“నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకోండి”
1 సత్యాన్ని తెలుసుకున్నందుకు క్రైస్తవులు మెప్పుదలను చూపిస్తారు! ఈ లోకంలో ఉన్నవారి జీవనశైలిని అనుసరించకుండా ఉండేలా జీవించడమెలాగో నేర్చుకున్నాం. ఈ లోకంలో భాగమైన వారు “దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన” వారై, “అంధకారమైన మనస్సుగలవారై” ఉన్నారు. (ఎఫె. 4:18) మనమైతే, పాత వ్యక్తిత్వాన్ని వదిలిపెడుతూ నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకుంటూ ఇహలోక ఆలోచనా విధానం నుండి మన మనస్సులను మరల్చుకోవాలని మనకు బోధించబడుతుంది.—ఎఫె. 4:22-24.
2 పాత వ్యక్తిత్వం నైతికంగా క్రమంగా దిగజారిపోయేలా చేసి, చివరికి అది అపవిత్రతకూ మరణానికీ దారితీస్తుంది. కాబట్టి క్రోధం, కోపం, చెడుతనం, దూషణ, బూతులు అనేవాటన్నింటినీ వదిలిపెట్టమని రాజ్యవర్తమానాన్ని ఆలకించే వ్యక్తులను మనం హృదయపూర్వకంగా కోరుతాము. దేవుని అనుగ్రహాన్ని పొందాలనుకొనే వారు పాత వ్యక్తిత్వాన్ని మురికి వస్త్రాలను అన్నట్లుగా పూర్తిగా నిస్సంశయంగా విడిచిపెట్టడం తప్పనిసరి.—కొలొ. 3:8, 9.
3 మనస్సును ప్రేరేపించే నూతన శక్తి: నూతన వ్యక్తిత్వాన్ని ధరించడంలో మనస్సులను ప్రేరేపించే శక్తియందు నూతనపర్చబడడం ఇమిడివుంది. (ఎఫె. 4:23, NW) ఒకరు సరైన దిశకు మొగ్గుచూపేవారై ఉండేందుకు ఆ శక్తిని, లేదా మానసిక ప్రవృత్తిని ఎలా నూతనపరచుకుంటారు? దేవుని వాక్యమైన బైబిలును క్రమంగా, శ్రద్ధాపూర్వకంగా చదివి, దాని భావాన్ని ధ్యానించడం ద్వారానే నూతనపర్చుకుంటారు. అప్పుడు, ఒక నూతన ఆలోచనా విధానం వృద్ధి అవుతుంది, ఆ విధంగా ఆ వ్యక్తి విషయాలను దేవుని దృక్కోణంలో నుండీ క్రీస్తు దృక్కోణంలో నుండీ చూస్తాడు. సానుభూతి, దయాళుత్వం, వినయమైన మనస్సు, నమ్రత, అత్యధిక సహనం, ప్రేమలతో సహా క్రీస్తును పోలిన అనేక లక్షణాలను ధరించుకోవడం ద్వారా ఒకరి జీవితం రూపాంతరం చెందుతుంది.—కొలొ. 3:10, 12-14.
4 నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకోవడం ద్వారా మనల్ని మనం లోకం నుండి వేరుగా ఉంచుకుంటాం. మన జీవన విధానం మనల్ని భిన్నమైన వ్యక్తులుగా చేస్తుంది. మనం ఇతరులను కట్టేందుకు సత్యాన్ని మాట్లాడతాం, ఆరోగ్యకరమైన మాటలను ఉపయోగిస్తాం. మనం కోపం, ద్వేషభావం, గట్టిగా అరవడం, కఠినంగా అవమానించే విధంగా మాట్లాడటం, ప్రతివిధమైన చెడుతనంవంటి వాటిని నియంత్రించుకుంటూ, వీటన్నింటి స్థానంలో నీతినీ, దేవుని లక్షణాలనూ అలవరచుకుంటాం. క్షమించే వ్యక్తిగా ఉండడంలో సాధారణంగా మన నుంచి కోరబడుతున్న దాని కన్నా ఎక్కువే చేస్తాము. నిస్సంశయంగా వీటన్నింటినీ చేయడమనేది హృదయం నుండే వస్తుంది.—ఎఫె. 4:25-32.
5 నూతన వ్యక్తిత్వాన్ని ఎన్నడూ విడిచిపెట్టవద్దు. అది లేకుండా మనం యెహోవాను ఆయన అంగీకరించే విధంగా సేవించలేము. ప్రజలను సత్యంవైపుకు ఆకర్షించేలా సహాయపడేందుకూ మన అద్భుతమైన నూతన వ్యక్తిత్వాన్ని కలుగజేసిన సృష్టికర్తయైన యెహోవాను మహిమపరిచేందుకూ దాన్ని అనుమతించండి.—ఎఫె. 4:24.