“మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి”
1 “మీ సభ్యులు నిజంగా ఆహ్లాదాన్ని కలిగిస్తారు; వాళ్ళు ఎంతో మర్యాదగా గౌరవంగా నడుచుకుంటారు” అని అమెరికాలోని, ఒక నగరంలో మన జిల్లా సమావేశానికి హాల్నిచ్చిన ఒక కన్వెన్షన్ అండ్ విజిటర్స్ కార్యాలయంవారు అన్నారు. మనం బహిరంగంగా ఎలా నడుచుకుంటున్నామన్న దానికి ఇతరులు మనలను ప్రశంసించినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. మొత్తమ్మీద చూస్తే, మనమందరమూ ‘కార్యాలన్నీ ప్రేమతో చేస్తున్నామని’ అది చూపిస్తుంది. (1 కొరిం. 16:14) అయితే, దేవుని ప్రజలకున్న మంచి పేరును పాడు చేయగల కొన్ని విషయాలున్నాయి, కనుక వాటి విషయంలో జాగ్రత్తపడాలి.
2 రూమ్ రిజర్వేషన్ల సంబంధంగా సమస్యలు: ప్రతి ఒక్కరూ సమావేశానికి హాజరవ్వగల్గేందుకు, సమావేశం జరిగే ప్రతి నగరంలోను, హోటళ్ళను సంప్రదించి, గదులను సరసమైన అద్దెకు తీసుకునేందుకు హోటళ్ళతో ఒప్పందాన్ని కుదిర్చే రూమింగ్ డిపార్ట్మెంట్ మనకు ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్లో మన సహోదరులు మన కోసం చెప్పుకోదగినంత సమయాన్ని వెచ్చిస్తారు, ప్రయత్నిస్తారు. కొన్ని హోటళ్ళ మేనేజర్లు, ఇతర మతాల వారితో కలిగిన అనుభవాలను బట్టి, మనకు తక్కువ అద్దెకు ఇవ్వడానికి మొదట్లో కొంత జంకారు. మన సమావేశానికి వచ్చేవాళ్ళు, హోటల్వారితో సహకరిస్తారని మన సహోదరులు హామీ ఇచ్చినప్పుడు, మనకు గదులివ్వడానికి అనేక హోటళ్ళవాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు.
3 అయితే, మీ వాళ్ళు చాలా మంది మునుపెన్నడూ లేనంతగా, చివరి క్షణంలో గదులను క్యాన్సిల్ చేయించుకున్నారని అనేక హోటళ్ళు గత సంవత్సరం ఫిర్యాదు చేశాయి. ఎందుకలా జరిగింది? కొందరు రెండు హోటళ్ళలో రూమ్ బుక్ చేయించుకుని, మొదటి హోటల్‌కి డిపాజిట్ పంపించకపోవడమో, లేదా తాము మరో హోటల్ని తీసుకుంటున్నందువల్ల దీన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తెలపకపోవడమో చేశారు. మరి కొందరు సహోదరులు తమతోపాటు ప్రయాణం చేస్తున్నవాళ్ళకు సహాయకరంగా ఉంటుందనుకుని ఒక్క హోటల్లోనే ఒకటి కన్నా ఎక్కువ గదులను బుక్ చేయించుకున్నారు. తీరా ఆ హోటల్‌కి వచ్చిన తర్వాత, ఒకే ఒక గదిని తీసుకుని మిగతావాటిని క్యాన్సిల్ చేశారు. వాచ్‌టవర్ సందర్శకులు మునుపెన్నడూ ఇలాగ చేయలేదని ఆయా హోటళ్ళవాళ్ళు అన్నారు.
4 సహోదరులు ఇలా చేయడం, హోటళ్ళకూ మన సమావేశ సంస్థీకరణా పనికీ గొప్ప సమస్యలను తీసుకు రాగలదు. హోటళ్ళలో కొన్ని గదులను మన సహోదరుల కోసం బుక్ చేసినప్పుడు, ఏరోజుల కోసం వాటిని బుక్ చేశారో ఆ రోజుల్లో అవి భర్తీ అయినట్లు ఆ యా హోటల్ వాళ్ళు అనుకుంటారు. కానీ, సమావేశ సమయం వచ్చేసరికి, బుక్ చేసిన అన్ని గదులను తీసుకోవడం లేదని తెలుసుకుంటారు. ఇది ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో సమావేశాలకు గదుల ఒప్పందం కుదుర్చుకోవడానికి వెళ్ళినప్పుడు హోటల్‌వాళ్ళు ఈ విషయాన్ని లేవనెత్తుతారు. ఈ పరిస్థితి రాకుండా నివారించేందుకు, మీరు తప్పనిసరిగా ఏ హోటల్ని ఎన్ని గదులను ఉపయోగిస్తారో వాటిని మాత్రమే బుక్ చేయించుకోవాలి.
5 కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఇచ్చే కొన్ని హోటళ్ళు, మన సహోదరులు కొందరు హోటల్లో తిన్నాక కూడా, చాలా ఎక్కువ పరిమాణంలో తమతో పాటు తీసుకువెళ్తూ ఈ ఏర్పాటును దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశాయి. ఒక హోటల్, తన అతిధులకు ఉదయం ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ ఇస్తే, అది అక్కడ ఉంటున్నవారికి ఇస్తున్న ఆతిధ్యమని ఎంచాలి. మనం తర్వాత తినడానికి గానీ, సమావేశంలో మన స్నేహితులతో పంచుకోవడానికి గానీ మన వెంట తీసుకువెళ్ళేందుకు హోటల్‌వాళ్ళు మనకు ఇవ్వడం లేదు. ఈ ఏర్పాటును దుర్వినియోగం చేస్తే, హోటల్‌వాళ్ళు మనకు ఈ సర్వీసును రద్దు చేయడంగానీ, గదులకు ఎక్కువ అద్దెను అడగడం గానీ, లేదా భవిష్యత్తులో మనతో ఒప్పందాలను చేసుకోవడానికి నిరాకరించడం గానీ జరగవచ్చు.
6 అందరికీ మేలు చేయడం: మంచి మర్యాదా, మాదిరికరమైన ప్రవర్తనా అనేవి, యెహోవా మీద, పొరుగువారి మీద ఉన్న ప్రేమ చేత పురికొల్పబడతాయి. (మత్త. 22:37-39; యాకో. 3:13) మనం అందరినీ ప్రేమించాలనీ, అందరినీ పరిగణనలోకి తీసుకోవాలని బైబిలు మనకు బోధిస్తోంది. (గల. 6:10) మనం హోటళ్ళలో ఉన్నప్పుడు కూడా ఆ సూత్రం వర్తిస్తుంది. సహకరించడానికి నిరాకరిస్తే, అది మన మంచిపేరు పాడవ్వడానికి కారణమవుతుంది, తక్కువ అద్దెకు గదులను తీసుకునే మన ఏర్పాటు దెబ్బతింటుంది. సహోదరుల్లో ఒకరిమీద ఒకరికి ఉక్రోషంతో కూడిన భావాలు కలుగుతాయి. ఇక మీదట, గదులను యెహోవాసాక్షులకు తక్కువ అద్దెకు ఇవ్వకూడదని హోటళ్ళు నిర్ణయించుకుంటే, ఆ నగరంలోని సమావేశాలకు హాజరయ్యే ఇతర సహోదరులపై, ముఖ్యంగా, ఎక్కువ అద్దె ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న సహోదరులపై బాగా దెబ్బతీయగలదు.
7 ఒక మంచి గదిని చాలా ముందుగా బుక్ చేసుకుని, చివరి క్షణంలో క్యాన్సిల్ చేయించుకున్నారంటే, మరొక సహోదరుడు అదే గది బుక్ చేయించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ గది తనకు లభించకుండా పోయి ఉంటుంది. కనుక ఆయన మరింత దూరంలో ఉన్న గదిని తీసుకోవలసివుంటుంది, లేదా ఆయన అంత మంచిగా లేని గదిలో ఉండవలసి రావచ్చు. అలా చేయడం ప్రేమపూర్వకమైన పనేనా, ఇతరులను పరిగణనలోకి తీసుకోవడమేనా? మన స్వప్రయోజనాలను మాత్రమే ఆలోచించక, ఇతరుల ప్రయోజనాలను కూడా మనస్సులో పెట్టుకుని, ప్రేమను కనబరచడమూ ఇతరులకు ఏది మేలో దానిని చేయడమూ ఎంత మంచిది!—మత్త. 7:12; యోహా. 13:34, 35.
8 “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే జిల్లా సమావేశానికి హాజరుకావాలని మనం ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నాం. హోటళ్ళను బుక్ చేసుకోవడమూ, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడంతో సహా మీరు అన్ని సిద్ధపాట్లను చేసుకున్నారా? హోటళ్ళలో ఉన్నప్పుడూ, సమావేశం జరుగుతున్న నగరంలో ఉన్నప్పుడూ, ఎల్లప్పుడూ, మన ప్రవర్తన మన హృదయంలో ఉన్న సత్యాన్నీ, మన సృష్టికర్తమీద మనకున్న ప్రేమనూ ప్రతిబింబించునుగాక.