బైబిల్లోని వ్యక్తి
బెనాయాలా ధైర్యంగా, విశ్వసనీయంగా ఉండండి
బెనాయా, రాజైన దావీదు అలాగే రాజైన సొలొమోను కింద పనిచేసిన ఒక సాహస వీరుడు. బెనాయా ఒక యాజకుని కుమారుడు. సాధారణంగా, యాజకులు యుద్ధాలు చేయరు కాబట్టి ఆయుధాలు వాడరు. కానీ బెనాయా యెహోవా యుద్ధాల్లో చురుగ్గా పాల్గొని, చాలా ధైర్యం చూపించాడు. ఉదాహరణకు, ఆయన ఒక నీటి గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు, అలాగే ఆయుధాలు ధరించిన ఒక భారీకాయుడిని ఓడించాడు. దావీదు బెనాయాను చాలా నమ్మాడు, అందుకే ఆయన్ని తన అంగరక్షకుల మీద అధిపతిగా నియమించాడు.—2 సమూ. 23:20-23.
అబ్షాలోము, అదోనీయా తిరుగుబాటు చేసినప్పుడు బెనాయా దావీదుకు విశ్వసనీయంగా ఉన్నాడు. (2 సమూ. 8:18; 15:18; 1 రాజు. 1:8) అంతేకాకుండా, దావీదు ముసలివాడై సొలొమోనును రాజుగా చేస్తున్నప్పుడు బెనాయా మద్దతిచ్చాడు. (1 రాజు. 1:32-40) అవును, తన చుట్టూ ఉన్నవాళ్లు విశ్వసనీయంగా లేకపోయినా బెనాయా మాత్రం యెహోవాకు, ఆయన అభిషేకించిన వాళ్లకు విశ్వసనీయంగా ఉన్నాడు.
సాతాను, అతని అనుచరులు శక్తిమంతులు కాబట్టి వాళ్లతో పోరాడాలంటే మనకు కూడా ధైర్యం కావాలి. అంతేకాకుండా, యెహోవా ప్రమాణాలకు తగ్గట్టుగా జీవిస్తూ ఉండాలని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. (ఎఫె. 6:11; 1 పేతు. 5:8, 9) కొంతమంది యెహోవాను వదిలేసినా సరే, మనం మాత్రం బెనాయాలా యెహోవా మనకు ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకంతో ఆయనకు విశ్వసనీయంగా ఉంటాం.—2 సమూ. 22:26.