“యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి”
ఏప్రిల్ 4న యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం
1 అనేక సంవత్సరాల క్రితం, యుక్రెయిన్ కమ్యూనిస్టు పరిపాలన క్రింద ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ప్రభువు రాత్రి భోజన ఆచరణ దినం సమీపించినప్పుడు, కూటం జరిగే స్థలం పసిగట్టవచ్చనే ఆశతో అధికారులు సహోదరులను ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. అధికారులకు ఆచరణ తేదీ ఉజ్జాయింపుగా తెలుసు కాబట్టి ఇది అన్ని సందర్భాల్లోను ఒక సమస్యగానే ఉండేది. మరి సహోదరులు ఏమి చేశారు? ఒక సహోదరి ఇంటి బేస్మెంట్ నీళ్లతో నిండివుండేది. అక్కడ ప్రజలు కూడుకుంటారని అధికారులు ఊహించే అవకాశం లేదు కాబట్టి, సహోదరులు మోకాలిలోతు నీళ్లపైన ఒక ప్లాట్‌ఫారమ్ నిర్మించారు. ఎత్తు తక్కువగా ఉన్న పైకప్పు మూలంగా సహోదరులు ఆ ప్లాట్‌ఫారమ్‌పై వంగి కూర్చోవాల్సివచ్చింది, అయితే వారు సంఘంగా కూడి ఆనందంగా జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడాన్ని ఎవరూ అడ్డుకోలేదు.
2 యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే ఆజ్ఞకు లోబడాలనే మన యుక్రెయిన్ సహోదరుల కృతనిశ్చయం, దేవునిపట్ల వారికున్న ప్రేమను అద్భుతంగా ప్రదర్శించింది. (లూకా 22:19; 1 యోహా. 5:3) మన జీవితాల్లో అడ్డంకులు ఎదుర్కొన్నప్పుడల్లా, అలాంటి ఉదాహరణల నుండి మనం ప్రోత్సహించబడి ఏప్రిల్ 4న జరిగే ప్రభువు రాత్రి భోజన ఆచరణకు హాజరుకావాలని తీర్మానించుకోవాలి. అలా చేయడం ద్వారా, “యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి” అని ఆలపించిన కీర్తనకర్త మనోభావాలనే మనమూ పంచుకుంటున్నామని మనం చూపిస్తాం.—కీర్త. 31:23.
3 దేవునిపట్ల ప్రేమలో ఎదిగేందుకు ఇతరులకు సహాయపడండి: మనతోపాటు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవమని ఇతరులను ఆహ్వానించేందుకు కూడా దేవునిపట్ల ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించాలని మనం పథకం వేసుకున్నవారి లిస్టు తయారుచేసుకోవాలని ఫిబ్రవరి మన రాజ్య పరిచర్య అనుబంధం మనల్ని ప్రోత్సహించింది. మీ లిస్టులో ఉన్న వారందరిని ఆహ్వానించడానికి మీరు కృషి చేస్తున్నారా? ఆ సందర్భపు ప్రాముఖ్యతను వారికి వివరించడానికి సమయం తీసుకోండి. జ్ఞాపకార్థ ఆచరణ దినాన్ని, సమయాన్ని స్నేహపూర్వకంగా గుర్తుచేయడం, అవసరమైతే, వారితోపాటు వస్తానని చెప్పడం హాజరయ్యేందుకు బహుశా వారిని ప్రోత్సహించవచ్చు.
4 జ్ఞాపకార్థ ఆచరణ జరిగే స్థలం దగ్గర మన ఆహ్వానం మేరకు వచ్చినవారిని పలకరించడానికి, వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయండి. యెహోవాపట్ల ప్రేమలో ఎదిగేందుకు మీరు వారికెలా సహాయం చేయవచ్చు? వారి ప్రశ్నలకు జవాబిచ్చేందుకు మీరు అందుబాటులో ఉండండి. సముచితమైతే బైబిలు అధ్యయనం ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉండండి. మన వారపు సంఘ కూటాలకు హాజరుకావడానికి వారిని ఆహ్వానించండి. హాజరైన క్రియాశూన్య క్రైస్తవులపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పెద్దలు కోరుకుంటారు. పెద్దలు అలాంటి వారిని సందర్శించడానికి, బహుశా జ్ఞాపకార్థ ప్రసంగంలో ప్రస్తావించబడ్డ అంశాలను వివరిస్తూ వారిని సంఘంతో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించమని ప్రోత్సహించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు.—రోమా. 5:6-8.
5 యెహోవాపట్ల మన ప్రేమను ప్రగాఢం చేసుకోవడం: విమోచన క్రయధన బహుమతి గురించి ధ్యానించడం యెహోవాపట్ల, ఆయన కుమారునిపట్ల మన ప్రేమను ప్రగాఢం చేయగలదు. (2 కొరిం. 5:14, 15) ఎన్నో సంవత్సరాలుగా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవుతున్న ఒక సాక్షి ఇలా చెబుతోంది: “మేము జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఎదురుచూస్తాం. ప్రతీ సంవత్సరం అది మాకు మరింత ప్రత్యేకంగా ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం మా ప్రియమైన నాన్న చనిపోయినప్పుడు నేను ఆయన శవం దగ్గర నిలబడి ఆయనను చూస్తున్నప్పుడు, విమోచన క్రయధనంపట్ల హృదయపూర్వక కృతజ్ఞతా భావం నాలో నిండిపోవడం నాకు గుర్తుంది. అంతకు ముందు కేవలం అదొక విద్యాంశంగానే ఉండేది. ఆ అంశానికి సంబంధించిన లేఖనాలన్నీ నాకు తెలుసు, వాటినెలా వివరించాలో తెలుసు. అయితే మరణపు తాకిడిని అనుభవించిన తర్వాతే, ఆ ప్రశస్తమైన విమోచన క్రయధనం ద్వారా నెరవేర్చబడే దానినిబట్టి కలిగే ఆనందంతో నా హృదయం ఉప్పొంగిపోయింది.”—యోహా. 5:28, 29.
6 ఈ సంవత్సరపు ఆచరణ తేదీ సమీపిస్తుండగా, ఆ సందర్భం కోసం మీ హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికి సమయం తీసుకోండి. (2 దిన. 19:3) ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం—2004 అనే చిన్నపుస్తకంలో, 2004 క్యాలెండర్లో పేర్కోబడిన ప్రత్యేకమైన జ్ఞాపకార్థ ఆచరణ బైబిలు పఠన భాగాలను ధ్యానించండి. కొందరు తమ కుటుంబ అధ్యయన సమయంలో మహాగొప్ప మనిషి పుస్తకంలోని 112-16 అధ్యాయాలను పునఃసమీక్షించడానికి ఇష్టపడతారు. ఇంకా కొందరు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అందించిన అధ్యయన ఉపకరణాలను ఉపయోగించి అదనపు పరిశోధన చేస్తారు. (మత్త. 24:45-47) విమోచన క్రయధనపు బహుమతిని మనమందరం ప్రార్థనాంశంగా చేసుకుందాం. (కీర్త. 50:14, 23) అవును, ఈ జ్ఞాపకార్థ ఆచరణా కాలంలో మనపట్ల యెహోవా చూపిన ప్రేమను ధ్యానిస్తూ, ఆయనపట్ల మన ప్రేమను ప్రదర్శించే మార్గాలను అన్వేషిద్దాం.—మార్కు 12:30; 1 యోహా. 4:10.