‘ఎదిరించువారికి ఏ విషయములోను బెదరకపోవడం’
1 పౌలు ఫిలిప్పీయులు 1:27, 28లోని ఈ మాటలను వ్రాస్తున్నప్పుడు ఫిలిప్పీలో తానెదుర్కొన్న వ్యతిరేకతను గుర్తుతెచ్చుకునివుంటాడు. (అపొ. 16:19-24) అయితే, ఆయన వ్యతిరేకులకు భయపడి సువార్తను ప్రకటించకుండా ఉండలేదు. ఆయన మాదిరి నేడు మనకు సహాయం చేయగలదు.
2 పరిచర్యలో ఒక గుంపు మనచుట్టూ గుమికూడితే మనమెలా ప్రతిస్పందించాలి? వ్యతిరేకులు మనలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళితే మనమేమి చేయాలి? అన్ని సందర్భాలూ ఒకేలా ఉండవు, అయినప్పటికీ మనకు సహాయపడే కొన్ని సూత్రాలను పరిశీలిద్దాం.
3 ఒక గుంపు మనలను చుట్టుముట్టినప్పుడు: సాధ్యమైనప్పుడల్లా, గుంపు ఏర్పడక ముందే ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోండి. (అపొ. 14:6) ఒకవేళ మిమ్మల్ని వెళ్ళనివ్వకపోతే మొబైల్ ఉపయోగించి పోలీసులకు ఫోన్ చేయండి. నెహెమ్యాలా యెహోవాకు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. (నెహె. 2:4) గుంపుతో లేదా గుంపు నాయకుడితో మాట్లాడి, దేవుని పట్ల వారికున్న గౌరవాన్ని పురికొల్పుతూ పరిస్థితిని నిమ్మళింపజేయడానికి ప్రయత్నించండి. పౌలు ఒక సందర్భంలో హింసాత్మక గుంపు తనను వ్యతిరేకించినప్పుడు అలాగే చేశాడు.—అపొ. 21:27 నుండి 22:30 వరకు.
4 ఎవరైనా మిమ్మల్ని భయపెడితే లేదా కొడితే మీరేమి చేయాలి? మిమ్మల్ని మీరు కాపాడుకోవడం సబబేనా? ఇది వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. “అరాచకత్వ లోకములో నేరమును ఎదుర్కొనుట” (కావలికోట, ఫిబ్రవరి 1, 1992 4-7 పేజీలు), “నేను స్వయం రక్షణ విద్యనభ్యసించాలా?” (తేజరిల్లు! అక్టోబరు 8, 1995 12-14 పేజీలు) వంటి ఆర్టికల్స్‌లో ఈ విషయంపై సహాయకరమైన సూత్రాలను మీరు కనుగొంటారు. ఈ ఆర్టికల్స్‌ను ముందే ఎందుకు పరిశీలించకూడదు?
5 పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళినప్పుడు: మీ నమ్మకాలను ఇతరులతో శాంతియుతంగా పంచుకోవడం, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కాదు. ఇది ప్రతీ ఒక్కరి చట్టబద్ధమైన హక్కు. మీరు చేసే పనిని గురించి ప్రశ్నిస్తే, ఆ విషయాన్ని మర్యాదపూర్వకంగా పోలీసులకు తెలియజేయండి. బైబిలు సందేశాన్ని తెలియజేయడానికి మనం జీతమేమీ తీసుకోవడంలేదని వివరించండి. అంతేగాక, మతమార్పిడి చేయడానికి మనం ఇతరులకు ఎలాంటి ప్రలోభాలను చూపించం.
6 పోలీసులు ఒకవేళ మిమ్మల్ని దూషిస్తే, ఆత్మరక్షణ కల్పించాల్సిన వారి బాధ్యతను నేర్పుగా వారికి గుర్తుచేయండి. అవసరమైతే, వారి పై అధికారులకు విన్నవించుకోండి. (రోమా. 13:3, 4; ప్రసం. 5:8) యెహోవా మీతో ఉన్నాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండండి.—లూకా 12:11, 12.
7 పోలీసులు మిమ్మల్ని దేనిమీదైనా సంతకం చేయమని అడిగితే, ముందు దాన్నంతా ఒకసారి జాగ్రత్తగా చదివి, దానిలోని వివరాలు సరైనవి అని నమ్మకం కుదిరాకే సంతకం చేయండి. ఇతరులతో మన నమ్మకాలను ఇకమీదట పంచుకోమని తెలియజేసే ఎలాంటి పత్రాల మీదనైనా సంతకం చేయకండి. మీపై కేసు పెడితే, ఏ తప్పును బట్టి మీపై కేసు పెట్టబడుతోందో, అది చట్టప్రకారం ఏ సెక్షను కిందకు వస్తుందో తెలుసుకోండి. వ్యతిరేకులు మీతో అమర్యాదగా ప్రవర్తిస్తే, వారిపై కేసు పెట్టే హక్కు మీకుందని నొక్కిచెప్పండి. మీకు గాయాలైతే, మిమ్మల్ని డాక్టరు దగ్గరకు లేదా హాస్పటల్‌కు తీసుకువెళ్ళమని పోలీసులను గట్టిగా అడగండి.
8 యెహోవాపై నమ్మకముంచండి: మనం అధికారుల ముందుకు తీసుకువెళ్ళబడతామని, స్థానిక కోర్టులకు అప్పగించబడతామని యేసు చెప్పాడని మర్చిపోకండి. (మత్త. 10:17, 18) మీకు వ్యతిరేకత ఎదురైతే భయపడకుండా, యెహోవా వింటాడనే నమ్మకంతో బలం కోసం ఆయనకు ప్రార్థించండి. అంతేకాదు, ‘సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకడానికి’ అధికారులు మనల్ని అనుమతించాలని ప్రార్థించండి. (1 తిమో. 2:1, 2) పరిచర్యలో మనం యెహోవా గురించి మాట్లాడడంలో కొనసాగుతుండగా, వ్యతిరేకత ఎదురైనప్పుడు ఆయన మనలను బలపరుస్తాడనే నమ్మకం కలిగి ఉండవచ్చు.