‘అందరితో సమాధానంగా ఉండండి’
1. పరిచర్యలో ఎవరైనా మనమీద కోప్పడితే మనం ఏ బైబిలు సలహా పాటించాలి?
1 యెహోవా సేవకులమైన మనం శాంతిని కోరుకునే ప్రజలం, మనం ప్రకటించే సందేశం కూడా సమాధాన సువార్తే. (యెష. 52:7) కానీ కొన్నిసార్లు, మనం ప్రజల ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్లు మనమీద కోప్పడతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సమాధానంగా ఉండాలంటే మనమేమి చేయాలి?—రోమా. 12:18.
2. ప్రజల పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
2 పరిస్థితుల్ని అర్థం చేసుకోండి: కొంతమంది సత్యమంటే ఇష్టంలేక కోప్పడతారు, అయితే ఇంకొంతమంది కోప్పడ్డానికి వేరే కారణాలు ఉండవచ్చు. బహుశా వాళ్లకు అంతగా అనుకూలం కాని సమయంలో మనం వెళ్లుండవచ్చు. లేదా వ్యక్తిగత సమస్యల వల్ల వాళ్లు చికాకుగా ఉండవచ్చు. ఒకవేళ సువార్తంటే ఇష్టం లేకపోవడంవల్లే కోప్పడినా, వాళ్లు తెలియక అలా చేస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి. (2 కొరిం. 4:4) మనం పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే వాళ్ల కోపం మనమీద కాదని గ్రహిస్తాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం.—సామె. 19:11.
3. మనకు గృహస్థులంటే గౌరవం ఉందని ఎలా చూపించవచ్చు?
3 గౌరవం చూపించండి: చాలామందికి బలమైన నమ్మకాలు ఉంటాయి. (2 కొరిం. 10:4) మనం చెప్పేది వినాలో వద్దో నిర్ణయించుకునే హక్కు వాళ్లకుంది. వాళ్ల నమ్మకాలను చులకన చేయాలనిగానీ, వాళ్లకంటే మనమే గొప్పవాళ్లమని నిరూపించాలనిగానీ మనం అస్సలు ప్రయత్నించం. వాళ్లు వెళ్లిపొమ్మంటే, మనం అక్కడ నుండి మర్యాదగా వచ్చేయాలి.
4. ఇంటివాళ్లతో సౌమ్యంగా ఎలా మాట్లాడవచ్చు?
4 సౌమ్యంగా మాట్లాడండి: ఇంటివాళ్లు మనల్ని తిట్టినా మనం మాత్రం దయగా, సౌమ్యంగా మాట్లాడాలి. (కొలొ. 4:6; 1 పేతు. 2:23) వాళ్లతో వాదనకు దిగకుండా, వాళ్లూ మీరూ ఒప్పుకునే విషయాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ల అభ్యంతరానికి కారణాలు ఏమిటో వినయంగా అడిగి తెలుసుకోండి. ఒక్కోసారి వాళ్ల కోపాన్ని మరింత పెంచకుండా ఉండడానికి మనం సంభాషణ ఆపేయడం మంచిది.—సామె. 9:7; 17:14.
5. పరిచర్యలో సమాధానంగా ఉంటే ఏ ప్రయోజనాలు కలుగుతాయి?
5 ఇంటివాళ్లతో మనం సమాధానంగా వ్యవహరిస్తే వాళ్లు దాన్ని గుర్తుపెట్టుకుని, వేరే సహోదరులు ఎవరైనా ప్రకటించడానికి వెళ్లినప్పుడు వినే అవకాశం ఉంది. (రోమా. 12:20, 21) అదేపనిగా వ్యతిరేకించే వాళ్లు కూడా ఏదో ఒక రోజు మన సహోదరులుగా మారవచ్చు. (గల. 1:13, 14) అయితే వాళ్లు సత్యాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా మనం నిగ్రహంగా, సమాధానంగా ఉంటే యెహోవాను ఘనపరుస్తాం, మన బోధకు మరింత వన్నె తెస్తాం.—2 కొరిం. 6:3.