ఇంకను అభివృద్ధి చెందుటకు అనుకూలమైన చర్య
1 ఇప్పటికి మనలో అనేకమందిమి 1992 వార్షిక పుస్తకమును చదివేసి ఉంటాము. 1991 రాజ్య ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 211 దేశాలలో, 6.5 శాతము అభివృద్ధితో 42 లక్షలు దాటుట మన హృదయాలను పులకరింపజేసినది! ప్రస్తుతము ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న రాజ్యాభివృద్ధి నిశ్చయముగా యెషయా 2:2-4 మరియు మీకా 4:1-4ల నెరవేర్పుకు గొప్ప నిదర్శనమైయున్నది.
2 ఇప్పటికి 1992 సేవా సంవత్సర రిపోర్టు పూర్తికాకపోయినప్పటికీ, ఈ సేవా సంవత్సరాన్ని కూడా యెహోవా ఉన్నతమైన అభివృద్ధితో అలంకరించాడన్న రుజువు స్పష్టంగా కనిపిస్తుంది. మన గొప్ప అంతర్జాతీయ సహోదర బృందముతో కలువవలసిందిగా ఆహ్వానము సాగిపోతూ ఉంది. జ్ఞాపకార్థ దినమునకు, జిల్లాసమావేశములకు హాజరగుచున్నవారి సంఖ్య, లక్షలాదిమంది ప్రజలు రాజ్యవర్తమానమువైపు తమ ధ్యాస మళ్లిస్తున్నారని చూపుతున్నది. చాటించబడుతున్న ఈ ప్రేరేపిత ఆహ్వానమునకు అన్ని జనాంగముల వారు ప్రతిస్పందిస్తున్నారు. అదేమనగా: “యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును.”
3 అభివృద్ధిచెందుటకు తీర్మానించు కొనియుండుము: యెహోవా సంస్థ ముందుకు కదలి వెళ్లుచున్నది. యెహోవా సత్యారాధనా పర్వతము యొద్దకు అనేకమంది క్రొత్తవారు గుంపులు గుంపులుగా వస్తుండగా, ప్రతి ఒక్కరు ఇంకను ఆత్మీయాభివృద్ధిచెందుటకు అనుకూల చర్యను గైకొని, క్రొత్తవారికి వారును అలా తయారగునట్లు సహాయము చేయుట ప్రాముఖ్యము. అలా అభివృద్ధిచెందు అవసరత, యెహోవా పర్వతమునొద్దకు రండను ఆహ్వానమునకు స్పందించినవారు, ఇతరులను “రండి” అని చెప్పుచున్నారను వాక్యములో సూచించబడి ఉన్నది. అపొస్తలుడైన యోహాను ప్రకటన 22:17 లో అలాంటి మాటలనే వ్రాశాడు. ఏమనగా: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను.”
4 ఈ ఆహ్వానమును ఎలా ఇవ్వాలో యేసు ప్రదర్శించి చూపెను. ప్రజలు ఆయన బోధకు ప్రతిస్పందించినప్పుడు, వారిని కూడ తన పరిచర్యలో భాగము వహించమని ఆహ్వానించి, దానిని ఎలా చేయాలో వారికి బోధించాడు. (మత్త. 4:19; 10:5-7, 11-14) ఆయన శిష్యులు ఆయనను వెంబడిస్తూ, దానిని ఆయన ఎలా చేస్తున్నాడో గమనించుట ద్వారా ఆయన ఉపయోగించిన సమర్ధవంతమైన పద్ధతులను నేర్చుకున్నారు. తదుపరి తమ పరిచర్యను ఆయన పద్ధతిలో జరిగించారు. యేసు వ్యతిరేకులు సహితము వీరు ధైర్యముగా యిచ్చిన సాక్ష్యమునుబట్టి, వారు యేసు శిష్యులని గుర్తించునంతగా వారు ఆయన విధానములను నేర్చుకొన్నారు. అపొస్తలుల కార్యములు 4:13 ఇట్లు తెలియజేయుచున్నది: “వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడ ఉండినవారని గుర్తెరిగిరి.”
5 ఆయన పరలోకమునకు తిరిగి వెళ్లకముందు, యేసు తన శిష్యులకు వారు బోధించబడినరీతిగానే, వారును బోధిస్తూ, క్రొత్త శిష్యులను తయారు చేయుట ద్వారా తమ క్రైస్తవ పరిచర్యను శాశ్వతంగా కొనసాగించాలని ఆజ్ఞాపించాడు. మత్తయి 28:19, 20లో యేసు ఇలా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” ఇంకనూ, ఈ పని మన దినముల వరకు కొనసాగవలసినదని తన భావమై యున్నట్లు సూచిస్తూ, ఆయన మరలా ఇలా అభయమిచ్చెను: “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.”
6 యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యులు ఆయన ఆజ్ఞాపించిన వాటిని క్రొత్త శిష్యులకు బోధించవలెనను ఆయన ఉపదేశాలకు విధేయత చూపుటలో తప్పిపోలేదు. అయిననూ, యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త సంఘములో కనబడుతున్న విశేషమైన వృద్ధిని బట్టి, సంఘములో క్రొత్తగా బాప్తిస్మము పొందినవారు, బాప్తిస్మము పొందని ప్రచారకులు, మనతోపాటు బైబిలు పఠనమును చేస్తున్నవారు, కొంతమేరకు క్రమముగా సంఘ కూటములకు హాజరగుటకు ప్రారంభించిన వారి ప్రత్యేక అవసరతలను పరిగణలోకి తీసుకొనుట అవసరమవుతుంది.
7 దాదాపు, 1992 సేవా సంవత్సర ప్రారంభానికి, ఇండియాలో ప్రతి తొమ్మిది మంది ప్రచారకులలో ఒక్కరు ఒక సంవత్సరము నుండి పరిచర్యలో చురుకుగా ఉన్నారు. నలుగురిలో ఒక్కరు మూడు లేక అంతకంటె తక్కువ సంవత్సరముల నుండి ప్రచారము చేస్తున్నారు. మరియు ముగ్గురిలో ఒక్కరు అయిదు లోపు సంవత్సరముల నుండి పరిచర్యలో పాల్గొంటున్నారు. అనేకమంది క్రొత్తవారు సంఘ సభ్యులైనప్పటి నుండి మంచి అభివృద్ధి చేసికొన్నను, కొన్ని విషయము లందు ఇంకను వారికి సహాయముచేస్తే, నిస్సందేహంగా అది వారి ఆత్మీయ అభివృద్ధిని వేగిరపరచుటకు తోడ్పడగలదు.
8 హెబ్రీయులు 6:1 అందరిని “సంపూర్ణులగుటకు సాగిపోదమని” ప్రోత్సహించుచున్నది. అయితే, క్రైస్తవ పరిపక్వతలో కేవలము సేవా రిపోర్టును యివ్వడంకంటె ఎంతో ఇమిడియున్నది. దానిలో వ్యక్తిగత పఠనమందు, కూటములకు క్రమముగా హాజరగుట యందు, ఆసక్తితో ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుట యందు అభివృద్ధిచెందుట చేరియున్నది. రక్షణకొరకై సత్యమును గూర్చిన జ్ఞానము పొందునట్లు ఇతరులకు సహాయము చేయుటయు అందులో ఇమిడి ఉన్నది. ‘లేఖనములను తర్కించుటలో’ మన నైపుణ్యమును పదునుపెట్టుటకు మనము పనిచేయవలెను. (అపొ. 17:2) పరిపక్వతకెదగడానికి, సమయము అవసరము, మరియు ఎక్కువ మట్టుకు అది మన దైవభక్తి పైన, ప్రాంతీయ సేవలో అనుభవము సంపాదించుట పైన ఆధారపడి ఉంటుంది. మన స్వంత దైవభక్తి యొక్క స్థాయిపై మనము ఆధిపత్యము కల్గివున్నను, అభ్యాస యుక్తమైన అనుభవమును సంపాదించుకొనుటలో పరిపక్వతగల ఇతర సహోదర సహోదరీలను మనకు సహాయము చేయుటకు అనుమతించుట జ్ఞానయుక్తమైన విధానము. ప్రత్యేకముగా ప్రాంతీయ పరిచర్యలో, వారి అనుభవము నుండి నేర్చుకొన వచ్చును. ప్రతిదాన్ని మన స్వంత ప్రయత్నం మీద, తప్పో ఒప్పోజేసి నేర్చుకొనవలసిన అవసరము లేదు.
9 అనుభవము లేనివారికి సహాయము చేయుము: సహాయముచేయు పద్ధతి క్రైస్తవ సంఘ ప్రారంభము లోనే ప్రవేశ పెట్టబడింది. యేసు తన శిష్యులకు ఉపదేశించాడు. (మార్కు 3:14; లూకా 9:1; 10:1) తిరిగి వారు ఇతరులకు బోధించారు. అపొస్తలుడైన పౌలు నుండి తిమోతి ప్రత్యేకమైన ప్రోత్సాహమును, సహాయాన్ని పొందాడు. శిష్యుడైన అపొల్లో, ఎంతో అనుభవముగల అకుల, ప్రిస్కిల్లల వ్యక్తిగత సహాయము నుండి అభివృద్ధిచెందాడు. (అపొ. 18:24-27; 1 కొరిం. 4:17) ఈనాడు, క్రైస్తవ సంఘములోని పరిపక్వతగల సభ్యులు, అనుభవము తక్కువగల వారికి ప్రత్యేకముగా క్రొత్తవారికి, యౌవనులకు బోధిస్తూ అటువంటి మాదిరులను అనుకరిస్తున్నారు. రోమీయులు 15:1, 2 చెప్పు ప్రకారము, “కాగా బలవంతులమైన మనము . . . బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.”
10 తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు సహాయపడులాగున అనుకూలమైన చర్య గైకొను బాధ్యతను కలిగియున్నారు. ఇందులో కుటుంబ పఠనము, వ్యక్తిగతముగా ఎలా పఠించవలెనో పిల్లలకు బోధించుట, క్రమముగా కూటములకు హాజరగుట, వాటిలో పాల్గొనుట, నేర్చుకొనినవాటిని అన్వయించు కొనుటలో అనుభవము ఇమిడి ఉన్నవి. (ఎఫె. 6:4; 1 తిమో. 5:8) సంఘ పుస్తక పఠన నిర్వాహకులు వారి పుస్తక పఠన గుంపులో ఉన్నవారు, ప్రాంతీయ సేవా గుంపులలో ఉన్నవారు ఆత్మీయంగా అభివృద్ధి చెందులాగు సహాయపడు ఏర్పాట్లను చేయుటలో ప్రత్యేకంగా నాయకత్వము వహించవలెను. సేవాధ్యక్షుడు (సర్వీస్ ఓవర్‌సీర్), ఇతర పెద్దలు, పరిచారకులు మరియు సంఘములోని ఇతర సభ్యులు కూడ సహాయము చేయవచ్చును.
11 అవసరమైన దానిని అందించుము: వ్యక్తిగత పఠనము వంటి క్రైస్తవ చర్యలలోని కొన్ని రంగాలలోనే సహాయమవసరమై యుండవచ్చును. అభ్యాసపూర్వకమైన పఠన కాలక్రమ పట్టికను ఏర్పరచుకొనుటలో సలహాలు అవసరము కావచ్చును. కొందరికి వ్యాఖ్యానములు లేక నియమిత ప్రసంగములకు సిద్ధపడుటకు సహాయము అవసరమైయుండ వచ్చును. కొందరికి బహుశా బైబిలు అంశాలపై ఎలా పరిశోధన జరపాలో నేర్చుకొను అవసరముండవచ్చును.
12 అనేకమంది క్రొత్తవారికి ప్రాంతీయ పరిచర్యలో సహాయము అవసరము. ఒక ప్రచారకుడు ఇంటింటి పరిచర్యలో, పునర్దర్శనములు చేయుటలో లేక పఠనములు ప్రారంభించి వాటిని నిర్వహించుటలో ఎక్కువ సమర్థవంతముగా ఉండుటకు ఇష్టపడవచ్చును. అందుకు రీజనింగ్ పుస్తకము లేక మన రాజ్య పరిచర్యలో సూచించ బడిన సలహాలను ఉపయోగిస్తూ, కొన్ని అభ్యాస కార్యక్రమములను నిర్వహించుట సరిపోతుంది. మరికొన్ని సార్లు ప్రాంతీయ సేవకొరకై ఆచరణాత్మకమైన కాలక్రమ పట్టిక వేసికొనుటకు మరియు దానిని కచ్చితంగా అవలంబించుటకు సహాయము అవసరమై యుండవచ్చును. సహాయమవసరమైన వ్యక్తితో పనిచేయుటకు కచ్చితమైన ఏర్పాట్లుచేసికొనుట ఆయనకు లేక ఆమెకు నిర్దిష్టమైన లక్ష్యాలలో వృద్ధిచెందుటకు సహాయము చేయును.
13 మన ఆత్మీయాభివృద్ధిని అందరికి తేటగా కనబడునట్లు చేయవలెనని దేవుని వాక్యము మనలను ప్రోత్సహించుచున్నది. ఇది పౌలు తన తోటి పనివాడైన తిమోతికి వ్రాసిన ఉపదేశము. (1 తిమో. 4:15) ఆ ప్రోత్సాహమునకు అనుగుణ్యముగా, అపొస్తలుడు మనకై మనము క్రీడా పోటీకి లేక విజయవంతముగా ఆత్మీయ యుద్ధములో పాల్గొనేవారముగా శిక్షణ పొందవలసిన అవసరతను నొక్కి తెలిపాడు. (1 కొరిం. 9:24-27; 2 కొరిం. 10:5, 6) మనలను గమనించువారు మనలో నిజమైన క్రైస్తవ విశ్వాసము యొక్క సజీవమైన మాదిరిని వెంటనే చూడ గలుగునట్లు దేవుని చిత్తమును గూర్చి మనము నేర్చుకున్న దానినంతటిని అన్వయించు కొనుటకు మనము వేగిర పడవలెను. అలాగే, ఇతరులు యేసుక్రీస్తు సమర్పిత శిష్యులగు నట్లు బోధించు కళలో మనము వృద్ధిచెంద వలెను.—యాకో. 1:22-25; 1 తిమో. 4:12-16.
14 అభివృద్ధిలో శోధనలను సహించుట ఇమిడి ఉన్నది: యేసుక్రీస్తు కూడ ఆయన అనుభవించిన బాధలనుబట్టి విలువైన పాఠములను నేర్చుకొనెను. (హెబ్రీ. 5:8) కావున మనము కూడ అలా చేయగలము. యాకోబు 1:2, 3 లో సిఫారసు చేయబడిన అనుకూలమైన చర్య తీసికొనినప్పుడు ఆలాగున మన ఆత్మీయాభివృద్ధి విస్తరించును. ఏలయనగా: “మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని యెంచుకొనుడి.” కొన్నిసార్లు మనము దీర్ఘకాల వ్యాధులు, ఆర్ధిక యిబ్బందులు, విభాగించబడిన కుటుంబము, ప్రకటించు ప్రాంతములో వ్యతిరేకత లేక ఇతర అనేకమైన ప్రతికూల పరిస్థితుల సవాలును ఎదుర్కొనవలసి వచ్చినను, యెహోవా సహాయముతో వాటిని జయించి ఆయన ఆరాధనలో వృద్ధిచెందగలమను యెహోవా అభయము మనకున్నది. (1 కొరిం. 10:13; 2 కొరిం. 12:9; 1 పేతు. 5:8-11) మనము అన్ని పరిస్థితులలోను కదలక స్థిరముగా ఉండుట వలన విజయాన్ని పొందగలము. ‘దైవోక్తులను బోధించుచు, దేవుడు అనుగ్రహించు సామర్ధ్యము కొలది ఉపచారము చేసినయెడల దేవుడు అన్నింటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును.’—1 పేతు. 4:11.
15 ఇంకను అభివృద్ధి పొందుటకు సహాయమును అంగీకరించుము: నీవు ఆత్మీయ అభివృద్ధిని ఇంకను పొందుటకు సహాయము అవసరమైన వాడవైతే, సంఘములో ఎక్కువ అనుభవముగల సభ్యునినుండి సహాయమును స్వీకరించుటకు ఇష్టపడుము. మీకు సహాయముచేస్తామని ఎవరూ నీ యొద్దకు రాకున్నను, నీవు సిగ్గుపడుతూ, సహాయము పొందే అవకాశమును పోగొట్టుకొనవద్దు. సంఘములో అనుభవముగల ఎవరినుండైనను సహాయము పొందుటకు స్వేచ్ఛగా ముందుకెళ్లుము. లేక మీ సంఘ పుస్తక పఠన నిర్వాహకునిగాని, సేవాధ్యక్షునిగాని, లేక ఇతర ఏ పెద్దనైనను అవసరమగు సహాయమును అడుగుము.—ఆది. 32:26 పోల్చుము; మత్తయి 7:7, 8.
16 యెహోవా యొక్క స్వచ్ఛమైన ఆరాధనా పర్వతము యొద్దకు ప్రవాహముగా వస్తూ, ఎడతెగక విస్తరిస్తున్న అంతర్జాతీయ “గొప్పసమూహము”లో భాగమగుట, నిశ్చయముగా అద్భుతమైన ఆధిక్యత. (ప్రక. 7:9) ఈ ఔన్నత్య స్థితికి మనతోపాటు ఇతరులను రమ్మని ఆహ్వానించుట కూడ ఆధిక్యతే. హృదయ పూర్వకమైన మెప్పుతో, ఇంకను అభివృద్ధి చెందుటకు అనుకూలమైన చర్యను గైకొనుచూ, మనమట్టుకు మనలో ఆత్మీయతను పెంపొందించు కొనుటలోను, యెహోవా సేవలో మనతోపాటు అభివృద్ధి చెందుటకు చేయగలిగిన సహాయమును ఇతరులకు చేయుటలోను కొనసాగుదము.