ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సహాయం
1. ఒక వ్యక్తి ఆధ్యాత్మికత ఎలా బలహీనంకావచ్చు?
1 అవిశ్వాసియైన భర్తగల అన్నా అనే సహోదరి, తీరిక దొరకని ఉద్యోగం చేస్తోంది, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవడం, పరిచర్యలో భాగం వహించడం, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ఆమెకు కష్టమనిపించింది. ఆమె యెహోవాను ప్రేమిస్తూనే ఉన్నా నిష్క్రియురాలైంది. అయితే, సంతోషకరమైన విషయమేమంటే, శ్రద్ధగల పెద్దల నుండి ఆమెకు ఆధ్యాత్మిక సహాయం లభించింది.
2. క్రైస్తవులందరూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సహాయంగా తమను తాము ఎలా నిరూపించుకోవచ్చు?
2 క్రైస్తవ సంఘం ద్వారా అందించబడే ఆధ్యాత్మిక సహాయాన్ని అంగీకరించడం యెహోవాపట్ల మనకున్న నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది. యేసుక్రీస్తు చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధను అనుకరిస్తూ సంఘంలోని పెద్దలు, ఆధ్యాత్మిక కార్యకలాపాలను చేపట్టడంలో కష్టాలు అనుభవిస్తున్నవారికి ప్రోత్సాహం, అవసరమైన సహాయం అందించే అవకాశాల కోసం చూస్తారు. (1 థెస్స. 5:14) ఓదార్పుకరమైన లేఖనాల ఆధారంగా ప్రోత్సాహాన్నిచ్చే మాటలు మాత్రమే తరచూ అవసరంకావచ్చు. తాత్కాలికంగా బలహీన స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడానికి పెద్దలు మాత్రమే కాదు, క్రైస్తవులందరూ చొరవతీసుకోవాలి. “సమయోచితముగా పలుకబడిన” ఆలోచనాపూర్వకమైన మాటకున్న శక్తిని మనలో ప్రతీ ఒక్కరం ఖచ్చితంగా చవిచూశాం.—సామె. 25:11; యెష. 35:3, 4.
3, 4 ఇతరులకు సహాయం చేయడంలో ఏమి ఇమిడివుంది, మనం దానిని ఎలా చేయవచ్చు?
3 చొరవ తీసుకోండి: సహాయం అవసరమైనవారిపట్ల మనం ప్రేమపూర్వక శ్రద్ధ చూపించాలంటే చొరవ తీసుకోవాలి, సహానుభూతి చూపించాలి, యథార్థంగా ప్రవర్తించాలి. దావీదు ఎదుర్కొంటున్న కృంగదీసే పరిస్థితి గురించి యోనాతాను తెలుసుకున్నప్పుడు, ఆయన ‘దావీదును బలపర్చడానికి వనములోనున్న దావీదునొద్దకు’ వెళ్ళాడు. (1 సమూ. 23:15, 16) ఇతరులకు సున్నితమైన రీతిలో సహాయం చేయండి. నిజమైన శ్రద్ధ కారణంగా పలికే మాటలు మంచి ఫలితాలనిస్తాయి. అంతేకాక, ఆధ్యాత్మిక సహోదరుడ్ని లేక సహోదరిని తిరిగి సంపాదించుకోవాలంటే శ్రద్ధతో కూడిన సంకల్పవంతమైన కృషి అవసరమని యేసు స్పష్టంగా ఉదాహరించాడు. (లూకా 15:4) వేరే వ్యక్తికి సహాయం చేయాలనే ప్రగాఢమైన కోరిక, ఆ వ్యక్తిలో ప్రగతి త్వరగా కనిపించకపోయినా పట్టుదలతో సహాయం అందించడానికి మనల్ని పురికొల్పుతుంది.
4 ఇతరులను, అంటే మన పుస్తక అధ్యయన గంపులో ఉన్నవారిని, మనతోపాటు పరిచర్యలో పాల్గొనడానికి ఆహ్వానించడంలో మనం చొరవతీసుకోవడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! మన తోటి యెహోవా సేవకునికి పరిచర్యలో పాల్గొనడానికి సహాయం చేస్తున్నప్పుడు, ఆయనను బలపర్చడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించవచ్చు. అలా యెహోవా సేవలో ఆనందంగా కలిసి గడిపిన సమయాలు, తమ ఆధ్యాత్మిక సమతూకాన్ని తిరిగిపొందుతున్నవారికి ప్రత్యేకంగా ప్రోత్సాహకరంగా ఉంటాయి.
5. కొన్ని పరిస్థితుల్లో, పెద్దలు ఎలాంటి సహాయాన్ని అందించవచ్చు?
5 ప్రేమపూర్వక ఏర్పాటు: కొంతకాలంగా ప్రకటనా పనిలో భాగం వహించనివారికి లేక సంఘంతో సహవసించనివారికి తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి అదనపు సహాయం అవసరం కావచ్చు. అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించండి లేక యెహోవాకు సన్నిహితమవండి లేక బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? వంటి ప్రచురణల ఆధారంగా వ్యక్తిగత బైబిలు అధ్యయనం మాత్రమే వారికి అవసరం కావచ్చు. ఆ వ్యక్తి అప్పటికే బాప్తిస్మం తీసుకున్నాడు కాబట్టి, చాలాకాలం వరకు అధ్యయనాన్ని కొనసాగించడం సాధారణంగా అవసరంలేదు. ఈ ఏర్పాటు నుండి ఎవరు ప్రయోజనం పొందవచ్చనేది గమనించడానికి సంఘ సేవా కమిటీ అప్రమత్తంగా ఉండాలి.—మన రాజ్య పరిచర్య, నవంబరు 1998, నవంబరు 2000 సంచికల్లోని ప్రశ్నా భాగాలను చూడండి.
6. ఒక సహోదరి తన ఆధ్యాత్మిక బలాన్ని తిరిగి ఎలా పొందింది?
6 పైన పేర్కొనబడిన అన్నా, ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన ఒక సహోదరి తనతో బైబిలు అధ్యయనం చేసేందుకు పెద్దలు చేసిన ఏర్పాటును కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరించింది. ఆమెతో కేవలం నాలుగుసార్లు అధ్యయనం చేయడం ఆమె మళ్ళీ యెహోవాకు సన్నిహితమవడానికి సహాయం చేసింది. ఆమె సంఘ కూటాలకు మళ్ళీ హాజరవడం ప్రారంభించింది, యెహోవా దేవుణ్ణి బహిరంగంగా స్తుతించాలనే కోరిక ఆమెలో మళ్ళీ కలిగింది. ఆమె ఇంటింటి పరిచర్యలో పాల్గొనేందుకు తగినంత బలం పొందేంతవరకు, పరిణతి చెందిన ఆ సహోదరి ఆమెను తనతోపాటు ఇతర బైబిలు అధ్యయనాలకు తీసుకువెళ్ళడం ద్వారా ఆమెకు పరిచర్యలో కూడా సహాయం చేసింది. ఆమె తన ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో తిరిగి కొనసాగడానికి దయతో కూడిన సహాయం మాత్రమే ఆమెకు అవసరమైంది!
7. ఇతరులను ఆధ్యాత్మికంగా బలపర్చడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి?
7 అవసరంలో ఉన్నవారిని బలపర్చడం అందరికీ ఆశీర్వాదాలు తెస్తుంది. సహాయం పొందుతున్న వ్యక్తి యెహోవాకు సన్నిహితమవడంవల్ల కలిగే సంతోషాన్నే కాక, ఆయన సంస్థ కార్యకలాపాలలో పాల్గొనడంవల్ల కలిగే సంతోషాన్ని కూడా అనుభవిస్తాడు. అలాంటి ఆధ్యాత్మిక ప్రగతిని చూడడానికి పెద్దలు సంతోషిస్తారు. (లూకా 15:5, 6) సంఘంలోని వారందరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తుండగా సంఘంలో ఐక్యత నెలకొంటుంది. (కొలొ. 3:12-14) ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సహాయంగా ఉన్న యెహోవాను అనుకరించడానికి మనకు ఎంత మంచి కారణాలు ఉన్నాయో కదా!—ఎఫె. 5:1