పత్రికలు అందించడానికి ఎలా సిద్ధపడాలి?
1. మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన అందింపును కంఠస్థం చేసే బదులు, పత్రికా అందింపుకు వ్యక్తిగతంగా సిద్ధపడడం ఎందుకు మంచిది?
1 ‘మన రాజ్య పరిచర్యలోని ప్రతీ సంచికలో పత్రికల ప్రతిపాదనలు ఉంటాయి కదా, మళ్ళీ ప్రత్యేకంగా మనం పత్రికలు అందించడానికి ఎందుకు సిద్ధపడాలి?’ అని మీరు ఆలోచించవచ్చు. ఈ మాదిరి అందింపులు సహాయకరంగా ఉన్నట్లు చాలామంది కనుగొన్నా, వ్యక్తిగతంగా సిద్ధపడడం కూడా అవసరం. ఒక ప్రాంతంలో ఫలవంతంగావున్న అందింపు, మరో ప్రాంతంలో ఆచరణయోగ్యంగా ఉండకపోవచ్చు. కాబట్టి, పత్రికలను అందించేటప్పుడు మన రాజ్య పరిచర్యలోని మాదిరి అందింపుల్లో ఉన్నది ఉన్నట్టుగా అందించాలని అనుకోకూడదు. ఒకవేళ మనం మాదిరి అందింపును ఉపయోగించేందుకు నిర్ణయించుకున్నా, మన భావాలను సొంత మాటల్లో వ్యక్తం చేయడం మంచిది.
2. ఏ ఆర్టికల్‌ని చూపించాలో నిర్ణయించుకోవడంలో ఏమి ఇమిడివుంది?
2 ఒక ఆర్టికల్‌ను ఎంచుకోండి: మీరు పత్రికను చదివిన తర్వాత మీకు ప్రత్యేకంగా నచ్చిన, మీ ప్రాంతానికి తగిన ఒక ఆర్టికల్‌ని ఎంచుకోండి. ఆ ఆర్టికల్‌ని చూపించేటప్పుడు మీలో కనబడే ఒప్పుదల, మీ ఉత్సాహం చూసి గృహస్థుడు కూడా దానిని చదివేందుకు పురికొల్పబడవచ్చు. స్థానిక క్షేత్రంలో చాలమందిని ఆకట్టుకోగలిగే ఆర్టికల్‌నే మీరు బహుశా ఉపయోగించినా, ఆ పత్రికలోని ఇతర ఆర్టికల్స్‌తో కూడా బాగా పరిచయం కలిగివుండండి. ఇలా చేయడం పత్రికలోని వేరే విషయంమీద ఎక్కువ ఆసక్తిగలవారు తారసపడినప్పుడు వారికి తగ్గట్టుగా మీ అందింపును మలచుకోవడానికి సహాయం చేస్తుంది.
3. సత్ఫలితాల కోసం మీరెలాంటి ఉపోద్ఘాతాన్ని ఉపయోగిస్తారు?
3 ప్రశ్నను అడగండి: తర్వాత, మీ ప్రారంభపు మాటలను జాగ్రత్తగా సిద్ధపడండి. మీ ఉపోద్ఘాతం చాలా ప్రాముఖ్యం. మీరు చూపించేందుకు నిర్ణయించుకున్న ఆర్టికల్‌లో గృహస్థునికి ఆసక్తి కలిగించేలా ఆలోచనను రేకెత్తించే ప్రశ్నను అడగడం సహాయకరంగా ఉంటుంది. దృక్పథాలను రాబట్టే ప్రశ్నలు సాధారణంగా చాలా సమర్థంగా పనిచేస్తాయి. గృహస్థుణ్ణి అసౌకర్యానికి గురిచేసే లేదా వాదనకు దిగేలాచేసే ప్రశ్నలు అడగకండి.
4. పరిస్థితులు అనుమతించినప్పుడు గృహస్థునికి ఒక లేఖనం చదివి వినిపించడంలో ఎలాంటి ప్రయోజనాలున్నాయి?
4 ఒక లేఖనాన్ని చదవండి: చివరిగా, ఒకవేళ గృహస్థుని పరిస్థితులు అనుమతిస్తే మీరు చూపించే ఆర్టికల్‌లో ఇవ్వబడిన ఒక లేఖనాన్ని చదివేందుకు ఎంపిక చేసుకోండి. ఆ విధంగా లేఖనాన్ని చదవడం మనం చెప్పే సందేశం దేవుని వాక్యంలోనిదనే విషయాన్ని గ్రహించడానికి గృహస్థుడికి సహాయం చేస్తుంది. (1 థెస్స. 2:13) ఒకవేళ గృహస్థుడు మన పత్రికలను తిరస్కరించినా, ఆ లేఖనం ఆయనకు సాక్ష్యాన్ని కూడా ఇస్తుంది. కొందరు ఒక ప్రత్యేక ప్రశ్నను అడిగే ముందు ఒక లేఖనాన్ని చదవడం ద్వారా గృహస్థుని ఆసక్తిని రేకెత్తించారు. “ఈ బైబిలు వచనంలో చెప్పబడిన విషయంపై మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను” అని అడుగుతూ మీరు లేఖనాన్ని పరిచయం చేయవచ్చు. ఆ తర్వాత మీరు పత్రికలో దానికి సంబంధించిన అంశంవైపు గృహస్థుని అవధానాన్ని మళ్ళించి, దాన్ని అందించడానికి ముందు అతని ఆసక్తిని పెంచడానికి ఆ అంశంపై క్లుప్తంగా మాట్లాడండి.
5. పత్రిక అందింపుకు సిద్ధపడేటప్పుడు మీరు ఎలాంటి ప్రాథమిక నిర్దేశాలను గుర్తుపెట్టుకోవాలి?
5 పత్రికలను ప్రతిపాదించేటప్పుడు నిర్దిష్టమైన మాటలనే ఉపయోగించాలనే ఖచ్చితమైన నియమేమీ లేదు. సాధారణంగా, మీ అందింపు సరళంగా, క్లుప్తంగా ఉండడం మంచిది. మీరు ఇబ్బంది పడకుండా, సత్ఫలితాలు సాధించే అందింపును ఉపయోగించండి. పత్రికలకున్న అమిత విలువమీద దృష్టి నిలపండి, ఉత్సాహంగా ఉండండి. మీరు చక్కగా సిద్ధపడితే, ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగల వారందరికీ’ కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందించడంలో మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు.—అపొ. 13:48, NW.