ప్రకటన —దాని దివ్యమైన ముగింపు సమీపించింది!
1 “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.” (ప్రక. 1:3) మనం ప్రత్యేకంగా ప్రకటన గ్రంథములోని ఎన్నో ప్రవచనాలు నెరవేరుతున్న నియమిత కాలంలో జీవిస్తున్నాం కాబట్టి, ఆ మాటలు ప్రకటన గ్రంథము యొక్క విలువను నొక్కిచెబుతున్నాయి. అందువల్ల, మనం ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే ఈ పుస్తకాన్ని జనవరి 8తో ప్రారంభమయ్యే వారం నుండి సంఘ పుస్తక అధ్యయనంలో పరిశీలిస్తాం.
2 అంతకుముందు మనం ప్రకటన ముగింపు పుస్తకాన్ని సంఘ పుస్తక అధ్యయనంలో పరిశీలించినప్పటినుండి ఇప్పటివరకు ప్రపంచ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు జరిగాయి. (1 కొరిం. 7:31) అంతేకాక, దేవుని రాజ్యసువార్తను ప్రకటించేవారితో క్రొత్తగా చేరిన చాలామందికి ప్రకటన గ్రంథములోని ప్రతీ వచనాన్ని పరిశీలించి ప్రయోజనంపొందే అవకాశం లభించలేదు. ప్రకటన ముగింపు పుస్తకాన్ని అధ్యయనం చేయడం భవిష్యత్తులో జరగబోయే విషయాల్లో మెలకువగా ఉండడానికి మనందరికీ తప్పకుండా సహాయం చేస్తుంది.—ప్రక. 16:15.
3 ప్రతీవారం ఖచ్చితంగా హాజరవ్వాలని తీర్మానించుకోండి. దానిలోని సమాచారం మనం మెలకువగా ఉండడానికి మాత్రమేకాక, యేసు ఏడు సంఘాలకు ఇచ్చిన సందేశాలు మన ఆధ్యాత్మికతపై, పరిచర్యలో పాల్గొనడంపై హానికర ప్రభావం చూపించగల పరిస్థితులను తప్పించుకోవడానికి కూడా సహాయం చేస్తాయి.—ప్రక. 1:11, 19.
4 బాగా సిద్ధపడండి: ప్రతీ పుస్తక అధ్యయనానికి ముందు ప్రకటన గ్రంథములో విశ్లేషించబోయే వచనాలను ముందుగానే చదవండి. ఆ వచనాల వివరణకు ఇవ్వబడిన లేఖన తర్కాన్ని గమనించండి. పురికొల్పగల ముఖ్యాంశాలను చక్కగా అర్థం చేసుకోవడానికి కృషి చేయండి. (నెహె. 8:8, 12) ధ్యానించడానికి, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకునేందుకు సమయం తీసుకోండి: ‘ఇది యెహోవా గురించి ఆయన సంకల్ప నెరవేర్పు గురించి నాకేమి చెబుతుంది? ఆయన సంకల్పానికి అనుగుణంగా నేనెలా ప్రవర్తించాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి?’
5 “ప్రభువు దినము” 1914లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటికి 92 సంవత్సరాలు గడిచిపోయాయి. (ప్రక. 1:10) ప్రకటన గ్రంథములో ముందుగానే చెప్పబడిన భీతిగొల్పే సంఘటనలు త్వరలోనే నెరవేరతాయి. ప్రకటన ముగింపు పుస్తకాన్ని అధ్యయనం చేయడం మన హృదయానికి, మనసుకు ఉత్తేజాన్నివ్వడమేకాక, ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము,’ నూతనలోకం సమీపించాయనే మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.—ప్రక. 16:14; 21:4, 5.