కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 జనవరి పేజీలు 20-25
  • విమోచన క్రయధనం మీద మీరు ఎలా కృతజ్ఞత చూపిస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విమోచన క్రయధనం మీద మీరు ఎలా కృతజ్ఞత చూపిస్తారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్టడీ తీసుకుంటున్న వాళ్లు
  • బాప్తిస్మం తీసుకున్న వాళ్లు
  • మందకు దూరమైన గొర్రెలు
  • మీరు ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?
  • యెహోవా ప్రేమ తెచ్చిపెట్టిన ప్రయోజనాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • విమోచన క్రయధనం నేర్పే పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • సంవత్సరంలోని ముఖ్యమైన రోజు కోసం సిద్ధపడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 జనవరి పేజీలు 20-25

మార్చి 23-29, 2026

పాట 18 విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞత

విమోచన క్రయధనం మీద మీరు ఎలా కృతజ్ఞత చూపిస్తారు?

“క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది.”—2 కొరిం. 5:14.

ముఖ్యాంశం

విమోచన క్రయధనం మీద కృతజ్ఞత ఉందని మనందరం ఎలా చూపించవచ్చో ఇందులో చూస్తాం.

1-2. యేసు అర్పించిన విమోచన క్రయధనం మనల్ని ఏం చేసేలా కదిలించాలి? ఎందుకు? (2 కొరింథీయులు 5:14, 15) (చిత్రం కూడా చూడండి.)

కూలిపోయిన బిల్డింగ్‌ కింద చిక్కుకుపోయిన మిమ్మల్ని ఎవరైనా రక్షిస్తే, ఆ వ్యక్తికి మీరు జీవితాంతం రుణపడి ఉండరా? ఆయన మీ ఒక్కరినే కాదు, వేరేవాళ్లను కూడా కాపాడి ఉండవచ్చు. అయినా సరే, మీరు వ్యక్తిగతంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటారు. ఆయన చేసిన మేలును మీరు ఎప్పటికీ మర్చిపోలేరని చూపించాలనుకుంటారు.

2 ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు, పాపపు శిథిలాల కింద నుండి మనంతట మనం బయటికి రాలేం. కానీ యేసు అర్పించిన విమోచన క్రయధనం మనల్ని రక్షిస్తుంది. ఎలాగంటే, (1) మన పాపాల్ని క్షమించడానికి, (2) మన పాపపు స్థితిని పూర్తిగా బాగుచేయడానికి, (3) దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి విమోచన క్రయధనం సహాయం చేస్తుంది. దానివల్ల, కొత్తలోకంలో శాశ్వతకాలం జీవించే అవకాశం కూడా మనకు ఉంటుంది. అవును, విమోచన క్రయధనం యేసు ప్రేమకు అద్దం పడుతుంది. ఆయన ఈ భూమ్మీదికి రావడానికి వేల సంవత్సరాల ముందు నుండే, మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. (సామె. 8:30, 31) “క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 కొరింథీయులు 5:14, 15 చదవండి.) అంటే, విమోచన క్రయధనాన్ని తేలిగ్గా తీసుకోకుండా దాని విషయంలో ఏదోక విధంగా కృతజ్ఞత చూపించేలా యేసు ప్రేమ మనల్ని కదిలించాలి.

ముందటి ఆర్టికల్‌లో, కూలిపోయిన బిల్డింగ్‌ శిథిలాల కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని, రక్షణా సిబ్బంది వచ్చి పైకి లేపుతున్నాడు.

కూలిపోయిన బిల్డింగ్‌ కింద నుండైనా, పాపపు శిథిలాల కింద నుండైనా మనల్ని ఎవరైనా రక్షిస్తే, వాళ్లకు మనం ఎంతో రుణపడి ఉంటాం (1-2 పేరాలు చూడండి)


3. విమోచన క్రయధనం మీద ఒక్కొక్కరు ఒక్కోలా ఎందుకు కృతజ్ఞత చూపించవచ్చు?

3 దేవుడు ప్రేమతో ఏర్పాటు చేసిన విమోచన క్రయధనానికి మీరు ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? ఇదే ప్రశ్న అడిగితే, ఒక్కొక్కరు ఒక్కోలా కృతజ్ఞత చూపిస్తామని అంటారు. ఎందుకు? ఈ ఉదాహరణ చూడండి. వేర్వేరు ఊళ్ల నుండి ముగ్గురు వ్యక్తులు ఒకే చోటికి ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్ల గమ్యం ఒక్కటే, కానీ దారులు వేరు. అదేవిధంగా, విమోచన క్రయధనం మీద కృతజ్ఞత చూపించడానికి మీరు ఏ దారిలో వెళ్తారనేది, యెహోవాతో ఉన్న బంధంలో మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. దీన్ని మనసులో ఉంచుకుని, ఈ ఆర్టికల్‌లో మూడు రకాల ప్రజల గురించి చూస్తాం: (1) స్టడీ తీసుకుంటున్న వాళ్లు, (2) బాప్తిస్మం తీసుకున్న వాళ్లు, (3) మందకు దూరమైన గొర్రెలు.

స్టడీ తీసుకుంటున్న వాళ్లు

4. స్టడీ తీసుకుంటున్న వాళ్లను యెహోవా గమనిస్తాడు అంటే అర్థం ఏంటి?

4 మీరు బైబిలు స్టడీ తీసుకుంటున్నారా? మీరు మంచివార్తను చక్కగా విని స్టడీకి ఒప్పుకున్నారు అంటేనే, యెహోవా మిమ్మల్ని తన వైపుకు ఆకర్షించుకుంటున్నాడని అర్థమౌతుంది. (యోహా. 6:44; అపొ. 13:48) “హృదయాల్ని పరిశీలించేది యెహోవాయే.” అంటే, తన గురించి నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్ని ఆయన గమనిస్తాడు. అంతేకాదు, తన ప్రమాణాల ప్రకారం మీరు మార్పులు చేసుకుంటుంటే చూసి ఆయన మురిసిపోతాడు. (సామె. 17:3; 27:11) మీరు యెహోవాకు స్నేహితులుగా ఉంటున్నారంటే, అది కేవలం విమోచన క్రయధనం వల్లే. (రోమా. 5:10, 11) కాబట్టి దాన్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకండి.

5. స్టడీ తీసుకుంటున్న వాళ్లు ఫిలిప్పీయులు 3:16 లో ఉన్న సలహాను ఎలా పాటించవచ్చు?

5 బైబిలు స్టడీ తీసుకుంటున్న మీరు, విమోచన క్రయధనం మీద ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? దానికి ఒక దారి ఏంటంటే, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు ఇచ్చిన సలహాను పాటించడం. ఆయన ఇలా చెప్పాడు: “మనం ప్రగతి సాధించినమేరకు ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం.” (ఫిలి. 3:16) ఈ లేఖనాన్ని వేరే బైబిలు అనువాదం ఇలా చెప్పింది: “మనం ఏ దారిలో ప్రయాణం మొదలుపెట్టామో దాంట్లోనే ముందుకు వెళ్తూ ఉందాం.” ఆ సలహాను పాటిస్తూ, జీవానికి నడిపించే దారిలో ఉన్న మీరు వెనక్కి తిరిగి చూడకండి, పక్కదారి పట్టకండి.—మత్త. 7:14; లూకా 9:62.

6. మార్పులు చేసుకోవడం కష్టంగా ఉంటే, స్టడీ తీసుకుంటున్న వాళ్లు ఏం చేయవచ్చు? (ద్వితీయోపదేశకాండం 30:11-14) (చిత్రం కూడా చూడండి.)

6 ఈ మధ్యే స్టడీలో నేర్చుకున్న ఒక బైబిలు బోధను నమ్మడం మీకు కష్టంగా ఉందా? అలాగైతే, దాని గురించి పరిశోధన చేయండి. దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. (కీర్త. 86:11) అయినాసరే మీకు అది అర్థం కావట్లేదా? ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టి, బైబిలు స్టడీని కొనసాగించండి. ఒకవేళ, బైబిలు తప్పు అని చెప్తున్న ఒక అలవాటును మానుకోవడం మీకు కష్టంగా ఉంటే అప్పుడేంటి? మనం చేయలేనిది చేయమని యెహోవా ఎప్పుడూ అడగడు అని గుర్తుంచుకోండి. మీరు ఆయన ప్రమాణాలకు తగ్గట్టు జీవించగలరు. (ద్వితీయోపదేశకాండం 30:11-14 చదవండి.) పైగా యెహోవాయే మీకు సహాయం చేస్తానని మాటిస్తున్నాడు కదా. (యెష. 41:10, 13; 1 కొరిం. 10:13) కాబట్టి మీ ప్రయత్నాలు ఆపకండి. మీకున్న సమస్య మీద మనసుపెట్టే బదులు, విమోచన క్రయధనంతో సహా ఇప్పటికే యెహోవా ఏమేం ఇచ్చాడో వాటి గురించి ఆలోచిస్తూ కృతజ్ఞత పెంచుకోండి. అలా యెహోవా మీద ప్రేమ పెరిగేకొద్దీ, “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని మీకు అనిపిస్తుంది.—1 యోహా. 5:3.a

ఒకతను “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” పుస్తకంలోని 40వ పాఠాన్ని చదువుతున్నాడు. ఆయన టేబుల్‌ మీద సిగరెట్‌ పెట్టె, యాష్‌ ట్రేలో కాల్చేసిన సిగరెట్‌ పీకలు ఉన్నాయి.

మనం చేయలేనిది చేయమని యెహోవా ఎప్పుడూ అడగడు. పైగా తన ప్రమాణాల ప్రకారం జీవించడానికి ఆయన సహాయం చేస్తాడు (6వ పేరా చూడండి)


7. యెహోవాసాక్షుల పిల్లలు దేని గురించి ఆలోచించవచ్చు?

7 మీరు యెహోవాసాక్షుల పిల్లలా? మీరు స్టడీ తీసుకుంటున్నారా? నిజం చెప్పాలంటే, మీ అమ్మానాన్నలకు ఉన్న స్టడీలన్నిటిలో మీ స్టడీనే ముఖ్యమైనది. బైబిలు ఇలా చెప్తుంది: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.” (యాకో. 4:8; 1 దిన. 28:9) మీరు యెహోవాకు దగ్గరవ్వడానికి ఒక అడుగు ముందుకేస్తే, ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి మీకు దగ్గరౌతాడు. యెహోవా మిమ్మల్ని ఏదో గుంపులో ఒకరిగా చూడడు. ఆయన ఒక్కొక్కర్ని తనవైపుకు ఆకర్షించుకుంటాడు. ఆఖరికి, యెహోవాసాక్షుల కుటుంబంలో పెరుగుతున్న మిమ్మల్ని కూడా ఒక వ్యక్తిలానే చూస్తాడు. మీరు యెహోవాకు ఫ్రెండ్‌ అవ్వడం దేనివల్ల సాధ్యమైందో తెలుసా? విమోచన క్రయధనం వల్లే. కాబట్టి దాన్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకండి. (రోమా. 5:1, 2) ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు వెళ్లే ముందు, యేసు మరణం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయో ఆలోచించవచ్చు కదా. అలాగే మీరెలా జీవించాలని అనుకుంటున్నారో, యెహోవా మీద కృతజ్ఞత ఉందని చూపించేలా మీరు ఏ లక్ష్యాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఆలోచించండి.b

బాప్తిస్మం తీసుకున్న వాళ్లు

8. బాప్తిస్మం తీసుకున్నవాళ్లు ఇప్పటికే విమోచన క్రయధనం మీద ఎలా విశ్వాసం చూపించారు?

8 మీరు బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులా? అలాగైతే, మీరు ఇప్పటికే విమోచన క్రయధనం మీద చాలా విధాలుగా విశ్వాసం చూపించారు. ఉదాహరణకు, యెహోవాకు దగ్గరవ్వడానికి, ఆయన చెప్తున్న ప్రకారం జీవించడానికి మీరు చాలా మార్పులు చేసుకున్నారు. అలాగే, మీరు నేర్చుకున్న వాటిని వేరేవాళ్లతో పంచుకుంటూ, శిష్యుల్ని చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞకు మీరు లోబడ్డారు. అంతేకాదు, మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం కూడా తీసుకున్నారు. సత్యారాధన వైపు నిలబడినందుకు మీరు వ్యతిరేకతను కూడా ఎదుర్కొని ఉంటారు. (2 తిమో. 3:12) మీరు దాన్ని నమ్మకంగా సహించారంటేనే యెహోవా మీద మీకు ప్రేమ ఉందని, ఆయన ఏర్పాటు చేసిన విమోచన క్రయధనం మీద కృతజ్ఞత ఉందని అర్థమౌతుంది.—హెబ్రీ. 12:2, 3.

9. బాప్తిస్మం తీసుకున్నవాళ్లు ఏ ప్రమాదం విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

9 బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులుగా, మనం ఒక ప్రమాదం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయం గడిచేకొద్దీ, విమోచన క్రయధనాన్ని మనం తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. అదెలా జరగవచ్చు? ఎఫెసులో ఉన్న మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి ఆలోచించండి. పునరుత్థానమైన యేసు వాళ్ల సహనాన్ని మెచ్చుకున్నాడు. అయితే, ఆయన ఇలా అన్నాడు: “నీలో ఒక లోపం ఉందని నేను గమనించాను. అదేమిటంటే, మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలేశావు.” (ప్రక. 2:3, 4) కాలం గడిచేకొద్దీ మన ఆరాధన కూడా, ఏదో చెయ్యాలి కదా అని చేసే అవకాశం ఉందని యేసు మాటల్ని బట్టి అర్థమౌతుంది. అంటే మనం ప్రార్థన చేస్తుంటాం, మీటింగ్స్‌కి వెళ్తుంటాం, ప్రీచింగ్‌ చేస్తుంటాం. కానీ అవన్నీ పైపైనే చేస్తుండవచ్చు, అందులో ప్రేమ ఉండకపోవచ్చు. ఒకవేళ యెహోవా మీద మీకున్న ప్రేమ చల్లారిపోయిందని అనిపిస్తే, మీరు ఏం చేయవచ్చు?

10. పౌలు తిమోతికి ఇచ్చిన సలహాను మీరు ఎలా పాటించవచ్చు? (1 తిమోతి 4:13, 15)

10 ఆరాధనకు సంబంధించిన విషయాల్లో ‘నిమగ్నం’ అవ్వమని, వాటి గురించి ‘ధ్యానించమని’ అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు. (1 తిమోతి 4:13, 15 చదవండి.) ఆ సలహాను పాటిస్తూ, మీరు కూడా మీ ఆరాధన ఏదో పైపైన కాకుండా, ‘పవిత్రశక్తి నింపే ఉత్సాహంతో’ చేసేలా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. (రోమా. 12:11) ఉదాహరణకు, మీటింగ్స్‌లో మీరు ఇంకా శ్రద్ధగా వినడం కోసం, ముందే చక్కగా సిద్ధపడవచ్చు. లేదా మీరు బైబిల్ని ఇంకా లోతుగా అధ్యయనం చేస్తూ, కాస్త ప్రశాంతంగా కూర్చుని, చదివినదాని గురించి ధ్యానించవచ్చు. కట్టెలు వేస్తూ ఉంటేనే మంట రగులుకుంటుంది. అదేవిధంగా, ఈ పనులన్నీ మీరు చేస్తూ ఉంటేనే, విమోచన క్రయధనంతో సహా యెహోవా మీకు ఇచ్చిన వాటన్నిటి విషయంలో మీ కృతజ్ఞత మళ్లీ రగులుకుంటుంది. అంతేకాదు, జ్ఞాపకార్థ ఆచరణకు ముందు వారాల్లో, యెహోవాసాక్షులుగా మనకున్న కొన్ని ప్రత్యేకమైన దీవెనల గురించి ధ్యానించండి. అలా ధ్యానిస్తే, యెహోవాతో స్నేహం చిగురించడానికి కారణమైన విమోచన క్రయధనం మీద కృతజ్ఞత పెరుగుతుంది.

11-12. అప్పుడప్పుడు మీలో ఉత్సాహం తగ్గినంత మాత్రాన, దేవుడు మీకు పవిత్రశక్తిని ఇవ్వడం ఆపేశాడని అనుకోవాలా? వివరించండి. (చిత్రం కూడా చూడండి.)

11 సత్యారాధన మీద ఒకప్పుడు ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదని మీకు అనిపిస్తే, నిరుత్సాహపడకండి లేదా దేవుడు మీకు పవిత్రశక్తిని ఇవ్వడం ఆపేశాడని అనుకోకండి. అపొస్తలుడైన పౌలు తన పరిచర్య గురించి కొరింథీయులకు ఏం రాశాడో చూడండి: “ఒకవేళ నేను ఆ పనిని ఇష్టం లేకుండా చేసినా, దేవుడు అప్పగించిన బాధ్యత నా మీద అలాగే ఉంటుంది.” (1 కొరిం. 9:17) ఆ మాటలకు అర్థం ఏంటి?

12 పౌలుకు కూడా కొన్నిసార్లు ప్రీచింగ్‌ చేయాలని అనిపించలేదు. అయితే, ఆ క్షణం తనకు ఎలా అనిపించినా సరే, పరిచర్యను మాత్రం పట్టుదలగా చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మీరూ అదే చేయవచ్చు. మీకు ఇష్టం లేకపోయినా సరే, సరైనది చేయాలని గట్టిగా నిర్ణయించుకోండి. అలా చేయాలనే “కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని” ఇవ్వమని యెహోవాను అడగండి. (ఫిలి. 2:13) మీ ఆధ్యాత్మిక పనుల్లో చురుగ్గా ఉండండి. అలా చేస్తే కొంతకాలానికి మీ ఉత్సాహం, యెహోవా మీద ప్రేమ మళ్లీ రగులుకుంటాయి అనే నమ్మకంతో మీరు ఉండవచ్చు.

తన బిడ్డను వాకర్‌లో వేసుకుని ప్రీచింగ్‌ చేస్తున్న ఒక సిస్టర్‌ ముఖం వేలాడేసుకుని డల్‌గా ఉంది. పక్కనున్న సిస్టర్‌ ఆమె భుజం మీద చెయ్యి వేసింది.

కొన్నిసార్లు మీకు ఇష్టం లేకపోయినా సరే, ఆధ్యాత్మిక పనుల్లో చురుగ్గా ఉండండి (11-12 పేరాలు చూడండి)


13. మనం ‘విశ్వాసంలో ఉన్నామో లేదో’ ఎలా పరీక్షించుకుంటూ ఉండవచ్చు?

13 ఎప్పటికప్పుడు 2 కొరింథీయులు 13:5 లో ఉన్న సలహాను పాటిస్తూ, మనల్ని మనం పరిశీలించుకోవడం మంచిది. అక్కడ ఇలా ఉంది: “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి; మీరేమిటో రుజువు చేసుకుంటూ ఉండండి.” కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘నేను నా జీవితంలో రాజ్య సంబంధమైన విషయాలకే మొదటిస్థానం ఇస్తున్నానా?’ (మత్త. 6:33) ‘నేను చూసే వినోదం ఎలా ఉంది? నేను చెడును అసహ్యించుకుంటున్నానని అది చూపిస్తుందా?’ (కీర్త. 97:10) ‘నేను తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ మధ్య శాంతిని, ఐక్యతను పెంచేలా ప్రవర్తిస్తున్నానా?’ (ఎఫె. 4:2, 3) జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో, మనం ముఖ్యంగా యెహోవా ఏర్పాటు చేసిన విమోచన క్రయధనం గురించి ధ్యానిస్తాం. కాబట్టి, మనం క్రీస్తు కోసం బ్రతుకుతున్నామా లేక మనకోసం బ్రతుకుతున్నామా అని గమనించుకోవడానికి అదో మంచి అవకాశం.c

మందకు దూరమైన గొర్రెలు

14. కొంతమంది క్రైస్తవులు ఎందుకు మంద నుండి దూరమయ్యారు?

14 కొంతమంది క్రైస్తవులు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు యెహోవాకు నమ్మకంగా సేవచేసిన తర్వాత, సంఘంతో సహవసించడం ఆపేశారు. ఎందుకు? కొంతమందేమో “జీవిత చింతల వల్ల” నలిగిపోయారు. (లూకా 21:34) ఇంకొంతమందేమో తోటి బ్రదరో, సిస్టరో అన్న మాటల వల్ల లేదా పనుల వల్ల అభ్యంతరపడి వెనక్కి వెళ్లిపోయారు. (యాకో. 3:2) మరికొంతమందేమో ఘోరమైన పాపం చేసి, పెద్దల సహాయం తీసుకోలేదు. కారణం ఏదైనా, ఒకవేళ మీరు మందకు దూరమైన గొర్రె అయితే మీరేం చేయవచ్చు? దేవుడు ప్రేమతో చేసిన విమోచన క్రయధన ఏర్పాటు మిమ్మల్ని ఏం చేసేలా కదిలిస్తుంది?

15. మందకు దూరమైన గొర్రెల్ని పట్టించుకుంటానని యెహోవా ఎలా చూపిస్తున్నాడు? (యెహెజ్కేలు 34:11, 12, 16)

15 మందకు దూరమైన గొర్రెల గురించి యెహోవాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. ఆయన వాళ్లను వద్దనుకోవట్లేదు. నిజం చెప్పాలంటే, తప్పిపోయిన గొర్రెల్ని ఆయన వెతుకుతాడు, వాటికి ఆహారం పెడతాడు, వాటిని మళ్లీ వెనక్కి తీసుకొస్తాడు. (యెహెజ్కేలు 34:11, 12, 16 చదవండి.) యెహోవా మీ విషయంలో కూడా అదే చేస్తున్నాడా? అవును! మీరు ఈ ఆర్టికల్‌ చదువుతున్నారు అంటేనే, మీ మనసు నీతి కోసం తపిస్తుందని అర్థమౌతుంది. ఒకప్పుడు యెహోవా మీ మనసును చూసే, సత్యం వైపు మిమ్మల్ని ఆకర్షించాడు. ఇప్పుడు మళ్లీ మీ మనసును చూసే, మిమ్మల్ని తనవైపుకు ఆకర్షించుకుంటున్నాడు.

16. తప్పిపోయిన గొర్రె యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి ఏది సహాయం చేస్తుంది? (చిత్రం కూడా చూడండి.)

16 యెహోవా దగ్గరకు తిరిగి రండి అనే బ్రోషుర్‌లో, ప్రోత్సహించే ఈ మాటలు ఉన్నాయి: “యెహోవా దగ్గరకు తిరిగి రావడానికి మీరు చేసే ప్రతీ ప్రయత్నంలో ఆయన మీకు తోడుంటాడనే ధైర్యంతో ఉండండి. ఆందోళనను తట్టుకోవడానికి, మనసుకు తగిలిన గాయాలు చెరిపేయడానికి, స్వచ్ఛమైన మనస్సాక్షి వల్ల వచ్చే మనశ్శాంతిని సంపాదించుకోవడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. అప్పుడు తోటి ఆరాధకులతో కలిసి మళ్లీ యెహోవాను సేవించాలనే ప్రేరణను మీరు పొందుతారు.” సంఘపెద్దలు కూడా మీకు ఎప్పుడెప్పుడు సహాయం చేద్దామా అని ఆశగా ఎదురు చూస్తున్నారని గుర్తుంచుకోండి. వాళ్లు “గాలికి చాటైన చోటులా, తుఫాను నుండి దాక్కునే చోటులా” ఉంటారు. (యెష. 32:2) విమోచన క్రయధనం మీద కృతజ్ఞతతో మీరు ఈ ప్రశ్న వేసుకోండి: ‘యెహోవాతో “వివాదాన్ని పరిష్కరించుకోవడానికి” ఇప్పుడు నేను ఏమేం చేయగలను?’ (యెష. 1:18; 1 పేతు. 2:25) ఉదాహరణకు, మీరు రాజ్యమందిరంలో జరిగే మీటింగ్‌కి వెళ్లవచ్చు. ఒక సంఘపెద్ద దగ్గరికి వెళ్లి సహాయం అడగవచ్చు, వీలైతే కొంతకాలం పాటు మీకు బైబిలు స్టడీ ఇవ్వమని కూడా అడగవచ్చు. తన కుమారుడి విమోచన క్రయధనం మీద కృతజ్ఞత చూపించడానికి మీరు చేసే ప్రయత్నాల్ని యెహోవా ఖచ్చితంగా దీవిస్తాడని మీరు నమ్మవచ్చు.

ఒక పెద్ద వయసు వ్యక్తి చేతిలో బైబిలు పట్టుకుని, రాజ్యమందిరానికి అల్లంత దూరంలో నిలబడి ఉన్నాడు. మీటింగ్‌కి వస్తున్న బ్రదర్స్‌సిస్టర్స్‌ ప్రేమగా ఒకరినొకరు పలకరించుకోవడం అతను చూస్తున్నాడు.

ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవాతో “వివాదాన్ని పరిష్కరించుకోవడానికి” ఇప్పుడు నేను ఏమేం చేయగలను?’ (16వ పేరా చూడండి)


మీరు ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?

17-18. ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు ముందున్న సమయాన్ని మీరు ఎలా తెలివిగా ఉపయోగించవచ్చు?

17 యేసు మీద “విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని” యెహోవా విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. (యోహా. 3:16) ఆ విమోచన క్రయధనం ద్వారానే యెహోవా మనల్ని పాపమరణాల శిథిలాల నుండి రక్షిస్తాడు. మనలో ఎవ్వరం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. (రోమా. 3:23, 24; 2 కొరిం. 6:1) జ్ఞాపకార్థ ఆచరణకు ముందు రోజుల్లో, యెహోవా అలాగే యేసు చూపించిన ప్రేమ గురించి ధ్యానించడానికి మంచి అవకాశం ఉంటుంది. విమోచన క్రయధనం మీద కృతజ్ఞత చూపించేలా ఆ ప్రేమ మనల్ని కదిలించాలి.

18 మరి విమోచన క్రయధనం మిమ్మల్ని ఏం చేసేలా కదిలిస్తుంది? దీనికి మీరు ఇచ్చే జవాబు, వేరేవాళ్లు ఇచ్చే జవాబు ఒకేలా ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితం. యెహోవా మీ ప్రయత్నాల్ని అలాగే ప్రపంచవ్యాప్తంగా “తమకోసం జీవించకుండా, తమకోసం చనిపోయి బ్రతికించబడిన వ్యక్తి కోసం” జీవిస్తున్న లక్షలమంది ప్రయత్నాల్ని దీవిస్తాడు.—2 కొరిం. 5:15.

విమోచన క్రయధనం మీద ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?

  • స్టడీ తీసుకుంటున్న వాళ్లు

  • బాప్తిస్మం తీసుకున్న వాళ్లు

  • మందకు దూరమైన గొర్రెలు

పాట 14 కొత్త భూరాజును స్తుతిద్దాం

a స్టడీలో మీరు నేర్చుకున్న వాటిని పాటించడానికి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని ప్రతీ పాఠం చివర్లో ఉన్న “ఇలా చేసి చూడండి” అనే బాక్సును ఉపయోగించండి.

b యెహోవా సేవలో మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చో తెలుసుకోవడానికి, డిసెంబరు 2017 కావలికోటలో ఉన్న “యౌవనులారా, ‘సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి’” అనే ఆర్టికల్‌ చూడండి.

c మీకు యెహోవా మీదున్న కృతజ్ఞత తగ్గిపోకుండా ఎలా చూసుకోవాలో తెలుసుకోవడానికి, జూన్‌ 15, 1995 కావలికోటలో “దేవున్ని సేవించడానికి మిమ్మల్ని ఏది పురికొల్పుతుంది?” అనే ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి