మీరు దాన్ని వాయిదా వేస్తున్నారా?
దేన్ని? బాప్తిస్మం తీసుకున్న సాక్షులకు ఇవ్వబడే డిపిఎ (డ్యూరబుల్ పవర్ ఆఫ్ అటార్నీ) కార్డును పూరించడాన్ని. “రేపేమి సంభవించునో మీకు తెలియదు” కాబట్టి అత్యవసర వైద్య చికిత్స చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే మీరు ఏ వైద్య చికిత్సను, విధానాలను అంగీకరిస్తారు అనే విషయాన్ని ముందుగానే నిర్ణయించుకొని దానిని వ్రాతపూర్వకంగా సూచించడం ప్రాముఖ్యం. (యాకో. 4:14; అపొ. 15:28, 29) మీకు సహాయం చేయడానికి మార్పిడి—ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ—రోగి అవసరాలు, హక్కులు తీర్చడం (ఆంగ్లం) అనే వీడియో రూపొందించబడింది. ఆ వీడియో చూసి, క్రింద ఇవ్వబడిన ప్రశ్నల సహాయంతో మీరేమి నేర్చుకున్నారో ప్రార్థనాపూర్వకంగా పునఃసమీక్షించుకోండి.—గమనిక: ఆ వీడియోలో శస్త్రచికిత్సకు సంబంధించిన క్లుప్త దృశ్యాలు ఉన్నాయి కాబట్టి తమ చిన్నపిల్లలతోపాటు ఆ వీడియో చూసే విషయంలో తల్లిదండ్రులు వివేచన ఉపయోగించాలి.
(1) రక్తమార్పిడుల గురించి వైద్య సమాజంలోని కొందరెందుకు పునరాలోచిస్తున్నారు? (2) రక్తమార్పిడి లేకుండా చేయగల సంశ్లిష్ట శస్త్రచికిత్సలకు సంబంధించిన మూడు ఉదాహరణలు చెప్పండి. (3) ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు రక్తమార్పిడి లేకుండానే రోగులకు వైద్యం చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు? అలాచేయడానికి వారెందుకు సుముఖంగా ఉన్నారు? (4) రక్తాన్ని ఉపయోగించే విషయం గురించి ఇటీవల ఆస్పత్రి అధ్యయనాలు ఏమి వెల్లడించాయి? (5) రక్తమార్పిడులతో ఎలాంటి వైద్య ప్రమాదాలు ముడిపడి ఉన్నాయి? (6) మార్పిడి ప్రత్యామ్నాయాల ప్రయోజనాల గురించి అనేకమంది నిపుణులు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? (7) రక్తహీనత కలగడానికి కారణమేమిటి? మానవులు ఏ స్థాయివరకు రక్తహీనతను తట్టుకోగలరు? ఆ లోటును పూరించడానికి ఏమి చేయవచ్చు? (8) రోగి శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ఎలా అధికం చేయవచ్చు? (9) శస్త్రచికిత్స చేసే సమయంలో రక్తం నష్టపోవడాన్ని తగ్గించేందుకు ఎలాంటి సాంకేతిక పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి? (10) మార్పిడి ప్రత్యామ్నాయాలు చిన్నపిల్లలకు లేదా ప్రాణాపాయాన్ని కలిగించే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సమర్థవంతంగా పనిచేస్తాయా? (11) మంచి వైద్య సంరక్షణకు సంబంధించిన ప్రాథమిక నైతిక సూత్రాల్లో ఒకటి ఏమిటి? (12) క్రైస్తవులు రక్తరహిత చికిత్సను ముందే ఎంపిక చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? దీనిని మనమెలా చేయవచ్చు?
వీడియోలో చూపించబడిన కొన్ని చికిత్సా పద్ధతులను అంగీకరించడం, ప్రతీ వ్యక్తి బైబిలు శిక్షిత మనస్సాక్షి ప్రకారం వ్యక్తిగతంగా తీసుకోవలసిన నిర్ణయం. మీకు, మీ పిల్లలకు ఏ మార్పిడి ప్రత్యామ్నాయాలను అంగీకరించడానికి మీరు ఇష్టపడుతున్నారో నిర్ణయించుకున్నారా? ఈ విషయాలపై పూర్తి చర్చ కోసం, కావలికోట జూన్ 15, 2004, అక్టోబరు 15, 2000 సంచికల్లోని “పాఠకుల ప్రశ్నలు” అలాగే మన రాజ్య పరిచర్య నవంబరు 2006లోని మధ్యపేజీల్లోవున్న “రక్తంలోని సూక్ష్మభాగాలను, నా రక్తం ఇమిడివున్న వైద్యవిధానాలను నేనెలా దృష్టిస్తాను?” అనేదాన్ని చూడండి. మీరు ఎంపిక చేసుకున్న ఆరోగ్య సంరక్షక ప్రతినిధులకు, సాక్షులుకాని కుటుంబ సభ్యులకు కూడా మీ నిర్ణయాల గురించి పూర్తిగా వివరించాలి.