ఆధ్యాత్మిక విందు ఆరగించడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారా?
1. ఒక విందు ఏర్పాటు చేయాలంటే ఏమేమి పనులుంటాయి?
1 విందు ఏర్పాటు చేయాలంటే ఎన్నో పనులుంటాయి. కావల్సిన పదార్థాలు కొనుక్కురావాలి, రుచిగా వండాలి, చక్కగా వడ్డించాలి. అయితే ఎవరు వడ్డించాలి, ఎలా వడ్డించాలి అనేవి ముందే నిర్ణయించుకోవాలి. అంతేకాదు, విందు జరిగే స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. అక్కడికొచ్చే అతిథులు కూడా, ముఖ్యంగా దూరం నుండి వచ్చేవాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికోసం ఎన్నో పనులు చేయాల్సివున్నా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన, పుష్టికరమైన భోజనం తినడంలో ఉన్న ఆనందమే వేరు. భూవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు త్వరలోనే తామెంతో ఎదురుచూస్తున్న ‘మెలకువగా ఉండండి!’ అనే జిల్లా సమావేశానికి పెద్ద పెద్ద గుంపులుగా, చిన్న చిన్న గుంపులుగా సమావేశమవుతారు. కార్యక్రమాన్ని సిద్ధం చేయడానికి, దాని కోసం తగిన ఏర్పాట్లు చేయడానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో పనులు పూర్తయ్యాయి. మనందరం దానికి ఆహ్వానించబడుతున్నాము. దానికి హాజరవడానికి, దాని నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి మనం కూడా వ్యక్తిగతంగా సిద్ధపడాలి.—సామె. 21:5.
2. సమావేశానికి మూడు రోజులూ హాజరై ఆధ్యాత్మిక విందును ఆరగించాలంటే ఏమి చేయాలి?
2 పూర్తి ప్రయోజనం పొందండి: మూడు రోజులూ మొదటి నుండి చివరి వరకూ జరిగే కార్యక్రమాలన్నిటికి హాజరవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారా? అవసరమైతే, మొదటిరోజుతో సహా అన్ని కార్యక్రమాలకు హాజరుకావాలని అనుకుంటున్నారని మీ పై అధికారులకు తెలియజేయండి. ప్రయాణానికి, ఉండడానికి కావల్సిన ఏర్పాట్లు చేసుకోవడం పూర్తయిందా? వృద్ధులకు, ఒంట్లో బాగోలేని వాళ్ళకు, సహాయం అవసరమైన వాళ్ళకు, సమావేశానికి హాజరయ్యేందుకు కావల్సిన ఏర్పాట్లు చేయబడ్డాయో లేదో పెద్దలు కనుక్కోవాలి.—యిర్మీ. 23:4; గల. 6:10.
3. మనకు ఆహ్వానం అందకపోతే అంతర్జాతీయ సమావేశానికి ఎందుకు వెళ్ళకూడదు?
3 కొన్ని దేశాల్లో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతాయి. వీటికి కొన్ని సంఘాలతోపాటు, కొంతమంది విదేశీ ప్రతినిధులు ఆహ్వానించబడతారని గుర్తుంచుకోండి. బ్రాంచి కార్యాలయం ఈ సమావేశాల కోసం ఏర్పాట్లు చేస్తూ, అందుబాటులో ఉన్న సీట్లను, హోటల్ గదులను దృష్టిలో పెట్టుకుని వీటికి ఎంతమందిని ఆహ్వానించాలో జాగ్రత్తగా ఆలోచించి అంతమందినే ఆహ్వానించింది. ప్రచారకులు తమకు ఆహ్వానం అందకపోయినా అంతర్జాతీయ సమావేశానికి వెళ్తే స్థలం సరిపోకపోవచ్చు.
4. ప్రతీరోజు కార్యక్రమం ప్రారంభమవడానికి సిద్ధంగా ఉండేందుకు ఏ విషయాలు మనకు సహాయం చేస్తాయి?
4 సీట్లు వెతుక్కోవడానికి వీలుగా ప్రతీరోజు సమావేశ కార్యక్రమం ప్రారంభం కాకముందే సమావేశానికి రావడానికి ప్రయత్నించండి. కార్యక్రమం ప్రారంభమవడానికి కొంచెం ముందు ముద్రిత కార్యక్రమాన్ని కాస్సేపు చూడండి. అలా చేస్తే, ప్రసంగాల్లో ఉండే సమాచారాన్ని వినడానికి మీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటారు. (ఎజ్రా 7:10) కార్యక్రమ అధ్యక్షుడు సంగీతం ప్రారంభమవుతుందని చెప్పినప్పుడు సంగీతాన్ని విని ఆనందించండి. తర్వాత పాట, ప్రార్థన కోసం మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి.
5. కుటుంబాలు కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చు?
5 కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుంటే తమ పిల్లలు కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటున్నారో లేదో తల్లిదండ్రులు చూసుకోగలుగుతారు. (ద్వితీ. 31:12) ప్రసంగీకుడు లేఖనాలను చదువుతున్నప్పుడు అందరూ తమ బైబిళ్ళను తెరిచి చూడాలని ప్రోత్సహించబడుతున్నారు. క్లుప్తంగా నోట్సు రాసుకుంటే ప్రసంగాన్ని జాగ్రత్తగా వినగలుగుతారు. మీరు రాసుకున్న నోట్సు ఆ తర్వాత, ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. కార్యక్రమం జరుగుతున్నప్పుడు అనవసరంగా మధ్యలో మాట్లాడడం లేదా బయటకు వెళ్ళడం లాంటివి చేయకండి. మీకు సెల్ ఫోన్ ఉంటే కార్యక్రమం జరుగుతున్నప్పుడు దానివల్ల మీకు గానీ ఇతరులకు గానీ అంతరాయం కలుగకుండా చూసుకోండి. మూడురోజులూ ఉదయం, మధ్యాహ్నం కార్యక్రమం ముగిసిన తర్వాత కార్యక్రమంలో మీకు నచ్చిన విషయాల గురించి ఇతరులతో ఎందుకు చర్చించకూడదు?
6. సమావేశాల్లో మనకు ఏ మంచి అవకాశం ఉంటుంది, దాన్ని చేజార్చుకోకూడదంటే మనమేమి చేయాలి?
6 జిల్లా సమావేశాల్లో, లోక ప్రజల మధ్య లేని మంచి బంధాన్ని మన సహోదర సహోదరీలతో ఏర్పర్చుకునే అవకాశముంది. (కీర్త. 133:1-3; మార్కు 10:29, 30) మీ పక్కన కూర్చున్నవారికి మిమ్మల్ని పరిచయం చేసుకుని విరామ సమయంలో వారితో ఎందుకు మాట్లాడకూడదు? బయటికెళ్ళి హోటల్లో తినే బదులు ఇంటి దగ్గర నుండే అల్పాహారం తెచ్చుకోవడంవల్ల వచ్చే ప్రయోజనాల్లో ఇదొకటి. ఒకరినొకరు ప్రోత్సహించుకునే అలాంటి మంచి అవకాశాన్ని చేజార్చుకోకండి.—రోమా. 1:11, 12.
7. సమావేశానికి మనం వేసుకునే బట్టల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
7 దుస్తులు: బట్టల అంచులకు కుచ్చులు ఉండాలని, ఆ కుచ్చులకు పైగా నీలిసూత్రం కుట్టుకోవాలని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించడం గమనార్హం. (సంఖ్యా. 15:37-41) ఇది వాళ్ళు యెహోవా ఆరాధకులుగా ప్రత్యేకించబడ్డారు అనడానికి గుర్తుగా పనిచేసేది. నేడు మనం, సమావేశానికి గౌరవప్రదంగా, పద్ధతిగా బట్టలు వేసుకుని వెళితే లోకస్థులకు భిన్నంగా కనిపిస్తాము. సాయంకాలం కార్యక్రమం ముగిశాక తినడానికి బయటకు వెళ్ళినప్పుడు చూపరులకు అది శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. కాబట్టి ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఇప్పటి నుండే జాగ్రత్తగా ఆలోచించుకోండి.
8. సీట్లు పెట్టుకునే విషయంలో ఏ లేఖన సూత్రం మనల్ని నిర్దేశించాలి?
8 ప్రేమను చేతల్లో చూపించండి: కొందరు సహోదర సహోదరీలు సమావేశ హాలులో తమ స్నేహితుల కోసం, బంధువుల కోసం అవసరానికి మించి సీట్లు పెట్టుకుంటున్నట్లు గమనించడం జరిగింది. కొందరు కొన్నిసార్లు అటెండెంట్లతో సహకరించడానికి నిరాకరిస్తూ, క్రైస్తవులు మాట్లాడకూడని విధంగా మాట్లాడారు. “నేను ముందు” అనే వైఖరి మంచిది కాదు, అలాంటి వైఖరి యెహోవా దేవునికి ఘనతను తీసుకురాదు. కాబట్టి మనం ప్రేమ, దీర్ఘశాంతం చూపిద్దాం, అటెండెంట్లతో సహకరిద్దాం. (గల. 5:22, 23, 25) సీట్లు పెట్టుకోవడానికి సంబంధించి ఇవ్వబడిన నిర్దేశాలు మనకు గుర్తున్నాయా? మనం, “స్వప్రయోజనమును విచారించుకొనని” ప్రేమను చూపించాలి. (1 కొరిం. 13:5) నిస్వార్థమైన ప్రేమనుబట్టే తన శిష్యులుగా గుర్తింపు పొందుతారని యేసు వెల్లడిచేశాడు. (యోహా. 13:35) చాలా సీట్లు పెట్టుకుంటే, మనం క్రీస్తువంటి ప్రేమను చేతల్లో చూపించినట్లవుతుందా? “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అని క్రీస్తు చెప్పిన దాన్ని అనుసరించడానికి క్రైస్తవ ప్రేమ మనల్ని పురికొల్పాలి.—మత్త. 7:12.
9. సమావేశం జరుగుతున్న నగరంలో ఉన్నప్పుడు ఇతరులకెలా సాక్ష్యమివ్వవచ్చు?
9 సాక్ష్యమివ్వండి: కాస్త ముందాలోచన ఉంటే, సమావేశం జరుగుతున్న నగరంలో ఉన్నప్పుడు ప్రజలకు సాక్ష్యమివ్వగలుగుతాం. సమావేశం ముగిసిన తర్వాత తన భార్యతో కలిసి హోటల్‌కు వెళ్ళిన ఒక సహోదరుడు అక్కడున్న వెయిటర్‌కు తన సమావేశ బ్యాడ్జి చూపించి, “చాలామంది ఇలాంటి బ్యాడ్జీలనే పెట్టుకొని ఉండడం మీరు గమనించారా?” అని అడిగాడు. చాలామంది అలాంటి బ్యాడ్జీలే పెట్టుకోవడం గమనించాను కానీ అవి ఏమైవుంటాయా అనుకున్నానని ఆ వెయిటర్ చెప్పాడు. దానితో వాళ్ళమధ్య సంభాషణ మొదలైంది, సహోదరుడు అతనిని సమావేశానికి రమ్మని ఆహ్వానించాడు.
10. మన అతిథేయి అయిన యెహోవాపట్ల మనకున్న గౌరవాన్ని చూపించాలంటే మనమేమి చేయాలి?
10 ప్రసంగాలు ఇచ్చేది, ఇంటర్వ్యూలు, ప్రదర్శనలు చేసేది మన సహోదరులే అయినా సంవత్సరానికి ఒకసారి ఈ ఆధ్యాత్మిక విందును ప్రేమతో ఏర్పాటు చేస్తున్నది మన పరలోక తండ్రియైన యెహోవానే. (యెష. 65:13, 14) మనం మన అతిథేయిపట్ల మనకున్న గౌరవాన్ని చూపించాలంటే మనం సమావేశం జరిగే మూడు రోజులూ హాజరై, ప్రతీ ప్రసంగాన్ని శ్రద్ధగా వినాలి. అలా చేయడానికి మీరు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారా?
[4వ పేజీలోని క్యాప్షన్]
జిల్లా సమావేశ జ్ఞాపికలు
▪ కార్యక్రమ వేళలు: మూడు రోజులూ కార్యక్రమం ఉదయం 9:20లకు ప్రారంభమౌతుంది. ఉదయం 8 గంటలకు తలుపులు తెరుస్తారు. ప్రారంభ రాజ్య సంగీతం మొదలవగానే కార్యక్రమం గౌరవప్రదంగా ప్రారంభమవ్వాలంటే మనమందరం సీట్లలో కూర్చోవాలి. శుక్ర, శనివారాలు కార్యక్రమం సాయంత్రం 4:55లకు ముగుస్తుంది, ఆదివారం సాయంత్రం 4:00లకు ముగుస్తుంది.
▪ పార్కింగ్: పార్కింగ్‌ను నియంత్రించే అవకాశం మనకు దొరికిన అన్ని సమావేశ స్థలాల్లో పార్కింగ్ స్థలం అందరికీ ఉచితంగానే ఇవ్వబడుతుంది. సాధారణంగా పార్కింగ్ స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరిద్దరు మాత్రమే ఒక కారులో రాకుండా, కొంతమంది కలిసి ఒకే కారులో రావడానికి ప్రయత్నించాలి.
▪ సీట్లు పెట్టుకోవడం: మీతోపాటు ఒకే వాహనంలో ప్రయాణించేవారికి లేదా మీతోపాటు మీ ఇంట్లో ఉంటున్నవారికి మాత్రమే సీట్లు పెట్టుకోవచ్చు.
▪ మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం విరామ సమయంలో తినడానికి సమావేశ స్థలాన్ని విడిచి వెళ్ళే బదులు దయచేసి మీ వెంట అల్పాహారాన్ని తెచ్చుకోండి. సమావేశ స్థలంలోకి పెద్దపెద్ద క్యానులు, గాజు సామాను తీసుకురాకూడదు. సమావేశ కమిటీ అల్పాహార, భోజన ఏర్పాట్లు చేయదు.
▪ విరాళాలు: మన రాజ్య మందిరంలో లేదా సమావేశంలో, ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం ద్వారా మనం కృతజ్ఞతను చూపించవచ్చు. సమావేశంలో చెక్కు రూపంలో విరాళం ఇవ్వాలనుకున్నవారు “The Watch Tower Bible and Tract Society of India” పేరుమీద ఇవ్వాలి.
▪ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు: సమావేశ స్థలంలో ఎవరికైనా అత్యవసరంగా వైద్య సహాయం అవసరమైతే దగ్గర్లో ఉన్న అటెండెంటును సంప్రదించండి, అర్హత పొందిన ప్రథమ చికిత్సా సిబ్బంది, పరిస్థితి గంభీరతను అంచనా వేసి సహాయపడేందుకు, వెంటనే ఆయన దానిని ప్రథమ చికిత్సా విభాగం దృష్టికి తీసుకువస్తాడు.
▪ చెప్పులు: మెట్ల మీద, ర్యాంపు మీద లేదా ఎత్తుపల్లాలున్న నేల మీద నడవడానికి వీలుగా ఉండేలా సరిగ్గా సరిపోయే సౌకర్యవంతమైన చెప్పులు వేసుకోవడం మంచిది.
▪ బధిరులు: ఈ సమావేశాల్లో కార్యక్రమం సంజ్ఞా భాషలో అందజేయబడుతుంది: బెంగుళూరు-3 (ఆంగ్లం); కోయంబత్తూర్ (తమిళం); కొచ్చి (మలయాళం); పూనె-చిన్చ్వడ్ (ఆంగ్లం).
▪ రికార్డింగ్: సమావేశ స్థలానికి సంబంధించిన విద్యుత్తు కనెక్షన్‌కు లేక సౌండ్సిస్టమ్కు ఏ విధమైన రికార్డర్లనూ కనెక్ట్ చేయకూడదు, వాటిని ఇతరులకు ఆటంకం కలిగించకుండా ఉపయోగించాలి.
▪ బేబీ స్ట్రోలర్లు: వీటిని సమావేశ స్థలంలోకి తీసుకురాకూడదు. అయితే, తల్లిదండ్రులు తమ పక్క సీట్లలో చైల్డ్ సేఫ్టీ సీట్లను అమర్చుకోవచ్చు.
▪ సెంట్లు: కొన్ని సమావేశాలు కృత్రిమ వెంటిలేషన్ మాత్రమే ఉండే హాళ్లలో జరుగుతాయి. కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు లేక తత్సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలిగించే ఘాటైన సెంట్లను, అత్తర్లను పరిమితంగా వాడడం మంచిది.—1 కొరిం. 10:24.
▪ ఫాలో అప్ ఫారమ్: సమావేశ సమయంలో మనం అనియత సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆసక్తి చూపించినవారి సమాచారం అందించడానికి ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారమ్‌ను ఉపయోగించాలి. ప్రచారకులు సమావేశానికి ఒకటి లేదా రెండు ఫాలో అప్ ఫారాలను తెచ్చుకోవాలి. పూర్తి చేయబడిన ఫారాలను పుస్తక విభాగానికి లేదా మీరు తిరిగి వెళ్ళిన తర్వాత మీ సంఘ కార్యదర్శికి ఇవ్వవచ్చు.—మన రాజ్య పరిచర్య ఫిబ్రవరి 2005, 6వ పేజీ చూడండి.
▪ రెస్టారెంట్లు: రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మీ మంచి ప్రవర్తన ద్వారా యెహోవా నామాన్ని ఘనపర్చండి. చాలా ప్రాంతాల్లో, లభ్యమవుతున్న సేవలనుబట్టి టిప్స్ ఇవ్వడం పరిపాటి.
▪ హోటళ్ళు: (1) అవసరమయ్యే దానికన్నా ఎక్కువ రూములు రిజర్వు చేసుకోకండి, మీ రూములో అనుమతించిన వారికన్నా ఎక్కువమందిని ఉంచుకోకండి. (2) మీరు మీ రూమ్ రిజర్వేషన్‌ను రద్దు చేయాల్సివస్తే, దాని గురించి హోటల్ వారికి వెంటనే తెలియజేయండి. (3) మీరు మీ బ్యాగులన్నీ సర్దుకున్నాకే లగేజి కార్ట్ తెచ్చుకోండి, ఇతరులకు కూడా అది అవసరమవుతుంది కాబట్టి వెంటనే దానిని తిరిగి ఇచ్చేయండి. (4) వంట చేసేందుకు అనుమతిలేని రూములో వంట చేయకండి. (5) ప్రతీరోజు రూమ్‌బాయ్స్‌కు టిప్స్ ఇవ్వండి. (6) అతిథులు హోటళ్ళో ఉన్నప్పుడు వారికి అందించే అల్పాహారం, కాఫీ లేదా ఐస్‌లాంటి అదనపు ఏర్పాట్లను దుర్వినియోగం చేయకండి. (7) హోటల్ సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు అన్నిసమయాల్లో ఆత్మఫలాలను ప్రదర్శించండి. వాళ్ళు హోటల్‌కు వచ్చే చాలామందిని చూసుకోవాలి కాబట్టి వాళ్ళపట్ల మనం దయ, ఓర్పు, సహేతుకత చూపిస్తే వాళ్లెంతో సంతోషిస్తారు. (8) టాక్స్ మినహాయించి రూమ్ అద్దె ఒక రోజుకు ఎంతవుతుందో సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితాలో ఇవ్వబడింది. మీరు కోరని లేదా ఉపయోగించని వాటి కోసం అదనంగా బిల్లు కట్టమని అడిగితే కట్టకండి, వెంటనే రూమింగ్ విభాగానికి తెలియజేయండి. (9) మీ హోటల్ రూమ్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే, వెంటనే రూమింగ్ విభాగానికి తెలియజేయండి.