సమావేశ కార్యక్రమాలను పునఃసమీక్షించడానికి నూతన ఏర్పాటు
సాతాను లోకం అంతకంతకు చెడిపోతుండగా, “మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, . . . ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుక[డానికి]” యెహోవా మనల్ని బలపరుస్తున్నాడు. (తీతు 2:12, 13) “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా ఆయన చేస్తున్న ఏర్పాట్లలో ప్రతి సంవత్సరం నిర్వహించబడే ప్రాంతీయ, ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాలు ఉన్నాయి. (మత్త. 24:45) ఈ ఆధ్యాత్మిక సమావేశాలు మనకు ఎంత బలాన్నిస్తాయో కదా!
అందించబడిన ఉపదేశాన్ని జ్ఞాపకం ఉంచుకొని, అన్వయించుకోవడానికి మనకు సహాయం చేసేందుకు, ఈ సమావేశ కార్యక్రమాలను పునఃసమీక్షించడానికి 2005 సేవా సంవత్సరంలో ఒక నూతన ఏర్పాటు చేయబడుతుంది. ఈ ఇన్సర్ట్లోని 5-6 పేజీల్లో సమావేశాలలో అందించబడే కార్యక్రమాల సమీక్ష మాత్రమే కాక సమావేశ కార్యక్రమాల పునఃసమీక్షా ప్రశ్నలుకూడా ఉన్నాయి. సంఘాలు ఈ సమాచారాన్ని సమావేశాలకు హాజరవడానికి కొన్నివారాల ముందు, హాజరయిన కొన్నివారాల తరువాత తమ సేవా కూటంలో పరిశీలిస్తాయి. ఇది ఎలా ఏర్పాటు చేయబడుతుంది?
సంఘం ప్రాంతీయ సమావేశానికి హాజరవడానికి ఒకటి లేక రెండువారాల ముందు ప్రాంతీయ సమావేశ కార్యక్రమంపట్ల ఉత్సుకతను పెంచేందుకు, “క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం” అనే ఆర్టికల్ ఆధారంగా సేవాకూటంలో పది నిమిషాల ప్రసంగం ఇవ్వబడుతుంది. ప్రసంగీకుడు పునఃసమీక్షా ప్రశ్నలవైపు కూడా అందరి దృష్టి మళ్ళించి, సమావేశం అయిన కొన్ని వారాల తరువాత జరిగే పునఃసమీక్ష కోసం సిద్ధపడడంలో భాగంగా సమావేశంలో నోట్సు వ్రాసుకోమని అందరినీ ప్రోత్సహిస్తాడు.
సమావేశం అయిన కొన్ని వారాల తర్వాత, సేవా కూటంలో సమావేశ మొదటిదిన కార్యక్రమంమీద 15 నిమిషాల పునఃసమీక్ష ఉంటుంది. ఆ తర్వాతి వారం రెండవదిన కార్యక్రమాన్ని పునఃసమీక్షించేందుకు 15 నిమిషాలు కేటాయించబడతాయి. ఈ ఇన్సర్ట్లో ఇవ్వబడిన పునఃసమీక్షా ప్రశ్నలను ఆ చర్చలకు ఆధారంగా ఉపయోగిస్తారు. పునఃసమీక్ష, సమాచారంయొక్క ఆచరణాత్మకమైన విలువమీద కేంద్రీకరించాలి. ఈ పునఃసమీక్షా చర్చలకు స్థానం కల్పించేందుకు పెద్దలు సేవా కూటంలోని ఇతర భాగాలను కుదించవచ్చు, తీసివేయవచ్చు లేక వేరే వారానికి వాయిదా వేయవచ్చు.
ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమానికి సంబంధించి కూడా అదే ఏర్పాటు చేయబడుతుంది, కాకపోతే కార్యక్రమం మొత్తాన్ని పునఃసమీక్షించేందుకు 15 నిమిషాల భాగం ఒకటే ఉంటుంది. మనమందరం ఈ ఇన్సర్ట్ను భద్రపరచుకొని, యెహోవా అందిస్తున్న చక్కని ఉపదేశంనుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు దానిని ఉపయోగించుకోవాలని కోరుకుంటాం.—యెష. 48:17, 18