బోధించే దృశ్య సహాయకాలను ఉపయోగించండి
1. యెహోవా తన ప్రాచీన సేవకులకు బోధించడానికి దృశ్య సహాయకాలను ఎలా ఉపయోగించాడు, దాని ఫలితమేమిటి?
1 యెహోవా తన ప్రాచీన సేవకులకు కొన్నిసార్లు దర్శనాల ద్వారా, కలల ద్వారా ప్రాముఖ్యమైన సమాచారాన్ని అందించాడు. యెహోవా పరలోక రథానికి సంబంధించి యెహెజ్కేలు చూసిన దర్శనం గురించి ఆలోచించండి. (యెహె. 1:1-28) ప్రపంచ శక్తుల గమనాన్ని చిత్రీకరించే ప్రవచనాత్మక కలను పొందిన తర్వాత దానియేలు ఎలా భావించాడో ఊహించండి. (దాని. 7:1-15, 28) “ప్రభువు దినం”లో సంభవించే ఘటనల గురించి అపొస్తలుడైన యోహానుకు ‘సూచనల’ రూపంలో అందించబడిన పులకరింపజేసే ప్రత్యక్షత విషయమేమిటి? (ప్రక. 1:1, 10) యెహోవా ప్రకాశవంతమైన రంగులు, శక్తిమంతమైన చర్యలను ఉపయోగించి వారికి బోధించాడు, అది వారి మనసులమీద చెరగని ముద్రవేసింది.
2. మనం ఇతరులకు బైబిలు సత్యాలను బోధించడానికి ఏ దృశ్య సహాయకాలను ఉపయోగించవచ్చు?
2 మనం బైబిలు సత్యాలను సులభంగా మర్చిపోకుండా ఉండేలా ఇతరుల మనసులపై ముద్రించే విధంగా వివరించాలంటే, మనం కూడా బోధించడానికి మన వీడియోలను ఉపయోగించవచ్చు. మన వీడియోలు వివిధ రకాల అంశాలను వివరించి బైబిలుమీద, యెహోవా సంస్థమీద, మనల్ని మంచి క్రైస్తవులుగా మార్చే సూత్రాలమీద నమ్మకాన్ని బలపరుస్తాయి. మనం బోధించేందుకు మన వీడియోలను ఉపయోగించగల కొన్ని మార్గాలను పరిశీలించండి. మీరు ఉపయోగించగల వీడియోలలో కొన్ని మాత్రమే ఈ క్రింద పేర్కొనబడ్డాయి.
3. బైబిలు విద్యార్థిని సంస్థవైపు నడిపించడానికి మీరు ఏమి ఉపయోగించవచ్చు?
3 పరిచర్యలో: మీరు బైబిలు విద్యార్థికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన క్రైస్తవ సహోదరత్వం గురించి చెబుతున్నారా? విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం (ఆంగ్లం) అనే వీడియో ద్వారా ఆ సహోదరత్వం ఎలా ఉంటుందో ఆ వ్యక్తికి చూపించండి. తర్వాతి అధ్యయనానికి ముందే ఆయన ఆ వీడియో చూసేందుకు దానిని ఆయనకు ఇవ్వండి లేక అధ్యయన సమయంలో మీరిద్దరూ కలిసి దానిని చూడండి. ఆ తర్వాత జూన్ 2002 మన రాజ్య పరిచర్యలో ఉన్న పునఃసమీక్ష ప్రశ్నలను చర్చించండి.
4. ఒక యౌవనసాక్షి ఏ బోధనా ఉపకరణాలను పాఠశాలలో ఉపయోగించవచ్చు?
4 యౌవనులారా, యెహోవాసాక్షులు నాజీ దాడి సమయంలో స్థిరంగా నిలబడ్డారు (ఆంగ్లం) లేక శ్రమల్లో విశ్వసనీయత—సోవియట్ యూనియన్‌లోని యెహోవాసాక్షులు (ఆంగ్లం) అనే వీడియో డాక్యుమెంటరీలను మీ తరగతిలోనివారికి చూపించే అవకాశం గురించి మీ టీచర్‌తో మాట్లాడవచ్చు. ప్రశ్నా పత్రాన్ని సిద్ధంచేసుకుని వస్తానని చెప్పండి, దానికి జూన్ 2001 లేక ఫిబ్రవరి 2003 మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన ప్రశ్నల ఆధారంగా, వాటిని మీ తరగతిలో చర్చించేందుకు అనుగుణంగా ఉండేటట్లు మలచండి.
5. కుటుంబ అధ్యయనాల్లో ఉపయోగించడానికి తల్లిదండ్రులకు ఏమి అందుబాటులో ఉంది?
5 కుటుంబంతో, స్నేహితులతో: తల్లిదండ్రులారా, మీ పిల్లలు యువత ఇలా అడుగుతోంది—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? (ఆంగ్లం) అనే వీడియోను గతంలో ఎప్పుడు చూశారు? మీ తర్వాతి కుటుంబ అధ్యయనంలో దానిని మళ్ళీ ఎందుకు చూడకూడదు? ఉత్తేజకరమైన, నిజాయితీతో కూడిన చర్చ కోసం ఏప్రిల్ 2002 మన రాజ్య పరిచర్యలో ప్రశ్నలున్నాయి.
6. స్నేహితులతో కలిసి ప్రోత్సాహకరమైన రీతిలో సమయాన్ని గడిపేందుకు మీరెలా ఏర్పాటు చేసుకోవచ్చు?
6 మీ ఇంటికి ఆహ్వానించాలనుకున్న స్నేహితులు సంఘంలో ఉన్నారా? యెహోవా అధికారాన్ని గౌరవించండి (ఆంగ్లం) అనే వీడియోను కలిసి చూడడం ద్వారా ఒక సాయంత్రాన్ని ప్రోత్సాహకరమైన రీతిలో గడపవచ్చు, ప్రత్యేకంగా సెప్టెంబరు 2004 మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ మీరు నేర్చుకున్న పాఠాలను సమీక్షించినట్లయితే అది ప్రోత్సాహకరంగా ఉంటుంది.
7. మన వీడియోలను ఉపయోగించడానికి ఏ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు?
7 ఇతర అవకాశాలు: మీరు మన 20 వీడియోలను ఉపయోగించే మరికొన్ని మార్గాలేమిటి? మీరు క్రమంగా కలుసుకునే వ్యక్తికి ఒకటి రెండు వీడియోలను చూపించడం ఆయన ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించేందుకు సహాయం చేస్తుందా? ఈ వీడియోలను స్థానిక నర్సింగ్ హోమ్‌లో లేక వృద్ధాశ్రమంలో చూపించేందుకు అనుమతి తీసుకోగలరా? ఆ వీడియోలు సాక్షులుకాని బంధువులు, పొరుగువారు, సహోద్యోగుల గౌరవాన్ని చూరగొనడానికి సహాయం చేస్తాయా? మన వీడియోలు ఉత్తేజకరమైన, ఉపదేశాత్మకమైన, సమర్థమైన దృశ్య సహాయకాలు. ఇతరులకు బోధించడానికి వాటిని ఉపయోగించండి.