అధ్యయన ఆర్టికల్ 32
పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు
కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఏమేం ఇచ్చాడు?
“ఆయన అన్నివిధాలా అపారదయను అనుగ్రహించే దేవుడు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, గట్టి పునాది మీద మిమ్మల్ని నిలబెడతాడు.”—1 పేతు. 5:10.
ముఖ్యాంశం
మనం కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఏమేమి ఇచ్చాడో, అవి మనకు ఉపయోగపడాలంటే మనం ఏం చేయాలో చూస్తాం.
1. మనకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? తట్టుకోవడానికి ఎవరు సహాయం చేస్తారు? (1 పేతురు 5:10)
మనం చివరిరోజుల్లో ఉన్నాం. కాబట్టి మనకు కష్టాలు తప్పట్లేదు. కొంతమంది పెద్దపెద్ద జబ్బులతో బాధపడుతున్నారు, ఇంకొంతమంది ఇష్టమైనవాళ్లను పోగొట్టుకున్నారు, మరికొంతమంది సొంత కుటుంబ సభ్యుల నుండి లేదా ప్రభుత్వ అధికారుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. (మత్త. 10:18, 36, 37) మీ కష్టం ఎంత పెద్దదైనా సరే, మీ వెనక యెహోవా ఉన్నాడు! తట్టుకోవడానికి ఆయనే మీకు సహాయం చేస్తాడు!—1 పేతురు 5:10 చదవండి.
2. మనకు సహనం ఎక్కడ నుండి వస్తుంది?
2 సహనం అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, హింసలు వచ్చినా, కష్టాలు వచ్చినా లేదా ప్రలోభాలు వచ్చినా, పట్టుదలగా భవిష్యత్తు వైపు చూస్తూ ఉండే సామర్థ్యం. అయితే, ఈ సామర్థ్యం మన సొంత శక్తితో రాదు. అది “అసాధారణ శక్తి”ని ఇచ్చే యెహోవా నుండే వస్తుంది. (2 కొరిం. 4:7) మనం సహించడానికి యెహోవా ఇచ్చే నాలుగు విషయాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే వాటిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో చూస్తాం.
ప్రార్థన
3. ప్రార్థన ఒక అద్భుతమైన వరమని ఎందుకు చెప్పవచ్చు?
3 మనం సహించడానికి యెహోవా ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. మనం పాపులమైనా సరే, తనతో మాట్లాడే గొప్ప అవకాశాన్ని ఆయనిచ్చాడు. (హెబ్రీ. 4:16) ఒకసారి ఆలోచించండి: మనం ఎప్పుడైనా, దేనిగురించైనా యెహోవాకు ప్రార్థన చేయవచ్చు. ఏ భాషలో చేసినా, ఏ ప్రాంతం నుండి చేసినా, నాలుగు గోడల మధ్య ఏకాకిగా ఉన్నా, ఆఖరికి జైల్లో మగ్గుతున్నా ఆయన మనం చేసే ప్రార్థనలు వింటాడు. (యోనా 2:1, 2; అపొ. 16:25, 26) మన గుండెలో గూడుకట్టుకున్న బాధను మాటల్లో చెప్పలేకపోయినా, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో యెహోవా అర్థం చేసుకుంటాడు. (రోమా. 8:26, 27) అవును, ప్రార్థన నిజంగా ఒక అద్భుతమైన వరం అనే చెప్పాలి.
4. సహించేలా సహాయం చేయమని మనం యెహోవాను ఎందుకు అడగవచ్చు?
4 “మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు” అని బైబిలు ద్వారా యెహోవా మాటిచ్చాడు. (1 యోహా. 5:14) కాబట్టి, సహించేలా సహాయం చేయమని యెహోవాను అడగవచ్చా? ఖచ్చితంగా! అది ఆయన ఇష్టానికి తగ్గట్టే ఉంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? మనం కష్టాల్ని నమ్మకంగా సహించినప్పుడు యెహోవా, సాతానుకు ధీటుగా జవాబివ్వగలుగుతాడు. (సామె. 27:11) దానికితోడు, “ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా ఉంటుందో వాళ్ల తరఫున తన బలం చూపించాలి” అని యెహోవా ఎంతో కోరుకుంటున్నాడని బైబిలు చెప్తుంది. (2 దిన. 16:9) కాబట్టి, సహించేలా మనకు సహాయం చేసేంత శక్తి, చేయాలనే కోరిక రెండూ యెహోవాకు ఉన్నాయి.—యెష. 30:18; 41:10; లూకా 11:13.
5. ప్రార్థన మనకు ఎలా మనశ్శాంతిని ఇస్తుంది? (యెషయా 26:3)
5 మనం యెహోవాకు ప్రార్థించినప్పుడు ‘మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి మన హృదయాలకు, మన మనసులకు కాపలా ఉంటుంది’ అని బైబిలు చెప్తుంది. (ఫిలి. 4:7) దానర్థం ఏంటో గమనించండి. లోకంలో వాళ్లకు చాలా కష్టాలు వస్తాయి. అయితే, వాళ్లు మనశ్శాంతి కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదాహరణకు తమ ఆలోచనల్ని, ఆందోళనల్ని మర్చిపోవడానికి లేదా తమ మనసును ఖాళీ చేయడానికి ఏవో ధ్యానం గట్రా చేస్తారు. ఒకవ్యక్తి అలా తమ మనసును ఖాళీ చేసుకోవడం ఆధ్యాత్మికంగా చాలా ప్రమాదకరం. (మత్తయి 12:43-45 పోల్చండి.) దీనికి పూర్తి భిన్నంగా, యెహోవాకు ప్రార్థించినప్పుడు మనకు దొరికే శాంతి ఏ ధ్యానంలోనూ దొరకదు. కాబట్టి యెహోవాకు ప్రార్థించినప్పుడు ఆయన మీద పూర్తిగా ఆధారపడుతున్నామని చూపిస్తాం. అలాచేస్తే, యెహోవా మనకు “ఎప్పుడూ శాంతిని” ఇస్తాడు. (యెషయా 26:3 చదవండి.) తన వాక్యమైన బైబిల్లో ఉన్న ఊరటను ఇచ్చే సత్యాలు మనకు గుర్తుచేసి యెహోవా మనకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడని, మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడని ఆ సత్యాలు గుర్తుచేస్తాయి. అప్పుడు మన హృదయం, మన మనసు కాస్త కుదుటపడతాయి.—కీర్త. 62:1, 2.
6. ప్రార్థన అనే వరాన్ని మీరెలా ఉపయోగించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
6 మీరేం చేయవచ్చు? మీరు సమస్యలతో ఎదురీదుతున్నప్పుడు, ‘యెహోవా మీద మీ భారం వేస్తూ’ మనశ్శాంతి కోసం ప్రార్థించండి. (కీర్త. 55:22) ఆ సమస్యల్లో దిక్కుతోచకపోతే, తెలివి కోసం ప్రార్థించండి. (సామె. 2:10, 11) సహించడానికి సహాయం చేయమని అడుగుతూనే, మీ ప్రార్థనలో థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. (ఫిలి. 4:6) అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా, యెహోవా ప్రతీరోజు మిమ్మల్ని ఎలా గట్టెక్కిస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. ఆయన మీ వెన్నంటే ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పండి. అంతేకాదు, ఆయన మీకు అప్పటికే ఇచ్చిన ఆశీర్వాదాల్ని చూడలేనంతగా, ఆ కష్టాలు మీ కళ్లను కప్పేయకుండా చూసుకోండి.—కీర్త. 16:5, 6.
మీరు ప్రార్థన చేసినప్పుడు యెహోవాతో మాట్లాడతారు, బైబిలు చదివినప్పుడు యెహోవా మీతో మాట్లాడతాడు (6వ పేరా చూడండి)b
బైబిలు
7. సహించడానికి బైబిల్లో ఉన్న లేఖనాలు మనకు ఎలా సహాయం చేస్తాయి?
7 సమస్యల్ని సహించడానికి యెహోవా బైబిలు అనే బహుమతిని ఇచ్చాడు. ఆయన మనకు సహాయం చేస్తాడనే భరోసా ఇచ్చే ఎన్నో లేఖనాలు అందులో ఉన్నాయి. అలాంటి ఒక లేఖనాన్ని చూద్దాం. మత్తయి 6:8లో ఇలా ఉంది: “మీరు అడగకముందే మీకేమి అవసరమో మీ తండ్రికి తెలుసు.” ఈ మాటలు చెప్పింది ఎవరోకాదు, యెహోవాను దగ్గరగా చూసిన యేసే! కాబట్టి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, యెహోవా మీకు సహాయం చేస్తాడని, మీకేం అవసరమో ఆయనకు తెలుసని మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు. పైన చెప్పుకున్న ఒక్క లేఖనమే కాదు, బైబిల్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవి కష్టాలకు ధీటుగా నిలబడడానికి కావాల్సిన బలాన్నిస్తాయి.—కీర్త. 94:19.
8. (ఎ) సహించడానికి సహాయం చేసే ఒక బైబిలు సలహా చెప్పండి. (బి) బైబిలు సలహాలు తేలిగ్గా గుర్తుకు రావాలంటే ఏం చేయాలి?
8 సహించడానికి సహాయం చేసే సలహాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఆ సలహాలు మనకు కావాల్సిన తెలివిని ఇస్తాయి. (సామె. 2:6, 7) దానివల్ల మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఉదాహరణకు, రేపటి గురించి అతిగా ఆలోచించకుండా, ఏ రోజుకు ఆరోజు యెహోవా మీద ఆధారపడమని బైబిలు చెప్తుంది. (మత్త. 6:34) ప్రతీరోజు బైబిలు చదివి, చదివినవాటి గురించి బాగా ఆలోచించే అలవాటు మనకు ఉంటే, అవసరమైనప్పుడు బైబిలు సలహాలు తేలిగ్గా గుర్తొస్తాయి.
9. గతంలో తన సేవకులకు యెహోవా సహాయం చేసిన దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
9 యెహోవాను నమ్మి, ఆయన సహాయాన్ని పొందిన మనలాంటి మామూలు మనుషుల గురించి కూడా బైబిల్లో ఉంది. (హెబ్రీ. 11:32-34; యాకో. 5:17) వాళ్ల గురించి మనం చదివినప్పుడు, యెహోవా “మన ఆశ్రయం, మన బలం, కష్టకాలాల్లో ఆయన ఎప్పుడూ సహాయం చేస్తాడు” అనే నమ్మకాన్ని కూడగట్టుకోగలుగుతాం. (కీర్త. 46:1) గతంలోని ఆ సేవకులు చూపించిన విశ్వాసం గురించి, కష్టాల్లో నమ్మకంగా దేవున్ని ఆరాధిస్తూ ఉన్న విధానం గురించి బాగా ఆలోచించినప్పుడు మనం కూడా వాళ్లలాగే ఉండగలం అనే ధైర్యాన్ని పొందుతాం.—యాకో. 5:10, 11.
10. బైబిల్లోని లేఖనాలు మీకు బాగా ఉపయోగపడాలంటే మీరేం చేయాలి?
10 మీరేం చేయవచ్చు? ప్రతీరోజు బైబిలు చదవండి. దానిలో మీకు నచ్చి, బాగా ఉపయోగపడే లేఖనాల్ని ఎప్పటికప్పుడు రాసిపెట్టుకోండి. అంతేకాదు, చాలామంది తమ రోజును దినవచనంతో మొదలుపెడతారు. దానివల్ల, వాళ్లు రోజంతా దానిగురించి నెమరు వేసుకోవడం బాగా ఉపయోగపడిందని చెప్పారు. మేరీa అనే సిస్టర్‌కి కూడా అలాగే అనిపించింది. ఆమె అమ్మానాన్నలు ఇద్దరూ ఒకే సమయంలో క్యాన్సర్ బారినపడ్డారు. ఆమె ఇలా చెప్తుంది: “ప్రతీరోజు ఉదయం నేను తప్పకుండా దినవచనాన్ని చదివి, అది నాకు ఏం నేర్పించిందో లోతుగా ఆలోచించేదాన్ని. అలా ప్రతీరోజు లేఖనాల్ని నా మనసులో ఉంచుకోవడం వల్ల నా గురించి, నా సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండగలిగాను. యెహోవా గురించి, బైబిలు నుండి ఆయన నేర్పిస్తున్న వాటిగురించి ఆలోచించగలిగాను.”—కీర్త. 61:2.
తోటి సహోదరసహోదరీలు
11. కష్టాల్ని సహించడంలో మనం ఒంటరివాళ్లం కాదని తెలుసుకోవడం ఎలా అనిపిస్తుంది?
11 కష్టాల్లో మనకు చేదోడువాదోడుగా ఉండడానికి యెహోవా తోటి సహోదరసహోదరీల్ని ఇచ్చాడు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న [మన] సహోదరులందరూ ఇలాంటి బాధలే అనుభవిస్తున్నారు.” (1 పేతు. 5:9) ఇది తెలుసుకోవడం మనకు కాస్త ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే, జీవిత పోరాటంలో మనం ఒంటరివాళ్లం కాదని అది గుర్తుచేస్తుంది. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి: మనలాంటి కష్టాల్నే వేరేవాళ్లు కూడా ఎదుర్కొన్నారు. వాళ్లు దాన్ని నమ్మకంగా సహించారంటే మనం కూడా వాటిని ఖచ్చితంగా సహించగలం!—అపొ. 14:22.
12. కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోవచ్చు? (2 కొరింథీయులు 1:3, 4)
12 మనం కష్టాల్ని సహించేలా మన తోటి సహోదరసహోదరీలు వాళ్ల మాటలతో-చేతలతో మన భుజం తడతారు. అపొస్తలుడైన పౌలు విషయంలో అదే జరిగింది. ఆయన గృహ నిర్భందంలో ఉన్నప్పుడు సహోదరులు ఆయన్ని ఓదార్చారు. ఆయనకు అవసరమైన పనులు చేసి పెట్టారు. అందుకే వాళ్లు చేసినదాన్ని గుర్తుపెట్టుకొని, పౌలు తన ఉత్తరాల్లో పేరుపేరున వాళ్లకు థ్యాంక్స్ చెప్పాడు. (ఫిలి. 2:25, 29, 30; కొలొ. 4:10, 11) ఇప్పుడు కూడా మనకు కష్టాలు వస్తే, మన సహోదరసహోదరీలు మన పక్కనే ఉంటారు. వాళ్లకు కష్టాలు వస్తే మనం తోడుగా ఉంటాం. అలా ఒకరికొకరం చేదోడువాదోడుగా ఉంటాం.—2 కొరింథీయులు 1:3, 4 చదవండి.
13. సహించేలా మాయ అనే సిస్టర్‌కి ఏది సహాయం చేసింది?
13 రష్యాలో ఉంటున్న మాయ అనే సిస్టర్ మన సహోదర ప్రేమను కళ్లారా చూసింది. 2020లో పోలీసులు ఆమె ఇంటిని తనిఖీ చేశారు. తర్వాత, తన విశ్వాసం గురించి వేరేవాళ్లతో మాట్లాడుతుందని ఆమెను విచారణ చేశారు. దానిగురించి మాయ ఇలా చెప్తుంది: “ఆ సమయంలో నేను బాధలో కూరుకుపోయి, నీరుగారిపోయినప్పుడు సహోదరసహోదరీలు నాకు ఫోన్ చేసి మాట్లాడారు, మెసేజులు పంపారు, ఉత్తరాలు రాశారు. ఆ పనులన్నీ వాళ్లు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించాయి. అయితే, నన్ను ప్రేమించే ఓ ప్రపంచవ్యాప్త కుటుంబం ఉందని ఎప్పటినుండో నాకు తెలిసినా, 2020 నుండి మాత్రం వాళ్ల ప్రేమను ఇంకా ఎక్కువగా చవిచూడగలిగాను.”
14. కష్టాల్ని సహించాలంటే ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)
14 మీరేం చేయవచ్చు? మీరు కష్టాల్ని సహించాలంటే సహోదరసహోదరీలకు దగ్గరగా ఉండాలి. పెద్దల్ని సహాయం అడగడానికి మొహమాటపడకండి. వాళ్లు “గాలికి చాటైన చోటులా, తుఫాను నుండి ఆశ్రయంలా” ఉంటారు. (యెష. 32:2, అధస్సూచి) అయితే, మీలాంటి కష్టాల్నే మీ తోటి సహోదరసహోదరీలు కూడా పడుతున్నారని మర్చిపోకండి. కాబట్టి అవసరంలో ఉన్న ఎవరికైనా మీకు తోచిన సహాయం చేస్తే, మీకు సంతోషంగా ఉంటుంది, మీ కష్టాల్ని తట్టుకోవడానికి కూడా అది సహాయపడుతుంది.—అపొ. 20:35.
మీ తోటి సహోదరసహోదరీలకు దగ్గరగా ఉండండి (14వ పేరా చూడండి)c
భవిష్యత్తు మీద ఆశ
15. భవిష్యత్తు మీద ఆశ యేసుకు ఎలా సహాయం చేసింది? మనకు ఎలా సహాయం చేస్తుంది? (హెబ్రీయులు 12:2)
15 సహించేలా సహాయం చేయడానికి యెహోవా మనకు భవిష్యత్తు మీద ఆశను ఇచ్చాడు. (రోమా. 15:13) యేసు భూమ్మీద ఉన్నప్పుడు అన్నిటికన్నా పెద్ద కష్టాన్ని తట్టుకోవడానికి, భవిష్యత్తు మీద ఆశ ఎలా సహాయం చేసిందో ఒకసారి గుర్తుతెచ్చుకోండి. (హెబ్రీయులు 12:2 చదవండి.) తను నమ్మకంగా ఉంటే యెహోవా పేరును పవిత్రపర్చినట్టు అవుతుందని యేసుకు తెలుసు. అంతేకాదు, తన తండ్రిని తిరిగి కలవడం కోసం, తన అభిషిక్త సహోదరులతో కలిసి పరిపాలించడం కోసం ఆయన ఎదురుచూశాడు. అదేవిధంగా, సాతాను లోకం మన మీదకు విసిరే ఏ కష్టాన్నైనా సహించడానికి, కొత్తలోకంలో శాశ్వతకాలం జీవిస్తామనే మన ఆశ సహాయం చేస్తుంది.
16. సహించడానికి ఒక సిస్టర్‌కి భవిష్యత్తు మీద ఆశ ఎలా సహాయం చేసింది? ఆమె మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?
16 రష్యాలో ఉంటున్న ఆనా అనే సిస్టర్‌కి భవిష్యత్తు మీద ఆశ ఎలా సహాయం చేసిందో చూడండి. తన భర్తను అరెస్టు చేసి, విచారణ కోసం జైల్లో పెట్టారు. దాన్ని గుర్తుచేసుకుంటూ ఆనా ఇలా చెప్పింది: “భవిష్యత్తు మీద మాకున్న ఆశ గురించి బాగా ఆలోచించాను, దానికోసం ప్రార్థించాను. దానివల్ల డీలాపడిపోకుండా ఉండగలిగాను. మా జీవితానికి ఇదే ముగింపు కాదని తెలుసు. అలాగే యెహోవా తన శత్రువుల్ని ఓడించి, మాకు ప్రతిఫలం ఇస్తాడని కూడా నాకు ఖచ్చితంగా తెలుసు.”
17. యెహోవా మాటిచ్చిన భవిష్యత్తు మీద మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
17 మీరేం చేయవచ్చు? యెహోవా మీకోసం దాచి ఉంచిన బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సమయం తీసుకోండి. మీరు కొత్తలోకంలో ఉన్నట్టు, దేవుడు ఇచ్చే దీవెనల్ని అనుభవిస్తున్నట్లు ఊహించుకోండి. దాంతో పోలిస్తే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఎంతపెద్ద కష్టమైనా ‘చాలా చిన్నగా’ కనిపిస్తుంది. (2 కొరిం. 4:17) దానికితోడు, భవిష్యత్తు గురించి వేరేవాళ్లకు చెప్తూ ఉండండి. భవిష్యత్తు గురించి ఏ ఆశా లేకుండా అష్టకష్టాలు పడుతున్న వాళ్ల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దేవుడు మాటిచ్చిన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని వేరేవాళ్లలో పెంచండి.
యెహోవా మీకోసం దాచి ఉంచిన అద్భుతమైన భవిష్యత్తు గురించి సమయం తీసుకొని ఆలోచించండి (17వ పేరా చూడండి)d
18. యెహోవా మాటిచ్చిన వాటిని మనం ఎందుకు నమ్మవచ్చు?
18 ఎన్నో కష్టాల్ని నమ్మకంగా సహించిన తర్వాత యోబు యెహోవా గురించి ఇలా చెప్పాడు: “నువ్వు అన్నీ చేయగలవని, నువ్వు చేయాలనుకున్నదేదీ నీకు అసాధ్యం కాదని ఇప్పుడు నాకు అర్థమైంది.” (యోబు 42:2) యెహోవా మాటిచ్చినవి చేయకుండా ఆయన్ని ఏదీ అడ్డుకోలేదని యోబు తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకుంటే, సహించడానికి మనకు కూడా బలం వస్తుంది. దీన్ని అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ గమనించండి. ఒకామెకు బాగా జబ్బు చేసింది, ఆమె ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్లింది కానీ అందరూ చేతులెత్తేశారు. దాంతో ఆమె డీలాపడిపోయింది. కానీ అనుభవం ఉన్న ఒక మంచి డాక్టర్, ఆమె సమస్యను గుర్తించి, ఆమె జబ్బును ఎలా నయం చేస్తాడో వివరించాడు. అప్పుడు ఆమెకు ఎలా అనిపిస్తుంది? ఆ జబ్బు నయం అవ్వడానికి కొంత సమయం పట్టినా సరే, అది నయం అవుతుందనే ఆశతో దాన్ని సహిస్తుంది, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా, కొత్తలోకం వస్తుందనే ఆశ ఇప్పుడున్న సమస్యల్ని తట్టుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని మనకు ఇస్తుంది.
19. సహించడానికి యెహోవా మనకు ఏమేమి ఇచ్చాడు?
19 మనం ఇప్పటివరకు చూసినట్టు మన కష్టాల్ని సహించడానికి యెహోవా మనకు ప్రార్థన అనే వరాన్ని, బైబిల్ని, తోటి సహోదరసహోదరీల్ని, భవిష్యత్తు మీద ఆశను ఇచ్చాడు. వీటన్నిటినీ మనం చక్కగా ఉపయోగించుకుంటే, సాతాను లోకం నాశనం అయ్యేవరకు మనకొచ్చే ఏ కష్టంలోనైనా సరే, యెహోవా మన చేయి పట్టుకుని నడిపిస్తాడు.—ఫిలి. 4:13.
పాట 33 మీ భారాన్ని యెహోవాపై వేయండి
a కొన్ని పేర్లను మార్చాం.
b చిత్రం వివరణ: కాలాలు, రుతువులు మారుతున్నా ఆరోగ్యం ఏమాత్రం బాగుపడని ఒక పెద్దవయసు బ్రదర్ నమ్మకంగా సహిస్తున్నాడు.
c చిత్రం వివరణ: కాలాలు, రుతువులు మారుతున్నా ఆరోగ్యం ఏమాత్రం బాగుపడని ఒక పెద్దవయసు బ్రదర్ నమ్మకంగా సహిస్తున్నాడు.
d చిత్రం వివరణ: కాలాలు, రుతువులు మారుతున్నా ఆరోగ్యం ఏమాత్రం బాగుపడని ఒక పెద్దవయసు బ్రదర్ నమ్మకంగా సహిస్తున్నాడు.