లౌకిక విద్యా, మీ ఆధ్యాత్మిక లక్ష్యాలూ
1 చిన్నప్పుడు మీరు మంచి ప్రాథమిక విద్య పొందడం, మీరు చక్కగా చదవడానికీ వ్రాయడానికీ, భూగోళశాస్త్రాన్ని గురించీ చరిత్రను గురించీ గణితశాస్త్రాన్ని గురించీ విజ్ఞానశాస్త్రాన్ని గురించీ కావలసినంత అవగాహనను పొందేందుకు సహాయపడుతుంది. క్రమేణా, స్పష్టంగా ఆలోచించడం ఎలాగో, వాస్తవాలను విశ్లేషించడం ఎలాగో, సమస్యలను పరిష్కరించడం ఎలాగో, ఫలవంతమైన ఆలోచనలు కలిగేలా చేసుకోవడం ఎలాగో మీరు నేర్చుకోగలరు. అలాంటి విద్య, మీ జీవితకాలమంతటిలోను మీకు ప్రయోజనాన్ని చేకూర్చుతూ ఉంటుంది. మీ లౌకిక విద్య, జీవితంలో మీ ఆధ్యాత్మిక లక్ష్యాలతో ఎలా ముడిపడి ఉండగలదు, “ఆచరణాత్మకమైన తెలివిని, ఆలోచనా సామర్థ్యాన్నీ” సంపాదించుకోవడంలో మీకెలా సహాయపడగలదు?—సామె. 3:21, 22, NW.
2 దేవుని సేవలో ఉపయోగకరమైనవారిగా అవ్వండి: మీరు పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు, క్లాస్‌లో పాఠాలు జరుగుతున్నప్పుడు శ్రద్ధనిలపండి, మీ హోమ్‌వర్క్ అసైన్మెంట్లను చక్కగా చేసేయండి. చక్కగా చదవడంపైనా, పఠన అలవాట్లపైనా మీరు మంచి పట్టు సాధిస్తే, మీరు మరింత సులభంగా దేవుని వాక్యాన్ని పరిశోధించగల్గుతారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు బలవంతులనుగా చేసుకోగల్గుతారు. (అపొ. 17:11) అన్ని అంశాల్లోను మీరు పొందే సమగ్రమైన జ్ఞానం అనేది, వివిధ నేపథ్యాలకు చెందిన, వేర్వేరు ఆసక్తులుగల, వివిధ నమ్మకాలుగల ప్రజలను పరిచర్యలో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి, మీకు సహాయపడుతుంది. మీరు స్కూల్లో సంపాదించే విద్య, దేవుని సంస్థలో మీరు మీ క్రైస్తవ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది.—పోల్చండి 2 తిమోతి 2:21; 4:11.
3 మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి నేర్చుకోండి: వాటిని అన్వయించుకుంటే, విద్యాభ్యాసం తర్వాత జీవనోపాధిని సంపాదించుకునేందుకు కావలసిన నిపుణతలు మీరు నేర్చుకోగల్గుతారు కూడా. (పోల్చండి 1 తిమోతి 5:8.) మీ సబ్జెక్ట్‌లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. పరిమితమైన ఉద్యోగావకాశాలున్న రంగంపై కేంద్రీకరించే బదులు, ఎక్కడో ఒక చోట మీకు తగిన పనిని మీరు సంపాదించుకోగల్గేలా మిమ్మల్ని సమర్థులను చేసే ఏదైనా ఒక ట్రేడ్‌ను గానీ, లేక ఒక నిపుణతను గానీ సంపాదించుకోవడాన్ని గురించి ఆలోచించండి. (సామె. 22:29) అవసరం ఎక్కువ ఉన్న చోట సేవ చేయాలని ఒకవేళ మీరు నిర్ణయించుకున్నట్లయితే, అలాంటి ట్రెయినింగ్, మిమ్మల్ని మీరు పోషించుకోవడం సాధ్యమయ్యేలా చేస్తుంది.—పోల్చండి అపొస్తలుల కార్యములు 18:1-4.
4 స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మంచి ప్రాథమిక విద్యను పొందడం, మీరు మీ పరిచర్యను విస్తృతం చేసుకునేందుకు సహాయపడుతుంది. మీరు యెహోవా సేవలో ముందుకు సాగుతుండగా, మిమ్మల్ని మీరు పోషించుకునేందుకు అవసరమైన నిపుణతలను సంపాదించుకునేందుకు బాగా కృషి చేయండి. అలా మీరు పాఠశాలలో చదువుకోవడం, మీరు మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకునేందుకు సహాయకంగా ఉంటుంది.