‘ప్రతీ సత్కార్యానికి సిద్ధంగా ఉండండి’
1 యేసు తన శిష్యులకు రాజ్య ప్రకటనా పనిని మొదటిసారిగా పరిచయం చేస్తున్నప్పుడు, వారికి శిక్షణనివ్వడానికి సమయాన్ని కేటాయించాడు. (మత్త. 10:5-14) కాబట్టి, మనందరికీ ఎన్ని పనులున్నా, ఇంటింటి పరిచర్యకు వెళ్లే ముందు సిద్ధపడడానికి కనీసం కొన్ని నిమిషాలు వెచ్చిస్తే మంచి ఫలితాలు సాధిస్తాం.—2 కొరిం. 9:6.
2 ఎలా సిద్ధపడాలి? చక్కని సిద్ధపాటులో భాగంగా మనం ఇవ్వాలనుకున్న ప్రచురణలతో సుపరిచితులమవ్వాలి. మన క్షేత్రంలోవున్న ప్రజల గురించి కూడా ఆలోచించాలి. వారు వేటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? మన క్షేత్రంలో, ప్రాముఖ్యంగా ఏ మతానికి చెందిన ప్రజలను మనం కలుసుకునే అవకాశముంది? మన రాజ్య పరిచర్యలోనూ అలాగే బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలోనూ ఇవ్వబడిన నమూనా అందింపులను కూడా మనం చూడవచ్చు.
3 సేవా కూటంలో ప్రదర్శనలు నిర్వహించబడుతున్నప్పుడు అవధానం నిలపడం ద్వారా కూడా మనం ప్రయోజనం పొందుతాం. పరిచర్యలో చక్కగా మాట్లాడడంలో మనం అనుభవం సంపాదించేకొద్దీ సిద్ధపడడానికి ఎక్కువ సమయం తీసుకోము. పరిచర్యకు వెళ్లే ప్రతీసారి మనం మాట్లాడే విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, దానిని సరిచేసుకుంటే మనం మరింత సమర్థవంతంగా మాట్లాడగలుగుతాం. పరిచర్యకు తీసుకువెళ్ళే బ్యాగులో మనకు అవసరమైన ప్రచురణలన్నీ పెట్టుకున్నామో లేదో ఒకసారి చూసుకోవాలి.
4 మనం చెప్పాలనుకుంటున్నది ఎలా గుర్తుంచుకోవచ్చు? బిగ్గరగా అభ్యాసం చేయడం ద్వారా గుర్తుంచుకోవచ్చు. కొందరు తాము చెప్పాలనుకుంటున్న దానిని, కుటుంబ అధ్యయన సమయాల్లో అభ్యాసం చేస్తారు. మరికొందరు దానిని చిన్న పేపరు మీద క్లుప్తంగా రాసుకొని గృహస్థుణ్ణి కలుసుకునే ముందు ఒకసారి చూసుకోవడం సహాయకరంగా ఉన్నట్లు తెలుసుకున్నారు.
5 ప్రయోజనాలు: పరిచర్యకు బాగా సిద్ధపడడం ద్వారా మనం సమర్థవంతంగా మాట్లాడగలగడమే కాక మన ఆనందం కూడా రెట్టింపవుతుంది. మనం ఎలాంటి భయం లేకుండా గృహస్థునితో చక్కగా మాట్లాడగలుగుతాం. మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు లేదా నిందించినప్పుడు ఎంపిక చేసుకున్న చక్కని పదాలతో మనం కృపాసహితంగా సమాధానం ఇవ్వగలుగుతాం. మనం చెప్పబోయేదాని గురించే ఎక్కువగా ఆలోచించే బదులు, గృహస్థుడు చెబుతున్నదానిపై అధికశ్రద్ధ నిలపగలుగుతాం. అంతేకాక, ఏ ప్రచురణలో ఏమేమి విషయాలు ఉన్నాయో తెలుసుకొని ఉంటే వాటిని ఉత్సాహంగా అందించగలుగుతాం.
6 ‘ప్రతీ సత్కార్యానికి’ సిద్ధంగా ఉండాలని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. (తీతు 3:1) సువార్తను ప్రకటించడంకన్నా శ్రేష్ఠమైన పని మరింకేముంది? మనం చక్కగా సిద్ధపడడం ద్వారా వినడానికి సుముఖత చూపించే గృహస్థులపట్ల, మనం ప్రాతినిథ్యం వహిస్తున్న యెహోవాపట్ల గౌరవాన్ని చూపించినవారమౌతాం.—యెష. 43:10.