జిల్లా సమావేశాలు—సంతోషంగా ఆరాధించే సమయం
1 యోసేపు, మరియ, వాళ్ళ పిల్లలు, ఇంకా చాలామంది, వార్షిక పండుగలు చేసుకోవడానికి యెరూషలేముకు క్రమం తప్పకుండా వెళ్ళేవారు. అలా వెళ్ళినప్పుడు వారు, ఇతర ఆరాధకులు తమ దైనందిన చింతలను ప్రక్కనపెట్టి, ఎక్కువ ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి నిలిపేవారు. ఆ పండుగలు యెహోవా మంచితనం గురించి ధ్యానించడానికి, దానిగురించి ఇతరులతో మాట్లాడడానికి, ఆయన ధర్మశాస్త్రంలోని విషయాల గురించి ఆలోచించడానికి అవకాశాన్నిచ్చేవి. త్వరలో జరగబోయే జిల్లా సమావేశాలు కూడా సంతోషంగా యెహోవాను ఆరాధించేందుకు అలాంటి అవకాశాన్నే ఇస్తాయి.
2 సిద్ధపడడం అవసరం: నజరేతు నుండి వెళ్ళిరావడానికి యేసు కుటుంబం ఇంచుమించు 200 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. యేసుకు ఎంతమంది తోబుట్టువులు ఉండేవాళ్ళో మనకు తెలియదు కానీ యోసేపు, మరియలకు ఎంత ప్రణాళిక, కృషి అవసరమైందో మనం ఊహించవచ్చు. త్వరలో జరగబోయే జిల్లా సమావేశపు మూడు రోజులూ హాజరవడానికి మీరు అవసరమైన సిద్ధపాట్లు చేసుకున్నారా? అలా సిద్ధపడాలంటే మీరు మీ ఉద్యోగానికి సెలవుపెట్టడం, మీ యజమానితో మాట్లాడడం, మీ పిల్లలు వెళ్ళే స్కూలు టీచర్‌తో మాట్లాడడం అవసరం కావచ్చు. మీకు హోటల్ రూమ్ అవసరమా, అలాగైతే బుకింగ్ చేసుకున్నారా? సమావేశానికి హాజరవడం కోసం మీ సంఘంలో కొంతమందికి ప్రత్యేక సహాయం అవసరం కావచ్చు, వారికి సహాయం చేసేందుకు మీరు చొరవ తీసుకోగలరా?—1 యోహా. 3:17, 18.
3 ప్రోత్సాహకరమైన సహవాసం: తోటి ఆరాధకులతో ప్రోత్సాహకరమైన సహవాసాన్ని ఆనందించడానికి యూదుల పండుగలు ఎంత చక్కటి అవకాశాన్నిచ్చాయో కదా! పాత స్నేహితులను తిరిగి కలవడానికి యేసు కుటుంబం ఎంతో ఎదురుచూసి ఉంటారు. అంతేగాక, యెరూషలేముకు వెళ్తున్నప్పుడు లేదా అక్కడినుండి తిరిగి వస్తున్నప్పుడు యూదులు, యూదామత ప్రవిష్టులు ఉన్న సమూహంలో కొంతమందిని కొత్త స్నేహితులుగా చేసుకునేవారు.
4 నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు, జిల్లా సమావేశ ప్రసంగాలను ముద్రిత రూపంలో మనకు అందించకుండా మనల్ని ఒకచోటకు సమావేశపర్చి, ఒకరినొకరం ప్రోత్సహించుకుంటామనే ఉద్దేశంతోనే వాటిని ఏర్పాటు చేస్తున్నాడు. (హెబ్రీ. 10:24, 25) అందుకే ప్రతీరోజు సాధ్యమైనంత త్వరగా సమావేశ స్థలానికి వెళ్ళడానికి ప్రయత్నించి, సెషన్ చైర్మన్ సంగీతం ప్రారంభమవబోతోందని చెప్పడానికి ముందు వరకు సహవాసాన్ని ఆస్వాదించండి. మధ్యాహ్న భోజనం కోసం సమావేశ స్థలాన్ని విడిచి బయటకు వెళ్ళే బదులు అల్పాహారం తెచ్చుకొని అక్కడే తినేస్తే మిగిలిన సమయంలో మన చుట్టుప్రక్కల ఉన్నవారిని పరిచయం చేసుకొని, వారితో మాట్లాడవచ్చు. మన క్రైస్తవ సహోదరత్వం యెహోవా ఇచ్చిన బహుమానం, కాబట్టి దానిని నిర్లక్ష్యం చేయకుండా ఉందాం.—మీకా 2:12.
5 నేర్చుకోవాల్సిన సమయం: చిన్నప్పటినుండే యేసు, పండుగలకు వెళ్ళినప్పుడు తన పరలోక తండ్రి గురించి నేర్చుకోవడం ద్వారా వాటినుండి ప్రయోజనం పొందాడు. (లూకా 2:41-49) మనం, మన కుటుంబం సమావేశాల్లో ఇవ్వబడే ప్రసంగాల నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి ఏవి సహాయం చేస్తాయి? కార్యక్రమం జరుగుతున్నప్పుడు అటుఇటు తిరగకండి, ఇతరులతో అనవసరంగా మాట్లాడకండి. మీ సెల్‌ఫోన్, పేజర్, అలాంటి పరికరాలేవైనా మీకు, మీ చుట్టూ ఉన్నవారికి ఆటంకం కలిగించకుండా చూసుకోండి. ప్రసంగీకునిపై దృష్టినిలిపి, ఆయన చెప్పే అంశాలను క్లుప్తంగా రాసుకోండి. మీ పిల్లలు వింటున్నారో లేదో గమనించేందుకు వీలుగా కుటుంబమంతా కలిసి కూర్చోండి. సమావేశంలో మీకు నచ్చిన విషయాల గురించి అందరూ కలిసి చర్చించేందుకు ఆ సాయంత్రం కొంత సమయం కేటాయించండి.
6 దుస్తులు, కనబడే తీరు: పండుగలకు వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు యేసు కుటుంబాన్ని, ఇతర యూదా ఆరాధకులను అటుగా ప్రయాణిస్తున్న విదేశీ వర్తకులు చాలా సులభంగా గుర్తుపట్టగలిగేవారు ఎందుకంటే వారి బట్టల అంచులకు కుచ్చులు, వాటిమీద నీలి సూత్రం తగిలించి ఉండేవి. (సంఖ్యా. 15:37-41) క్రైస్తవులముగా నేడు అలాంటి ప్రత్యేకమైన దుస్తులు ధరించకపోయినా మర్యాదపూర్వకంగా, శుభ్రంగా ఉండే దుస్తులు వేసుకుంటారనే పేరు మనకుంది. సమావేశానికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, సమావేశం జరిగే నగరంలో ఉన్నప్పుడు మనం కనబడే తీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. సమావేశం అయిపోయిన తర్వాత వేసుకునే దుస్తులు కూడా మర్యాదపూర్వకంగా ఉండాలి, సమావేశ బ్యాడ్జి కార్డు పెట్టుకోవాలి. ఈ విధంగా మనం సాక్షులుకాని వారినుండి భిన్నంగా ఉండడమే కాక చూసేవారికి మనపై మంచి అభిప్రాయం కలుగుతుంది.
7 స్వచ్ఛంద సేవకులు అవసరం: సమావేశం సజావుగా జరగాలంటే చాలామంది స్వచ్ఛంద సేవకులు అవసరం. సహాయం చేయడానికి మీరు ముందుకు రాగలరా? (కీర్త. 110:3) సమావేశాల్లో జరిగే పని మన పవిత్ర సేవలో భాగమే కాక అది చక్కని సాక్ష్యాన్ని కూడా ఇస్తుంది. సమావేశ స్థలాన్ని శుభ్రం చేసిన స్వచ్ఛంద సేవకుల్ని చూసి ముగ్ధుడైన మేనేజరు ఇలా రాశాడు: “నేను ఇంతకు ముందెప్పుడూ చూడని ఫంక్షన్‌ను చూశాను, దానికి నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. యెహోవాసాక్షులు ప్రత్యేకమైన ప్రజలని, ఏదైనా స్థలాన్ని తీసుకుంటే దాన్ని మరింత శుభ్రం చేసి తిరిగి ఇస్తారనే మంచి పేరు వాళ్ళకు చాలా కాలంగా ఉందని నేను విన్నాను. మీరు, మీ సంస్థ ఈ స్థలాన్ని అత్యంత దయగల ప్రజల సహాయంతో ఎంతో చక్కగా రూపుదిద్దారు, అలాంటి వాళ్ళను కలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది.”
8 సాక్ష్యమిచ్చేందుకు అవకాశాలు: సమావేశం జరుగుతున్న నగరంలోని వాసులు, గౌరవప్రదమైన మన వస్త్రధారణను, కనబడే తీరును, మనం సమావేశ బ్యాడ్జిలను ధరించడాన్ని గమనించినప్పుడు అది వారిలో ఆసక్తి రేకెత్తించవచ్చు, దానివల్ల సమావేశం గురించి వాళ్ళతో మాట్లాడే అవకాశాలు మనకు దొరుకుతాయి. నాలుగు సంవత్సరాల ఒక అబ్బాయి సమావేశం తర్వాత ఆ రోజు విడుదల చేయబడిన ప్రచురణను రెస్టారెంటుకు తీసుకువెళ్ళి అక్కడున్న వెయిట్రస్‌కు చూపించాడు. దానివల్ల ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఆ స్త్రీని సమావేశానికి ఆహ్వానించగలిగారు.
9 మంచి ప్రవర్తన: జిల్లా సమావేశాల్లో మన మంచి పనులు అందరికీ కనిపిస్తాయి. (1 తిమో. 5:25) ఉత్తర భారతదేశంలో, చాలా సంవత్సరాల నుండి మన జిల్లా సమావేశాలు జరుగుతున్న ఒక నగరంలో, ఒక హోటల్ మేనేజరు ఇలా అన్నాడు: “మీ ప్రవర్తనను చూసి మేము చాలా సంతోషిస్తున్నాం, ఎందుకంటే మీరెవ్వరూ ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయరు, ఊరికే అటూ ఇటూ తిరగరు, పరిసరాలను మురికి చేయరు. కానీ వేరేవాళ్లతో మేము ఎప్పుడూ ఆ సమస్యనే ఎదుర్కొంటుంటాం.” మరో నగరంలోని ఒక హోటల్ మేనేజరు వేరేవాళ్లవల్ల, వినోదం అందించే కళాకారులవల్ల ఎదురైన సమస్యల గురించి చెప్పిన తర్వాత, మన సహోదర సహోదరీలు ఆ హోటల్‌లో ఉన్నంతకాలం చూపించిన సహకార స్ఫూర్తిని, ఓపికను మెచ్చుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “మా దగ్గరకొచ్చే వాళ్లంతా యెహోవాసాక్షుల్లా ఉండాలని కోరుకుంటున్నాము!” మన సహోదరుల మంచి ప్రవర్తనను చూసి ఆ ఇద్దరు మేనేజర్లు, మరితరులు చేసిన వ్యాఖ్యలు మన దేవుడైన యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తాయి.
10 యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకునే యూదులకు ప్రాచీన పండుగలు సంతోషకరమైన సందర్భాలుగా ఉండేవి, వాటి కోసం వారెంతగానో ఎదురుచూసేవారు. (ద్వితీ. 16:15) యేసు కుటుంబం, అలాంటి వాటికి హాజరై, పూర్తి ప్రయోజనం పొందేందుకు ఎలాంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉండేది. మన జిల్లా సమావేశాల పట్ల మనకు కూడా అలాంటి మెప్పుదలే ఉంది, ఆ సమావేశాలను మనం మన ప్రేమగల పరలోక తండ్రి నుండి వచ్చిన బహుమానంగా దృష్టిస్తాం. (యాకో. 1:17) యెహోవాను సంతోషంగా ఆరాధించేందుకు వచ్చిన ఈ వార్షిక అవకాశానికి సిద్ధపడేందుకు ఇదే సమయం!
[అధ్యయన ప్రశ్నలు]
1. ఇశ్రాయేలీయుల పండుగలు ఏ విధంగా మన ఆధునిక జిల్లా సమావేశాల్లా ఉన్నాయి?
2. త్వరలో జరగబోయే జిల్లా సమావేశం కోసం సిద్ధపడడానికి మనమేమి చేయాలి?
3. ప్రోత్సాహకరమైన సహవాసం కోసం ఇశ్రాయేలీయుల పండుగలు ఎలాంటి చక్కని అవకాశాలను ఇచ్చాయి?
4. ఐక్యపర్చబడిన క్రైస్తవ సహోదరత్వాన్ని నిర్లక్ష్యం చేయడం లేదని మనమెలా చూపిస్తాం?
5. కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి మనకు ఏవి సహాయం చేస్తాయి?
6. మన దుస్తులు, కనబడే తీరు విషయంలో మనమేమి గుర్తుపెట్టుకోవాలి?
7. సమావేశంలో స్వచ్ఛందంగా సేవచేయడం గురించి మనమెందుకు ఆలోచించాలి?
8. సమావేశ నగరంలో సాక్ష్యమిచ్చేందుకు ఎలాంటి అవకాశాలు దొరుకుతాయి?
9. మన సహోదరుల మంచి ప్రవర్తన గురించి ఇద్దరు హోటల్ మేనేజర్లు ఏమన్నారు?
10. యెహోవా చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లపట్ల యేసు కుటుంబం చూపించిన మెప్పుదలను మనమెలా అనుకరించవచ్చు?
[5, 6వ పేజీలోని బాక్సు]
జిల్లా సమావేశ జ్ఞాపికలు
▪ కార్యక్రమ వేళలు: మూడు రోజులూ కార్యక్రమం ఉదయం 9:20లకు ప్రారంభమౌతుంది. ఉదయం 8 గంటలకు తలుపులు తెరుస్తారు. కార్యక్రమం గౌరవప్రదంగా ప్రారంభమవ్వాలంటే, ప్రారంభ సంగీతం మొదలౌతుందనే ప్రకటన వినగానే మనమందరం సీట్లలో కూర్చోవాలి. శుక్ర, శనివారాలు కార్యక్రమం సాయంత్రం 4:55లకు ముగుస్తుంది, ఆదివారం సాయంత్రం 3:40లకు ముగుస్తుంది.
▪ పార్కింగ్: సమావేశ స్థలాల్లో పార్కింగ్ స్థలం అందరికీ ఉచితంగానే ఇవ్వబడుతుంది. స్థలం అందుబాటులో ఉన్నంతవరకు, హాజరైనవాళ్లంతా తమ వాహనాలను పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, సాధారణంగా పార్కింగ్ స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కార్లకు స్థలం ఉండకపోవచ్చు. అందుకే, కేవలం ఒకరిద్దరు ఒక కారులో రాకుండా, కొంతమంది కలిసి ఒకే కారులో రావడానికి ప్రయత్నించాలి.
▪ సీట్లు పెట్టుకోవడం: మీతోపాటు ఒకే వాహనంలో ప్రయాణించేవారికి లేదా మీతోపాటు మీ ఇంట్లో ఉంటున్నవారికి, అలాగే మీరు ప్రస్తుతం బైబిలు అధ్యయనం చేస్తున్న వారికి మాత్రమే సీట్లు పెట్టుకోవచ్చు.—1 కొరిం. 13:5.
▪ మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం విరామ సమయంలో తినడానికి సమావేశ స్థలాన్ని విడిచి వెళ్ళే బదులు దయచేసి మీ వెంట కుర్చీకింద పెట్టుకోగలిగే చిన్న సంచిలో అల్పాహారాన్ని తెచ్చుకోండి. సమావేశ స్థలంలోకి పెద్దపెద్ద భోజనపు క్యానులు, గాజు వస్తువులు, తీసుకురాకూడదు. సమావేశ కమిటీ అల్పాహార, భోజన ఏర్పాట్లు చేయదు.
▪ విరాళాలు: రాజ్య మందిరంలో లేదా సమావేశంలో, ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం ద్వారా సమావేశ ఏర్పాట్ల పట్ల మన కృతజ్ఞతను చూపించవచ్చు. సమావేశంలో చెక్‌రూపంలో విరాళం ఇవ్వాలనుకున్నవారు “The Watch Tower Bible and Tract Society of India” పేరుమీద ఇవ్వాలి.
▪ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు: సమావేశ స్థలంలో ఎవరికైనా అత్యవసరంగా వైద్య సహాయం అవసరమైతే దగ్గర్లో ఉన్న అటెండెంటును సంప్రదించండి, అర్హతగల ప్రథమ చికిత్సా సిబ్బంది పరిస్థితిని అంచనా వేసి సహాయపడేందుకు, వెంటనే ఆయన దానిని ప్రథమ చికిత్సా విభాగం దృష్టికి తీసుకువెళ్తాడు.
▪ చెప్పులు: చాలామందికి తాము వేసుకొనే చెప్పుల మూలంగా ప్రతీ సంవత్సరం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మెట్ల మీద, ర్యాంపు మీద లేదా ఎత్తుపల్లాలున్న నేల మీద నడవడానికి వీలుగా ఉండేలా సరిగ్గా సరిపోయే, సౌకర్యవంతమైన చెప్పులు వేసుకోవడం మంచిది.
▪ బధిరులు: ఈ కింది సమావేశాల్లో కార్యక్రమం సంజ్ఞా భాషలో అందజేయబడుతుంది: బెంగుళూరు (ఆంగ్లం); కోయంబత్తూర్ (తమిళం); కొచ్చి-2 (మలయాళం); పూనె-చిన్‌చ్వడ్ (ఆంగ్లం).
▪ రికార్డింగ్: సమావేశ స్థలానికి సంబంధించిన విద్యుత్తు కనెక్షన్‌కు లేక సౌండ్‌సిస్టమ్‌కు ఏ విధమైన రికార్డర్లనూ కనెక్ట్ చేయకూడదు, వాటిని ఇతరులకు ఆటంకం కలిగించకుండా ఉపయోగించుకోవచ్చు.
▪ బేబీ స్ట్రాలర్లు: వీటిని సమావేశ స్థలంలోకి తీసుకురాకూడదు. అయితే, తల్లిదండ్రులు తమ పక్క సీట్లలో చైల్డ్ సేఫ్టీ సీట్లను అమర్చుకోవచ్చు.
▪ సెంట్లు: కృత్రిమ వెంటిలేషన్ మాత్రమే ఉండే హాళ్లలో కొన్ని సమావేశాలు జరుగుతాయి. కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు లేక తత్సంబంధిత సమస్యలు ఉన్నవారిపై ప్రతిచర్య చూపే ఘాటైన సెంట్లను, అత్తర్లను పరిమితంగా వాడితే వారిపట్ల దయ చూపించినవారమవుతాం.—1 కొరిం. 10:24.
▪ ఫాలో అప్ ఫారమ్: సమావేశ సమయంలో మనం అనియత సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆసక్తి చూపించినవారి సమాచారం అందించడానికి ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారమ్‌ను ఉపయోగించాలి. ప్రచారకులు సమావేశానికి ఒకటి లేదా రెండు ఫాలో అప్ ఫారాలను తెచ్చుకోవాలి. పూర్తి చేయబడిన ఫారాలను పుస్తక విభాగానికి లేదా మీరు తిరిగి వెళ్ళిన తర్వాత మీ సంఘ కార్యదర్శికి ఇవ్వవచ్చు.—మన రాజ్య పరిచర్య నవంబరు 2009, 3వ పేజీ చూడండి.
▪ రెస్టారెంట్లు: రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్ళినప్పుడు మీ మంచి ప్రవర్తన ద్వారా యెహోవా నామాన్ని ఘనపర్చండి. చాలా ప్రాంతాల్లో, లభ్యమవుతున్న సేవలనుబట్టి టిప్స్ ఇవ్వడం పరిపాటి.
▪ హోటళ్ళు: (1) అవసరమయ్యే దానికన్నా ఎక్కువ రూములు రిజర్వు చేసుకోకండి, మీ రూములో అనుమతించిన వారికన్నా ఎక్కువమందిని ఉంచుకోకండి. (2) మీరు మీ రూమ్ రిజర్వేషన్‌ను రద్దు చేయాల్సివస్తే, దాని గురించి హోటల్ వారికి వెంటనే తెలియజేయండి. (3) మీరు మీ బ్యాగులన్నీ సర్దుకున్నాకే లగేజి కార్ట్ తెచ్చుకోండి, ఇతరులకు కూడా అది అవసరమవుతుంది కాబట్టి వెంటనే దానిని తిరిగి ఇచ్చేయండి. (4) వంట చేసేందుకు అనుమతిలేని రూములో వంట చేయకండి. (5) ప్రతీరోజు రూమ్‌బాయ్స్‌కు టిప్స్ ఇవ్వండి. (6) అతిథులు హోటళ్ళో ఉన్నప్పుడు వారికి అందించబడే అల్పాహారం, కాఫీ లేదా ఐస్‌లాంటి అదనపు ఏర్పాట్లను దుర్వినియోగం చేయకండి. (7) హోటల్ సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు అన్నిసమయాల్లో ఆత్మఫలాలను ప్రదర్శించండి. వాళ్ళు హోటల్‌కు వచ్చే చాలామందిని చూసుకోవాలి కాబట్టి వాళ్ళపట్ల మనం దయ, ఓర్పు, సహేతుకత చూపిస్తే వాళ్లెంతో సంతోషిస్తారు. (8) ట్యాక్స్ మినహాయించి రూమ్ అద్దె ఒక రోజుకు ఎంతవుతుందో సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితాలో ఇవ్వబడింది. మీరు కోరని లేదా ఉపయోగించని వాటి కోసం అదనంగా బిల్లు కట్టమని అడిగితే కట్టకండి, వీలైనంత త్వరగా రూమింగ్ విభాగానికి తెలియజేయండి. (9) మీ హోటల్ రూమ్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే, సమావేశం వద్ద ఉన్నప్పుడే రూమింగ్ విభాగానికి తెలియజేయండి.
▪ స్వచ్ఛంద సేవ: సమావేశ స్థలంలో, సమావేశానికి సంబంధించి ఏదైనా పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకువెళ్తే సమావేశానికి హాజరైనందుకు పొందిన ఆనందం రెట్టింపవుతుంది. (అపొ. 20:35) అలా సహాయం చేయాలనుకున్న వారెవరైనా సమావేశంలోని స్వచ్ఛంద సేవా విభాగం దగ్గరకు వెళ్ళి వారికి చెప్పాలి. 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు కూడా అలా సహాయం చేయాలనుకుంటే వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో గానీ లేదా వారి అనుమతి పొందిన ఇతర పెద్దవాళ్ళ పర్యవేక్షణలో గానీ చేయవచ్చు.