బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి క్రమంగా వచ్చే ఒక కొత్త ఆర్టికల్
1. వచ్చే నెల నుండి కావలికోట సార్వజనిక పత్రికలో ఏ కొత్త ఆర్టికల్ ఉంటుంది, అదెలా రూపొందించబడింది?
1 బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టేందుకు మనకు సహాయం చేయడానికి, వచ్చే నెల నుండి కావలికోట సార్వజనిక పత్రికలో, “దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి” అనే అంశంతో ఒక కొత్త ఆర్టికల్ ఉంటుంది. క్షేత్రంలో కొంతమంది దీన్ని చదవడానికి ఇష్టపడినా, ఇది ముఖ్యంగా గృహస్థులతో చర్చించడానికే రూపొందించబడింది.
2. ఈ కొత్త ఆర్టికల్‌లో ఏమేమి ఉంటాయి?
2 అందులో ఏమేమి ఉంటాయి? గృహస్థులతో చర్చిస్తున్నప్పుడు వాళ్లను అడిగేందుకు వీలుగా దాని శీర్షిక, ఉపశీర్షికలు ప్రశ్నల రూపంలో ఉంటాయి. ముఖ్యమైన లేఖనాలు ఎత్తిరాసివుండవు, కానీ గృహస్థులు నేరుగా దేవుని వాక్యం నుండి నేర్చుకునేలా లేఖనాలు ఇవ్వబడ్డాయి. దీనిలో చిన్నచిన్న పేరాలు ఉంటాయి కాబట్టి గుమ్మం దగ్గరే నిలబడి పరిశీలించవచ్చు. ముగింపులో, బైబిలు బోధిస్తోంది పుస్తకం గురించి ప్రస్తావించబడింది. సముచితం అనిపించినప్పుడు ఆ పుస్తకం నుండి అధ్యయనం మొదలుపెట్టవచ్చు.
3. ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గరే బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కొత్త ఆర్టికల్‌ను ఎలా ఉపయోగించవచ్చు?
3 ఎలా ఉపయోగించాలి? ప్రతీ త్రైమాసిక సంచికలో ఈ కొత్త ఆర్టికల్స్ మూడు వస్తాయి. పత్రిక ఇస్తున్నప్పుడు, వాటిలోని ఒక ఆర్టికల్‌లో ఉన్న ఏదైనా ఆసక్తి రేకెత్తించే ప్రశ్న అడగవచ్చు. ఉదాహరణకు, జూలై - సెప్టెంబరు సంచికలో వచ్చిన కొత్త ఆర్టికల్స్‌లో మొదటి ఆర్టికల్, బైబిలుకున్న విలువ గురించి చర్చిస్తుంది. గృహస్థులతో మీరిలా అనవచ్చు: “బైబిలు దేవుని వాక్యమని అనుకుంటున్నారా, లేకపోతే అది ఒక మామూలు పుస్తకమని అనుకుంటున్నారా? [వాళ్లు చెప్పేది వినండి.] దీని గురించి ఆసక్తికరమైన ఒక విషయం చూపించాలనుకుంటున్నాను.” మొదటి ప్రశ్న చూపించి, మొదటి పేరా చదివి, అక్కడున్న లేఖనాన్ని బైబిల్లో నుండి చదవండి. ప్రశ్న మరోసారి చదివి, వాళ్ల అభిప్రాయాన్ని తెలుసుకోండి. అలా ఒక్కో ప్రశ్నను చర్చిస్తూ, ఎంత సమాచారం పరిశీలిస్తే బావుంటుందో అంత సమాచారం పరిశీలించండి. వెళ్లిపోయే ముందు, తర్వాతి ప్రశ్నను ప్రస్తావించి, తిరిగి వచ్చి దాని గురించి చర్చించేలా ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకోండి. మిగతా ప్రశ్నలను పరిశీలించడానికి ప్రతీవారం తిరిగి వెళ్లండి. ఒక ఆర్టికల్ పూర్తిచేశాక అవసరమనుకుంటే కొత్త ఆర్టికల్స్‌లో రెండవదాన్ని పరిశీలించవచ్చు. బైబిలు బోధిస్తోంది పుస్తకంతో బైబిలు అధ్యయనం ప్రారంభించేంత వరకు అలా చేస్తూ ఉండండి. మరో పద్ధతి ఏమిటంటే, ఆసక్తివున్న గృహస్థులకు నేరుగా బైబిలు అధ్యయనం గురించి చెప్పడమే. అధ్యయనం ఎలా చేస్తారో చూపించడానికి పత్రికలోని ఆ ఆర్టికల్స్‌లో ఒకదాన్ని ఉపయోగించండి.
4. పునర్దర్శనాల్లో ఈ ఆర్టికల్స్‌లోని అంశాలను ఎలా ఉపయోగించవచ్చు?
4 మీరు క్రమంగా పత్రికలు ఇస్తున్న వాళ్ల దగ్గర, వేరే పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు కూడా ఈ కొత్త ఆర్టికల్‌ను ఉపయోగించవచ్చు. మీరు మాములుగా ఇలా అనవచ్చు: “కావలికోటలో ఇప్పుడు క్రమంగా ఒక కొత్త ఆర్టికల్ వస్తుంది. దాని నుండి ఎలా అధ్యయనం చేయవచ్చో మీకు చూపిస్తాను.” ఈ కొత్త ఆర్టికల్, ‘సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం గలవారయ్యేలా’ చాలామందికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం.—1 తిమో. 2:4.