మన జిల్లా సమావేశాలు—సత్యం గురించి శక్తివంతంగా సాక్ష్యమిస్తాయి
1. ఏటా వచ్చే పండుగలు ఇశ్రాయేలీయులకు ఏ ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాల గురించి ధ్యానించే, మాట్లాడుకునే అవకాశాన్నిచ్చేవి?
1 ప్రాచీన ఇశ్రాయేలీయులు ఏటా వచ్చే పండుగల్లో సంవత్సరానికి మూడుసార్లు సమకూడేవాళ్లు. వాటికి మగవాళ్ళు మాత్రం తప్పనిసరిగా హాజరవ్వాలి, అయినా ఇలాంటి ఆనందకరమైన సమావేశాలకు హాజరవడానికి తరచూ కుటుంబ సభ్యులందరూ యెరూషలేముకు ప్రయాణించి వెళ్ళేవాళ్ళు. (ద్వితీ. 16:15, 16) అలాంటి సందర్భాలు ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాల గురించి ధ్యానించే, మాట్లాడుకునే అవకాశాన్నిచ్చేవి. ఆ సత్యాల్లో కొన్ని ఏమిటి? ఒకటేమిటంటే యెహోవా ఉదారంగా, ప్రేమగా ఇచ్చే దేవుడు. (ద్వితీ. 15:4, 5) మరొకటి ఏమిటంటే నిర్దేశం కోసం, సంరక్షణ కోసం మనం ఆయన మీద ఆధారపడవచ్చు. (ద్వితీ. 32:9, 10) ఇశ్రాయేలీయులు యెహోవా పేరు కలిగిన ప్రజలుగా ఆయన నీతి మార్గాలకు అనుగుణంగా నడుచుకోవాలనే వాస్తవం గురించి కూడా ధ్యానించవచ్చు. (ద్వితీ. 7:6, 11) మన కాలంలో ఏటా జరుగుతున్న జిల్లా సమావేశాలు కూడా మనకు అలాంటి ప్రయోజనాన్నే చేకూరుస్తాయి.
2. జిల్లా సమావేశ కార్యక్రమం సత్యాన్ని ఎలా మరింత స్పష్టం చేస్తుంది?
2 సమావేశ కార్యక్రమం సత్యాన్ని మరింత స్పష్టం చేస్తుంది: మన జిల్లా సమావేశాల్లో, బైబిల్లోని ప్రాథమిక సత్యాలను సుస్పష్టం చేసి, వాటినెలా అన్వయించుకోవాలో వివరించే ఆసక్తికరమైన ప్రసంగాలు, నాటకాలు, ప్రదర్శనలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. (యోహా. 17:17) రాబోయే సమావేశం కోసం ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లు జరిగాయి. యెహోవా సంస్థ, ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగిన కార్యక్రమాన్ని సిద్ధం చేస్తోంది. (మత్త. 24:45-47) మరి మీకు అవన్నీ చూడాలని, వినాలని కుతూహలంగా ఉందా?
3. సమావేశ కార్యక్రమం నుండి ప్రయోజనం పొందాలంటే మనం ఏమి చేయాలి?
3 సమావేశానికి మూడు రోజులూ హాజరై, శ్రద్ధగా వింటేనే మనం పూర్తి ప్రయోజనం పొందుతాం. కాబట్టి, ఆ సమయంలో సెలవు తీసుకోవడానికి ఇప్పుడే ప్రయత్నం చేయండి. సమావేశ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మెలకువగా ఉండేలా, రాత్రుళ్ళు తగినంత విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి. ప్రసంగీకుని మీద దృష్టి పెట్టి, ముఖ్యమైన విషయాలు నోట్సు రాసుకుంటూ ఉంటే శ్రద్ధగా వినగలుగుతాము. మీ సెల్‌ఫోన్ మీ ఏకాగ్రతకు లేదా వేరేవాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించకుండా చూసుకోండి. కార్యక్రమం జరుగుతున్నప్పుడు మాట్లాడడం, మెసేజ్‌లు పంపించడం, తినడం వంటివి చేయకండి.
4. సమావేశ కార్యక్రమం నుండి పిల్లలు ప్రయోజనం పొందడానికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?
4 సబ్బాతు సంవత్సరాల్లో, పర్ణశాలల పండుగ సమయంలో చదవబడుతున్న ధర్మశాస్త్రాన్ని వినడానికి ఇశ్రాయేలీయుల కుటుంబాలు సమకూడినప్పుడు తమ ‘పిల్లలు విని, నేర్చుకోవాలని’ వాళ్లను కూడా తీసుకువచ్చేవాళ్లు. (ద్వితీ. 31:12) సమావేశంలో కుటుంబమంతా కలిసి కూర్చోవడం, పిల్లలు నిద్రపోకుండా శ్రద్ధగా వినడం చూస్తే ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! సాయంకాలాల్లో, మీరు రాసుకున్న నోట్సు దగ్గర పెట్టుకుని, కార్యక్రమంలో మీకు నచ్చిన అంశాలను కలిసి చర్చించండి. ‘పిల్లల హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది’ కాబట్టి మధ్యాహ్న విరామ సమయంలో, అలాగే హోటల్ దగ్గర తల్లిదండ్రులు తమ చిన్నపిల్లలను, యౌవనులను ‘అదుపులేని’ వాళ్లలా వదిలేయకుండా ఓ కంట కనిపెట్టి ఉండాలి.—సామె. 22:15; 29:15.
5. హోటల్లో మన చక్కని ప్రవర్తన సత్యాన్ని ఎలా ఆకర్షణీయంగా చేస్తుంది?
5 మన చక్కని ప్రవర్తన సత్యాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది: సమావేశ నగరంలో మన చక్కని ప్రవర్తన సత్యాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. (తీతు 2:9, 10) మనం హోటల్లో బస చేస్తున్నప్పుడు అక్కడి నియమాలు పాటిస్తూ సహనాన్ని చూపిస్తూ సిబ్బందితో దయగా ప్రవర్తిస్తే వాళ్లు దాన్ని గుర్తిస్తారు. (కొలొ. 4:6) గత సంవత్సరం బ్రాంచి కార్యాలయ ప్రతినిధులు ఒక హోటల్‌ను సంప్రదించినప్పుడు, ఆ హోటల్ మేనేజర్ వాళ్లతో ఇలా చెప్పింది: “మీ వాళ్లు చాలా మంచివాళ్లు, వాళ్లు మా హోటల్లో ఉండడం మాకెంతో ఆనందాన్నిస్తుంది. వాళ్లు ఎంతో మర్యాదగా, చక్కగా నడుచుకుంటారు. ఎప్పుడూ హోటల్ సిబ్బందిపట్ల గౌరవం చూపిస్తారు, హోటల్లోని వస్తువులను జాగ్రత్తగా వాడతారు.”
6. సత్యాన్ని ఆకర్షణీయంగా చేయాలంటే, సమావేశ నగరంలో ఉన్నప్పుడు మన వస్త్రధారణ ఎలా ఉండాలి?
6 మనం సమావేశ బ్యాడ్జి పెట్టుకోవడంవల్ల సమావేశం గురించి అందరికీ తెలుస్తుంది, సమావేశానికి వచ్చిన ఇతరులు మనల్ని గుర్తించగలుగుతారు. అంతేకాదు, చూసేవాళ్లకు అది సాక్ష్యంగా కూడా ఉంటుంది. సమావేశ బ్యాడ్జి పెట్టుకున్నవాళ్లు వస్త్రధారణ విషయంలో లోక ప్రజల్లా వికారంగా, రెచ్చగొట్టేలా కాకుండా శుభ్రంగా, మర్యాదగా ఉండడాన్ని సమావేశ నగరంలోని ప్రజలు గమనిస్తారు. (1 తిమో. 2:9, 10) కాబట్టి మనం హోటల్లో బస చేయడానికి వెళ్లేటప్పుడు, సమావేశ నగరంలో ఉన్నప్పుడు అలాగే గౌరవప్రదంగా ఉండాలి. షార్ట్సు, స్లోగన్లు రాసివున్న టీ-షర్టు వేసుకుని రావడం మర్యాదకరంగా ఉండదు. సమావేశం జరిగే స్టేడియంలో ఉక్కపోతగా ఉన్నా మన వస్త్రధారణ మర్యాదకరంగా ఉండాలి. కార్యక్రమం ముగిసిన తర్వాత బట్టలు మార్చుకుని భోజనానికి బయటకు వెళ్లాలనుకుంటే, అప్పుడు కూడా మనం యెహోవాసాక్షులమేనని, ఇష్టమొచ్చినట్లు తయారై వెళ్లకూడదని గుర్తుంచుకోవాలి.
7. సమావేశ సమయంలో మనం క్రైస్తవ ఐక్యతను అనుభవించాలంటే ఏమి చేయాలి?
7 ఏటా వచ్చే పండుగల్లో ఇశ్రాయేలీయులు తమ దేశ నలుమూలల నుండి, ప్రపంచంలోని వేరే ప్రాంతాల నుండి వచ్చిన తోటి ఆరాధకులతో చక్కని సహవాసాన్ని ఆనందించేవాళ్లు, అది ఐక్యతను పెంపొందించేది. (అపొ. 2:1, 5) మన జిల్లా సమావేశాల్లో సాటిలేని క్రైస్తవ సహోదరత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మన ఆధ్యాత్మిక పరదైసులోని ఈ ఆహ్లాదకరమైన అంశం చూపరులను ముగ్ధుల్ని చేస్తుంది. (కీర్త. 133:1) మధ్యాహ్న భోజనం కోసం హాలు ప్రాంగణం వదిలి బయటకు వెళ్లే బదులు మనతోపాటు తేలికపాటి ఆహారాన్ని తెచ్చుకుని, దగ్గర్లో కూర్చున్న సహోదర సహోదరీలతో మాట్లాడేందుకు ఆ సమయాన్ని ఉపయోగిస్తే ఎంత బావుంటుందో కదా!
8. మన పరిస్థితులు అనుకూలిస్తే స్వచ్ఛంద సేవ చేయడం ఎందుకు మంచిది?
8 చక్కని వ్యవస్థీకరణతో, పద్ధతిగా జరిగే మన సమావేశాలను చూసి, ముఖ్యంగా స్వచ్ఛంద సేవకులే ఈ పనంతా చేశారని తెలుసుకుని చూపరులు ఎంతో ముగ్ధులౌతారు. సమావేశంలో పనిచేయడానికి మీరు “ఇష్టపూర్వకముగా” ముందుకు వస్తున్నారా? (కీర్త. 110:3) ఇతరులకు సహాయం చేయాలనే విషయం పిల్లలకు నేర్పించేందుకు, కొందరు తరచూ కుటుంబమంతా కలిసి స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు. మీరు బిడియస్థులైతే, ఇతరులతో పరిచయం పెంచుకోవడానికి సమావేశంలో పనిచేయడం మంచి మార్గం. ఒక సహోదరి ఇలా అంది: “నా కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులు తప్ప అక్కడ నాకు ఇంకెవరూ తెలియదు. కానీ నేను హాలు శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు చాలామంది సహోదర సహోదరీలు నాకు పరిచయమయ్యారు. నాకు చాలా సరదాగా అనిపించింది.” సమావేశంలో పనిచేస్తూ ఎక్కువమంది స్నేహితులను సంపాదించుకోవడం మనకెంతో సంతోషాన్నిస్తుంది. (2 కొరిం. 6:12, 13) మీరు ఇంతవరకూ ఎప్పుడూ సమావేశంలో అలా పని చేయకపోతే, దానికి అర్హత ఎలా సంపాదించుకోవాలో పెద్దలను అడిగి తెలుసుకోండి.
9. మనం సమావేశానికి ఇతరులను ఎలా ఆహ్వానించవచ్చు?
9 సత్యాన్ని వినడానికి ఇతరులను ఆహ్వానించండి: గత సంవత్సరాల్లోలాగే మనం సమావేశానికి మూడు వారాల ముందు ఇతరులను ఆహ్వానించే కార్యక్రమంలో పాల్గొంటాం. సాధ్యమైనంతవరకు క్షేత్రమంతటిలో ఆహ్వాన ప్రతులను పంచిపెట్టడానికి సంఘాలు ప్రయత్నించాలి. (“ఆహ్వాన ప్రతిని ఎలా అందించవచ్చు?” అనే బాక్సు చూడండి.) మిగిలిపోయిన ఆహ్వాన ప్రతులను సమావేశ స్థలానికి తీసుకురావాలి. ఆ నగరంలో ఉన్నప్పుడు అవకాశం దొరికిన చోట సాక్ష్యమివ్వడానికి వాటిని ఉపయోగించాలి.
10. ఏటా జరిగే ఈ ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని చూపించే అనుభవాలు చెప్పండి.
10 ఏటా జరిగే ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజలు స్పందిస్తున్నారా? ఒక అటెండెంట్, సమావేశానికి వచ్చిన దంపతులకు కూర్చోవడానికి సీటు చూపించాడు. తమకు ఎవరో ఆహ్వాన ప్రతి ఇచ్చారని, “అది ఆసక్తికరంగా అనిపించింది” అని వాళ్లు ఆయనకు చెప్పారు. వాళ్లు కారులో దాదాపు 320 కిలోమీటర్ల దూరం నుండి వచ్చారు! మరోచోట, ఒక సహోదరి ఇంటింటి సాక్ష్యంలో సమావేశం పట్ల ఆసక్తి చూపించిన ఒక వ్యక్తికి ఆహ్వాన ప్రతిని ఇచ్చింది. ఆ ఆహ్వాన ప్రతిలోని విషయాలను కాసేపు ఆ వ్యక్తితో చర్చించింది. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి, తన స్నేహితునితో కలిసి సమావేశంలో ఉండడం ఆ సహోదరి చూసింది, ఆ సమావేశంలో విడుదలైన ఒక కొత్త ప్రచురణ వాళ్ల దగ్గర ఉండడం కూడా చూసింది!
11. ఏటా జరిగే మన జిల్లా సమావేశాలకు హాజరవడం ఎందుకు ప్రాముఖ్యం?
11 ఏటా వచ్చే పండుగలు ఇశ్రాయేలీయులు తనను ‘నిష్కపటంగా సత్యంతో సేవించడానికి’ యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాట్లు. (యెహో. 24:14) అలాగే మనం ఏటా వచ్చే జిల్లా సమావేశాలకు హాజరైతే, ‘సత్యమును అనుసరించి నడుచుకోగలుగుతాం,’ అలా హాజరవడం మన ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగం కూడా. (3 యోహా. 3) సత్యాన్ని ప్రేమించేవాళ్లందరూ సమావేశానికి హాజరవడానికి, దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికి చేసే కృషిని యెహోవా ఆశీర్వదించును గాక!
[5వ పేజీలోని బ్లర్బ్]
సమావేశ నగరంలో మన చక్కని ప్రవర్తన సత్యాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది
[5వ పేజీలోని బ్లర్బ్]
మనం సమావేశానికి మూడు వారాల ముందు ఇతరులను ఆహ్వానించే కార్యక్రమంలో పాల్గొంటాం
[6, 7వ పేజీలోని బాక్సు]
2012 జిల్లా సమావేశ జ్ఞాపికలు
◼ కార్యక్రమ వేళలు: మూడు రోజులూ కార్యక్రమం ఉదయం 9:20కి మొదలవుతుంది. ఉదయం ఎనిమిదికి తలుపులు తెరుస్తారు. కార్యక్రమం క్రమపద్ధతిలో, గౌరవప్రదంగా ఆరంభమవ్వాలంటే ప్రారంభ సంగీతం మొదలౌతుందనే ప్రకటన వినగానే మనందరం సీట్లలో కూర్చోవాలి. శుక్ర, శని వారాల్లో కార్యక్రమం సాయంత్రం 4:55కు ముగుస్తుంది, ఆదివారం సాయంత్రం 3:40కి ముగుస్తుంది.
◼ పార్కింగ్: సమావేశ స్థలాల్లో అందరూ తమ వాహనాలను ఉచితంగా పార్క్ చేసుకోవచ్చు. స్థలం అందుబాటులో ఉన్నంతవరకు, హాజరైనవాళ్లంతా తమ వాహనాలను పార్క్‌చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, సాధారణంగా పార్కింగ్ స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి, వీలైనంతవరకు ఒక కారులో కేవలం ఒకరిద్దరే కాకుండా, కారులో ఎంతమంది కూర్చోవచ్చో అంతమంది కలిసి రావడానికి ప్రయత్నించాలి.
◼ సీట్లు పెట్టుకోవడం: మన ఇంట్లో వాళ్లకు, మనతోపాటు ఒకే కారులో వచ్చినవాళ్లకు, లేదా ప్రస్తుతం మనం బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్న వాళ్లకు మాత్రమే సీట్లు పెట్టుకోవచ్చు.—1 కొరిం. 13:5.
◼ మధ్యాహ్న భోజనం: మధ్యాహ్న భోజనం కోసం హాలు ప్రాంగణం వదిలి బయటకు వెళ్లే బదులు, కుర్చీ కింద పెట్టుకోగలిగే చిన్న సంచిలో తేలికపాటి ఆహారాన్ని దయచేసి మీ వెంట తెచ్చుకోండి. ఆహారం ఉన్న పెద్దపెద్ద సంచులు, గాజు వస్తువులు తీసుకురాకూడదు.
◼ విరాళాలు: సమావేశంలో ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం ద్వారా సమావేశ ఏర్పాట్ల పట్ల మన కృతజ్ఞతను చూపించవచ్చు. చెక్ ద్వారా విరాళం ఇవ్వాలనుకునేవాళ్లు “The Watch Tower Bible and Tract Society of India” పేరుమీద ఇవ్వాలి.
◼ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు: సమావేశ స్థలంలో ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైతే దగ్గర్లో ఉన్న అటెండెంటును సంప్రదించాలి. ఆయన వెంటనే దానిని ప్రథమ చికిత్సా విభాగం దృష్టికి తీసుకువెళ్తాడు, దాంతో అర్హతగల ప్రథమ చికిత్సా సిబ్బంది పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని తగిన సహాయం అందజేస్తారు. అవసరమనుకుంటే ప్రథమ చికిత్సా సిబ్బంది అంబులెన్సును రప్పిస్తారు. ఈ పద్ధతి పాటిస్తే, ప్రథమ చికిత్సా సిబ్బందికి ఎక్కువ ఫోన్‌కాల్స్ వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
◼ మందులు: మీరు డాక్టరు రాసిచ్చిన మందులు వాడుతుంటే, సమావేశ స్థలంలో అవి దొరకవు కాబట్టి మీతోపాటు కావలసినన్ని తెచ్చుకోండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే సిరంజిలను, సూదులను సమావేశ హాలు వద్ద, హోటళ్ల వద్ద ఉన్న సాధారణ చెత్త కుండీలలో వేయకుండా హానికరమైన వ్యర్థాలు వేసే కుండీలలో వేయాలి.
◼ పాదరక్షలు: ప్రతీ సంవత్సరం పాదరక్షల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మెట్ల మీద, ఏటవాలుగా ఉండే నడవ మీద, ఎత్తుపల్లాలున్న నేల మీద నడవడానికి వీలుగా ఉండే, సౌకర్యవంతమైన పాదరక్షలు వేసుకోవడం మంచిది.
◼ బధిరులు: ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో, సమావేశ కార్యక్రమం సంజ్ఞా భాషలో కూడా అందజేయబడుతుంది.
◼ బాప్తిస్మం: బాప్తిస్మం తీసుకోబోయే వాళ్లు శనివారం ఉదయం బాప్తిస్మ ప్రసంగం ఆరంభమయ్యే ముందు వాళ్ల కోసం కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ప్రతి ఒక్కరూ ఒక టవల్ తెచ్చుకోవాలి, బాప్తిస్మం తీసుకునేటప్పుడు గౌరవప్రదమైన దుస్తులు ధరించాలి. బాప్తిస్మం తీసుకునే వాళ్ల కోసం వేదికకు ఎదురుగా ఉన్న ముందు వరుస సీట్లు కేటాయించబడతాయి. ఈ విషయంలో మార్పులేమైనా ఉంటే ముందుగానే ప్రకటించబడుతుంది. అటెండెంట్ల ద్వారా, సమాచార విభాగం ద్వారా కూడా తెలియజేయబడుతుంది.
◼ సెంట్లు: చాలా సమావేశాలు ఏ.సీ. హాళ్లలోనే జరుగుతాయి. కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు లేక తత్సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ల మీద ప్రతిచర్య చూపే ఘాటైన సెంట్లు, అత్తర్లు అంతగా వాడకపోవడం మంచిది.—1 కొరిం. 10:24.
◼ ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారమ్‌లు: సమావేశ సమయంలో, అవకాశం దొరికినచోట సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆసక్తి చూపించినవాళ్ల సమాచారం అందించడానికి ప్లీజ్‌ఫాలో అప్ ఫారమ్ ఉపయోగించాలి. ప్రచారకులు సమావేశానికి ఒకటి లేదా రెండు ఫారాలను తెచ్చుకోవాలి. పూరించిన ఫారాలను పుస్తక విభాగానికి లేదా మీరు తిరిగి వెళ్లిన తర్వాత మీ సంఘ కార్యదర్శికి ఇవ్వవచ్చు.—మే 2011 మన రాజ్య పరిచర్య, 3వ పేజీ చూడండి.
◼ రెస్టారెంట్లు: రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు మీ చక్కని ప్రవర్తనతో యెహోవా నామాన్ని ఘనపర్చండి. అక్కడ టిప్ ఇవ్వడం మామూలైతే, మీరూ ఇవ్వండి.
◼ హోటళ్లు:
(1) అవసరమయ్యే దానికన్నా ఎక్కువ గదులు రిజర్వు చేసుకోకండి, మీ గదిలో అనుమతించిన దానికన్నా ఎక్కువమందిని ఉంచుకోకండి.
(2) అత్యవసర పరిస్థితుల్లో తప్ప మీ గది రిజర్వేషన్‌ను రద్దు చేయకండి, ఒకవేళ రద్దు చేయాల్సివస్తే హోటల్ వాళ్లకు వెంటనే తెలియజేయండి.—మత్త. 5:37.
(3) మీరు డెబిట్కార్డుగానీ క్రెడిట్కార్డుగానీ ఉపయోగిస్తుంటే, మీరు హోటల్లో దిగినప్పుడు హోటల్ వాళ్లు మీ గది అద్దె కోసం, ఏదైనా నష్టం జరిగితే దాని కోసం అన్నట్లుగా మీ అకౌంటులోని కొంత మొత్తాన్ని నిలిపివుంచుకోవడం పరిపాటి. మీరు గదిని ఖాళీ చేసిన కొన్ని రోజుల తర్వాత మీ అకౌంటు సెటిలయ్యే వరకు మీరు ఆ మొత్తాన్ని ఉపయోగించుకోలేరు.
(4) లగేజ్ కార్ట్ మీకు అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకోండి, ఇతరులకు కూడా అది అవసరమవుతుంది కాబట్టి వెంటనే దానిని తిరిగి ఇచ్చేయండి.
(5) హోటల్ బాయ్స్ మీ సామాను మోసుకొచ్చినప్పుడు, మీ గది శుభ్రం చేసినప్పుడు వాళ్లకు టిప్ ఇవ్వండి.
(6) హోటల్ గదిలో వంట చేసుకునేందుకు అనుమతి ఉంటేనే వంట చేసుకోండి.
(7) హోటల్ వాళ్లు అతిథుల కోసం ఏర్పాటు చేసే అల్పాహారం, కాఫీ లేదా ఐస్ వంటి అదనపు ఏర్పాట్లను దుర్వినియోగం చేయకండి.
(8) హోటల్ సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు ఆత్మఫలంలోని లక్షణాలను చూపించండి. వాళ్లు హోటల్‌కు వచ్చే చాలామందిని చూసుకోవాలి కాబట్టి మనం దయ, ఓర్పు, సహేతుకత చూపిస్తే వాళ్లు ఎంతో సంతోషిస్తారు.
(9) హోటల్ పరిసరాల్లో అంటే స్విమ్మింగ్ పూల్, రిసెప్షన్, లిఫ్ట్ వంటి స్థలాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలి.
(10) సిఫారసు చేయబడిన హోటళ్ల లిస్ట్‌లో గదికి ఒక రోజుకు ఎంత అద్దె కట్టాలో ఇవ్వబడింది. అయితే పన్ను అదనంగా చెల్లించాల్సివుంటుంది. కానీ దాని కంటే ఎక్కువ డబ్బు ఇవ్వమని అడిగితే ఇవ్వకండి, వీలైనంత త్వరగా రూమింగ్విభాగానికి తెలియజేయండి.
(11) మీ హోటల్ గదికి సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే, సమావేశం వద్ద ఉన్నప్పుడే రూమింగ్ విభాగానికి తెలియజేయండి. అలాగైతేనే వాళ్లు మీకు సహాయం చేయగలుగుతారు.
◼ స్వచ్ఛంద సేవ: స్వచ్ఛందంగా సహాయం చేయాలనుకున్న వాళ్లెవరైనా సమావేశంలోని స్వచ్ఛంద సేవా విభాగం దగ్గరకు వెళ్లాలి. 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు కూడా అలా సహాయం చేయాలనుకుంటే వాళ్లు తల్లిదండ్రుల పర్యవేక్షణలో గానీ, వాళ్ల అనుమతి పొందిన ఇతర పెద్దవాళ్ల పర్యవేక్షణలో గానీ చేయవచ్చు.
[6వ పేజీలోని బాక్సు]
ఆహ్వాన ప్రతిని ఎలా అందించవచ్చు?
క్షేత్రంలో ఉన్న అందరికీ ఆహ్వాన ప్రతులను అందించాలంటే మనం క్లుప్తంగా మాట్లాడితే బావుంటుంది. మనం ఇలా చెప్పవచ్చు: “నమస్కారమండీ, ఈ ఆహ్వాన ప్రతిని అందించే ప్రపంచవ్యాప్త పనిలో మేము పాల్గొంటున్నాం. ఇది మీకోసం తీసుకువచ్చాం. దీనిలో మరిన్ని వివరాలు ఉన్నాయి.” ఉత్సాహంగా మాట్లాడండి. ఆహ్వాన ప్రతులను వారాంతాల్లో అందిస్తున్నప్పుడు, సముచితమైతే పత్రికలు కూడా ఇవ్వండి.