మే 25-31, 2026
పాట 135 యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’
లోతైన అవగాహన చూపించండి, ‘విజయం సాధించండి’
“ఒక విషయం మీద లోతైన అవగాహన ఉన్నవాడు విజయం సాధిస్తాడు.”—సామె. 16:20.
ముఖ్యాంశం
లోతైన అవగాహన చూపించడం వల్ల, కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎలా చక్కగా ప్రవర్తించవచ్చో చూస్తాం.
1-2. లోతైన అవగాహన అంటే ఏంటి? అది మనకు ఎలా సహాయం చేస్తుంది?
ఎవరైనా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వనట్టు ఎప్పుడైనా అనిపించిందా? లేదా ఎవరైనా మిమ్మల్ని తప్పుబట్టి నిందించారా? లేదా ఏదైనా పరిస్థితి మిమ్మల్ని హడలెత్తించిందా? అలాగైతే, అలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండడం ఎంత కష్టమో మీకు తెలిసే ఉంటుంది. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ పరిస్థితుల్లోనే కాదు ఇంకా చాలా పరిస్థితుల్లో మీరు ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేసే ఒక లక్షణం గురించి బైబిలు చెప్తుంది. అదే లోతైన అవగాహన.
2 లోతైన అవగాహన అంటే ఒక విషయాన్ని పైపైన కాకుండా, లోతుల్లోకి వెళ్లి చూసే సామర్థ్యం. అంటే, ఫలానా విషయం ఎందుకు జరిగి ఉండవచ్చో, ఎవరైనా ఫలానా విధంగా ఎందుకు ప్రవర్తించి ఉండవచ్చో అర్థం చేసుకోవడం. దాన్ని సంపాదిస్తే తెలివిగా ప్రవర్తిస్తాం. ఉదాహరణకు, మన ‘పెదాల్ని అదుపు చేసుకోవడానికి,’ ఎప్పుడు “మౌనంగా” ఉండాలో తెలుసుకోవడానికి లోతైన అవగాహన మనకు సహాయం చేస్తుంది. (సామె. 10:19; కీర్త. 4:4) మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి, తప్పును చూసీచూడనట్టు వదిలేయడానికి కూడా అది సహాయం చేస్తుంది. ఎవరైనా మనకు సలహా లేదా దిద్దుబాటు ఇచ్చినప్పుడు, వాటిని తీసుకోవడానికి కూడా లోతైన అవగాహన సహాయం చేస్తుంది. (సామె. 19:20) మనం లోతైన అవగాహన చూపించినప్పుడు యెహోవాను సంతోషపెడతాం. అంతేకాదు మనకు మనం మంచి చేసుకుంటాం, అలాగే మనం ఎవరితో మాట్లాడుతున్నామో-ప్రవర్తిస్తున్నామో వాళ్లకు కూడా మంచి చేస్తాం. కొన్ని పరిస్థితుల్లో, ముందు-వెనక ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయాలని, కోపాన్ని కక్కేయాలని మనకు అనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో లోతైన అవగాహన బాగా సహాయం చేస్తుంది. వినయంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, యెహోవా మీద పూర్తిగా ఆధారపడడానికి అది ఎలా సహాయం చేస్తుందో తెలిపే మూడు బైబిలు ఉదాహరణల్ని ఇప్పుడు చూద్దాం.
గర్వం వద్దు, వినయం చూపించండి
3. నయమాను ఎవరు?
3 విజయం మనల్ని వరించాలంటే, గర్వాన్ని తీసేసుకోవాలి. (1 పేతు. 5:5) ఈ విషయంలో లోతైన అవగాహన మనకు సహాయం చేస్తుంది. అదెలా? నయమాను ఉదాహరణ చూడండి. ఆయన ఇశ్రాయేలుకు ఉత్తరాన ఉన్న సిరియా దేశంలో ఉండేవాడు. ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, సిరియా సైన్యానికి అధిపతి. కానీ, ఆయనకు ఒక భయంకరమైన చర్మవ్యాధి ఉంది. అదే కుష్ఠువ్యాధి.—2 రాజు. 5:1.
4. నయమాను కొంతవరకు లోతైన అవగాహనను ఎలా చూపించాడు?
4 నయమాను భార్య దగ్గర, ఇశ్రాయేలు నుండి బానిసగా తెచ్చిన ఒక పాప పనిచేసేది. నయమానుకు ఉన్న రోగాన్ని ఇశ్రాయేలులో ఉన్న ఒక ప్రవక్త నయం చేయగలడని ఆ పాప ఆమెకు చెప్పింది. (2 రాజు. 5:2, 3) అప్పుడు నయమాను కావాలనుకుంటే ఇలా అనుకోవచ్చు: ‘శత్రు దేశం నుండి బానిసగా తెచ్చిన ఈ పాప నాకు ఉపయోగపడే విషయం ఏదైనా చెప్పగలదా?’ కానీ ఆయన అలా అనుకునే బదులు, కొంతవరకు లోతైన అవగాహన చూపించాడు. గర్వంతో ఆమె మాటల్ని కొట్టిపారేసే బదులు, వినయంగా వాటిని తీసుకున్నాడు. సిరియా రాజు దగ్గర అనుమతి తీసుకుని, తన జబ్బును నయం చేసుకోవడానికి ఇశ్రాయేలుకు బయలుదేరాడు.—2 రాజు. 5:4, 5.
5. నయమాను ఇశ్రాయేలుకు వచ్చినప్పుడు ఏం జరిగింది?
5 నయమాను తన కుష్ఠువ్యాధి బాగౌతుందనే కొండంత ఆశతో, ఇశ్రాయేలు రాజైన యెహోరాము దగ్గరికి వచ్చాడు. అయితే, సిరియా రాజు తనతో గొడవ పెట్టుకోవడానికే ఇతన్ని పంపించాడు అని యెహోరాము అనుకున్నాడు. ఎలీషా ప్రవక్తకు ఇదంతా తెలిసినప్పుడు, నయమానును తన దగ్గరికి పంపించమని యెహోరామును అడిగాడు. (2 రాజు. 5:6-9) నయమాను అనుకున్నట్టు అసలు ఏదీ జరగలేదు. ఎలీషా అయితే నయమానును చూడడానికి, అతనితో మాట్లాడడానికి కనీసం తన ఇంట్లో నుండి కూడా బయటికి రాలేదు. నయమాను బాగవ్వడానికి ఏమేం చేయాలో ఒక సందేశకుడి ద్వారా ఎలీషా కబురు పంపించాడు.—2 రాజు. 5:10.
6. (ఎ) సందేశకుడు నిర్దేశాలు ఇచ్చినప్పుడు, నయమాను ఎందుకు గర్వం చూపించి ఉంటాడు? (బి) నయమాను సేవకులు ఎలా లోతైన అవగాహన చూపించారు? దానివల్ల ఏమైంది? (2 రాజులు 5:13, 14)
6 మొదట్లో ఆ సందేశకుడికి గానీ, ఆ సందేశకుడు ఇచ్చిన నిర్దేశాలకి గానీ నయమాను సరిగ్గా స్పందించలేదు. ఆయనకు “కోపం వచ్చింది,” ఆయన “కోపంగా తిరిగెళ్లిపోయాడు” కూడా. (2 రాజు. 5:11, 12) ఎందుకు? బహుశా, ఇంత పైస్థానంలో ఉన్న సైన్యాధిపతి వచ్చి మాట్లాడుతుంటే, తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆయనకు అనిపించి ఉండవచ్చు. దాంతోపాటు, ఎలీషా ఇచ్చిన నిర్దేశాల్లో కూడా సిరియాని తక్కువ చేసినట్టు అనిపించి ఉండవచ్చు. ఏదేమైనా, బాగవ్వడం అనే సంగతి పక్కనపెట్టేసి, ఇంటికి వెళ్లిపోదాం అని నయమాను అనుకున్నాడు. కానీ ఆయన సేవకులు మాత్రం లోతైన అవగాహన చూపించి, ఆయన్ని ఇంకోసారి ఆలోచించమని వేడుకున్నారు. నయమాను తెలివిగా ప్రవర్తించాడు. తన గర్వాన్ని పక్కనపెట్టి వినయంగా ఎలీషా ఇచ్చిన నిర్దేశాలకు లోబడ్డాడు. దానివల్ల ఆయన బాగయ్యాడు!—2 రాజులు 5:13, 14 చదవండి.
7. నయమాను ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (సామెతలు 22:4) (చిత్రాలు కూడా చూడండి.)
7 ఈ ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? పైకి కనిపించే దానికి మించి చూసినప్పుడు, కోపం-బాధ లాంటివాటిని అదుపులో ఉంచుకున్నప్పుడు లోతైన అవగాహన చూపిస్తాం. ఆ లోతైన అవగాహన ఉంటే, మనం వినయంగా ఉంటాం. మనకు అన్ని జవాబులూ తెలియవని, మనకు వేరేవాళ్ల సహాయం, మరిముఖ్యంగా యెహోవా సహాయం అవసరమని గుర్తిస్తాం. నయమాను అప్పటికి ఇంకా యెహోవా ఆరాధకుడు కాదు. అయినప్పటికీ, ఆయన వినయంగా వేరేవాళ్లు చెప్పేది వినడం ద్వారా కొంతవరకు లోతైన అవగాహన చూపించాడు. ఉదాహరణకు, తన భార్య దగ్గర దాసురాలిగా సేవచేస్తున్న ఇశ్రాయేలు పాప చెప్పేది ఆయన విన్నాడు, తన సొంత సేవకులు చెప్పేది విన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా యెహోవా ప్రతినిధి అయిన ఎలీషా మాట విన్నాడు. నయమాను తన అహం దెబ్బతిందని అక్కడే ఆగిపోయే బదులు, చివర్లో తెలివైన నిర్ణయం తీసుకుని విజయం సాధించాడు. మనకు కూడా లేఖనాధారంగా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, బహుశా అది మనకు నచ్చకపోవచ్చు. అలాగే, యెహోవా సంస్థ ఇచ్చిన నిర్దేశం మనకు అర్థం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కాస్త ఆగి, మనం ఏం చెప్పాలి లేదా ఏం చేయాలి అని ఆలోచించాలి. ఎందుకంటే, మన మాటల్లో లేదా పనుల్లో మనకు గర్వం ఉందా లేక వినయం ఉందా అనేది తెలిసిపోతుంది.—సామెతలు 22:4 చదవండి.
నయమాను వేరేవాళ్ల మాటను వినయంగా విన్నట్టే, మనం కూడా వేరేవాళ్లు మనకు సలహా ఇస్తున్నప్పుడు, ఒక సమస్య గురించి చెప్తున్నప్పుడు, దేవుని సంస్థ నుండి నిర్దేశం వచ్చినప్పుడు వినాలి (7వ పేరా చూడండి)
కోపం వద్దు, ప్రశాంతంగా ఉండండి
8. ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రశాంతంగా ఉండడం కష్టం?
8 చిరాకు పుట్టించే పరిస్థితుల్లో, కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి లోతైన అవగాహన సహాయం చేస్తుంది. నిజమే, ఎవరైనా జాలి-దయ లేకుండా అన్యాయంగా మనల్ని ఏదైనా అన్నా, ఏదైనా చేసినా, మనకు కోపం రావడం సహజమే. అలాంటప్పుడు, ప్రశాంతంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. (ఎఫె. 4:26) కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు, అబీగయీలు లోతైన అవగాహనను ఎలా చూపించారో ఇప్పుడు గమనిద్దాం.
9. నాబాలు దావీదుతో ఎలా ప్రవర్తించాడు?
9 ఒకసారి ఊహించుకోండి: దావీదు, ఆయన మనుషులు సౌలు నుండి పారిపోయి పారాను ఎడారిలో తలదాచుకున్నారు. (1 సమూ. 25:1) వాళ్లు అక్కడ ఉన్నప్పుడు, నాబాలు అనే ధనవంతుడి మందల్ని, కాపరుల్ని దయతో కాపాడారు. (1 సమూ. 25:15, 16) గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చినప్పుడు, దావీదు తన మనుషుల్ని నాబాలు దగ్గరికి పంపించి, ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ వీలైతే ఏమైనా ఆహారం ఇవ్వగలడేమో అని వినయంగా అడిగించాడు. (1 సమూ. 25:6-8) కానీ నాబాలు మాత్రం దావీదు, ఆయన మనుషులు చేసినదానికి రవ్వంత కృతజ్ఞత కూడా చూపించలేదు. ఆయన దావీదు మనుషులతో దురుసుగా మాట్లాడాడు. ఆఖరికి దావీదును, ఆయన మనుషుల్ని అవమానించాడు.—1 సమూ. 25:10, 11.
10. దావీదు, అబీగయీలు ఇద్దరూ లోతైన అవగాహనను ఎలా చూపించారు? (1 సమూయేలు 25:32, 33) (చిత్రం కూడా చూడండి.)
10 మీరు దావీదు స్థానంలో ఉంటే మీకు ఎలా అనిపించేది? దావీదుకు ఎందుకంత కోపం వచ్చిందో అర్థం చేసుకోవడం మనకు పెద్ద కష్టమేం కాదు. ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఆయనకు ఈ సందర్భంలో ఎంత కోపం వచ్చిందంటే, ఆయన నాబాలును చంపేద్దాం అనుకున్నాడు! (1 సమూ. 25:13, 21, 22) నిజానికి, అలా చంపేద్దామని బయల్దేరినప్పుడే నాబాలు భార్య అయిన అబీగయీలు తెలివిగా వచ్చి అడ్డుపడింది. అబీగయీలు లోతైన అవగాహనను ఎలా చూపించింది? దావీదు ఎంత కోపం చూపిస్తున్నప్పటికీ, ఆయన మంచివాడని ఆమె అర్థం చేసుకుంది. అందుకే, ఆయన కోపాన్ని అదుపు చేయడానికి చేయగలిగినదంతా చేసింది. ఆమె దయగా చాలా ఆహారం తెచ్చింది, వినయంగా తెలివైన సలహా ఇచ్చింది. (1 సమూ. 25:18, 23-31) దావీదు కూడా అబీగయీలు చెప్పింది పాటించడం ద్వారా లోతైన అవగాహన చూపించాడు. ఆమె మాటలు యెహోవా ఆలోచనకు అద్దం పడుతున్నాయి అని ఆయన గుర్తించాడు. దానివల్ల దావీదు తన కోపం తగ్గించుకుని, ప్రశాంతంగా ఉండి ఒక పెద్ద తప్పు చేయకుండా ఆగిపోయాడు.—1 సమూయేలు 25:32, 33 చదవండి.
దావీదు, అబీగయీలు లోతైన అవగాహన చూపించడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది (10వ పేరా చూడండి)
11. ఎవరైనా మనకు కోపం తెప్పించినప్పుడు, లోతైన అవగాహన ఎలా సహాయం చేస్తుంది? (సామెతలు 19:11)
11 ఈ ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఏదైనా జరిగినప్పుడు, మీకు కోపం రావడానికి సరైన కారణం ఉన్నాసరే, ప్రశాంతంగా ఉండేలా లోతైన అవగాహన సహాయం చేస్తుంది. మన మాటల వల్ల, పనుల వల్ల ఎన్ని అనర్థాలు జరగవచ్చో కూడా గుర్తించడానికి సహాయం చేస్తుంది. (సామెతలు 19:11 చదవండి.) యెహోవా ఆలోచన ఏంటో దావీదుకు గుర్తుచేసినప్పుడు, ఆయన తన కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగాడు. అలాగే, ఏదైనా విషయం మీకు కోపం-చిరాకు తెప్పించినా తొందరపడి ఏదీ చేయకండి. (యాకో. 1:19) బదులుగా యెహోవాకు ప్రార్థన చేసి, ఆ విషయంలో యెహోవా ఆలోచన ఏంటో అర్థం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకోండి. అలా చేస్తే, బహుశా మీ కోపం తగ్గిపోయి ప్రశాంతంగా ఉండవచ్చు.
12. లోతైన అవగాహన చూపించడానికి, ప్రశాంతంగా ఉండడానికి వేరేవాళ్లు మనకు ఎలా సహాయం చేయవచ్చు?
12 విషయాల్ని పైపైన కాకుండా, లోతుగా చూసేలా యెహోవా అబీగయీలు ద్వారా దావీదుకు సహాయం చేశాడు. అదేవిధంగా, మనం కూడా విషయాల్ని లోతుగా అర్థం చేసుకోవడానికి వేరేవాళ్లను ఉపయోగించుకుని ఆయన మనకు సహాయం చేయవచ్చు. కాబట్టి, ఏదైనా చిరాకు పుట్టించే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే ఏదో ఒకటి చేసేసే బదులు, ఒక పరిణతిగల క్రైస్తవుడితో మాట్లాడండి. బహుశా, మీరు ఆ విషయాల్ని సరైన దృష్టితో చూడడానికి ఆయన మీకు సహాయం చేయవచ్చు. (సామె. 12:15; 20:18) మరోవైపు, అలాంటి పరిస్థితిలో ఉన్న ఫ్రెండ్‌కి మీరే సహాయం చేసే స్థితిలో ఉన్నారనుకోండి. మీరు అబీగయీలులా ఉండగలరా? విషయాల్ని యెహోవా దృష్టితో చూడడానికి మీ ఫ్రెండ్‌కి సహాయం చేయగలరా? వాళ్లు లోతైన అవగాహన చూపిస్తూ ప్రశాంతంగా ఉండడానికి మనం సహాయం చేస్తే, యెహోవా మన ప్రయత్నాల్ని తప్పకుండా దీవిస్తాడు.
భయం వద్దు, నమ్మకం చూపించండి
13. మన భయాల్ని తగ్గించుకోవడానికి లోతైన అవగాహన ఎలా సహాయం చేస్తుంది?
13 కొన్నిసార్లు మనకు భయం పుట్టించే పరిస్థితులు ఎదురౌతుంటాయి. కానీ యెహోవాకున్న అపారమైన శక్తి ముందు ఈ లోకంలోని ఎలాంటి హడలెత్తించే పరిస్థితులైనా తలవంచాల్సిందే అని గుర్తించడానికి లోతైన అవగాహన మనకు సహాయం చేస్తుంది. (కీర్త. 27:1) ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఆఖరికి తప్పించుకోవడానికి ఏ దారీ లేదు అనిపించే పరిస్థితుల్లోనైనా సరే, యెహోవా మనకు సహాయం చేయగలడు. ఆ విషయమే యోనా ప్రవక్త జీవితంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయనకు యెహోవా అంటే ఇష్టమే, కానీ ఒక కష్టమైన పని అప్పగించినప్పుడు మాత్రం ఆయన భయపడ్డాడు. ఆ సమయంలో ఆయనకు లోతైన అవగాహన చాలా అవసరమైంది.
14. యెహోవా ఒక పని అప్పగించినప్పుడు, యోనా దాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు భయపడి ఉంటాడు?
14 యెహోవా యోనాకు హడలెత్తించే ఒక పని అప్పగించాడు. అదేంటంటే: నీనెవెకు వెళ్లి అక్కడున్న ప్రజలకు, త్వరలో నాశనం రాబోతుంది అని ప్రకటించాలి. (యోనా 1:1, 2) మీకే ఆ పని అప్పగిస్తే మీకు ఎలా అనిపించి ఉండేది? ఇశ్రాయేలు నుండి అష్షూరు నగరమైన నీనెవె వరకు ఆ కష్టమైన రోడ్లమీద నడుచుకుంటూ వెళ్లాలంటే, యోనాకు ఒక నెల పట్టి ఉండేది. అష్షూరీయులు కోపానికి, హింసకు పెట్టింది పేరు. అంతెందుకు, నీనెవెకి “రక్తసిక్తమైన నగరం” అనే పేరు ఉంది. (నహూ. 3:1, 7) కాబట్టి, ఆ పనిని ఒప్పుకునే బదులు పారిపోవడమే మంచిదని యోనా అనుకున్నాడు.—యోనా 1:3.
15. యోనా యెహోవా మీద, ఇంతకుముందు కన్నా ఎక్కువ నమ్మకాన్ని ఎలా పెంచుకున్నాడు? (యోనా 2:6-9)
15 యోనా పారిపోతున్నప్పుడు, యెహోవా ఆయన ప్రాణాన్ని అద్భుతరీతిలో కాపాడడం ద్వారా తన శక్తిని గుర్తుచేశాడు. (యోనా 1:15, 17) అప్పుడు యోనా ఒక పాఠం నేర్చుకున్నాడు. ఆయన నీనెవెలో తన పని ఎంత ప్రమాదకరమో ఆలోచించే బదులు, ఏ ప్రమాదం నుండైనా సరే యెహోవా తనను కాపాడగలడనే వాస్తవం మీద మనసుపెట్టాడు. (యోనా 2:6-9 చదవండి.) అందుకే యెహోవా రెండో అవకాశాన్ని ఇచ్చినప్పుడు, ఇక యోనా వెనక్కి తగ్గలేదు. ఆయన వెంటనే నీనెవె వెళ్లిపోయాడు, పరిచర్య చేశాడు, మంచి ఫలితాలు కూడా సాధించాడు.—యోనా 3:5.
16. భయంగా అనిపించే పరిస్థితుల్లో, లోతైన అవగాహన మనకు ఎలా సహాయం చేస్తుంది? (సామెతలు 29:25) (చిత్రాలు కూడా చూడండి.)
16 ఈ ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనుషుల భయం వల్ల గానీ, ఇంకా దేనివల్ల గానీ యెహోవా ఆరాధనలో మనం వెనకడుగు వేయకూడదు. (సామెతలు 29:25 చదవండి.) యోనా లోతైన అవగాహన చూపించాడు కాబట్టి, తనకు అప్పగించిన పనిలోని సవాళ్ల మీద మనసుపెట్టే బదులు, యెహోవా ఇచ్చే మద్దతు మీద మనసుపెట్టాడు. అదేవిధంగా, మనం కూడా మన భయాలకు మించి చూడాలి. యెహోవా గతంలో మనకు ఎలా సహాయం చేశాడో, ఎలా కాపాడాడో ఆలోచించాలి. అంతేకాదు, యెహోవా మీద ఆధారపడడం ద్వారా భయంకరమైన పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న, కష్టమైన నియామకాల్ని చక్కగా చేసిన మన బ్రదర్స్‌సిస్టర్స్ ఉదాహరణల్ని ధ్యానించవచ్చు.a (హెబ్రీ. 13:6) యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచుతూ లోతైన అవగాహన చూపిద్దాం, వేరేవాళ్లు కూడా అలా చేసేలా సహాయం చేద్దాం.
దేవుని నిర్దేశాన్ని అంగీకరించడానికి, కష్టమైన పరిస్థితుల్లో విజయం సాధించడానికి లోతైన అవగాహన సహాయం చేస్తుందని యోనా ఉదాహరణ నేర్పిస్తుంది (16వ పేరా చూడండి)
లోతైన అవగాహనను సంపాదించుకోండి, దాన్ని కాపాడుకోండి
17. లోతైన అవగాహనను ఇంకా ఎక్కువగా ఎలా సంపాదించుకోవచ్చు?
17 ఈ ఆర్టికల్‌లో చూసినట్టు, లోతైన అవగాహన వల్ల కష్టమైన పరిస్థితుల్లో మనం చక్కగా ప్రవర్తించగలుగుతాం. ఇంతకీ, లోతైన అవగాహనను ఇంకా ఎక్కువగా ఎలా సంపాదించుకోవచ్చు? దానికి మూలం యెహోవాయే. ఆయన దాన్ని తన వాక్యమైన బైబిలు ద్వారా, పవిత్రశక్తి ద్వారా తన ప్రజలకు ఇస్తాడు. మన అడుగులు నిర్దేశించడానికి, అలాగే కోపం-బాధ లాంటివాటిని అదుపు చేసుకోవడానికి ఉపయోగపడే సలహాల్ని ఆయన ఇస్తాడు. కాబట్టి బైబిలు ఏం చెప్తుందో పరిశీలించడం ద్వారా, పవిత్రశక్తిని ఇవ్వమని ప్రార్థించడం ద్వారా మనం లోతైన అవగాహనను సంపాదించుకోవచ్చు. (నెహె. 9:20; కీర్త. 32:8) దానివల్ల విషయాల్ని స్పష్టంగా చూడగలుగుతాం. (కీర్త. 119:97-101) అలాగే, ఫలానా పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తే మంచిదో అర్థం చేసుకుంటాం. అంటే మనం ఏం చేస్తే, ఏం మాట్లాడితే యెహోవా ఆలోచనకు అద్దం పట్టినట్టు అవుతుందో తెలుసుకోగలుగుతాం.—సామె. 21:11.
18. మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు?
18 యెహోవా ఇచ్చే లోతైన అవగాహనను వెతుకుతూ ఉందాం, దానికి విలువిస్తూ ఉందాం. (కీర్త. 14:2) అలా చేస్తే, “లోతైన అవగాహన మార్గం నుండి” మనం ఎప్పుడూ పక్కకు తొలగం. (సామె. 21:16) బదులుగా అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో లోతైన అవగాహన చూపించాలని ఇంకా ఎక్కువగా నిర్ణయించుకుంటాం. దానివల్ల, మనం ‘విజయం సాధిస్తాం.’
పాట 42 దేవుని సేవకుల ప్రార్థన
a ఉదాహరణకు, JW లైబ్రరీలో లేదా jw.orgలో ఆర్టికల్ సిరీస్‌లోని “యెహోవాసాక్షుల జీవిత కథలు” కిందున్న గ్యోర్గి పోర్చులియాన్ అనుభవం చూడండి.