“లోకమునకు వెలుగు” అయిన వ్యక్తి గురించి ఇతరులతో మాట్లాడండి
1. దేవుని వాక్యంలో ఏ గొప్ప వెలుగు గురించి ప్రవచింపబడింది, ఏ సందర్భం ఆ వెలుగువైపు ప్రత్యేక అవధానాన్ని మళ్ళిస్తుంది?
1 ప్రవక్తయైన యెషయా ద్వారా యెహోవా ఇలా ప్రవచించాడు: “చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.” (యెష. 9:2) ఆ “గొప్ప వెలుగు,” దేవుని స్వంత కుమారుడైన యేసుక్రీస్తు నడవడిలో కనబడింది. భూమ్మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రకటనా పని, ఆయన బలి ఆధారంగా లభించే ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక చీకటిలో ఉన్నవారి పరిస్థితిని మెరుగుపరిచాయి. నేడు కూడా చీకటిమయంగా ఉన్న కాలాల్లో జీవిస్తున్న ప్రజలకు అటువంటి వెలుగే అవసరం. “లోకమునకు వెలుగు” అయిన వ్యక్తివైపు అవధానాన్ని మళ్ళించడానికి ప్రభువు రాత్రి భోజన ఆచరణ మనకు ఒక ప్రత్యేక అవకాశాన్నిస్తుంది. (యోహా. 8:12) గత సంవత్సరం, “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపడంలో మనతోపాటు లక్షలాదిమంది ఇతరులు కూడా పాల్గొన్నారు. అలా చేయడం ద్వారా వారు తమకు కొంతైనా విశ్వాసం ఉందని చూపించారు. (లూకా 22:19) ఈ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ సమీపిస్తుండగా, యెహోవా ప్రకాశింపజేసిన గొప్ప వెలుగువైపు ప్రజల అవధానాన్ని మళ్ళించడంలో మనమెలా భాగం వహించవచ్చు?—ఫిలి. 2:14-15.
2. విమోచనా క్రయధనంపట్ల మన హృదయపూర్వక కృతజ్ఞతను ఎలా అధికం చేసుకోవచ్చు, అలా చేయడంవల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి?
2 హృదయపూర్వక కృతజ్ఞతను పెంపొందించుకోండి: విమోచనా క్రయధనాన్ని ఏర్పాటు చేయడంలో యెహోవా, యేసు చూపించిన గొప్ప ప్రేమ గురించి ధ్యానించడానికి జ్ఞాపకార్థ ఆచరణాకాలం సరైన సమయం. (యోహా. 3:16; 2 కొరిం. 5:14, 15) అలా చేయడం, ఈ పవిత్రమైన సందర్భంపట్ల మనకున్న కృతజ్ఞతను ఖచ్చితంగా అధికం చేస్తుంది. ప్రతిదినం లేఖనాలను పరిశోధించడంలో ప్రత్యేక జ్ఞాపకార్థ బైబిలు పఠనం కోసం సూచింపబడిన లేఖనాలను చదివి, వాటిపై ధ్యానించడానికి దేవుని ప్రజలందరూ సమయాన్ని కేటాయించాలనుకుంటారు. విమోచనా క్రయధన ఏర్పాటులో ఎంతో అద్భుతంగా బయల్పర్చబడిన యెహోవా దేవుని సాటిలేని లక్షణాల గురించి ఆలోచించడం, ఆయన మన దేవునిగా ఉన్నందుకు మనం గర్వించేలా చేస్తుంది. విమోచనా క్రయధనం మనకు వ్యక్తిగతంగా ఏ భావాన్ని కలిగివుందనే దాని గురించి ధ్యానించడం, దేవునిపట్ల, ఆయన కుమారునిపట్ల మనకున్న హృదయపూర్వక ప్రేమను అధికం చేస్తుంది. అంతేకాక ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో మనకు సాధ్యమైనంత చేయడానికి కూడా అది మనల్ని పురికొల్పుతుంది.—గల. 2:20.
3. జ్ఞాపకార్థ ఆచరణపట్ల మనం మన కృతజ్ఞతను ఎలా ప్రదర్శించవచ్చు?
3 మన రక్షణకోసం యెహోవా చేసిన ఏర్పాటు విషయంలో మన కృతజ్ఞతను మరింత ప్రగాఢం చేసుకున్నట్లయితే, జ్ఞాపకార్థ ఆచరణ పట్ల మనలో ఉండే ఉత్సాహం, మనం ఈ ప్రత్యేక సందర్భానికి ఆహ్వానించిన బైబిలు విద్యార్థుల్ని, మనం పునర్దర్శనాలు చేస్తున్నవారిని, బంధువులను, ఇరుగు పొరుగువారిని, తోటి విద్యార్థులను, తోటి ఉద్యోగస్థులను, మరితరులను కూడా ప్రభావితం చేస్తుంది. (లూకా 6:45) కాబట్టి, వారు గుర్తుంచుకోవడానికి వీలుగా ముద్రించబడిన ఆహ్వాన పత్రాలను ఇస్తూ వారందరినీ ఆహ్వానించడానికి విశేషంగా కృషిచేయండి. ఆహ్వానించాలని అనుకున్నవారిలో ఎవరినీ మరచిపోకుండా ఉండడానికి అనేకులు, జ్ఞాపకార్థ ఆచరణకు వారు క్రమంగా ఆహ్వానించేవారి పట్టిక తయారుచేసుకోవడం, ప్రతీ సంవత్సరం ఆ పట్టికలో ఇంకొందరిని చేర్చుకోవడం సులభంగా ఉన్నట్టు గమనించారు. ఆసక్తిగలవారిని ఆహ్వానించడానికి మనకు సాధ్యమైనంత చేస్తూ, దాన్ని చేయడానికి ఒక క్రమపద్ధతిని పాటించడమనేది, మనకు “చెప్ప శక్యము కాని ఆయన వరమును” ఇచ్చిన యెహోవా దేవునికి కృతజ్ఞత చూపించడానికి ఉత్తమమైన మార్గం.—2 కొరిం. 9:15.
4. మార్చి, ఏప్రిల్ నెలల్లో పరిచర్యలో మన భాగాన్ని విస్తృతపరచుకోవడానికి ఏది మనకు సహాయం చేస్తుంది?
4 పరిచర్యలో ఎక్కువగా పాల్గొనండి: మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో మీరు పరిచర్యను విస్తృతపరచుకోగలరా? ‘క్రీస్తు మహిమను కనుపరచు సువార్తను’ ఇతరులతో పంచుకోవడానికి కృషి చేస్తే మనకు యెహోవా ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి. సమస్త ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలమైన యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక.” (2 కొరిం. 4:4-6) సంఘంలోని పెద్దలు, అవసరాల మేరకు క్షేత్రసేవ కోసం కూటాలను అదనపు సమయాల్లో, స్థలాల్లో నిర్వహించే ఏర్పాటు చేస్తారు. పరిచర్యలో ఎక్కువ సమయం గడపాలనుకునే ప్రచారకులకు వారు మద్దతివ్వడంలో నాయకత్వం వహిస్తారు. వారు చేసే ఏర్పాట్లలో ఉదయాన్నే చేసే వీధిసాక్ష్యం, వ్యాపార క్షేత్రాల్లో సాక్ష్యమివ్వడం, మధ్యాహ్న లేదా సాయంకాల వేళల్లో టెలిఫోన్ సాక్ష్యమివ్వడం వంటివి కూడా ఇమిడివున్నాయి. మీ పరిచర్యను విస్తృతపర్చుకోవడంలో సహాయకరంగా ఉండేందుకు, వెచ్చించగల గంటల గురించి సహేతుకమైన లక్ష్యాన్ని పెట్టుకుని దానిని సాధించడానికి శాయశక్తులా కృషి చేయండి. యెహోవాకు శ్రేష్ఠమైనదానిని ఇవ్వడంలో, అనేకులు సహాయ పయినీరు సేవ కూడా చేస్తారు.—కొలొ. 3:23.
5. సహాయ పయినీరు సేవకు వెచ్చించాల్సిన గంటలు తగ్గించబడినందువల్ల అనేకులు ఎలా ప్రయోజనం పొందుతున్నారు?
5 మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? సహాయ పయినీరు సేవలో వెచ్చించవలసిన గంటలను తగ్గించి ఇప్పటికి ఏడు సంవత్సరాల పైనే అయ్యింది. ఈ మార్పువల్ల అనేకులు సహాయ పయినీరు సేవవల్ల వచ్చే ఆశీర్వాదాలను అనుభవించడానికి సాధ్యమయ్యింది. మీరెప్పుడైనా సహాయ పయినీరు సేవ చేయడానికి ప్రయత్నించారా? కొందరు ఈ సేవను ప్రతీ సంవత్సరం అలవాటుగా చేస్తారు. అనేక సంఘాల్లో చాలామంది ప్రచారకులు కలిసి ఒకేసారి ఈ సేవ చేయడానికి నిర్ణయించుకుంటారు, అటువంటి సందర్భాలు ఆ సంఘ వార్షిక కార్యకలాపాలలో సంతృప్తినిచ్చిన ఉత్తేజకరమైన సమయాలు అవుతాయి. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఒక నెల ఆనందంగా సహాయ పయినీరు సేవలో గడపడానికి సమయాన్ని కేటాయించగలరా? ఏప్రిల్ నెలలో ఐదు వారాంతాలు ఉండడంవల్ల ప్రత్యేకంగా ఆ నెల కొందరికి సముచితంగా ఉండవచ్చు.
6. ఎటువంటి ఉత్తేజకరమైన ఏర్పాట్లు చేయబడ్డాయి?
6 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో మీ సంఘంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శన జరగనుందా? అలాగైతే ఒక విశేషమైన అవకాశం మీ ముందుంది. ముందుగానే తెలియజేసినట్లుగా, 2006వ సేవా సంవత్సరంలో, ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శించే నెలలో సహాయ పయినీరు సేవ చేసేవారందరూ, ఆ వారంలో పయినీర్ల కోసం నిర్వహించబడే కూటానికి సంబంధించిన మొదటి అర్థభాగానికి హాజరయ్యేందుకు ఆహ్వానింపబడతారు. ఈ కూటంలో అందించబడే ఆధ్యాత్మికంగా బలపర్చే సమాచారం, సహాయ పయినీర్లుగా సేవచేసే అనేకులు క్రమ పయినీర్లుగా మారేందుకు సహాయం చేస్తుందనడంలో సందేహం లేదు. అదనంగా, మార్చి నెలలో బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే కొత్త అధ్యయన ప్రచురణను ఉపయోగించి ప్రజలను ఆధ్యాత్మిక వెలుగులోకి తీసుకువచ్చే సంతోషకరమైన పని మనకుంది. ఈ కొత్త పుస్తకాన్ని ఉపయోగించి బైబిలు అధ్యయనం ఆరంభించాలనే లక్ష్యాన్ని మీరెందుకు పెట్టుకోకూడదు?
7, 8. (ఎ) సహాయ పయినీరు సేవ చేసేందుకు పట్టిక వేసుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (బి) కుటుంబంలోని ప్రతీ ఒక్కరి సహకారం ఎలా సహాయం చేస్తుంది, దానివల్ల కుటుంబమంతా ఎలా ప్రయోజనం పొందుతుంది?
7 సహాయ పయినీరు సేవకు వెచ్చించాల్సిన 50 గంటలను ఎలా పూర్తిచేయాలో ఆలోచిస్తున్నప్పుడు, మీరు వారానికి దాదాపు 12 గంటలు సత్యపు వెలుగును ప్రకాశింపజేయడానికి ఎటువంటి సమయ పట్టిక వేసుకుంటే బాగుంటుందో నిర్ణయించుకోండి. దానిని సమర్థవంతంగా పూర్తి చేసినవారితో, ఇతరులతో దాని గురించి చర్చించండి. మీతోపాటు వారూ ఈ సేవ చేసేలా అది వారిని ప్రోత్సహించవచ్చు. సరిగ్గా పథకం వేసుకోవడంవల్ల ప్రశంసనీయమైన ఈ లక్ష్యాన్ని సాధించటం అటు యౌవన ప్రచారకులకు, ఇటు వృద్ధ ప్రచారకులకు అంత కష్టమనిపించకపోవచ్చు. దాని గురించి ప్రార్థించండి. ఆ తరువాత ఒకవేళ సాధ్యమైతే, పథకాలు వేసుకుని, సహాయ పయినీరు సేవను ఆనందించండి.—మలా. 3:10.
8 కుటుంబంలోని అందరి సహకారం ఉన్నప్పుడు కనీసం ఒకరైనా ఈ లక్ష్యాన్ని సాధించే అవకాశముందని కొన్ని కుటుంబాలు గ్రహించాయి. ఒక కుటుంబంలోని బాప్తిస్మం పొందిన ఐదుగురూ సహాయ పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకా బాప్తిస్మం పొందని ఇద్దరు పిల్లలు తమ పరిచర్యను విస్తృతపరచుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేశారు. అలా అదనపు కృషి చేయడంవల్ల ఆ కుటుంబం ఎలా ప్రయోజనం పొందింది? వారు ఇలా వ్రాశారు: “ఆ నెల ఎంతో ఉల్లాసవంతంగా గడిచింది, మా కుటుంబ బంధాలు మరింత బలపడ్డాయని మేము దృఢంగా నమ్ముతున్నాము. మాకు ఈ అద్భుత ఆశీర్వాదాలను ఇచ్చినందుకు యెహోవాకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం!”
9. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మనం మన వెలుగును ఎలా ప్రకాశింపజేయవచ్చు?
9 మార్చి, ఏప్రిల్ నెలల్లో మనం చేసే ప్రత్యేక సేవ ఉత్తేజకరంగా, మనల్ని పరలోక తండ్రికి మరింత సన్నిహితుల్ని చేసేలా ఉంటుందా? అది మనం దేవునిపై, ఆయన కుమారునిపై మన ప్రేమను వృద్ధిచేసుకోవడానికి, పరిచర్యను విస్తృతపరచుకోవడానికి, వ్యక్తిగతంగా మనం చేసే కృషిపై ఆధారపడి ఉంటుంది. కీర్తనకర్త పాడినట్లుగా మనమూ ఇలా తీర్మానించుకుందాము: “నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను.” (కీర్త. 109:30) ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఉత్సాహంగా మనం చేసే సేవను యెహోవా ఆశీర్వదిస్తాడు. ఇంకా అనేకులు అంధకారం నుండి బయటకు వచ్చి ‘జీవపు వెలుగుగలిగి యుండుటకు’ మనం ఈ గొప్ప వెలుగును ప్రకాశింపజేద్దాం.—యోహా. 8:12.