మే 18-24, 2026
పాట 35 ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో తెలుసుకోండి’
మీ దృష్టిని పక్కకు మళ్లనివ్వకండి
“యెహోవా ఇష్టం ఏమిటో అర్థంచేసుకుంటూ ఉండండి.”—ఎఫె. 5:17.
ముఖ్యాంశం
మన దృష్టిని పక్కకు మళ్లించే పరిస్థితులున్నా, మనం ఆధ్యాత్మిక పనులపై ఎలా మనసుపెట్టవచ్చో చూస్తాం.
1-2. కొన్నిసార్లు ప్రాముఖ్యమైన విషయాలు కూడా మన దృష్టిని ఎలా మళ్లించవచ్చు?
మీ దృష్టిని పక్కకు మళ్లించే పరిస్థితి ఈమధ్య ఎప్పుడు వచ్చింది? బహుశా మీరు అప్పటికే ఒక పని చేస్తుండగా, ఉన్నట్టుండి ఇంకో పని వచ్చి ఉంటుంది. అప్పుడు మీరు రెండిటిలో ఏది ముఖ్యమో తేల్చుకోవాలి. ఉదాహరణకు, మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడే మీకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ముఖ్యమైనదే కావచ్చు, కానీ ఆ టైమ్‌లో అది మీ దృష్టిని పక్కకు మళ్లిస్తుంది. కాబట్టి, డ్రైవింగ్ మీద మనసుపెట్టడమే చాలా ప్రాముఖ్యం.
2 మన జీవితంలో ముఖ్యమైన విషయాలు చాలానే ఉంటాయి. కానీ, ఆధ్యాత్మిక పనులa మీద మనసుపెట్టడం అన్నిటికంటే ముఖ్యం. (మత్త. 6:33) వాహనాన్ని జాగ్రత్తగా నడిపే డ్రైవర్లు ముందున్న రోడ్డు మీద మనసుపెడతారు గానీ, దిక్కులు చూడరు. యెహోవా ప్రజలు కూడా తమ దృష్టి పక్కకు మళ్లకుండా జాగ్రత్తపడతారు.—సామె. 4:25; మత్త. 6:22.
3. మన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో ఎలా పోరాడాలో ఎందుకు తెలుసుకోవాలి?
3 ఆధ్యాత్మిక పనుల్ని పక్కన పెట్టేయాలని మనలో ఎవ్వరం కోరుకోం. కానీ, కొన్నిసార్లు మన పరిస్థితుల వల్ల తెలీకుండానే మనందరి దృష్టి పక్కకు మళ్లే ప్రమాదం ఉంది. (లూకా 21:34-36) అందుకే, ఈ ఆర్టికల్‌లో మనం వీటి గురించి చూస్తాం: (1) మన దృష్టిని పక్కకు మళ్లించే విషయాలు ఏంటి? (2) తన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో యేసు ఎలా పోరాడాడు? (3) ఈ రోజుల్లో మన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో మనం ఎలా పోరాడవచ్చు? వీటిని తెలుసుకోవడం వల్ల, మనం యెహోవా సేవ మీద మనసుపెట్టగలుగుతాం.
మన దృష్టిని పక్కకు మళ్లించే విషయాలు ఏంటి?
4-6. ఏ విషయాలు మన దృష్టిని ఇట్టే పక్కకు మళ్లించగలవు?
4 రోజువారీ జీవితంలో మనం పట్టించుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఉదాహరణకు ఆరోగ్యం కాపాడుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, మన సొంత అవసరాల్ని కూడా పట్టించుకోవాలి. అవన్నీ చాలా ముఖ్యమైనవే అయినా, వాటివల్ల మన దృష్టి పక్కకు మళ్లే అవకాశం ఉందా? అవును, ఖచ్చితంగా ఉంది. ఒకవేళ 24 గంటలూ వాటి గురించే ఆలోచిస్తే, అవి మన దృష్టిని పక్కకు మళ్లించే అవకాశం ఉంది.
5 వాటికితోడు ఈ చివరి రోజుల్లో రాజకీయ అలజడులు, ఆర్థిక ఇబ్బందులు, విరుచుకుపడే మహమ్మారులు, ఊపిరాడనివ్వని యుద్ధాలు మన గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. (2 తిమో. 3:1) అలాంటివి జరిగినప్పుడు, మనం కంగారుపడిపోయి ప్రతీక్షణం వాటి గురించే ఆలోచించే ప్రమాదం ఉంది.
6 బహుశా వాటివల్ల కొంతమంది జీవితాలు తలకిందులు అయ్యుండవచ్చు. దాంతో వాళ్లు అదేపనిగా బాధపడుతూ ఉంటారు, అది మామూలే. అయితే, మనుషులు అదేపనిగా ఆందోళనలో నలిగిపోయేలా యెహోవా సృష్టించలేదు. అందుకే జీవితంతో విసిగిపోయిన కొంతమంది తమ బాధను మర్చిపోవడానికి వినోదం వెంట, ఆటపాటల వెంట పరుగులు తీస్తారు. ఒకవేళ మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయవచ్చు? తన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో యేసు ఎలా పోరాడాడో, ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
తన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో యేసు ఎలా పోరాడాడు?
7. దృష్టిని పక్కకు మళ్లించే ఏ విషయాలు యేసు చుట్టూ ఉన్నాయి?
7 దృష్టిని పక్కకు మళ్లించే చాలా విషయాలు యేసు చుట్టూ ఉన్నాయి. ఉదాహరణకు పేదరికం, జబ్బులు వంటి సమస్యలతో సమాజంలో చాలామంది ఇబ్బంది పడేవాళ్లు. (మత్త. 14:14; మార్కు 14:7) రాజకీయ సమస్యలు కూడా ఎక్కువే. రోమన్ల చేతుల్లో, తోటి యూదుల చేతుల్లో ప్రజలు అన్యాయానికి బలయ్యారు. అందుకే యేసుకున్న శక్తిని, అద్భుతాలు చేసే సామర్థ్యాన్ని చూసి ప్రజలు ఆయన్ని రాజుగా చేయాలనుకున్నారు. (యోహా. 6:14, 15) దానికితోడు సాతాను కూడా యేసును వదల్లేదు, లోక పరిపాలకుడు అవ్వడానికి అడ్డదారి తొక్కమన్నాడు. (మత్త. 4:8, 9) అంతేకాదు, తను చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుందని యేసు అన్నప్పుడు, ఆయన దగ్గరి స్నేహితుల్లో ఒకరైన పేతురు “ప్రభువా, అలా మాట్లాడొద్దు” అన్నాడు. ఒకవిధంగా, ముళ్లబాటలో కాకుండా పూలబాటలో నడవమని పేతురు అంటున్నాడు.—మత్త. 16:21, 22.
8. తన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో యేసు ఎలా పోరాడాడు?
8 తన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో యేసు ఎలా పోరాడాడు? ఆయన మూడు విధాలుగా అలా చేశాడు. (1) యెహోవాలా ఆలోచించడం నేర్చుకున్నాడు. (యోహా. 8:28; 14:9) (2) ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉన్నాడు. (మత్త. 9:35) (3) ఏవి నిజంగా ముఖ్యమైనవో మనసులో స్పష్టంగా ఉంచుకున్నాడు. (యోహా. 4:34) ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం అంటున్నారు, ఏం చేస్తున్నారు అని పట్టించుకోకుండా దేవుని ఇష్టాన్ని చేసుకుంటూ వెళ్లాడు. ఇంకా, సాతాను ఎంత ఆశ చూపించినా యేసు వాటివైపు కూడా చూడలేదు. అంతేకాదు, పేతురు మంచి ఉద్దేశంతోనే ఆ మాటలు అన్నా, అవి దేవుని ఇష్టానికి తగ్గట్టు లేవు కాబట్టి యేసు తన మనసు మార్చుకోలేదు. (మత్త. 4:10; 16:23) అయితే యేసు దృష్టిని పక్కకు మళ్లించేవి, మన దృష్టిని పక్కకు మళ్లించేవి వేర్వేరుగా ఉండవచ్చు. కానీ యేసు గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్ల, మనం కూడా ఆయనలాగే వాటితో పోరాడవచ్చు.
మన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో మనం ఎలా పోరాడవచ్చు?
9. “యెహోవా ఇష్టం ఏమిటో” ఎలా అర్థం చేసుకోవచ్చు? (ఎఫెసీయులు 5:17)
9 యెహోవాలా ఆలోచించడం నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించడం ద్వారా మనం వేర్వేరు విషయాల్లో “యెహోవా ఇష్టం ఏమిటో” అర్థం చేసుకోగలుగుతాం. (ఎఫెసీయులు 5:17 చదవండి.) బైబిల్ని ఎంత ఎక్కువగా చదివి ధ్యానిస్తే, యెహోవా ఆలోచనను అంత ఎక్కువగా అర్థం చేసుకుంటాం. కొన్నిసార్లు మన పరిస్థితికి సూటిగా సరిపోయే విషయాలు బైబిల్లో లేకపోయినా, మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఎందుకంటే యెహోవా ఎలా ఆలోచిస్తాడో, ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడో మనం అర్థం చేసుకున్నాం.
10. యెహోవా ఆలోచనా విధానాన్ని ఇంకా బాగా ఎలా తెలుసుకోవచ్చు?
10 యెహోవా మనుషులతో ఎలా ప్రవర్తించాడో పరిశీలించడం ద్వారా, ఆయన ఆలోచనా విధానాన్ని ఇంకా బాగా తెలుసుకోవచ్చు. (యిర్మీ. 45:5) అందుకే, బైబిలు చదువుతున్నప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఇది యెహోవా గురించి నాకు ఏం చెప్తుంది? యెహోవా ఆలోచనకు తగ్గట్టు నా ఆలోచనా విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాలా?’ నిజమే, యెహోవా ఆలోచనలు మన ఆలోచనల కంటే చాలా గొప్పవి. (యెష. 55:9) కాబట్టి, ఆయన ఇష్టాన్ని ఎలా చేయాలో నేర్పించమని ఆయన్ని అడగడమే సరైనది. (కీర్త. 143:10) ఆయన ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకునేలా, ఆయనలాగే ఆలోచించేలా సహాయం చేయమని ప్రార్థిస్తే, ఆయన మనకు ఖచ్చితంగా జవాబిస్తాడు.—1 యోహా. 5:14.
11. యెహోవా మన విషయంలో ఏం కోరుకుంటున్నాడు?
11 మనం యెహోవాలా ఆలోచించడం నేర్చుకునే కొద్దీ, ఇప్పుడు మన విషయంలో ఆయన కోరిక ఏంటో తెలుసుకుంటాం. మన దృష్టిని మళ్లించేవి మన చుట్టూ ఎన్ని ఉన్నా, మనం అంతం కోసం సిద్ధంగా ఉండాలన్నదే ఆయన కోరిక. (మత్త. 24:44) ఆందోళనలతో మనం ఉక్కిరిబిక్కిరి అవ్వకూడదని ఆయన కోరుకుంటున్నాడు. (మత్త. 6:31, 32) కాబట్టి ఆరోగ్యం, ఉద్యోగం, ఇల్లు, కుటుంబం వంటి రకరకాల ఆందోళనలు మనకు ఊపిరాడకుండా చేస్తే, యెహోవా మనకు ఏదోకవిధంగా సహాయం చేస్తాడు. మనం అడిగితే, మన సమస్యలతో పోరాడడానికి కావాల్సిన తెలివిని, శక్తిని ఆయన ఇస్తాడు.—కీర్త. 55:22; సామె. 3:5-7.
12. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల్ని చూసి ఆందోళనపడకుండా ఉండాలంటే, మనం చేయాల్సిన ఒక పని ఏంటి? (మత్తయి 5:3)
12 ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉండండి. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల్ని చూసి మనందరం ఎంతో కొంత ఆందోళనపడతాం. కానీ దాని గురించి మనం ఏమీ చేయలేం. కాబట్టి మన చేతుల్లో లేనివాటి గురించి ఆలోచించి మన దృష్టిని పక్కకు మళ్లించుకునే బదులు, ఆధ్యాత్మిక పనుల మీద మనసుపెట్టాలి. యెహోవా మనల్ని ఆధ్యాత్మిక అవసరంతో, అంటే దేవుని నిర్దేశం వైపు చూడాలనే కోరికతో సృష్టించాడు. ఆ అవసరాన్ని తీర్చుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. (మత్తయి 5:3 చదవండి.) బైబిల్ని చదివి యెహోవా గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకోవడం ద్వారా, ఆయన సేవలో చేయగలిగినదంతా చేయడం ద్వారా ఆ అవసరాన్ని తీర్చుకోవచ్చు. మనం అలా చేసినప్పుడు యెహోవా చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే మన సమయాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాం అని చూపిస్తాం.—సామె. 23:15.
13. మన సమయాన్ని “శ్రేష్ఠమైన విధంగా” ఎలా ఉపయోగించవచ్చు?
13 క్రైస్తవులమైన మనం, సమయాన్ని “శ్రేష్ఠమైన విధంగా” ఉపయోగించాలనుకుంటాం. (ఎఫె. 5:15, 16) ఇక్కడ బైబిలు మన రోజువారీ పనుల్ని చక్కబెట్టుకోవడం గురించి చెప్పట్లేదు గానీ, అంతానికి ముందున్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించమని చెప్తుంది. మరి, మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించవచ్చు? 24 గంటలూ న్యూస్ చూస్తూ, ఎక్కడ ఏ చెడు సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకుంటూ ఉంటే, మన దృష్టి పక్కకు మళ్లవచ్చు, మనసు పాడవ్వవచ్చు, ఆరాధనలో మన ఉత్సాహం తగ్గిపోవచ్చు. కాబట్టి, ఎంతసేపు న్యూస్ చూడాలనే విషయంలో హద్దులు పెట్టుకోవడం మంచిది! అలా చేస్తే మనం బెంబేలెత్తిపోం గానీ, ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉంటూ ప్రోత్సాహం పొందుతాం. కుదిరితే మన పరిచర్యను పెంచుకోవచ్చేమో, ఇంకెక్కువ రిటన్ విజిట్‌లు చేయవచ్చేమో ఆలోచించవచ్చు. మనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని పరిచర్య చేయడం ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. ఎందుకంటే ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే రక్షించబడతారు!—1 తిమో. 2:4.
14. ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉంటే ఎలా ప్రయోజనం పొందుతాం? (చిత్రం కూడా చూడండి.)
14 ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉన్నప్పుడు, రోజులు ఇలా ఎందుకు ఉన్నాయో అర్థం చేసుకుంటాం. రాజకీయ అలజడులు, ఆర్థిక ఇబ్బందులు, మహమ్మారులు మన చుట్టూ ఉన్నా అవేవీ మనల్ని కుదిపేయలేవు. ఈ సూచనలన్నీ బైబిలు ప్రవచన నెరవేర్పుకు రుజువులు అని మనం గుర్తిస్తాం. కాబట్టి మనం అనవసరమైన భయాలతో మన దృష్టిని పక్కకు మళ్లించుకునే బదులు, యెహోవా అతిత్వరలో కొత్తలోకాన్ని తీసుకొస్తాడనే ధైర్యంతో ఉంటాం. అప్పటివరకు, కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండవచ్చు.—కీర్త. 16:8; 112:1, 6-8.
ప్రపంచ సంఘటనలు కుదిపేస్తున్నా, ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉండండి (14వ పేరా చూడండి)b
15. ‘మంచి వివేచనను’ ఎలా చూపించవచ్చు? (1 పేతురు 4:7)
15 నిజంగా ఏవి ముఖ్యమైనవో మనసులో స్పష్టంగా ఉంచుకోండి. ఈ లోకంలోని చాలామంది ఆటపాటల్లోనే మునిగి తేలుతున్నారు గానీ, ఈ లోకాంతం దగ్గరపడుతుందని గమనించుకోవట్లేదు. ఆటపాటల్లో తప్పేం లేదు గానీ, ఈ విషయంలో లోకస్థుల ఆలోచనను ఒంటపట్టించుకోకుండా జాగ్రత్తపడుతూ మనం “మంచి వివేచన” చూపించాలి. (1 పేతురు 4:7 చదవండి.) మంచి వివేచన ఉంటే, ఆటపాటల విషయంలో మనం సరైన ఆలోచనతో ఉంటూ, తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం. అలా తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు యెహోవాలా ఆలోచిస్తున్నామని, ఏవి ముఖ్యమైనవో అర్థం చేసుకున్నామని చూపిస్తాం.—2 తిమో. 1:7.
16. చనిపోయే ముందు కూడా యేసు దేని గురించి ఆలోచించాడు?
16 ఏవి ముఖ్యమైనవో యేసు మనసులో చాలా స్పష్టంగా ఉంది. యేసు చనిపోవడానికి కొన్ని గంటల ముందు చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు కూడా యెహోవాకు నమ్మకంగా ఉండడం గురించి, ఆయన ఇష్టం చేయడం గురించే యేసు ఆలోచించాడు. అందుకే ఆయన చాలా తీవ్రంగా ప్రార్థించాడు. యేసు అప్రమత్తంగా ఉన్నాడు, కానీ ఆయన శిష్యులు మాత్రం “దుఃఖం వల్ల అలసిపోయి” నిద్రపోయారు.—లూకా 22:39-46; యోహా. 19:30.
17. చాలామంది సోషల్ మీడియాను ఎందుకు వాడతారు? అది మన దృష్టిని ఎలా పక్కకు మళ్లించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
17 యేసు శిష్యుల్లాగే, మనం కూడా కొన్నిసార్లు దుఃఖంలో మునిగిపోవచ్చు. ఈ చివరి రోజుల్లో జరుగుతున్న సంఘటనల్ని చూసి మనలో ఆందోళన పెరగవచ్చు. ఇలాంటి సమస్యల నుండి పారిపోవడానికి చాలామంది సోషల్ మీడియా వైపు తిరుగుతున్నారు. ఉదాహరణకు వాళ్లు ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకి ఫోటోలు, వీడియోలు లాంటివి పంపించడానికి సోషల్ మీడియాను వాడతారు. అలాగే వీడియోలు చూడడానికి, గేమ్స్ ఆడడానికి దాన్ని వాడతారు. జాగ్రత్తగా లేకపోతే, తెలియకుండానే వీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో వచ్చింది వచ్చినట్టు చూడాలనే కోరిక సమయాన్ని, శక్తిని పూర్తిగా వృథా చేస్తుంది. కాబట్టి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఏదో కాస్త రిలాక్స్ అవ్వడానికి సోషల్ మీడియా వాడుతున్నానా? లేక ముఖ్యమైనవి ఏంటో తెలుసుకోకుండా కళ్లు మూసుకుపోయేంతగా దాన్ని వాడుతున్నానా?’
మంచి వివేచన ఉంటే సోషల్ మీడియా, వినోదం, ఆటపాటల వల్ల మన దృష్టి పక్కకు మళ్లకుండా చూసుకుంటాం (17వ పేరా చూడండి)
18. వినోదాన్ని ఎంచుకుంటున్నప్పుడు ఎందుకు మంచి వివేచన చూపించాలి?
18 టీవీలో, ఇంటర్నెట్‌లో మనం చూసే సినిమాలు, సిరీస్‌లు, షార్ట్ వీడియోలు, వీడియో గేమ్‌ల విషయంలో కూడా మంచి వివేచన అవసరం. అవి సరదాగా ఉండవచ్చు, రిలాక్స్ అవ్వడానికి సహాయం చేస్తాయని అనిపించవచ్చు. కానీ ఎలాంటి వినోదం చూస్తున్నాం, ఎంతసేపు చూస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఇంటర్నెట్‌లో అవి చూడండి, ఇవి చూడండి అంటూ ఎప్పుడూ ఏవో సజెషన్లు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో హింస, అశ్లీలత ఉండవచ్చు. ఆసియాలో ఉండే ఒక బ్రదర్ విషయంలో అదే జరిగింది. ఆయన ఆన్‌లైన్‌లో సినిమాలకు సంబంధించిన వీడియోలు చూడడం మొదలుపెట్టాడు. అలా చూస్తున్నప్పుడు, ఇవి కూడా చూడండి అంటూ కొన్ని వీడియో సజెషన్లు వచ్చాయి. అందులో కొన్ని అనైతికమైన సీన్లు చూశాడు. పోనుపోను ఆయన అశ్లీల చిత్రాలు చూడడం మొదలుపెట్టాడు. సంతోషకరంగా ఆయన పెద్దల సహాయంతో, కొంతమంది స్నేహితుల సహాయంతో ఆ యాప్‌లను డిలీట్ చేశాడు. అలాగే, ఫోన్‌ను ఎంతసేపు వాడాలనే విషయంలో హద్దులు పెట్టుకున్నాడు. వినోదాన్ని ఎంచుకుంటున్నప్పుడు మంచి వివేచన చూపించడం ఎంత ముఖ్యమో ఈ అనుభవం చెప్తుంది.
19. ఆటపాటలకు, సరదాగా ఊళ్లకు వెళ్లడానికే సమయమంతా పెట్టేస్తే ఏం జరగవచ్చు?
19 ఆటపాటలు, సరదాగా ఊళ్లకు వెళ్లడం లాంటి విషయాల్లో కూడా మంచి వివేచన చూపించాలి. మనం రిలాక్స్ అయినప్పుడు, మన ఉరుకుల-పరుగుల జీవితం నుండి బ్రేక్ తీసుకున్నప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి కూడా అది సహాయం చేస్తుంది. ఒకవేళ ఇలాంటివాటికే ఎక్కువ టైమ్ పెడితే, ఎక్కువ ప్రాముఖ్యమైన విషయాలకు అసలు టైమే మిగలదు. (ఫిలి. 1:10) కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాటికి ఎంత టైమ్ పెడుతున్నాం అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ఆటపాటలకు, సరదాగా ఊళ్లకు వెళ్లడానికి పెట్టే సమయాన్ని బట్టి నాకు మంచి వివేచన ఉందని చూపిస్తున్నానా? ముఖ్యమైన విషయాల మీదే మనసుపెడుతున్నానని, అంతానికి సిద్ధపడుతున్నానని నా నిర్ణయాలు చూపిస్తున్నాయా?’
20. మన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో పోరాడడం ఎందుకు మంచిది?
20 ఆధ్యాత్మిక పనుల నుండి మన దృష్టి మళ్లించేవాటితో పోరాడడం మనకే మంచిది. (యెష. 48:17) యెహోవా సహాయంతో కష్టాల్ని ఇంకాస్త మంచిగా ఎదుర్కుంటాం. లోకంలోని పరిస్థితులు మనల్ని కుదిపేయలేవు. అలాగే, మన జీవితం కేవలం వినోదం చుట్టూ తిరగకుండా జాగ్రత్తపడతాం. కాబట్టి మనందరం ఎప్పుడూ యెహోవాలా ఆలోచించాలని, ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉండాలని, ఏవి నిజంగా ప్రాముఖ్యమైనవో వాటిని స్పష్టంగా మనసులో ఉంచుకోవాలని నిర్ణయించుకుందాం. అలా చేసినప్పుడు, మన దృష్టిని పక్కకు మళ్లించేవాటితో పోరాడడమే కాదు, “వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు సాధించగలుగుతాం.”—1 తిమో. 6:19.
పాట 129 సహనం చూపిస్తూ ఉందాం
a పదాల వివరణ: మన ఆరాధనతో నేరుగా సంబంధం ఉన్న పనులన్నీ ఆధ్యాత్మిక పనుల కిందికి వస్తాయి. ఉదాహరణకు బైబిల్ని అధ్యయనం చేయడం, మీటింగ్స్‌కి వెళ్లడం, కుటుంబ ఆరాధన చేసుకోవడం, పరిచర్య చేయడం లాంటివి. అలాగే రాజ్యమందిరాల్ని నిర్మించడం, వాటిని చూసుకోవడం, విపత్తు సహాయక పనుల్లో పాల్గొనడం, సమావేశాల్లో స్వచ్ఛందంగా పని చేయడం, బెతెల్‌లో సేవ చేయడం కూడా మన ఆరాధనలో భాగమే.
b చిత్రాల వివరణ: ప్రపంచంలో జరిగే సంఘటనల వల్ల తమ దృష్టి పక్కకు మళ్లకుండా జాగ్రత్తపడుతూ, ఒక జంట ప్రకటనా పనిలో బిజీగా ఉన్నారు.