మన గొప్ప సృష్టికర్త మన గురించి శ్రధ్ధవహిస్తున్నాడు!
1 యెహోవా అవిధేయులైన ఇశ్రాయేలీయులను తార్కికంగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ “నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు” అని అన్నాడు. (యెష. 40:28) మన గొప్ప సృష్టికర్త గురించి మనకు తెలుసు, ఆయన మన విషయమై చూపించే ప్రేమపూర్వకమైన శ్రద్ధను మనం చూస్తున్నాము. అయినప్పటికీ లక్షలాదిమంది ఆయన ఉనికిని సందేహిస్తున్నారు, అలాగే బైబిలులో ఆయన గురించి తెలుపబడినదానికి ఏమాత్రం పొందిక లేని తలంపును కలిగి ఉన్నారు. మనం వారికెలా సహాయం చేయగలం?
2 మీ పట్ల శ్రద్ధవహించే ఒక సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనే క్రొత్త పుస్తకం అలాంటి వారికి సహాయం చేసేందుకే రూపకల్పన చేయబడింది. ఆలోచనా పరులైన ప్రజల్ని వాస్తవాల విషయమై సహేతుకంగా ఆలోచించమని అది ఆహ్వానిస్తుంది. ఆ పుస్తకంలో ఉన్న ఆకట్టుకునే సమాచారం, ఒప్పింపజేసే తర్కాలు, ఉండటం వల్ల ఆ పుస్తకం చదివేవారి అవధానాన్ని ఆకట్టుకొంటుంది.
3 సృష్టికర్త పుస్తకంతో సుపరిచితులవ్వండి: ఈ పుస్తకంలోని ప్రాథమిక విషయాంశాలను స్థూలంగా గుర్తుంచుకోండి. 2 నుండి 5 అధ్యాయాలు ఈ విశ్వము, జీవము, మనిషి ఎలా ఉనికిలోకి రావడం జరిగింది అనే విషయాన్నీ, వీటన్నిటికి కారణభూతమైనదేమిటి అనే విషయాన్నీ చర్చిస్తున్నాయి. 6 నుండి 9 అధ్యాయాలు బైబిలును, దాని గ్రంథకర్తను, ముఖ్యంగా ఆదికాండములోని సృష్టిని గూర్చిన వివరణను నమ్మవచ్చా లేదా అనే విషయాన్ని సమగ్రంగా విశ్లేషిస్తుంది. 10వ అధ్యాయం, మానవులు అడుగుతున్న అత్యంత కలవరానికి గురిచేసే ప్రశ్నల్లో ఒకటైన “సృష్టికర్త శ్రద్ధ తీసుకుంటున్నట్లయితే ఇన్ని కష్టాలు ఎందుకు పడవలసి వస్తుంది?” అనే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇస్తుంది.
4 సందేహించే వారితో తర్కించేందుకు ప్రయత్నించండి: సృష్టికర్త పుస్తకంలోని 78-79 పేజీల్లో సహేతుకమైన క్రమబద్ధమైన తర్కం కనిపిస్తుంది. దేవుని గూర్చి సరైన నిర్ధారణకు వచ్చేలా ఇతరులకు సహాయపడేందుకు మీరు దానిని ఉపయోగించవచ్చు. “ఈ విశ్వానికి ప్రారంభం ఉందా?” అని వారిని అడగండి. చాలా మంది ఉందని అంగీకరిస్తారు. అలా అంగీకరిస్తే, “అయితే దానంతటదే ప్రారంభమయ్యిందా లేక ఏదైనా కారణమయ్యిందా?” అని అడగండి. దానికి ఏదో ఒకటి కారణమయ్యుంటుందని చాలా మంది అంగీకరిస్తారు. చివరిగా, “ఈ విశ్వం శాశ్వతమైన ఏదో ఒక కారకం వల్ల ప్రారంభయ్యుంటుందా లేక శాశ్వతంగా ఉండే ఎవరో ఒకరి మూలంగా ప్రారంభమయ్యుంటుందా?” అని ప్రశ్నించవచ్చు. ఈ విధంగా సంభాషించడం ద్వారా చాలామంది సృష్టికర్త ఉండి ఉంటాడని గ్రహించేందుకు నడిపిస్తుంది.
5 సృష్టికర్త పుస్తకం చాలా మంది ప్రజలకు సరిగ్గా అవసరమైన పుస్తకం. దానిని మీ బంధువులకు, తోటి ఉద్యోగస్థులకు, తోటి విద్యార్థులకు, మరియు ఇతర పరిచయస్థులకు అందించండి. దేవుని ఉనికి విషయమై సందేహాలున్న వారిని మీరు కలిసినప్పుడు వారికి అందించగలిగేందుకుగాను మీరు పరిచర్యకు వెళ్ళేటప్పుడు ఈ పుస్తకాన్ని మీతో పాటు తీసుకువెళ్ళండి. మనకు ఈ పుస్తకంతో ఎంత ఎక్కువ పరిచయమైతే సృష్టికర్త మీద మనకున్న ప్రేమ అంతెక్కువ బలపడుతుంది, ఆయన ఉన్నతమైన ప్రమాణాలకు అనుగుణ్యంగా నడవడంలో కొనసాగేందుకు అది మనల్ని కదిలిస్తుంది.—ఎఫె. 5:1; ప్రక. 4:10, 11.