పవిత్రమైన దేవోక్తులను శ్రద్ధగా ఆలకించేవారై ఉండండి
1 మానవుడు పలికే ప్రతి మాటకూ అంత అవధానాన్నివ్వవలసిన అవసరం ఉండదు. కాని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, శ్రద్ధగా ఆలకించేందుకు ప్రాముఖ్యమైన కారణముంది. (ద్వితీ. 28:1, 2) సంతోషకరమైన విషయమేమిటంటే, ప్రేరేపిత లేఖికులు మన ప్రయోజనార్థం, పవిత్రమైన “దేవోక్తులు” వ్రాసి పెట్టారు. (రోమా. 3:2) రానున్న జిల్లా సమావేశంలో, దేవోక్తులను చదివి చర్చిస్తున్నప్పుడు వాటిని వినే అమూల్యమైన అవకాశాలు మనకున్నాయి. అయితే మీరు ఎలా అవధానాన్నివ్వగలరు?
2 ప్రతిరోజూ ముందుగానే చేరుకోండి: సీనాయి కొండ దగ్గర, యెహోవాను కలుసుకొని, ఆయన ధర్మశాస్త్రాన్ని వినడానికి రమ్మని ఇశ్రాయేలీయులకు చెప్పబడినప్పుడు వాళ్ళకు కలిగిన ఆనందాన్ని ఒక్కసారి ఊహించండి! (నిర్గ. 19:10, 11, 16-19) జిల్లా సమావేశంలో యెహోవా ఇచ్చే నిర్దేశాలను స్వీకరించడంలో మీకు ఇశ్రాయేలీయులకున్నటువంటి దృక్పథం ఉంటే, సమావేశంలోని మూడు రోజులూ ముందుగా చేరుకునేందుకు మీరు ఏర్పాట్లు చేసుకుంటారు. మనం ఆలస్యంగా వెళ్తే, సీట్ల కోసం వెదకడంలో ఇతరుల అవధానానికి అంతరాయం కలిగించిన వాళ్ళమౌతాం, మనం కూడా కార్యక్రమమంతటినీ శ్రద్ధగా ఆలకించలేము. సమావేశం జరిగే హాల్ తలుపులు మూడురోజులూ ఉదయం 8 గంటలకు తెరుస్తారు, 9:30 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభమౌతుంది.
3 కొందరు, ముందుగా చేరుకున్నా, కార్యక్రమం ఆరంభమయ్యే సమయానికి, సీట్లలో ఉండరు. ఎందుకని? చైర్మన్ ప్రారంభ గీతాన్ని గురించి పేర్కొనే వరకు, తమ స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటారు, పాటను ప్రారంభించినప్పుడే తమ సీట్లలోకి వెళ్తారు. ప్రతి భాగానికి ముందు ప్రారంభ గీతానికి కొన్ని నిమిషాల ముందు, ఉపోద్ఘాత రాజ్య సంగీతం వినిపిస్తున్నప్పుడే, చైర్మన్ ప్లాట్‌ఫారమ్ మీదికి వచ్చి కూర్చోవడాన్ని మనం గమనించాలి. మనం మన సీట్లో కూర్చోవలసిన సమయమైందన్న దానికి అది సూచన ! మనమలా మన సీట్లోకి వచ్చి కూర్చుంటే, ప్రారంభ గీతాన్ని ప్రారంభించినప్పుడు, యెహోవాకు చేసే ఆ స్తుతిగీతంలో మనం కూడా మన గొంతును కలపడానికి సిద్ధంగా ఉంటాము.
4 కుటుంబ సమేతంగా వినండి: ఇశ్రాయేలీయుల సమాజానికి దేవోక్తులను చదివి వినిపించేటప్పుడు, ఇశ్రాయేలీయులు ‘పిల్లలతో’ సహా కుటుంబ సమేతంగా విని నేర్చుకోవలసి ఉండింది. (ద్వితీ. 31:12) సమావేశంలో, పిల్లలను “అదుపులేని”వారిగా వదిలిపెట్టకూడదు. (సామె. 29:15) తల్లిదండ్రులారా, కౌమార ప్రాయంలో ఉన్న మీ పిల్లలతో సహా, మీరు కుటుంబ సమేతంగా ఒకేదగ్గర కూర్చునే ఏర్పాట్లు చేసుకోండి. కొంత మంది తల్లిదండ్రులు, పిల్లలను టాయ్‌లెట్‌కి తీసుకువెళ్ళేందుకు పాట ఆరంభించే వరకూ వేచి ఉంటారు. అలా చేస్తే, మన ఆరాధనలో పాటల, ప్రార్థనల ప్రాముఖ్యతను గురించి పిల్లలకు అంతగా బోధించలేము. కనుక సాధ్యమైనంత మట్టుకు, ప్రతి కార్యక్రమ భాగాన్ని మొదలుపెట్టక ముందే అలాంటి అవసరాలను తీర్చడం ఎంత మంచిది!
5 మనం ప్రతి రాత్రీ కావలసినంత విశ్రాంతిని తీసుకుని, పగలు ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటే కార్యక్రమాన్ని శ్రద్ధగా వినగల్గుతాం. ప్రసంగీకుడు ఏమి మాట్లాడుతున్నాడన్న దానిపై అవధానాన్ని నిలపండి. మీ మనసును అటు ఇటు వెళ్ళనివ్వకండి. లేఖనాలు చదువుతున్నప్పుడు, బైబిలును తెరిచి చూడండి. క్లుప్తంగా నోట్సు రాసుకోండి. ఒక్కో ప్రసంగం వింటున్నప్పుడు, అప్పటికి ప్రసంగీకుడు చెప్పిన విషయాలను పునఃసమీక్షించుకుంటూ ఆ సమాచారాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో ఆలోచించుకోండి. ఆ యా రోజుల చివరన, ఆ యా రోజుల్లో జరిగిన కార్యక్రమంలో ఒక్కొక్కరికి ఏ విషయం బాగా నచ్చింది? మీ కుటుంబం ఆ సమాచారాన్ని ఆచరణలో ఎలా పెట్టగలదు? అన్నది కుటుంబ సమేతంగా చర్చించుకోండి.
6 దేవుని వాక్యానికి గౌరవం చూపండి: మిత్రులతో మాట్లాడడానికీ, నిర్మాణాత్మకమైన సహవాసాన్ని అనుభవించేందుకూ సమావేశాలు మనకు మంచి అవకాశాన్నిస్తాయి. ముందుగా చేరుకోవడం వల్ల, కార్యక్రమం ప్రారంభించక ముందే సంభాషించుకునేందుకు సమయం దొరుకుతుంది. అయితే, కొందరు కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా సంభాషణలు జరుపుతున్నారు. ఇది పెద్ద హాల్ కనుక, సంభాషించడం వల్ల ఇతరులకు అంతగా అంతరాయం కలగదని అనుకుంటారు. అది పొరపాటు. రాజ్య మందిరాల్లో కూటాలు జరిగేటప్పుడు ఎంత శ్రద్ధగా ఆలకిస్తామో, పెద్ద హాల్లో కూటాలు జరుగుతున్నప్పుడు కూడా అంతే శ్రద్ధగా ఆలకించాలి. సెల్యులార్ ఫోన్లను గానీ, పేజర్లను గానీ, చిన్న వీడియో కెమెరాలను గానీ, కెమెరాలను గానీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇతరులకు అంతరాయం కలిగేలా ఉపయోగించకూడదు.
7 మోషే యెహోవా నుండి ధర్మశాస్త్రాన్ని స్వీకరిస్తున్నప్పుడు, “భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు.” (నిర్గ. 34:28) అలాగే, నేడు సమావేశ కార్యక్రమం జరుగుతున్నప్పుడు, తినడం గానీ త్రాగడం గానీ చేయకూడదు. “ప్రతిదానికి సమయము కలదు” గనుక వేచివుండండి. గంభీరమైన ఆరోగ్య సమస్యలు ఉంటే అది వేరు.—ప్రసం. 3:1.
8 కొన్ని సమావేశాల్లో, చాలామంది సహోదర సహోదరీలు, చిన్నపిల్లలు సహితం, కార్యక్రమం జరుగుతుండగా నడవలో అటు ఇటు తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళకు హాల్లోకి వెళ్ళి కూర్చోమని చెప్పమని అటెండ్లకు నిర్దేశించబడుతుంది. వివిధ డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న స్వచ్ఛంద సేవకులు తమ తమ పనులు అయిన తర్వాత వెంటనే తమ సీట్లలోకి వెళ్ళి కూర్చోవాలి. కార్యక్రమం జరుగుతున్నప్పుడు అత్యవసరంగా చేయవలసిన పనేమీ తమకు నియమించబడకపోతే, సీట్లలో కూర్చుని కార్యక్రమాన్ని వినాలి. కార్యక్రమం జరుగుతుండగా, డిపార్ట్మెంట్లలోనే తచ్చాడుతూ ఒకళ్ళనొకళ్ళు కలుస్తూ ఉండకూడదు.
9 దేవుని వాక్యాన్ని వినేటప్పుడు వినడంలో “మందులై” ఉండాలని మనమెవరమూ కోరుకోము. (హెబ్రీ. 5:11) యెహోవా నుండి వచ్చిన దేవోక్తులు రానున్న జిల్లా సమావేశంలో చర్చించబడుతున్నప్పుడు, మనం వాటిని శ్రద్ధగా ఆలకించడం ద్వారా వాటిపై గౌరవాన్ని చూపాలని గట్టి నిర్ణయం తీసుకుందాం.