పరిచర్యలో నేను చేయగలిగినంత చేస్తున్నానా?
1. విశ్వసనీయులైన క్రైస్తవులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు?
1 మీకెప్పుడైనా అలా అనిపించిందా? వయసు పైబడడం వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, కుటుంబ బాధ్యతలు ఎక్కువవడం వల్ల పరిచర్యలో ఒకప్పుడు చేసినంతగా ఇప్పుడు చేయలేకపోవడం మూలంగా మీరు నిరాశపడుతుండవచ్చు. తన సమయాన్ని, శక్తిని ఇంటి పనుల కోసం వెచ్చించాల్సి రావడం వల్ల పరిచర్యలో తాను చేయగల్గింది చేయలేకపోతున్నందుకు కొన్నిసార్లు తప్పుచేస్తున్నాననే భావన కలుగుతుందని ముగ్గురు పిల్లలున్న ఒక సహోదరి రాసింది. అయితే, పరిస్థితుల విషయంలో సమతుల్యమైన ఆలోచనను ఎలా అలవర్చుకోవచ్చు?
2. యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడు?
2 యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడు: మనలో ఎవరమైనా పరిచర్యలో ఎక్కువగా పాల్గొనాలనే కోరుకుంటాం. కానీ మనం చేయాలని ఇష్టపడేదానికి, నిజంగా చేయగలిగేదానికి మధ్య తరచూ చాలా తేడా ఉంటుంది. మనం పరిచర్యలో ఎక్కువగా పాల్గొనాలని కోరుకుంటున్నామంటే ఇప్పుడు మనం చేస్తున్నదానితో సంతృప్తిగా లేమని దానర్థం. మన పరిస్థితి యెహోవాకు బాగా తెలుసని, మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువ మననుండి కోరడని మనం గుర్తుంచుకోవాలి. (కీర్త. 103:13, 14) అయితే ఆయన మననుండి ఏమి కోరుతున్నాడు? తనను మనస్ఫూర్తిగా సేవించాలని, మనం చేయగలిగినంత చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.—కొలొ. 3:23.
3. పరిచర్యలో మనం ఎంత చేయగలం అనేదాన్ని ఎలా పరిశీలించుకోవచ్చు?
3 మనం ఎంత చేయగలం అనేది మనకెలా తెలుస్తుంది? మన పరిస్థితుల దృష్ట్యా మనం ఎంత చేయగలం అనేది గ్రహించేలా మనకు సహాయం చేయమని మనం యెహోవాను అడగవచ్చు. (కీర్త. 26:2) మన గురించి బాగా తెలిసిన నమ్మకస్థుడైన, పరిణతి గల క్రైస్తవ స్నేహితుని సహాయం కూడా తీసుకోవచ్చు, సర్దుబాట్లు ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉందో, లేదో మనతో చెప్పడానికి అలాంటి స్నేహితుడు వెనకాడడు. (సామె. 27:9) మన పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వాటిని పరిశీలించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని కూడా గుర్తుంచుకోండి.—ఎఫె. 5:10.
4. పరిచర్య గురించి మనకు పదేపదే గుర్తుచేయబడినప్పుడు దానిని మనమెలా దృష్టించాలి?
4 పదేపదే గుర్తు చేయబడినప్పుడు ఎలా దృష్టించాలి? పరుగుపందెం జరుగుతున్నప్పుడు దాన్ని చూస్తున్నవారు, పరుగెత్తేవారికి ప్రేరణనివ్వడం కోసం కేకలు వేస్తూ ఉంటారు. ఆ పరుగెత్తేవాళ్ళు గమ్యస్థానాన్ని త్వరగా చేరడానికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అలా చేస్తారు గానీ వారిని నిరుత్సాహపర్చాలని కాదు. అలాగే బైబిలు ఆధారంగా ప్రోత్సాహం ఇవ్వబడినా, సంఘ కూటాల్లో, ప్రచురణల్లో ‘వాక్యాన్ని ప్రకటించండి’ అని పదేపదే గుర్తుచేయబడినా అది మన ప్రయోజనం కోసమే కానీ మనం పరిచర్యను తక్కువగా చేస్తున్నామని చెప్పేందుకు కాదు. (2 తిమో. 4:2) మనం చేయగలిగినంత సేవ చేసినంతకాలం, యెహోవా మన ‘ప్రేమను, కార్యాలను’ గుర్తుంచుకొని మనకు మద్దతు ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—హెబ్రీ. 6:10.