2006 “విడుదల సమీపించింది” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం
1. ప్రాచీన కాలంలో దేవుని ప్రజలు సత్యారాధనపట్ల తమ గౌరవాన్ని ఎలా చూపించారు, నేడు అలాంటి ఏ అవకాశం మనకు ఉంది?
1 ప్రాచీన యూదా రాజైన హిజ్కియా, యెరూషలేములో ప్రజలు సమావేశమయ్యేలా వారికి తాకీదులు అందజేయడానికి వార్తాహరులను ఉపయోగించాడు. (2 దిన. 30:6, 13) ప్రజల ప్రతిస్పందన, సత్యారాధన విషయంలో వారి వైఖరిని వెల్లడి చేసింది. (2 దిన. 30:10-12) యెహోవాను ఆరాధించేందుకు సమకూడే ఆధిక్యతపట్ల తమ హృదయపూర్వక కృతజ్ఞతను ప్రదర్శించే అలాంటి అవకాశమే రానున్న నెలల్లో నేటి యెహోవా సేవకులకు లభిస్తుంది. “విడుదల సమీపించింది” అనే జిల్లా సమావేశానికి హాజరవమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ సంఘానికి ఒక ఉత్తరం పంపించబడింది. ఆ ఆహ్వానానికి మీరెలా ప్రతిస్పందిస్తారు? క్రొత్తవారు సమావేశానికి హాజరవడానికి, అనేక చిన్న చిన్న పట్టణాలలోని ప్రజలు యెహోవాసాక్షులను అతి సన్నిహితంగా గమనించడానికి గతంలో చిన్న చిన్న సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. అయితే ఈ సంవత్సరం పెద్ద సమావేశాలు నిర్వహించబడతాయి, తద్వారా అనేక ప్రాంతాల నుండి వచ్చే ఇతర సాక్షులతో సహవాసం చేసే అవకాశం దొరుకుతుంది.
2. సమావేశం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి మనం ఇప్పుడే ఏమి చేయవచ్చు?
2 ఇప్పుడే ఏర్పాట్లు చేసుకోండి: ప్రేమపూర్వకంగా సిద్ధం చేయబడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి మనం కార్యక్రమమంతటికీ హాజరవ్వాలి. మీరు, మీ కుటుంబం మూడు రోజులూ హాజరవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడాన్ని జ్ఞానయుక్తంగా ఇప్పుడే ప్రారంభించండి. (సామె. 21:5) అలాంటి ఏర్పాట్లలో మీ యజమానిని సెలవు అడగడం, సాక్షికాని మీ వివాహ భాగస్వామితో మీ ప్రణాళికల గురించి చర్చించడం, హోటళ్ళను బుక్ చేసుకోవడం, మీ బైబిలు విద్యార్థులు ప్రతీరోజు హాజరయ్యేందుకు సహాయం చేయడం వంటివి ఇమిడివున్నాయి. ఈ ప్రాముఖ్యమైన విషయాలను చివరి నిమిషానికి వదిలేయకండి. బదులుగా, వాటి గురించి యెహోవాకు ప్రార్థిస్తూ ‘ఆయన కార్యము నెరవేరుస్తాడు’ అనే నమ్మకముంచండి. (కీర్త. 37:5) జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవడం ఆర్థిక ఒత్తిళ్ళను ఎదుర్కొనేందుకు సహాయం చేస్తుంది. ఇప్పటినుండి సమావేశం జరిగేవరకు మనం ప్రతీవారం కొంత డబ్బును ప్రక్కన పెట్టినట్లయితే, ఆ డబ్బు కుటుంబ సభ్యులందరి ప్రయాణానికీ, బసకూ సరిపోవచ్చని మనం బహుశా గ్రహిస్తాం.—1 కొరిం. 16:2 పోల్చండి.
3. మన వసతుల కోసం చేయబడిన ఏర్పాట్లకు మనం ఎందుకు సహకరించాలి?
3 సమావేశం జరిగే ప్రతీ నగరంలో సరిపోయేంత వసతి అందుబాటులో ఉండేలా చూసేందుకు యెహోవా సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ ఆర్టికల్‌లో అందించబడిన మార్గనిర్దేశాలకు పూర్తిగా సహకరించడానికి, ఆ ఏర్పాట్లకు చేయూతనందించడంలో కష్టించి పనిచేసిన సహోదరుల స్వయంత్యాగపూరిత ప్రయత్నాలపట్ల కృతజ్ఞత, మన తోటి సమావేశ ప్రతినిధులపట్ల శ్రద్ధ, దైవపరిపాలనా క్రమంపట్ల గౌరవం మనల్ని ప్రోత్సహించాలి.—1 కొరిం. 13:5; 1 థెస్స. 5:12, 13; హెబ్రీ. 13:17.
4-6. మనం హోటల్ బుక్ చేసుకుంటున్నప్పుడు ఏ ముఖ్యాంశాలను గుర్తుంచుకోవాలి, ఎందుకు? (4వ పేజీలో ఉన్న బాక్సులోని విషయాలు చేర్చండి.)
4 హోటళ్ళను బుక్ చేసుకోవడం: సమాచార బోర్డు మీద అందుబాటులో ఉండే సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితా సమావేశ తేదీలకన్నా ఎంతో ముందే అంటించబడుతుంది. మీరు సహకరిస్తే ప్రతీ సంవత్సరం సాధ్యమైనంత తక్కువ ధరలకు సమావేశం జరిగే స్థలానికి దగ్గర్లో ఉన్నత శ్రేణి హోటళ్ళలో వసతి సంపాదించుకోవడం వీలవుతుంది.—1 కొరిం. 14:39.
5 సమావేశం జరుగుతున్నప్పుడు మీరు ఉపయోగించే హోటల్ గదులను మాత్రమే బుక్ చేసుకోవడం ప్రాముఖ్యం. ఇతర ప్రతినిధులు తాము హోటల్ గదులను ఉపయోగిస్తామని మీతో ముందుగానే చెప్పి, బుక్ చేయమని తమ పేర్లను ఖచ్చితంగా ఇస్తే తప్ప వారికోసం గదుల్ని బుక్ చేయకండి. అలాచేస్తే సమావేశం కోసం హోటల్ గదులన్నీ పూర్తిగా బుక్ అయ్యాయనే తప్పుడు అభిప్రాయం కలుగుతుంది, అందువల్ల ఇతర ప్రతినిధులు హోటల్ బుక్ చేసుకోవడం కష్టమవుతుంది. హోటల్ గదిని దానిలో బస చేసే వ్యక్తుల్లో ఒకరి పేరు మీదనే బుక్ చేయాలి.
6 మీరు బుక్ చేసుకున్నట్లు ధృవీకరించుకోవడానికి బుక్ చేసుకున్న ప్రతీ గదికి హోటల్వారికి డిపాజిట్ కట్టాలి. అలా కట్టనట్లయితే ఆ హోటల్‌వారు ఆ గదిని వేరొకరికి కేటాయించవచ్చు. మీరు జాబితాలోని అన్ని హోటళ్ళను సంప్రదించిన తర్వాత గదులు అందుబాటులో లేవని తెలిస్తే లేక ఏదైనా హోటల్‌తో మీకు సమస్య ఎదురైతే, మీ సంఘ కార్యదర్శికి తెలియజేయండి. ఆయన జాబితా పైనున్న సమాచారాన్ని ఉపయోగిస్తూ మీరు హాజరవబోయే సమావేశపు రూమింగ్ డిపార్ట్మెంట్ను సంప్రదించాలే గానీ బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించకూడదు. జాబితాలో లేని హోటల్‌ను సంప్రదించే బదులు మీరు హాజరవబోయే సమావేశం కోసం అందే సవరించబడిన జాబితా కోసం వేచివుండండి.
7, 8. ప్రత్యేక అవసరాలు ఉన్నవారిపట్ల ఎలా శ్రద్ధ చూపించవచ్చు?
7 ప్రత్యేక అవసరాలు: సామెతలు 3:27 ఇలా చెబుతోంది: “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.” సమావేశానికి సంబంధించి మనం ఇతరులకు ఎలా మేలు చేయవచ్చు? వయస్సు పైబడిన ప్రచారకులకు, అనారోగ్యంగా ఉన్నవారికి, పూర్తికాల పరిచర్యలో ఉన్నవారికి, ఇతరులకు రవాణా లేక వసతి సౌకర్యాల విషయంలో ఆచరణాత్మక సహాయం అవసరం కావచ్చు. ఇలాంటి వారిపట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత బంధువులకు ఉంది. (1 తిమో. 5:4) వారు శ్రద్ధ తీసుకోలేకపోతే తోటి విశ్వాసులు సహాయం చేయవచ్చు. (గల. 6:10) పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు తమ గుంపులో ప్రత్యేక అవసరాలు ఉన్నవారు సమావేశం కోసం ముందుగానే పథకాలు వేసుకున్నారో లేదో నిర్ధారించుకోవాలి.
8 వసతి అవసరాలను కుటుంబ సభ్యులు గానీ సంఘం గానీ తీర్చలేకపోయిన ప్రచారకులకు మాత్రమే స్పెషల్ నీడ్స్ రూమ్ రిక్వెస్ట్ ఫారాలు ఇవ్వబడతాయి. సంఘ సేవా కమిటీ, ఫారంలో ఉన్న మార్గదర్శక సూత్రాలనే కాక పెద్దల సభలన్నిటికీ ఉద్దేశించిన డిసెంబరు 14, 2004వ తేదీగల ఉత్తరాన్ని కూడా ఉపయోగించి ప్రచారకుల అర్హతలను పరిశీలించాలి. ఈ ఏర్పాటు మంచి పేరు ఉన్న ప్రచారకులకు, మంచి ప్రవర్తన ఉన్న వారి పిల్లలకు మాత్రమే.
9. (ఎ) మనం మనకు నియమించబడిన సమావేశానికే ఎందుకు హాజరవ్వాలి? (బి) మీరు మీ పరిస్థితుల కారణంగా వేరే సమావేశానికి హాజరవ్వాల్సివస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
9 వేరే సమావేశానికి హాజరవడం: సీట్లు, సాహిత్యాలు, వసతి సౌకర్యాలు మొదలైనవి సరిపోయేన్ని ఉండేటట్లు నిర్ధారించుకోవడానికి మీ సంఘానికి నియమించబడిన సమావేశానికే హాజరవ్వాలని మీరు ప్రోత్సహించబడుతున్నారు. మీ పరిస్థితుల కారణంగా మీరు వేరే సమావేశానికి హాజరవ్వాల్సివస్తే సమాచారం కోసం మీ సంఘ కార్యదర్శిని కలవండి. సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితా లేక ఏదైనా అదనపు సమాచారం కావాలంటే మీ రిక్వెస్టుతోపాటు మీ చిరునామా ఉన్న, స్టాంపులు అంటించిన కవరును పంపించడం మర్చిపోకండి. ఆ నగరంలో ఒకటి కన్నా ఎక్కువ సమావేశాలు నిర్వహించబడుతుంటే, మీరు హాజరయ్యే సమావేశపు తేదీలను పేర్కొనండి.
10. మనం రానున్న సమావేశంలో కలిగే ఆనందాన్ని అధికం చేయగల ఒక మార్గమేమిటి?
10 ఇష్టపూర్వకంగా పనిచేసే స్వచ్ఛంద సేవకులు: సమావేశానికి హాజరయ్యేవారందరూ ఆధ్యాత్మిక ఆహారం నుండి, ప్రోత్సాహకరమైన సహవాసం చేయడానికి దొరికే అవకాశాల నుండి అధిక ఆనందం పొందుతారనడంలో ఎలాంటి అనుమానమూలేదు. సమావేశాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన పనిలో చేయూతను అందించేందుకు మనం స్వచ్ఛందంగా ముందుకువచ్చినట్లయితే మన సంతోషం ఇంకా అధికమవుతుంది. (అపొ. 20:35) ఈ పనిలో భాగంవహించడానికి స్థానిక సమావేశ కమిటీలు త్వరలో ఇతరులను ఆహ్వానించనున్నాయి. మీరు అందుబాటులో ఉండగలరా?—కీర్త. 110:3.
11. మీరు వార్షిక జిల్లా సమావేశంలో ఇష్టపడే అంశమేమిటి, మీరు ఎలాంటి దృఢ సంకల్పంతో ఉండాలి?
11 జిల్లా సమావేశానికి హాజరవుతున్నప్పుడు ఐదు సంవత్సరాల ఒక అబ్బాయి ఇలా అన్నాడు: “యెహోవా ఆరాధనలో జిల్లా సమావేశం నాకు చాలా ఇష్టమైన భాగం.” మన వార్షిక జిల్లా సమావేశానికి హాజరవడాన్ని మనం ఎంతగా ఆనందిస్తామో గుర్తించడానికి ఆ హృదయపూర్వక వ్యాఖ్యానం మనందరికీ సహాయం చేస్తుంది. అది నిజంగా కీర్తనకర్త పాడినట్లే ఉంది: “నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము.” (కీర్త. 84:10) దావీదు ‘యెహోవా మందిరంలో ధ్యానించడానికి తన జీవితకాలమంతా ఆయన మందిరంలో నివసించాలి’ అనే తన కోరికను పాటలో వ్యక్తం చేశాడు. (కీర్త. 27:4) యెహోవా ఆరాధకుల మధ్య ఉండడం దావీదుకు ఎంతో సంతోషాన్నిచ్చింది. “విడుదల సమీపించింది” అనే జిల్లా సమావేశానికి మూడు దినాలూ హాజరవడం ద్వారా సత్యారాధనపట్ల ఆయనకున్న గౌరవాన్ని మనం అనుకరిద్దాం.
[3వ పేజీలోని బాక్సు]
కార్యక్రమ సమయాలు
శుక్రవారం, శనివారం
ఉద: 9:30 - సాయం: 5:05
ఆదివారం
ఉద: 9:30 - సాయం: 4:10
[4వ పేజీలోని బాక్సు]
హోటల్ బుక్ చేసుకోవడానికి మీరు అనుసరించాల్సిన పద్ధతులు
1. సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితాలో ఉన్న ఫోన్ నంబర్లను ఉపయోగించి హోటల్ పనిచేసే వేళల్లోనే ఫోన్ చేయండి.
2. మీరు యెహోవాసాక్షుల సమావేశానికి హాజరవుతున్నారని హోటల్వారికి చెప్పండి.
3. చెక్ ఇన్ చెక్ అవుట్ తేదీలను స్పష్టం చేయండి.
4. సరిపడా గదులు లభ్యం కాకపోతే జాబితాలో ఉన్న మరో హోటల్‌కు ఫోన్ చేయండి.
5. జాబితాలో సూచించబడిన ధర కన్నా ఎక్కువ ధర కట్టడానికి అంగీకరించకండి.
6. గదిని బుక్ చేసుకొని నిర్ధారణ కోసం అడగండి.
7. పది రోజుల్లో క్రెడిట్ కార్డు ద్వారా, చెక్ లేక మనియార్డర్ ద్వారా డబ్బు పంపించండి. నగదు రూపంలో డబ్బును ఎన్నడూ పంపించకండి. చెక్ లేక మనియార్డర్ ద్వారా డబ్బును పంపిస్తే నిర్ధారణ వివరాలను ముందు భాగంలో వ్రాయండి.
దయచేసి
◼ మీరు ఉపయోగించే హోటల్ గదులనే బుక్ చేసుకోండి.
◼ మీరు మొదట బుక్ చేసుకున్న గదిలోనే ఉండండి.—మత్తయి 5:37.
◼ హోటల్‌వారు అనుమతించేదానికన్నా ఎక్కువమందిని గదిలో ఉంచకండి.