‘మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పువేసినట్టు రుచిగలదిగా ఉండనివ్వండి’
1 “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొ. 4:6) మన ‘సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదిగా’ ఉండేలా చేసుకోవడం అంటే, సరైన పదాలను ఎంపిక చేసుకోవడమని, వినేవారికి ఆహ్లాదకరమైన విధంగా ఉండేలా మాట్లాడడమని అర్థం. పరిచర్యలో భాగం వహిస్తున్నప్పుడు అలా చేయడం చాలా ప్రాముఖ్యం.
2 యేసు మాదిరి: యేసు ఒక బావి దగ్గర అలసట తీర్చుకుంటున్నప్పుడు, నీళ్ళ కోసం అక్కడికి వచ్చిన ఒక సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఆయన చొరవ తీసుకున్నాడు. సంభాషణలో చాలాసార్లు ఆమె, యూదులకు, సమరయులకు మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న శత్రుత్వం గురించిన అంశాలను ప్రస్తావించింది. సమరయులు యూదేతరుల నుండి వచ్చినవారని యూదులు బలంగా నమ్ముతున్నప్పటికీ ఆమె మాత్రం సమరయులు యాకోబు వంశావళినుండి వచ్చినవారనే తన నమ్మకాన్ని వ్యక్తం చేసింది. యేసు ఆమె చెబుతున్నదాని గురించి వాదించేబదులు, ఆయన అనుకూలమైన రీతిలో సంభాషణ కొనసాగించాడు. తత్ఫలితంగా ఆమెకు, ఆ ఊరిలోని అనేకులకు సహాయం చేకూరే విధంగా ఆయన సాక్ష్యమివ్వగలిగాడు.—యోహా. 4:7-15, 39.
3 మనం ప్రకటించేటప్పుడు, “ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించ[డం]” అనేది మన లక్ష్యమని మనసులో ఉంచుకోవాలి. (రోమా. 10:15) గృహస్థులతో, బైబిలు నుండి ఆకర్షణీయమైన, ప్రోత్సాహకరమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటామే కానీ వారి వ్యక్తిగత నమ్మకాలపై దాడిచేయాలనుకోము. ఒకవేళ గృహస్థుడు, తప్పు అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తే మన ప్రతిస్పందన ఆయన తప్పును ఎత్తిచూపేలా ఉండకూడదు. ఆయన చెప్పిన దానిలో మనం అంగీకరించగలదేదైనా ఉందా లేక మనం యథార్థంగా ప్రశంసించడానికి దానిని ఆధారంగా ఉపయోగించవచ్చా? ఒక లేఖనాన్ని వారి ముందుంచుతూ మనమిలా అడగవచ్చు: “ఈ విధంగా జరుగుతుందని మీరెప్పుడైనా అనుకున్నారా?”
4 గృహస్థుడు కించపర్చేవిధంగా మాట్లాడితే లేదా కేవలం వాదించడానికే మాట్లాడుతున్నాడని స్పష్టమౌతుంటే అప్పుడేమిటి? మన ప్రవర్తనలో, మాటల్లో మనం దయను మృదుస్వభావాన్ని కనపరుస్తూనే ఉండాలి. (2 తిమో. 2:23-26) రాజ్య సందేశం పట్ల ఆ వ్యక్తికి ఆసక్తి లేకపోతే మనం యుక్తిగా అక్కడినుండి వచ్చేయడం ఉత్తమం.—మత్త. 7:6; 10:11-14.
5 మంచి ఫలితాలు: ఒక సహోదరి తన పొరుగువారికి సాక్ష్యమివ్వడానికి ప్రయత్నించినప్పుడు, ఆ స్త్రీ కోపంతో కేకలువేసి, దూషించింది. మన సహోదరి మృదువుగా ఇలా అంది: “మీరలా భావిస్తున్నందుకు నేను బాధపడుతున్నాను. మరి నేను వెళ్ళొస్తానండి.” రెండు వారాల తర్వాత, ఆ స్త్రీ మన సహోదరి ఇంటి తలుపు తట్టి, గతంలో తానలా ప్రవర్తించినందుకు క్షమాపణ అడిగి, మన సహోదరి ఏమి చెప్పాలనుకుందో దానిని వినడానికి ఇప్పుడు సుముఖంగా ఉన్నట్లు చెప్పింది. మృదువుగా మాట్లాడడం ఎల్లప్పుడూ మంచి ఫలితాలనిస్తుంది!—సామె. 15:1; 25:15.
6 సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీ సంభాషణ ఉప్పువేసినట్టు రుచిగలదిగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ గృహస్థునికి వినడం ఇష్టంలేకపోయినా, మరోసారి యెహోవాసాక్షులు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వినడానికి ఇష్టపడవచ్చు.
[అధ్యయన ప్రశ్నలు]
1. ‘మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదిగా’ ఉండేలా చూసుకోవడమంటే అర్థమేమిటి?
2. సమరయ స్త్రీకి యేసు ఎలా సాక్ష్యమివ్వగలిగాడు?
3. మనం పరిచర్యలో ఉన్నప్పుడు యేసు మాదిరిని ఎలా అనుకరించవచ్చు?
4. గృహస్థుడు కించపర్చేవిధంగా మాట్లాడితే మనమేమి చేయాలి?
5. మృదువుగా మాట్లాడడం వల్ల ఒక సహోదరి ఎలా మంచి ఫలితాలను పొందింది?
6. పరిచర్యలో మన సంభాషణ ఉప్పువేసినట్టు రుచిగలదిగా ఉండేలా చూసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?