మార్చి 30–ఏప్రిల్ 5, 2026
పాట 76 మీకు సంతోషంగా ఉంటుందా?
సత్యాన్ని దయగా చెప్పండి
‘యెహోవా, సత్యవంతుడైన దేవుడు.’—కీర్త. 31:5.
ముఖ్యాంశం
ఇతరులు పూర్తిగా ప్రయోజనం పొందేలా నిజం ఎలా మాట్లాడాలో, సత్యం ఎలా చెప్పాలో చూస్తాం.
1. మనం యెహోవా కుటుంబంలో ఒకరం అవ్వాలంటే ఏం చేయాలి?
ఎవరైనా ఒక బ్రదర్‌ని లేదా ఒక సిస్టర్‌ని మొదటిసారి కలిసినప్పుడు మనం సాధారణంగా అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, “మీరు సత్యం ఎలా తెలుసుకున్నారు?” దానికి కొంతమంది, “మేము చిన్నప్పటి నుండి సత్యంలోనే ఉన్నాం” అని చెప్తారు. ఇంకొంతమంది, “ఈ మధ్యే సత్యంలోకి వచ్చాం” అని చెప్తారు. మనం ఎందుకు అలా చెప్తామంటే, దేవుని వాక్యంలోని సత్యం మన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మనం ఆ సత్యాల్ని ప్రేమించి, దానికి తగ్గట్టు జీవించినప్పుడు మాత్రమే యెహోవా కుటుంబంలో ఒకరిగా ఉండగలమని మనకు తెలుసు. కాబట్టి, మనం ఆ మార్పుల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాం. సత్యం అంటే మనకెంత ఇష్టమో చూపించే ఒక విధానం ఏంటంటే, మన మాటల్లో-పనుల్లో నిజాయితీగా ఉండడం.—కీర్త. 15:1-3.
2. (ఎ) ప్రజలు యేసు గురించి ఏమనుకున్నారు? (బి) యేసు బైబిలు సత్యాల్ని చెప్పినప్పుడు దాన్ని ప్రజలు ఎలా చూశారు?
2 యేసు ఎప్పుడూ నిజమే మాట్లాడాడు. ఆ విషయం వాళ్ల శత్రువులకు కూడా తెలుసు. అందుకే యేసు చెప్పేది తమకు నచ్చకపోయినా, ఆయన మాత్రం ముక్కుసూటిగానే మాట్లాడతాడని వాళ్లు అనుకున్నారు. (మత్త. 22:16) తను చెప్పే సత్యానికి ప్రజలు ఎలా స్పందిస్తారో తన శిష్యులకు చెప్తూ యేసు ఇలా అన్నాడు: “కుమారుడికి తండ్రికి, కూతురికి తల్లికి, కోడలికి అత్తకి మధ్య విరోధం పెట్టడానికే నేను వచ్చాను.” (మత్త. 10:35) ఇక్కడ తను, తన అనుచరులు ప్రకటించే సందేశానికి వ్యతిరేకత రావాలని యేసు కోరుకోలేదు గానీ, సత్యం వల్ల ఏం జరగవచ్చో ఆయన నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు. (మత్త. 23:37) సత్యం విని, ఈ లోకం రెండు గుంపులుగా విడిపోతుందని యేసుకు తెలుసు. ఒకటి, బైబిలు సత్యాల్ని ఇష్టపడేవాళ్లు. రెండు, ఇష్టపడనివాళ్లు.—2 థెస్స. 2:9-11.
3. మనం ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 యేసులా మనం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా మనం మాత్రం నిజమే మాట్లాడడానికి చూడాలి. అలాగే కొంతమందికి మనం చేసే పని నచ్చకపోయినా మనం మాత్రం బైబిల్లో ఉన్న సత్యాన్ని ప్రకటిస్తాం, బోధిస్తాం. అంటే మనం నిజాన్ని గానీ, బైబిలు సత్యాన్ని గానీ ఎలా, ఎప్పుడు చెప్పాలనేదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని దానర్థమా? కాదు! అదే విషయాన్ని మనం ఈ ఆర్టికల్‌లో చూస్తాం. మనం ముందుగా, మనకు సత్యం ఎక్కడ దొరుకుతుందో చూస్తాం. ఆ తర్వాత ఎందుకు, ఎలా, ఎప్పుడు నిజం మాట్లాడాలో చూస్తాం. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మనం ఇంకా దయగా మాట్లాడగలుగుతాం. అంటే ఇంకా తెలివిగా, సరైన సమయంలో మాట్లాడగలుగుతాం.
మనకు సత్యం ఎక్కడ దొరుకుతుంది?
4. యెహోవానే సత్యానికి మూలం అని ఎందుకు చెప్పవచ్చు?
4 యెహోవానే సత్యానికి మూలం. ఆయన మాటలన్నీ సత్యమైనవి. ఉదాహరణకు, తప్పొప్పుల విషయంలో యెహోవా ఏది చెప్తే అదే కరెక్ట్. (కీర్త. 19:9; 119:142, 151) భవిష్యత్తు గురించి ఆయన చెప్పే ప్రతీది అక్షరాలా నిజమై తీరుతుంది. (యెష. 55:10, 11) ఆయన ఎప్పుడూ ఒట్టు తీసి గట్టు మీద పెట్టడు. (సంఖ్యా. 23:19) ఇంకా చెప్పాలంటే యెహోవా అబద్ధమాడడం అసాధ్యం! (హెబ్రీ. 6:18) వీటన్నిటినిబట్టి, “యెహోవా, సత్యవంతుడు” అని చెప్పవచ్చు.—కీర్త. 31:5.
5. ‘సత్యవంతుడైన దేవుణ్ణి’ తెలుసుకోవడం ఎందుకంత కష్టం కాదు? వివరించండి. (అపొస్తలుల కార్యాలు 17:27)
5 కొంతమంది ప్రజలు సత్య దేవుడైన యెహోవాను తెలుసుకోవడం కష్టం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన చుట్టూ ఉన్న ప్రతీదీ యెహోవా ఉన్నాడనే నిజాన్ని కోడైకూస్తుంది. (రోమా. 1:20) అపొస్తలుడైన పౌలు ఏథెన్సులో బాగా చదువుకున్న కొంతమంది గ్రీకువాళ్లతో మాట్లాడుతూ మనం ‘తన కోసం వెతకాలని’ దేవుడు కోరుకుంటున్నాడని, “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు” అని చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 17:27 చదవండి.) ఇంకా చెప్పాలంటే, ఎవరైతే వినయంగా ఉంటూ, తన గురించిన సత్యం కోసం వెతుకుతూ ఉంటారో యెహోవా వాళ్లకు దగ్గరౌతాడు.—యోహా. 6:44.
6. బైబిల్లో ఉన్న కొన్ని సత్యాలు ఏంటి? అవి ముందే తెలుసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది?
6 మనం యెహోవాను వెతికే ఒక మార్గం ఏంటంటే బైబిల్ని చదివి, ధ్యానించడం. బైబిల్ని రాసిన వ్యక్తులు దేవుని పవిత్రశక్తి సహాయంతోనే రాశారు. (2 పేతు. 1:20, 21) కాబట్టి అందులో ఉన్న ప్రతీ అక్షరం నిజం. కాబట్టి మనం దాన్ని నమ్మవచ్చు. ఉదాహరణకు, ఈ విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చింది? జీవం ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబుల్ని మనం నమ్మవచ్చు. (ఆది. 1:1, 26) పాపానికి, మన కష్టాలకు, చావుకు బైబిలు చెప్పే కారణాన్ని మనం కళ్లు మూసుకొని నమ్మవచ్చు. (రోమా. 5:12; 6:23) అలాగే, “అబద్ధానికి తండ్రి” అయిన సాతాను చేసిన నష్టాన్ని, యెహోవా తన కుమారుడి ద్వారా పూరిస్తానని ఇచ్చిన మాటను ఏ డౌట్ లేకుండా నమ్మవచ్చు. (యోహా. 8:44; రోమా. 16:20) అంతేకాదు, యేసు భవిష్యత్తులో చెడుతనాన్ని నాశనం చేస్తాడని, చనిపోయినవాళ్లను తిరిగి లేపుతాడని, భూమిని మళ్లీ పరదైసుగా చేస్తాడని, మనం పరిపూర్ణులం అవ్వడానికి సహాయం చేస్తాడని బైబిలు చెప్పే మాటల్ని మనం నమ్మవచ్చు. (యోహా. 11:25, 26; 1 యోహా. 3:8) యెహోవా మనకు సత్యాల్ని చెప్పడమే కాదు, మనం వాటిని వేరేవాళ్లకు చెప్పే అద్భుతమైన అవకాశాన్ని కూడా ఇచ్చాడు.—మత్త. 28:19, 20.
మనం ఎందుకు నిజం మాట్లాడతాం?
7-8. మనం ఏ ఉద్దేశంతో నిజం మాట్లాడుతున్నాం అన్నది అంత ముఖ్యమా? ఒక ఉదాహరణ చెప్పండి. (మార్కు 3:11, 12) (చిత్రాలు కూడా చూడండి.)
7 ఇంతకుముందే చూసినట్టు, మనం యెహోవా కుటుంబంలో ఒకరం అవ్వాలంటే, ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. అయితే, యెహోవాను సంతోషపెట్టాలంటే మనం నిజం మాట్లాడడంతో పాటు, దాన్ని ఎందుకు మాట్లాడుతున్నామో కూడా ఆలోచించాలి. ఎందుకంటే అది యెహోవాకు చాలా ముఖ్యం. యేసు భూమ్మీద పరిచర్య చేస్తున్నప్పుడు ఏం జరిగిందో ఆలోచించండి. (మార్కు 3:11, 12 చదవండి.) యేసు గలిలయ సముద్రం దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు, చాలామంది ప్రజలు ఆయన చుట్టూ గుమికూడారు. వాళ్లలో చెడ్డదూతలు పట్టిన కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. వాళ్లు యేసును చూడగానే ఆయన ముందు సాష్టాంగపడి, “నువ్వు దేవుని కుమారుడివి” అని కేకలు వేశారు. ఆ చెడ్డదూతలు ఎందుకు యేసుక్రీస్తు గురించిన నిజం చెప్పారు? ఎందుకంటే, ఆ మాటలు వింటున్న ప్రజల్ని బుట్టలో వేసుకుని, ఆ తర్వాత వాళ్లను మెల్లమెల్లగా యెహోవాకు దూరం చేయాలన్నది ఆ చెడ్డదూతల ప్లాన్ అయ్యుండవచ్చు. ఆ చెడ్డదూతలు మొదట్లో నిజం చెప్పినా, వాళ్ల ఉద్దేశంలో స్వార్థం ఉంది. కాబట్టి యేసు వాళ్లను చూసి సంతోషించలేదు. వాళ్ల పప్పులు ఆయన ముందు ఉడకలేదు. అందుకే యేసు ఆ చెడ్డదూతల్ని తన గురించి మాట్లాడొద్దని ఆజ్ఞాపించాడు.
8 ఈ వృత్తాంతం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం ఏ ఉద్దేశంతో నిజం చెప్తున్నాం అనేది యెహోవా చూస్తాడు. మనం యెహోవా గురించిన సత్యం వేరేవాళ్లకు చెప్తాం. ఎందుకంటే మనం యెహోవాను ప్రేమిస్తాం. అయితే, ఆ సత్యం చెప్పడం వల్ల వచ్చే ఘనతను మనం తీసుకోకూడదు గానీ, ఆ ఘనతంతా యెహోవాకే చెందేలా చూడాలి!—మత్త. 5:16; అపొస్తలుల కార్యాలు 14:12-15 తో పోల్చండి.
మీరు సత్యం నేర్పిస్తున్నప్పుడు, ప్రజల్ని ఎవరి వైపు ఆకర్షిస్తున్నారు? (7-8 పేరాలు చూడండి)
9. మనం ఏం చేయకుండా జాగ్రత్తపడాలి? ఎందుకు?
9 మనల్ని మనం గొప్ప చేసుకోకుండా ఉండాల్సిన ఇంకో సందర్భాన్ని గమనిద్దాం. ఉదాహరణకు, బాధ్యతల్లో ఉన్న ఒక బ్రదర్ మనమీద నమ్మకంతో ఒక విషయం చెప్పి, దాన్ని రహస్యంగా ఉంచమన్నాడు. కానీ మనం ఆ విషయాన్ని వేరేవాళ్లకు చెప్పేశాం. అది విన్నవాళ్లు తర్వాత్తర్వాత మనం చెప్పింది నిజమని తెలుసుకున్నారు. అప్పుడు వాళ్లు మనల్ని చూసి, ‘అబ్బా! వీళ్లు చాలా కరెక్ట్‌గా చెప్పారే’ అనుకుంటారు. మనకు ఇంకా రహస్యమైన విషయాలు చాలా తెలుసని వాళ్లు అనుకుంటారు. దానివల్ల మనం ప్రజల్ని మెప్పించవచ్చేమో గానీ, యెహోవాను మాత్రం సంతోషపెట్టలేం. (సామె. 11:13) ఎందుకు? ఎందుకంటే మనం రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని బయటపెట్టేశాం. దానికితోడు, మనం చెప్పింది నిజమే అయినా, దాన్ని తప్పుడు ఉద్దేశంతో చెప్పాం.
మనం నిజాన్ని ఎలా చెప్పాలి?
10. కొలొస్సయులు 4:6 లో ఉన్న మాటల అర్థం ఏంటి?
10 కొలొస్సయులు 4:6 చదవండి. అపొస్తలుడైన పౌలు కొలొస్సయిలో ఉన్న క్రైస్తవులకు, మన “మాటలు ఎప్పుడూ దయగా” ఉండాలని గుర్తుచేశాడు. ఇంతకీ, దాని అర్థం ఏంటి? గ్రీకు భాషలో దాని అర్థం ఏంటంటే, మన మాటలు వినేవాళ్లకు పనికొచ్చేలా మాత్రమే కాదు మృదువుగా, వినసొంపుగా కూడా ఉండాలి.
11-12. మనం ఎందుకు బైబిల్లో ఉన్న సత్యాన్ని జాగ్రత్తగా చెప్పాలి? ఒక ఉదాహరణ చెప్పండి. (చిత్రాలు కూడా చూడండి.)
11 మనం వేరేవాళ్లకు సత్యాన్ని చెప్తున్నప్పుడు, ఎప్పుడూ దయగా మాట్లాడాలని పౌలు ఇచ్చిన సలహాను పాటించాలి. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని బైబిలు పదునైన ఖడ్గంతో పోలుస్తుంది. అది మన మనసులో ఉన్న నిజమైన ఫీలింగ్స్‌ని, ఉద్దేశాల్ని బయటపెడుతుంది. (హెబ్రీ. 4:12) ఒకవేళ మనం ఆ బైబిల్ని నైపుణ్యంగా ఉపయోగించకపోతే వేరేవాళ్లను నొప్పించి, అనవసరమైన గొడవల్ని నెత్తినేసుకునే ప్రమాదం ఉంది. అది ఎలా జరుగుతుంది?
12 ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. మీరు ప్రీచింగ్‌కి వెళ్లినప్పుడు దేవుడంటే భక్తి ఉన్న ఒకతన్ని కలిశారు. అతను ప్రతీరోజు విగ్రహాలకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతను కుటుంబంతో కలిసి క్రిస్మస్, ఈస్టర్ కూడా చేసుకుంటాడు. మనం బైబిల్ని ఉపయోగించి, ప్రాణం లేని విగ్రహాలకు ప్రార్థన చేయడం తెలివితక్కువ పని అని, ఈ క్రిస్మస్-ఈస్టర్ అబద్ధమత పండుగలని ఆయనకు నిరూపించవచ్చు. (యెష. 44:14-20; 2 కొరిం. 6:14-17) ఒకవేళ మనం మొదటిసారి కలిసినప్పుడే ఇవన్నీ మాట్లాడితే, బహుశా మనం బైబిల్లో ఉన్న సత్యం చెప్తున్నట్టు అవుతుందేమో గానీ, దేవుని వాక్యాన్ని నైపుణ్యంగా ఉపయోగించినట్టు అవ్వదు.
మీరు సత్యాన్ని ఎలా నైపుణ్యంగా నేర్పించవచ్చు? (11-12 పేరాలు చూడండి)a
13. మనం ఉప్పు వేసినట్టు రుచిగా ఎలా మాట్లాడవచ్చు?
13 పౌలు తన ఉత్తరంలో, మన మాటలు ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలని చెప్పాడు. ఇక్కడ మనం సత్యాన్ని మార్చి చెప్పాలనో, లేదా దాన్ని దాచేయలనో పౌలు ఉద్దేశం కాదు. బదులుగా మన మాటలు రుచిగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే అలా మాట్లాడినప్పుడే మనం సత్యాన్ని, వినేవాళ్ల ‘రుచికి’ తగ్గట్టు చెప్పగలుగుతాం. (యోబు 12:11) అలా చేయడం ఒక సవాలనే చెప్పాలి. ఉదాహరణకు, ఆహారం విషయమే తీసుకుంటే, మన రుచికి తగ్గట్టు వేసే ఉప్పు-కారాలే వేరేవాళ్లకు కూడా నచ్చుతాయని మనం అనుకుంటాం. అదేవిధంగా, మనం మాట్లాడే విధానం ఇతరులకు వినసొంపుగానే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాకపోవచ్చు. ఉదాహరణకు, కొన్ని సంస్కృతులవాళ్లు తమ అభిప్రాయాన్ని ఎవ్వరి ముందైనా సరే, ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పేస్తారు. కానీ వేరే సంస్కృతులవాళ్లకు అది నచ్చకపోవచ్చు లేదా అభ్యంతరంగా కూడా అనిపించవచ్చు. అందుకే పౌలు, “ప్రతీ ఒక్కరికి ఎలా జవాబు ఇవ్వాలో” తెలుసుకోమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పౌలు, మనం సత్యాన్ని చెప్తున్నప్పుడు అది మన రుచికి తగ్గట్టు లేదా మన సంస్కృతికి తగ్గట్టు కాదుగానీ, మన మాటలు వింటున్నవాళ్ల రుచికి తగ్గట్టు ఉండాలని చెప్తున్నాడు.
మనం నిజాన్ని ఎప్పుడు చెప్పాలి?
14. యేసు తనకు తెలిసిందంతా తన శిష్యులకు నేర్పించాడా? వివరించండి.
14 యేసు తన శిష్యులతో దయగా మాట్లాడేవాడు, చాలా విషయాలు నేర్పించేవాడు. (మార్కు 6:34) అయినా, వాళ్లు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. యేసుక్రీస్తు తనకు తెలిసిందంతా వాళ్లకు చెప్పేయాలని అనుకోలేదు. ఎందుకంటే, వాళ్ల పరిమితులు ఏంటో ఆయనకు తెలుసు. కొన్ని సత్యాల్ని అర్థంచేసుకోవడానికి వాళ్లకు అది సరైన సమయం కాదని ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఒక సందర్భంలో “మీరు వాటిని అర్థం చేసుకోలేరు” అని కూడా అన్నాడు. (యోహా. 16:12) ఇంతకీ ఇది మనకు ఏం నేర్పిస్తుంది?
15. మన బైబిలు విద్యార్థులకు మనకు తెలిసిందంతా ఒకేసారి చెప్పేయాలా? వివరించండి. (సామెతలు 25:11) (చిత్రం కూడా చూడండి.)
15 మనకు బైబిలు సత్యాలు తెలిసినంత మాత్రాన, వాటిని వేరేవాళ్ల ముందు ఒకేసారి కుమ్మరించాలని కాదు. మనం యేసు నుండి అదే విషయాన్ని నేర్చుకున్నాం. మరి మనం యేసులా ఎలా ఉండవచ్చు? మనం ఎదుటివ్యక్తి పరిస్థితుల్ని అర్థంచేసుకోవాలి. తన కుటుంబంతో కలిసి క్రిస్మస్, ఈస్టర్ జరుపుకునే ఆ వ్యక్తి గురించి ఇంకోసారి ఆలోచించండి. క్రిస్మస్, ఈస్టర్ అబద్ధమతం నుండి వచ్చాయని, అలాంటి పండుగల్ని దేవుడు ఇష్టపడడని మనకు తెలుసు. కానీ మీరు అతనితో క్రిస్మస్‌కి ఒకట్రెండు వారాల ముందు బైబిలు స్టడీ మొదలు పెట్టారనుకుందాం. ఇప్పుడు మీరు అబద్ధమతాల గురించి బైబిలు ఏం చెప్తుందో చూపించి, క్రిస్మస్ చేయడం వెంటనే ఆపేయాలని చెప్తే, మీరు అతని మీద దయ చూపించినట్టు అవుతుందా? నిజమే, కొంతమంది బైబిలు నుండి ఏదైనా తెలుసుకున్న వెంటనే మార్పులు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇంకొంతమందికి తమ ఆలోచనల్ని, పనుల్ని మార్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మన బైబిలు విద్యార్థులు అవసరమైన మార్పులు చేసుకోవాలంటే, మనం వాళ్లకు అవసరమైన విషయాల్ని, సరైన సమయంలో చెప్పాలి.—సామెతలు 25:11 చదవండి.
సత్యాన్ని ఎప్పుడు, ఎంతవరకు చెప్పాలో యేసును చూసి నేర్చుకోండి (15వ పేరా చూడండి)
16. ‘సత్యంలో నడుస్తూ’ ఉండేలా మన బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చు?
16 ఇతరులకు యెహోవా గురించిన సత్యం చెప్తున్నప్పుడు వచ్చే సంతోషం, మనకు దేంట్లోనూ దొరకదు. వాళ్లు ‘సత్యంలో నడుస్తూ ఉండేలా’ సహాయం చేయాలంటే మనం ఈ పనులు చేయాలి: మనం వాళ్లకు మంచి ఆదర్శం ఉంచాలి. (3 యోహా. 3, 4) భవిష్యత్తు గురించి దేవుని వాక్యం చెప్తున్న విషయాల్ని మనం నమ్ముతున్నామని మన రోజువారీ పనుల్లో చూపించాలి. మనం నిజాలు చెప్తున్నప్పుడు మంచి ఉద్దేశంతో చెప్పాలి. ఇతరులకు సత్యాన్ని నేర్పిస్తున్నప్పుడు మన మాటలు దయగా, వినసొంపుగా, మంచిగా ఉండాలి. మనం వాటిని సరైన సమయంలో చెప్పాలి. మనకు వచ్చే ఏ ఘనతైనా అది యెహోవాకు చెందేలా చూడాలి. ఒకవేళ మీరు ఇవన్నీ చేస్తూ ఉంటే, మీరు సత్యదేవుడైన యెహోవాకు చెందినవాళ్లని నిరూపించుకుంటారు.
పాట 160 “మంచి వార్త”!
a చిత్రాల వివరణ: మొదటి చిత్రంలో, వాళ్ల ఇంట్లో ఉన్న క్రిస్మస్ చెట్టును చూసి మన బ్రదర్, క్రిస్మస్ అబద్ధమతం నుండి వచ్చింది అని చెప్పే ఆర్టికల్‌ని చూపిస్తున్నాడు. రెండో చిత్రంలో బ్రదర్, మంచి నాన్నగా ఎలా ఉండవచ్చో చెప్పే ఒక ఆర్టికల్‌ని ఇంటివ్యక్తికి చూపిస్తున్నాడు. ఈ రెండిటిలో ఏది చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?