‘తగినవేళ ఆహారం’
1. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం మీకు, వేరేవాళ్లకు ఎలా సహాయం చేసింది?
1 సాధారణంగా మనం ప్రత్యేక సమావేశదిన కార్యక్రమానికి హాజరైన తర్వాత, “సరిగ్గా మనకు అవసరమైన విషయాలే ఉన్నాయి!” అంటూవుంటాం. ఒక ప్రాంతీయ పైవిచారణకర్త, తన సర్క్యూట్లోవున్న కొంతమంది ఇటీవలి కార్యక్రమాన్ని విన్న తర్వాత, పరిచర్యలో ఇంకా ఎక్కువగా పాల్గొనాలని అనుకుంటున్నట్లు చెప్పారని నివేదించాడు. ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా చెప్పాడు, “దీని ద్వారా కాలగమనంలో మనం ఎక్కడ ఉన్నామో స్పష్టంగా తెలుసుకోగలిగాం, జీవితంలో వేటికి ప్రాధాన్యతనివ్వాలో అర్థం చేసుకోగలిగాం.” మరో ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా చెప్పాడు, “మనం ప్రాముఖ్యమైన దానిమీద అంటే పరిచర్యమీద దృష్టి పెడుతున్నామో లేదో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఇది సరిగ్గా సమయానికి గుర్తుచేసిందని చాలామంది ప్రచారకులు అంటున్నారు.” ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం మీకెలా సహాయం చేసింది?
2. రాబోయే సేవా సంవత్సర కార్యక్రమంలో ఏమి పరిశీలిస్తాం?
2 రాబోయే సేవా సంవత్సరంలో జరిగే ప్రత్యేక సమావేశదిన కార్యక్రమంలో కూడా సరిగ్గా మనకు అవసరమైన విషయాలే ఉంటాయి. ‘యెహోవాను ఆశ్రయించండి’ అన్నది దాని ముఖ్యాంశం. ఇది కీర్తన 118:8, 9 నుండి తీసుకోబడింది. ఆ సమావేశంలో చర్చించబోయే విషయాలు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి: “కష్టకాలంలో యెహోవా ఆశ్రయంగా ఎలా ఉంటాడు?,” “యెహోవా రెక్కల కింద ఆశ్రయం పొందడానికి వేరేవాళ్లకు సహాయం చేయండి,” “ఆశ్రయమిచ్చే విషయంలో యెహోవాలా ఉండండి,” “యౌవనస్థులారా, యెహోవామీద నమ్మకం ఉంచండి,” “మన ఆధ్యాత్మిక పరదైసు—మనల్ని కాపాడడానికి యెహోవా చేసిన ఏర్పాటు.”
3. సమావేశానికి హాజరైనప్పుడు మనమెలా పూర్తి ప్రయోజనం పొందవచ్చు?
3 కార్యక్రమం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు? తేదీ ప్రకటించిన వెంటనే హాజరవడానికి ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకుని, మీ బైబిలు విద్యార్థులను ఆహ్వానించండి. మనం ‘ఓపికతో ఫలించాలంటే,’ విన్నదాన్ని గుర్తుంచుకోవాలి. (లూకా 8:15) కాబట్టి, కార్యక్రమాన్ని జాగ్రత్తగా వింటూ, మీరు మీ జీవితంలో, పరిచర్యలో పాటించాలనుకుంటున్న ముఖ్య విషయాలను, ఉపదేశాన్ని క్లుప్తంగా రాసుకోండి. సమావేశం తర్వాత మీ కుటుంబమంతా కలిసి వాటిని చర్చించండి. వాటిని పాటించడానికి మీరు, మీ కుటుంబం నిర్దిష్టంగా ఏమి చేస్తే బావుంటుందో ఆలోచించండి.
4. రాబోయే ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం కోసం మనమెందుకు ఎదురుచూడాలి?
4 రుచికరమైన పౌష్టికాహారంలా, ఈ సంవత్సరంలో జరగబోయే ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం ఎంతో ప్రేమతో, ముందాలోచనతో తయారుచేయబడింది. సమావేశానికి హాజరవడానికీ, క్రైస్తవ పరిచారకులు ఆధ్యాత్మిక బలాన్ని పొందడం కోసం ఏర్పాటు చేయబడిన ‘తగినవేళ ఆహారం’ నుండి ప్రయోజనం పొందడానికీ మీరు చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించును గాక.—మత్త. 24:45.