంతోషించవచ్చు.—అపొ. 5:40-42.
17. చనిపోయే ముందు రోజు రాత్రి, యేసు తన శిష్యులతో ఏం చెప్పాడు?
17 చనిపోయే ముందు రోజు రాత్రి, యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: ‘నన్ను ప్రేమించేవాళ్లను నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా వాళ్లను ప్రేమిస్తాను.’ (యోహా. 14:21) యెహోవాను సేవిస్తున్నందుకు ప్రజలు మనల్ని ద్వేషించకుండా ప్రేమించే రోజు కోసం మనం ఎంతగా ఎదురుచూస్తున్నామో కదా! (2 థెస్స. 1:6-8) అప్పటిదాకా, ప్రజలు మనల్ని ద్వేషిస్తున్నా మనం సంతోషంగా ఉండడానికి ఉన్న ఎన్నో కారణాల్ని బట్టి మనం ఓదార్పును, బలాన్ని పొందవచ్చు.
పాట 149 విజయగీతం
a పేర్లను మార్చాం.
b చిత్రాల వివరణ: హెన్రీ తన మాస్టారుకు సాక్ష్యమిస్తున్నట్టు, ఫోటో కోసం నటించిన చిత్రం.
c చిత్రాల వివరణ: విశ్వాసం కారణంగా జైలుకు వెళ్తున్న ఒక సహోదరిని ప్రోత్సహించడానికి బ్రదర్స్‌సిస్టర్స్ వచ్చినట్టు, ఫోటో కోసం నటించిన చిత్రం.