మనం అన్ని సమయాల్లో సాక్షులమే
1. యేసు బావి దగ్గర స్త్రీకి సాక్ష్యమిచ్చిన సంఘటన నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
1 యేసు అప్పటికే చాలాసేపటి నుండి నడిచినడిచి అలసిపోయాడు. ఆయనకు దాహంగా ఉంది. అప్పుడాయన ఓ సమరయ పట్టణం బయటున్న బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన శిష్యులు భోజనం తీసుకురావడానికి వెళ్లారు. ఆయన సమరయ పట్టణంలో ప్రకటించడానికి రాలేదు గానీ గలిలయలో పరిచర్య చేయడానికి ఆ ఊరి మీదుగా వెళ్తున్నాడు. అయినా అక్కడికి నీళ్ల కోసం వచ్చిన స్త్రీకి ప్రకటించే అవకాశాన్ని వదులుకోలేదు. (యోహా. 4:5-14) ఎందుకు? యేసు ఎల్లప్పుడూ యెహోవాకు “నమ్మకమైన సత్యసాక్షి”గానే ఉన్నాడు. (ప్రక. 3:14) మనం యేసులా ఉండాలంటే అన్ని సమయాల్లో యెహోవాకు సాక్షులుగా ఉండాలి.—1 పేతు. 2:21.
2. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సాక్ష్యం ఇవ్వడానికి మనం ఎలా సిద్ధంగా ఉండవచ్చు?
2 సిద్ధంగా ఉండండి: మన దగ్గర ప్రచురణలు ఉంచుకుంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సాక్ష్యం ఇవ్వగలుగుతాం. చాలామంది ప్రచారకులు కరపత్రాలను, పరిస్థితికి తగిన పత్రికలను దగ్గరుంచుకుని దుకాణాల్లో, పెట్రోలు బంకుల్లో పనిచేస్తున్నవారికి లేదా వేర్వేరు చోట్ల కలిసే ఇతరులకు ఇస్తారు. (ప్రసం. 11:6) అయితే మనది సమస్యాత్మకమైన ప్రాంతమైతే మనం జాగ్రత్తగా ఉంటూ నిజంగా ఆసక్తి ఉన్నవారికే ప్రచురణలు చూపించాలి.
3. మనం మాట్లాడడం ఎలా మొదలుపెట్టవచ్చు?
3 మాట కలపండి: అనియత సాక్ష్యం ఇస్తున్నప్పుడు మొదట్లోనే బైబిలు గురించి, దేవుని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. యేసు బావి దగ్గర ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన తానే మెస్సీయనని పరిచయం చేసుకుంటూ మొదలుపెట్టలేదు. ఆయన త్రాగడానికి నీళ్లడిగాడు. యేసు యూదుడైవుండి తనను నీళ్లిమ్మని అడగడంతో ఆమెకు కుతూహలం కలిగింది. (యోహా. 4:7-9) ఒక సహోదరి అలాగే చేస్తుంది, పండుగ ఎలా జరుపుకున్నారని ఎవరైనా అడిగినప్పుడు ఆమె వారితో మాటలు మొదలుపెడుతుంది. ఆమె తాను యెహోవాసాక్షిని కాబట్టి పండుగ జరుపుకోలేదని చెప్పకుండా, “నేను పండుగ జరుపుకోకూడదనుకున్నాను” కాబట్టి పండుగ జరుపుకోలేదని చెప్తుంది. సాధారణంగా అవతలి వాళ్లు కారణం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు, అప్పుడు మన సహోదరి వారికి సాక్ష్యం ఇస్తుంది.
4. మత్తయి 28:18-20 ప్రోత్సాహానిచ్చే ఏ విషయాన్ని చెబుతోంది?
4 యేసు భూమ్మిద తను ఆసక్తితో, ఉత్సాహంగా చేసిన పరిచర్యను ముగించినా, ఆయనలాగే మనం ఇప్పుడు చేస్తున్న ప్రకటనా పనిని అంతే ఆసక్తితో గమనిస్తున్నాడు. (మత్త. 28:18-20) కాబట్టి మనకు మాదిరి ఉంచిన యేసులా మనం కూడా అన్ని సమయాల్లో మన విశ్వాసం గురించి నలుగురికీ సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం.—హెబ్రీ. 10:23.