‘మీమీద నా కాడిని ఎత్తికొనుడి’
1 ఒత్తిళ్లతో, ఇబ్బందులతో నిండివున్న ఈ లోకంలో, తన కాడి క్రింద విశ్రాంతి తీసుకోమన్న యేసు ఆహ్వానాన్ని స్వీకరించడం ద్వారా మనం నిజమైన ఉత్తేజాన్ని పొందాం. (మత్త. 11:29, 30) శిష్యులుగా ఉండడమనే కాడిని ఎత్తుకోవడం కష్టంతో కూడినదే అయినా అది ఉత్తేజాన్నిస్తుంది. ఆ కాడిని ఎత్తుకోవడమంటే, మనలాగే ఇతరులు కూడా యేసు సులువైన కాడి క్రింద ఉత్తేజాన్ని పొందేలా వారికి సహాయం చేయడానికి రాజ్య సువార్తను ప్రకటించడమని అర్థం.—మత్త. 24:14; 28:19, 20.
2 పరిచర్య చేయడం ద్వారా ఉత్తేజాన్ని పొందడం: యేసు తన అనుచరులతో, వారు మోస్తున్న భారంతో పాటు తన భారాన్ని కూడా మోయమని చెప్పలేదు. బదులుగా, వారి బరువైన భారాన్ని తన మీద వేసి తేలికైన తన భారాన్ని మోయమని ఆయన వారిని ప్రోత్సహించాడు. ప్రస్తుత విధానంలోవున్న నిరాశానిస్పృహల మూలంగా, ఐహికవిచారాల మూలంగా ఇక కృంగిపోము; అస్థిరమైన ధనం సంపాదించుకోవడం కోసం తాపత్రయపడం. (లూకా 21:34; 1 తిమో. 6:17) మనం నిత్యావసరాలను తీర్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సివచ్చినా, దేవుని ఆరాధనకే మన జీవితాల్లో ప్రథమ స్థానమిస్తాం. (మత్త. 6:33) ప్రాముఖ్యమైన విషయాలపట్ల సరైన దృక్కోణముంటే మన పరిచర్యను భారంగా ఎంచంగానీ ఎల్లప్పుడూ ఉత్తేజాన్నిచ్చేదిగా దృష్టిస్తాం.—ఫిలి. 1:9, 10.
3 సాధారణంగా మన హృదయానికి సంతోషాన్నిచ్చే విషయాల గురించే ఎక్కువగా మాట్లాడతాం. (లూకా 6:45) అయితే క్రైస్తవులందరూ, యెహోవా గురించి, ఆయన వాగ్దానం చేసిన రాజ్యాశీర్వాదాల గురించి మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కాబట్టి పరిచర్యలో ఉన్నప్పుడు దైనందిన విషయాల గురించి చింతించకుండా, “ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త” ప్రకటించడం మనకెంతో ఉత్తేజాన్నిస్తుంది! (రోమా. 10:15) మనం ఒక పనిని ఎంత ఎక్కువ చేస్తే అంతెక్కువ సమర్థులమౌతాం, అంతే ఆనందాన్ని కూడా పొందుతాం. కాబట్టి, మనకు సాధ్యమైతే, పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడపడంవల్ల అధిక ఉత్తేజాన్ని పొందుతాం. మన ప్రకటనా పనికి ప్రజలు స్పందించినప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది. (అపొ. 15:3) పరిచర్యలో మనం చేస్తున్న ప్రయత్నాలను బట్టి యెహోవా సంతోషిస్తాడనీ, ఆయన ఆశీర్వాదంవల్లే మనం ఎలాంటి అనుకూల ఫలితాలనైనా సాధిస్తామనీ మనసులో ఉంచుకుంటే మనకు ఉదాసీనత, వ్యతిరేకత ఎదురైనా పరిచర్యలో మనం ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని పొందగలం.—అపొ. 5:41; 1 కొరిం. 3:9.
4 యేసు ఆహ్వానాన్ని అంగీకరించడం ద్వారా ఆయనతోపాటు యెహోవాకు సాక్షులముగా సేవ చేసే ఆధిక్యత మనకు లభించింది. (యెష. 43:10; ప్రక. 1:5) దానికన్నా ఉత్తేజాన్నిచ్చేది మరేదీ లేదు!