‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
1. ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ పుస్తకం ఎందుకోసం తయారుచేశారు?
1 జనవరి 4తో మొదలయ్యే వారం ఎప్పుడొస్తుందా, ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే కొత్త పుస్తకంతో చేసే సంఘ బైబిలు అధ్యయనం ఎప్పుడెప్పుడు మొదలౌతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. యెహోవాను ప్రేమిస్తున్నవారందరికి పరిపాలక సభ రాసిన ఉత్తరం ముగింపు మాటలు ఇలా ఉన్నాయి: “మీరు ప్రతీరోజు సత్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, ‘నిత్యజీవార్థమైన దేవుని ప్రేమలో నిలిచి ఉండేందుకు’ ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.”—యూదా 20, 21.
2. ఈ కొత్త పుస్తకం ఏయే విషయాల గురించి మనకు వివరిస్తుంది?
2 అధ్యయనం ఎలా ఉంటుంది: బైబిలు సూత్రాల ప్రకారం మన అలవాట్లు, ఆచారాలు, కుటుంబం, మాటతీరు, వినోదం, స్నేహితులు ఎలా ఉండాలి, అధికారాన్ని గౌరవించే విషయంలో మనం ఎలా ఉండాలి వంటి విషయాలు తెలుసుకుంటాం. మన మనస్సాక్షి దేవుని వాక్యంలోని ఉన్నతమైన నీతి ప్రమాణాలకు తగ్గట్టు మలచబడుతుంది. (కీర్త. 19:7, 8) యెహోవా దేవుని ఆలోచనా తీరు గురించి ఎంతగా తెలుసుకుంటే, ఆయనకు నచ్చేటట్లు నడుచుకోవాలనే కోరిక అంతగా పెరుగుతుంది. అప్పుడు ప్రతీ విషయంలో ఆయనకు విధేయత చూపిస్తాం.—సామె. 27:11; 1 యోహా. 5:3.
3. ప్రతీ వారం బైబిలు అధ్యయనంలో వ్యాఖ్యానించడానికి మనమెందుకు సిద్ధపడాలి?
3 అధ్యయనంలో పాల్గొనాలని నిశ్చయించుకోండి: మీరు సిద్ధపడుతున్నప్పుడే సంఘంలో దేవుణ్ణి స్తుతించాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. (హెబ్రీ. 13:15) సంఘమంతా కలిసి ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తుంది. వారంవారం కొన్ని పేరాలనే పరిశీలిస్తాం కాబట్టి జాగ్రత్తగా సిద్ధపడవచ్చు, నేర్చుకున్న దాన్ని బెరుకులేకుండా చెప్పవచ్చు. చక్కగా సిద్ధపడి, విషయాన్ని సూటిగా, క్లుప్తంగా చెప్పినప్పుడు, ఇతరులలో ప్రేమ, సత్క్రియలు చేయాలనే కోరిక కలుగుతుంది, అధ్యయనం ఉల్లాసంగా, ఉపయోగకరంగా ఉంటుంది. (హెబ్రీ. 10:24, 25) అంతేకాకుండా మన విశ్వాసం గురించి బయటకు చెప్పినప్పుడు మన ఆనందం రెట్టింపు అవుతుంది.
4. యెహోవా ఆజ్ఞలను ఎందుకు తప్పనిసరిగా పాటించాలి?
4 యేసు చనిపోవడానికి ముందు రాత్రి, యెహోవా ప్రేమలో నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలని చెప్పాడు. (యోహా. 15:10) “దేవుని ప్రేమ” పుస్తకం, ప్రతీ విషయంలో బైబిలు సూత్రాలు పాటిస్తూ ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి’ అనే కోరికను పెంచుతుంది.—యూదా 20, 21.