బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తక అధ్యయనాన్ని ఆస్వాదించండి
1 బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకం ఆవిష్కరించబడడం “దైవిక విధేయత” అనే జిల్లా సమావేశాలకు సంబంధించిన ఉత్తేజకరమైన అంశం. త్వరలో ఆ పుస్తకాన్ని మనం, మన క్షేత్ర పరిచర్యలో, ప్రత్యేకంగా గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నప్పుడు ఎక్కువగా ఉపయోగించనున్నాం. కాబట్టి, ఈ క్రొత్త ప్రచురణ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 2006, ఏప్రిల్ 17 మొదలుకొని మనం ఆ పుస్తకాన్ని సంఘ పుస్తక అధ్యయనంలో అధ్యయనం చేయనున్నాం కాబట్టి, దాని గురించి బాగా తెలుసుకోవడం సాధ్యమే.
2 సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్త ప్రతీ అధ్యాయం ప్రారంభంలో కనిపించే ప్రశ్నలవైపు సభికుల దృష్టిని మళ్ళిస్తాడు. ఆ తర్వాత పేజీ క్రింది భాగంలోవున్న ప్రశ్నలను ఉపయోగిస్తూ అధ్యయనం నిర్వహించబడుతుంది. కీలక లేఖనాలు చదవబడి, చర్చించబడతాయి, ప్రతీ అధ్యాయం చివర్లో ఉండే “బైబిలు ఈ విషయాలను బోధిస్తోంది” అనే బాక్సులో, అధ్యాయం ప్రారంభంలో ఉన్న ఉపోద్ఘాత ప్రశ్నలకు లేఖనాధారిత జవాబులున్నాయి కాబట్టి, అధ్యాయంలో ఇవ్వబడిన సమాచారాన్ని పునఃసమీక్షించడానికి అది సహాయకరంగా ఉంటుంది. ఈ పుస్తకం విషయాలను స్పష్టమైన, సరళమైన, ఆసక్తికరమైన రీతిలో వివరిస్తుంది కాబట్టి, మీరు వ్యాఖ్యానించడానికి ఇష్టపడతారు.
3 ఈ పుస్తక అనుబంధం వివిధ అంశాల గురించిన వివరాలు అందిస్తోంది. బైబిలు విద్యార్థులకు నిర్దిష్ట విషయం మీద అదనపు సమాచారం కావాల్సివస్తే మనం ఈ సమాచారాన్ని ఉపయోగించగలుగుతాం. సంఘ పుస్తక అధ్యయనంలో కొన్నిసార్లు అనుబంధంలోని భాగాలు చర్చించబడతాయి. ఒక అంశం మీద ఉన్న అనుబంధ సమాచారాన్ని పుస్తక అధ్యయన పాఠకుడు చదువుతాడు, పెద్దగా ఉన్న ఆర్టికల్స్‌ను వివిధ భాగాలుగా విభజించి చర్చించవచ్చు. అనుబంధంలో అధ్యయన ప్రశ్నలు లేవు. అయితే, పైవిచారణకర్త ముఖ్యాంశాలను నొక్కిచెప్పే ప్రశ్నలను అడగడం ద్వారా హాజరైనవారి నుండి వ్యాఖ్యానాలు రాబట్టవచ్చు.
4 సంఘ పుస్తక అధ్యయనంలో బైబిలు బోధిస్తోంది పుస్తకానికి సంబంధించిన అధ్యయనాలు వేగంగా నిర్వహించబడతాయి. మనం ఈ పుస్తకాన్ని ఇతరులతో అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రత్యేకంగా బైబిలు జ్ఞానం తక్కువగా ఉన్నవారితో లేక ఆ జ్ఞానం అసలే లేనివారితో అధ్యయనం చేస్తున్నప్పుడు అంతే వేగంతో నిర్వహించవలసిన అవసరం లేదు. (అపొ. 26:28, 29) మనం గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నప్పుడు లేఖనాలను మరింత సమగ్రంగా చర్చించడం, ఉపమానాలు వివరించడం, మొదలైనవి అవసరం. కాబట్టి ప్రతీవారం పుస్తక అధ్యయనానికి హాజరవడాన్ని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు దానిలో పూర్తిగా భాగంవహించడాన్ని మీ లక్ష్యంగా చేసుకోండి.