కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 జూలై పేజీలు 8-13
  • మీరు సత్యాన్ని గుర్తిస్తున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు సత్యాన్ని గుర్తిస్తున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సత్యాన్ని గుర్తించడానికి అవసరమయ్యే లక్షణాలు
  • మనం సత్యాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉండవచ్చు?
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • సత్యాన్ని దయగా చెప్పండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ‘సత్యవంతుడైన దేవుడు’ తన సంకల్పాన్ని తప్పక నెరవేరుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 జూలై పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 28

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

మీరు సత్యాన్ని గుర్తిస్తున్నారా?

“మీరు నడుముకు సత్యం అనే దట్టీ కట్టుకుని, . . . స్థిరంగా నిలబడండి;”—ఎఫె. 6:14.

ముఖ్యాంశం

యెహోవా నేర్పించిన సత్యానికి, సాతాను అలాగే మన వ్యతిరేకులు ప్రచారం చేసే అబద్ధాలకు తేడాను ఎలా గుర్తించాలో నేర్చుకుంటాం.

1. సత్యం గురించి మీకేం అనిపిస్తుంది?

యెహోవా ప్రజలంగా మనం దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఇష్టపడతాం. మన విశ్వాసం దానిమీదే ఆధారపడివుంది. (రోమా. 10:17) యెహోవాయే క్రైస్తవ సంఘాన్ని ‘సత్యానికి స్తంభంగా, పునాదిగా’ స్థాపించాడని మనం గట్టిగా నమ్ముతాం. (1 తిమో. 3:15) అంతేకాదు, “నాయకత్వం వహిస్తున్నవాళ్లు” బైబిలు నుండి సత్యాన్ని వివరించినప్పుడు, దేవుని ఇష్టానికి తగ్గట్టు మనకు నిర్దేశం ఇచ్చినప్పుడు ఇష్టంగా లోబడతాం.—హెబ్రీ. 13:17.

2. యాకోబు 5:19 ప్రకారం, సత్యం నేర్చుకున్న తర్వాత ఏ ప్రమాదం ఎదురవ్వవచ్చు?

2 అయితే మనం సత్యాన్ని, దేవుని సంస్థ పాత్రను అంగీకరించిన తర్వాత కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. (యాకోబు 5:19 చదవండి.) బైబిలు మీద, దేవుని సంస్థ మీద మనకున్న నమ్మకాన్ని తీసేయాలనేదే సాతాను కోరిక.—ఎఫె. 4:14.

3. మనం ఎందుకు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి? (ఎఫెసీయులు 6:13, 14)

3 ఎఫెసీయులు 6:13, 14 చదవండి. త్వరలోనే సాతాను పచ్చి అబద్ధాల్ని వ్యాప్తి చేసి దేశాలన్నీ యెహోవాకు ఎదురుతిరిగేలా చేస్తాడు. (ప్రక. 16:13, 14) అంతేకాదు, యెహోవా సేవకుల్ని తప్పుదారి పట్టించడానికి తన ప్రయత్నాల్ని కూడా ముమ్మరం చేస్తాడని మనకు తెలుసు. (ప్రక. 12:9) అందుకే మనం సత్యానికి లోబడాలంటే, సత్యానికి అలాగే అబద్ధానికి ఉన్న తేడాను గుర్తించడం చాలా ప్రాముఖ్యం. (రోమా. 6:17; 1 పేతు. 1:22) మనం మహాశ్రమను తప్పించుకుంటామా లేదా అనేది దానిమీదే ఆధారపడి ఉంటుంది.

4. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

4 బైబిల్లో ఉండే సత్యాన్ని గుర్తించడానికి, సంస్థ ఇచ్చే నిర్దేశాన్ని అంగీకరించడానికి మనకు అవసరమయ్యే రెండు లక్షణాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ఆ తర్వాత సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి మనం చేయాల్సిన మూడు పనులు ఏంటో కూడా తెలుసుకుంటాం.

సత్యాన్ని గుర్తించడానికి అవసరమయ్యే లక్షణాలు

5. యెహోవా మీద భయం ఉంటే ఏం చేస్తాం?

5 యెహోవా మీద భయం. యెహోవా మీద సరైన భయం ఉంటే ఆయన్ని చాలా ప్రేమిస్తాం, ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయం. అంతేకాదు ఏది తప్పో ఏది ఒప్పో, ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి మనం చాలా ఆసక్తి చూపిస్తాం. అలా చేయడంవల్ల యెహోవా హృదయాన్ని సంతోషపెడతాం. (సామె. 2:3-6; హెబ్రీ. 5:14) మనం యెహోవా మీదున్న ప్రేమను, మనుషుల మీదున్న భయం ఎప్పుడూ పైచేయి సాధించకుండా చూసుకోవాలి. ఎందుకంటే, సాధారణంగా మనుషులకు నచ్చేది యెహోవాకు నచ్చదు.

6. మనుషులకు భయపడడం వల్ల పదిమంది ఇశ్రాయేలు ప్రధానులు ఎలా సత్యం నుండి పక్కదారిపట్టారు?

6 మనకు యెహోవా మీద భయం కన్నా మనుషుల మీద భయం ఎక్కువైనప్పుడు సత్యం నుండి పక్కదారి పడతాం. 12 మంది ప్రధానుల ఉదాహరణ గమనించండి. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇస్తానని మాటిచ్చిన దేశాన్ని వేగు చూడడానికి వాళ్లు వెళ్లారు. వాళ్లల్లో పదిమంది వేగుల వాళ్లకు యెహోవా మీద ప్రేమకన్నా కనానీయుల మీద భయమే ఎక్కువైంది. అప్పుడు వాళ్లు తోటి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నారు: “మనం ఆ ప్రజలతో యుద్ధం చేయలేం, వాళ్లు మనకన్నా బలవంతులు.” (సంఖ్యా. 13:27-31) నిజమే, మనుషుల వైపు నుండి చూస్తే ఇశ్రాయేలీయులకన్నా కనానీయులే చాలా బలవంతులు. కానీ ఇశ్రాయేలీయులు తమ శత్రువుల్ని ఓడించలేరని చెప్పడం ద్వారా వాళ్లు యెహోవాను పూర్తిగా మర్చిపోయారు. ఆ పదిమంది వేగులవాళ్లు యెహోవా గురించి ఆలోచించాల్సింది. కొంతకాలం ముందే యెహోవా వాళ్ల కోసం ఏమేం చేశాడో ధ్యానించాల్సింది. అప్పుడు యెహోవాకున్న అంతులేని శక్తి ముందు కనానీయుల బలం అసలు దేనికీ పనికిరాదని వాళ్లు గుర్తించేవాళ్లు. ఆ విశ్వాసంలేని వేగులవాళ్లలా కాకుండా యెహోషువ, కాలేబు యెహోవా హృదయాన్ని సంతోషపెట్టాలని అనుకున్నారు. అందుకే వాళ్లు ప్రజలతో ఇలా అన్నారు: “యెహోవా ఆమోదం మనమీద ఉంటే, ఆయన తప్పకుండా మనల్ని ఆ దేశంలోకి తీసుకెళ్లి, దాన్ని మనకు ఇస్తాడు.”—సంఖ్యా. 14:6-9.

7. మనం యెహోవా మీద భయాన్ని ఎలా పెంచుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

7 యెహోవాకు భయపడితే మనం తీసుకునే ప్రతీ నిర్ణయంలో ఆయన్ని సంతోషపెట్టాలని ఆలోచిస్తాం. (కీర్త. 16:8) మీరు బైబిలు వృత్తాంతాల్ని చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి: ‘ఆ పరిస్థితుల్లో నేనే ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాను?’ ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు కనానీయుల్ని ఓడించలేరని పదిమంది ప్రధానులు చెప్పడం మీరు విన్నట్లు ఊహించుకోండి. మీరు ఆ మాటల్ని నమ్మి, మనుషులకు భయపడతారా లేదా యెహోవా మీద ప్రేమతో ఆయన్ని సంతోషపెట్టాలనే కోరికను చూపిస్తారా? ఇశ్రాయేలీయులందరూ యెహోషువ, కాలేబు చెప్పిన సత్యాన్ని గుర్తించలేకపోయారు. దానివల్ల వాళ్లు వాగ్దాన దేశంలోకి వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు.—సంఖ్యా. 14:10, 22, 23.

కోపంతో ఊగిపోయి రాళ్లు రువ్వబోతున్న ఇశ్రాయేలీయులను బ్రతిమాలుతున్న యెహోషువ, కాలేబు. వాళ్ల వెనుక మేఘ స్తంభం ఉంది.

మీరైతే ఎవరిని నమ్మేవాళ్లు? (7వ పేరా చూడండి)


8. మనం ఏ లక్షణాన్ని పెంచుకోవడానికి కృషిచేయాలి? ఎందుకు?

8 వినయం. యెహోవా వినయం ఉన్నవాళ్లకే సత్యాన్ని వెల్లడిచేస్తాడు. (మత్త. 11:25) మనం కూడా సత్యం తెలుసుకోవడానికి వినయంగా సహాయం తీసుకున్నాం. (అపొ. 8:30, 31) అయితే, మనం గర్వం చూపించకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ మనం గర్వం చూపిస్తే, బైబిలు సూత్రాలు అలాగే యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశం కన్నా మన అభిప్రాయాలే తెలివైనవని అనుకునే ప్రమాదముంది.

9. మనం వినయాన్ని ఎలా చూపిస్తూ ఉండవచ్చు?

9 మనం వినయం చూపిస్తూ ఉండాలంటే యెహోవా ముందు అసలు మనమెంత అని ఆలోచిస్తూ ఉండాలి. (కీర్త. 8:3, 4) అంతేకాదు ఇంకా వినయం చూపించడానికి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థనలో యెహోవాను అడగాలి. అప్పుడు మన ఆలోచనల కన్నా బైబిలు నుండి, సంస్థ నుండి నేర్చుకున్న విషయాల్ని మనం విలువైనవిగా చూసేలా యెహోవా సహాయం చేస్తాడు. మీరు బైబిలు చదువుతున్నప్పుడు యెహోవా వినయం చూపించేవాళ్లను ఎలా ప్రేమిస్తాడో, గర్వం-అహంకారం చూపించేవాళ్లను ఎలా అసహ్యించుకుంటాడో గమనించండి. అలాగే ఏదైనా నియామకంలో మీకు ఇతరుల మీద కొంత అధికారం ఉంటే లేదా నలుగురి దృష్టి మీమీద ఉంటే, వినయం చూపించడానికి ఇంకాస్త ఎక్కువ ప్రయత్నించండి.

మనం సత్యాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉండవచ్చు?

10. తన ప్రజలకు నిర్దేశాలు ఇవ్వడానికి యెహోవా ఎవర్ని ఉపయోగించుకున్నాడు?

10 సంస్థ ఇచ్చే నిర్దేశాన్ని నమ్ముతూ ఉండండి. పూర్వం ఇశ్రాయేలులో తన ప్రజలకు నిర్దేశాలు ఇవ్వడానికి యెహోవా మోషేను, ఆ తర్వాత యెహోషువను ఉపయోగించుకున్నాడు. (యెహో. 1:16, 17) వీళ్లు యెహోవా దేవునికి ప్రతినిధులుగా ఉన్నారని ఇశ్రాయేలీయులు గుర్తించినంతకాలం ఎన్నో దీవెనలు పొందారు. వందల సంవత్సరాల తర్వాత క్రైస్తవ సంఘం ఏర్పడినప్పుడు, 12 మంది అపొస్తలులు సంఘాలకు నిర్దేశాలు ఇచ్చారు. (అపొ. 8:14, 15) తర్వాత వీళ్లతో యెరూషలేములో ఉన్న పెద్దలు కూడా కలిశారు. ఆ నమ్మకమైన పురుషులు ఇచ్చిన నిర్దేశాన్ని పాటించినప్పుడు, “సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ ఉన్నాయి, విశ్వాసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.” (అపొ. 16:4, 5) మనకాలంలో కూడా యెహోవా సంస్థ నుండి వచ్చే నిర్దేశాన్ని మనం పాటించినప్పుడు ఎన్నో దీవెనల్ని పొందుతాం. అయితే, యెహోవా నియమించినవాళ్లను మనం గుర్తించలేకపోతే ఆయనకు ఎలా అనిపిస్తుంది? వాగ్దాన దేశంలోకి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీయులకు జరిగిన దానిగురించి చర్చించి, ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం.

11. దేవుడు మోషేకు ఇచ్చిన అధికారాన్ని ప్రశ్నించిన వాళ్లకు ఏం జరిగింది? (చిత్రం కూడా చూడండి.)

11 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి వెళ్తున్నప్పుడు ఒక సందర్భంలో కొంతమంది పేరున్న పురుషులు మోషేను, యెహోవా ఆయనకు ఇచ్చిన అధికారాన్ని ప్రశ్నించారు. వాళ్లు ఇలా అన్నారు: “సమాజమంతా, అందులో ఉన్నవాళ్లంతా పవిత్రులే; యెహోవా వాళ్ల మధ్య ఉన్నాడు.” (సంఖ్యా. 16:1-3) నిజమే యెహోవా దృష్టిలో ఇశ్రాయేలు సమాజమంతా పవిత్రమైనదే. కానీ తన ప్రజల్ని నడిపించడానికి ఆయన మోషేను ఎంచుకున్నాడు. (సంఖ్యా. 16:28) కాబట్టి ఈ తిరుగుబాటుదారులు మోషేను అవమానించారంటే నిజానికి వాళ్లు యెహోవాను అవమానించినట్టే. వాళ్లు యెహోవా ఏం కోరుకుంటున్నాడో అనే దానికన్నా తమ అధికారం, గుర్తింపు కోసమే ఎక్కువ ప్రాకులాడారు. కాబట్టి ఆ తిరుగుబాటుదారులైన ప్రముఖుల్ని, వాళ్లతో చేతులు కలిపిన వేలమందిని యెహోవా చంపేశాడు. (సంఖ్యా. 16:30-35, 41, 49) ఈరోజుల్లో కూడా సంస్థ చేసే ఏర్పాట్ల మీద ఎవరైతే గౌరవం చూపించరో యెహోవా వాళ్లను ఇష్టపడడని మనకు ఖచ్చితంగా తెలుసు.

కోపంతో పిడికిలి బిగించి, అరుస్తున్న ఇశ్రాయేలీయులతో పర్వతం మీద నిలబడి మాట్లాడుతున్న మోషే, అహరోను.

మీరైతే ఎవరి వైపు ఉండేవాళ్లు? (11వ పేరా చూడండి)


12. యెహోవా సంస్థను మనం ఎందుకు నమ్ముతూ ఉండవచ్చు?

12 మనం యెహోవా సంస్థను నమ్ముతూ ఉండవచ్చు. ఏదైనా బైబిలు సత్యాన్ని అర్థం చేసుకునే విషయంలో లేదా రాజ్య పనికి సంబంధించి సవరణలు అవసరమైనప్పుడు మన సంస్థ మార్పులు చేయడానికి అస్సలు వెనుకాడదు. (సామె. 4:18) వాళ్లు ఎందుకలా చేస్తారంటే, వాళ్లు అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాను సంతోషపెట్టాలని అనుకుంటారు. వాళ్లు తీసుకునే ప్రతీ నిర్ణయం బైబిలు మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుని ప్రజలు పాటించాల్సిన ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీసుకోవడానికి కృషి చేస్తారు.

13. “మంచి మాటల ప్రమాణం” అంటే ఏంటి? దాని విషయంలో మనం ఏం చేయాలి?

13 “మంచి మాటల ప్రమాణాన్ని పాటిస్తూ ఉండండి.” (2 తిమో. 1:13) “మంచి మాటల ప్రమాణం” బైబిల్లో ఉన్న క్రైస్తవ బోధల్ని సూచిస్తుంది. (యోహా. 17:17) మన నమ్మకాలన్నిటికీ ఆధారం ఆ బోధలే. ఆ ప్రమాణాన్ని అంటిపెట్టుకుని ఉండమని యెహోవా సంస్థ మనకు నేర్పిస్తుంది. మనం అలా చేసినంతకాలం దీవెనలు పొందుతూనే ఉంటాం.

14. కొంతమంది క్రైస్తవులు ఎలా “మంచి మాటల ప్రమాణాన్ని” అంటిపెట్టుకోవడం ఆపేశారు?

14 “మంచి మాటల ప్రమాణాన్ని” అంటిపెట్టుకోవడం ఆపేస్తే ఏం జరగవచ్చు? ఈ ఉదాహరణ గమనించండి. యెహోవా రోజు వచ్చేసిందని మొదటి శతాబ్దంలో కొంతమంది క్రైస్తవుల మధ్య ఒక పుకారు చెక్కర్లు కొడుతూ ఉంది. ఆ విషయాన్ని పౌలే చెప్తున్నట్టు ఒక ఉత్తరం వచ్చింది. వాస్తవాలు ఏంటో చూడకుండా థెస్సలోనికలోని కొంతమంది క్రైస్తవులు ఆ పుకారును నమ్మి, వేరేవాళ్లకు చెప్తూ ఉన్నారు. పౌలు వాళ్లతో ఉన్నప్పుడు నేర్పించిన విషయాల్ని వాళ్లు గుర్తుపెట్టుకుని ఉంటే వాళ్లు మోసపోయేవాళ్లు కాదు. (2 థెస్స. 2:1-5) వాళ్ల చెవిన పడ్డ ప్రతీ విషయాన్ని నమ్మవద్దని పౌలు వాళ్లకు సలహా ఇచ్చాడు. అలాగే భవిష్యత్తులో వాళ్లకు ఉపయోగపడేలా థెస్సలొనీకయులకు రాసిన రెండో పత్రికను ఈ మాటలతో ముగించాడు: “పౌలు అనే నేను స్వహస్తాలతో నా శుభాకాంక్షలు రాస్తున్నాను. నా ఉత్తరాలన్నిటినీ గుర్తుపట్టడానికి నా చేతిరాతే మీకు గుర్తు, ఇదే నా చేతిరాత.”—2 థెస్స. 3:17.

15. నిజంలా కనిపించే అబద్ధాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి. (చిత్రాలు కూడా చూడండి.)

15 థెస్సలొనీకయులకు పౌలు రాసిన మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? బైబిలు నుండి మనం నేర్చుకున్న విషయాలకు విరుద్ధంగా ఉన్నవి మన చెవినపడ్డా లేదా మనం ఊహించని ఏదైనా పుకారు మన చెవినపడ్డా వివేచన చూపించాలి. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో ఏం జరిగిందో గమనించండి. మన శత్రువులు ఒక ఉత్తరాన్ని బ్రదర్స్‌కు పంపించారు. కొంతమంది బ్రదర్స్‌ విడిపోయి, ఒక సంస్థగా ఏర్పడాలని ఆ ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరం అచ్చం ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి వచ్చినట్టే కనిపించింది. కానీ నమ్మకమైన బ్రదర్స్‌ మాత్రం మోసపోలేదు. ఉత్తరంలో ఉన్న విషయం వాళ్లు నేర్చుకున్న విషయాలకు పూర్తి విరుద్ధంగా ఉందని వాళ్లు గుర్తించారు. ఈరోజుల్లో కూడా మన శత్రువులు మనల్ని తికమక పెట్టి, విడగొట్టాలని కొన్నిసార్లు టెక్నాలజీని ఉపయోగించవచ్చు. అప్పుడు మనం “వెంటనే అయోమయంలో పడిపోకుండా” విన్న విషయాలు, చదివిన విషయాలు మనం నేర్చుకున్న సత్యానికి తగ్గట్టుగా ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా ఆలోచించాలి.—2 థెస్స. 2:2; 1 యోహా. 4:1.

చిత్రాలు: 1. పదుల సంవత్సరాల క్రితం, ఒక సహోదరుడు “వాచ్‌ టవర్‌” పేరుతో వచ్చిన ఉత్తరాన్ని తన ఇంట్లో కలుసుకున్న బ్రదర్స్‌కి చూపిస్తున్నాడు. 2. మన కాలంలో, బ్రదర్స్‌-సిస్టర్స్‌ సరదాగా కలుసుకున్నప్పుడు ఒక బ్రదర్‌ యెహోవాసాక్షుల గురించి ఇంటర్నెట్‌లో ఉన్న ఒక వీడియో చూపిస్తున్నాడు.

నిజంలా కనిపించే అబద్ధాలకు పడిపోకండి (15వ పేరా చూడండి)a


16. ఎవరైనా పక్కదారి పడితే మనం ఏం చేయాలని రోమీయులు 16:17, 18 చెప్తుంది?

16 యెహోవాకు నమ్మకంగా ఉన్నవాళ్లతో ఐక్యంగా ఉండండి. మనం తనని ఐక్యంగా ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం సత్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నంతవరకు ఐక్యంగా ఉండగలుగుతాం. సత్యం నుండి పక్కదారి పట్టిన వాళ్లవల్ల సంఘంలో విభజనలు ఏర్పడతాయి. అందుకే వాళ్లకు “దూరంగా ఉండండి” అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. లేకపోతే మనం సత్యం నుండి పక్కదారి పట్టే అవకాశం ఉంది.—రోమీయులు 16:17, 18 చదవండి.

17. సత్యాన్ని గుర్తించి, దాన్ని అంటిపెట్టుకుని ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం?

17 మనం సత్యాన్ని గుర్తించి, దాన్ని గట్టిగా అంటిపెట్టుకుని ఉన్నప్పుడు యెహోవాకు దగ్గరౌతాం. మన విశ్వాసం కూడా బలంగా ఉంటుంది. (ఎఫె. 4:15, 16) అలాగే సాతాను అబద్ధ బోధలకు, ప్రచారాలకు మనం పడిపోం. మహాశ్రమ సమయంలో కూడా యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉంటాం. సత్యాన్ని గట్టిగా అంటిపెట్టుకుని ఉన్నంతవరకు “శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.”—ఫిలి. 4:8, 9.

మీరెలా జవాబిస్తారు?

  • సత్యాన్ని గుర్తించడం ఎందుకు ప్రాముఖ్యం?

  • సత్యాన్ని గుర్తించి, పాటించడానికి యెహోవా మీద భయం, వినయం ఎలా సహాయం చేస్తాయి?

  • సత్యాన్ని గట్టిగా అంటిపెట్టుకుని ఉండడానికి ఏం సహాయం చేస్తుంది?

పాట 122 స్థిరంగా, నిలకడగా ఉందాం!

a చిత్రం వివరణ: ఫోటో కోసం నటించిన దాంట్లో, పదుల సంవత్సరాల క్రితం ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో బ్రదర్స్‌కి ఒక ఉత్తరం వచ్చింది. అది అచ్చం ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి వచ్చినట్టే కనిపించింది కానీ అది శత్రువులు పంపించింది. మన కాలంలో, యెహోవాసాక్షుల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి శత్రువులు ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి