మీరు ఏవి ఎంపిక చేసుకునే అవకాశముందో మీకు తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసుపత్రుల్లో రక్తం ఎక్కించకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. రక్తం ఎక్కించకుండా చేసే చికిత్సల్లో, మీరు ఎంపిక చేసుకునే అవకాశమున్న వివిధ వైద్య విధానాల గురించి మీకు పూర్తిగా తెలుసా? వైద్య చికిత్స, శస్త్రచికిత్సల గురించి అన్ని విషయాలు అర్థంచేసుకుని నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు వాటి గురించి తెలుసుకోవాలి. రక్తం ఎక్కించకుండా వైద్యరంగం చికిత్స చేయగలుగుతోంది (No Blood—Medicine Meets the Challenge) అనే వీడియోను చూడండి. ఇంగ్లీషు రానివాళ్లు ఈ ఆర్టికల్ చివరి పేరాలో ఉన్న రెఫరెన్సులను తమ భాషలో చదువుకోవాలి. ఆ తర్వాత, మీరు తెలుసుకున్న విషయాల గురించి ఈ క్రింది ప్రశ్నల సహాయంతో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి.—గమనిక: ఈ వీడియోలో శస్త్రచికిత్సకు సంబంధించిన క్లుప్త దృశ్యాలున్నాయి కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ వీడియో చూడనివ్వాలో వద్దో నిర్ణయించుకోవాలి.
(1) యెహోవాసాక్షులు రక్తం ఎక్కించుకోకపోవడానికి ముఖ్య కారణమేమిటి? (2) చికిత్స విషయంలో యెహోవాసాక్షుల ఉద్దేశమేమిటి? (3) రోగులకు ఏ ప్రాథమిక హక్కుంది? (4) రక్తంలోని భాగాలేవి? (5) (ఎ) రక్తం నుండి సేకరించిన సూక్ష్మభాగాలను కొంతమంది క్రైస్తవులు ఎందుకు అంగీకరిస్తారు? (బి) రక్తం నుండి సేకరించిన దేన్నైనా కొంతమంది క్రైస్తవులు ఎందుకు అంగీకరించరు? (6) రక్తాన్ని దానం చేయడం, నిలవ ఉంచడం, నిలవ ఉంచిన స్వంత రక్తాన్ని ఎక్కించుకోవడం వంటివాటిని క్రైస్తవులు ఎలా దృష్టించాలి? (7) రక్తం చేరివున్న వైద్య పద్ధతులు కొన్ని ఏవి? వివరించండి. (8) రక్తం చేరివున్న వైద్య పద్ధతులకు సంబంధించి ప్రతీ క్రైస్తవుడికి ఏ గంభీరమైన బాధ్యత ఉంది? (9) రక్తం ఎక్కించకుండా చేసే చికిత్సల గురించి మీరు ఏ విషయాలు తెలుసుకుని ఉండాలి? (10) ప్రమాదభరితమైన, కష్టమైన శస్త్రచికిత్సలు రక్తం ఎక్కించకుండా చేయవచ్చా?
వీడియోలో చూపించిన కొన్ని చికిత్సలను చేయించుకోవాలా వద్దా అనేది, ప్రతీ వ్యక్తి తన బైబిలు శిక్షిత మనస్సాక్షి ఆధారంగా నిర్ణయించుకోవాలి. మీ కోసం, మీ పిల్లల కోసం ఎలాంటి చికిత్సలు చేయించుకోవాలి, ఏ పద్ధతులను ఉపయోగించుకోవాలి అనేది నిర్ణయించుకుని, అడ్వాన్స్ హెల్త్ కేర్ డైరెక్టివ్ను నింపారా? ఈ విషయాల గురించి పూర్తి వివరాల కోసం కావలికోట జూన్ 15, 2004, అక్టోబరు 15, 2000 సంచికల్లోని “పాఠకుల ప్రశ్నలు” జాగ్రత్తగా పరిశీలించండి. ఆ తర్వాత నవంబరు 2006 మన రాజ్య పరిచర్య మధ్య పేజీల్లోవున్న, “రక్తంలోని సూక్ష్మభాగాలను, నా రక్తం ఇమిడివున్న వైద్యవిధానాలను నేనెలా దృష్టిస్తాను?” అనే భాగంలో ఇవ్వబడిన ప్రశ్నాపత్రాలను ఉపయోగించి, మీరు ఏవి అంగీకరిస్తారో ఏవి అంగీకరించరో నిర్ణయించుకోండి. చివరగా, మీరు నిర్ణయించుకున్నవాటిని మీ అడ్వాన్స్ హెల్త్ కేర్ డైరెక్టివ్లో స్పష్టంగా తెలియజేయండి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన వారికి (మీ కాంటాక్టులకు), సాక్షులుకాని మీ కుటుంబ సభ్యులకు మీ నిర్ణయాల గురించి స్పష్టంగా తెలియజేయాలి.