ధైర్యంగా ఉంటూనే సమాధానంగా ప్రకటించడం
1 మనం ప్రకటించే చాలామంది బైబిలు సత్యానికి విరుద్ధంగావున్న తమ నమ్మకాలను యథార్థంగా వ్యక్తం చేస్తారు. మనం ధైర్యంగా ప్రకటించాల్సివున్నా, ‘సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండేందుకు’ కూడా ఇష్టపడడమేకాక, వారికి అనవసర ఇబ్బంది కలిగించం. (రోమా. 12:18; అపొ. 4:30) రాజ్య సందేశాన్ని ప్రకటించేటప్పుడు ధైర్యంగా ఉంటూనే, మనమెలా సమాధానంగా ఉండవచ్చు?
2 పరస్పరం అంగీకరించగల అంశాలకోసం చూడండి: సమాధానపరుడైన వ్యక్తి వాగ్వివాదాలకు దూరంగా ఉంటాడు. గృహస్థుడు బలంగా నమ్మేవాటిని అనవసరంగా ఖండిస్తే మనం చెప్పే సందేశాన్ని వినేందుకు సుముఖంగా ఉండడు. ఆయన ఒకవేళ తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తే, పరస్పరం అంగీకరించగల అంశాన్ని యుక్తిగా ప్రస్తావించవచ్చు. అలా పరస్పరం నమ్మే అంశాలను నొక్కిచెప్పడం ద్వారా ప్రతికూల భావాలను తొలగించి ఆయన మనసును ఆకట్టుకోవచ్చు.
3 ఒకవేళ గృహస్థుడు తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తంచేసినప్పుడు దానినలాగే వదిలేస్తే, మనం సత్యంతో రాజీపడుతున్నవారిగా లేక సత్యాన్ని నీరుగారుస్తున్నవారిగా ఉంటామా? లేదు. క్రైస్తవ పరిచారకులుగా మనకు అప్పగించబడిన బాధ్యత మనకెదురయ్యే ప్రతీ తప్పుడు అభిప్రాయాన్ని ఖండించడం కాదుగానీ, దేవుని రాజ్యసువార్తను ప్రకటించడమే. (మత్త. 24:14) తప్పుడు అభిప్రాయం వ్యక్తం చేయబడినప్పడు అతిగా స్పందించే బదులు, ఆ వ్యక్తి ఆలోచనా విధానాన్ని లోతుగా గ్రహించడానికి లభించిన ఒక అవకాశంగా దాన్ని దృష్టించవచ్చు.—సామె. 16:23.
4 గృహస్థుణ్ణి గౌరవించండి: మనం తప్పుడు బోధలను ధైర్యంగా ఖండించాల్సిన సందర్భాలు ఉంటాయి. అయితే సమాధానపరులుగా మనం తప్పుడు విషయాలను విశ్వసించే, బోధించేవారిని అపహసించం లేదా అవమానకరంగా మాట్లాడం. అధికులమనే భావన ప్రజలను మననుండి దూరం చేస్తుంది, కానీ వినయంగా, మర్యాదగా మాట్లాడడం సత్యాన్ని ప్రేమించేవారి మనసులను ఆకట్టుకుంటుంది. మనం ప్రకటిస్తున్నవారిని, వారి నమ్మకాలను గౌరవించడం వారి ఆత్మగౌరవాన్ని కాపాడడమేకాక, వారు మన సందేశాన్ని సులభంగా అంగీకరించేలా కూడా చేస్తుంది.
5 అపొస్తలుడైన పౌలు తాను ప్రకటించిన వారి నమ్మకాలను పరిగణలోకి తీసుకొని, వారిని ఆకట్టుకునే రీతిలో సువార్తను ప్రకటించేందుకు ప్రయత్నించాడు. (అపొ. 17:22-31) ఆయన ‘కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధాలుగా’ మారేందుకు ఇష్టపడ్డాడు. (1 కొరిం. 9:22) మనం సువార్తను ధైర్యంగా ప్రకటిస్తూనే సమాధానంగా ఉండడం ద్వారా మనం కూడా అలాగే చేయవచ్చు.