సృష్టికర్త మీ జీవితాలకు అర్థాన్ని చేకూర్చగలడు
“యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక”—కీర్తన 148:5.
1, 2. (ఎ) మనం ఏ ప్రశ్నను పరిశీలించాలి? (బి) యెషయా ప్రశ్నలో సృష్టి ఎలా ఇమిడివుంది?
“నీకు తెలియలేదా?” ఈ ప్రశ్న, “ఏమిటి తెలియనిది” అని ప్రతిస్పందించేందుకు నడిపించేదిగా మాత్రమే అనిపించవచ్చు. కానీ అది గంభీరమైన ప్రశ్న. అంతేగాక, మనం ఆ ప్రశ్న, బైబిలు పుస్తకమైన యెషయా 40వ అధ్యాయంలో ఎటువంటి సందర్భంలో ఉపయోగించబడిందో గమనించినప్పుడు దాని జవాబును ఇంకా బాగా గుణగ్రహించగలం. ప్రాచీనకాలంలోని హెబ్రీయుడైన యెషయా దాన్ని వ్రాశాడు, కాబట్టి ఈ ప్రశ్న పాతది. అయినా, చాలా ఆధునికమైనది కూడా, అది మీ జీవిత పరమార్థానికి సంబంధించినది.
2 అంత ప్రాముఖ్యమైనది గనుకనే యెషయా 40:28లోని ప్రశ్న మన గంభీరమైన అవధానాన్ని ఆకట్టుకుంటుంది: “నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు.” (ఇటాలిక్కులు మావి.) కాబట్టి ఆ ‘తెలుసుకోవడం’ అనేది భూమి యొక్క సృష్టికర్తను గురించే. ఇందులో ఇమిడివున్నది భూమి మాత్రమే కాదని సందర్భం చూపిస్తుంది. ‘మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేయువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు’ అని నక్షత్రాల గురించి యెషయా, దీనికి కొంచెం ముందు వ్రాశాడు.
3. సృష్టికర్తను గురించి మీకు ఎంతో తెలిసినప్పటికీ మీరు మరింత ఎక్కువ తెలుసుకోవాలని ఎందుకు కోరుకోవాలి?
3 అవును, “నీకు తెలియలేదా?” అన్న ప్రశ్న నిజానికి మన విశ్వ సృష్టికర్తను గురించినదే. “భూదిగంతములను సృజించిన”వాడు యెహోవా దేవుడేనని వ్యక్తిగతంగా మీకు నమ్మకం కుదిరి ఉండవచ్చు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన మార్గాల గురించి కూడా మీకు ఎంతో తెలిసివుండవచ్చు. కానీ, ఒక సృష్టికర్త ఉన్నాడా అని సందేహించే, ఆయన ఎలాంటివాడో స్పష్టంగా తెలియని ఒక వ్యక్తిని మీరు కలిస్తే అప్పుడేమిటి? అలాంటి వ్యక్తి తారసపడటంలో ఆశ్చర్యపోవల్సినదేమీ లేదు, ఎందుకంటే సృష్టికర్త గురించి తెలియని లేదా సృష్టికర్త ఉన్నాడని నమ్మని మనుష్యులు కోట్లకొలదిగా ఉన్నారు.—కీర్తన 14:1; 53:1.
4. (ఎ) సృష్టికర్తను గురించి ఈ సమయంలో తలంచడం ఎందుకు యుక్తం? (బి) విజ్ఞానశాస్త్రం దేనికి జవాబుల్ని ఇవ్వలేదు?
4 విశ్వం ఆవిర్భవించినదాని గురించిన, జీవం ఆవిర్భవించినదాని గురించిన ప్రశ్నలకు విజ్ఞానశాస్త్రం దగ్గర జవాబులున్నాయనీ (లేదా త్వరలో కనుగొంటుందనీ) భావించే అనేకమంది సంశయవాదుల్ని స్కూళ్ళు ఉత్పత్తి చేస్తున్నాయి. జీవావిర్భావం (ఫ్రెంచి భాషలోని అసలు పేరు ఓ ఆరీజీన్ డ లా వీ) అనే పుస్తకంలో ఆజాన్, లనే అనే రచయితలు ఇలా చెబుతున్నారు: “ఇరవై ఒకటవ శతాబ్దం ప్రారంభం కాబోతున్నా కూడా జీవావిర్భావాన్ని గురించిన వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత క్లిష్టమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు, విశ్వం యొక్క అపరిమితత్వం మొదలుకొని పదార్థం యొక్క సూక్ష్మాతి సూక్ష్మ స్థాయి వరకూ—అన్ని రంగాల్లోనూ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.” అయితే, ఆ పుస్తకంలోని “ఆ ప్రశ్న ఇప్పటికీ అలాగే ఉంది” అనే చివరి అధ్యాయం ఇలా ఒప్పుకుంటుంది: “భూమ్మీద జీవం ఎలా ఉద్భవించింది అన్న ప్రశ్నకు కొన్ని వైజ్ఞానిక జవాబులను మనం పరిశీలించాం. కానీ జీవం ఎందుకు ఉద్భవించింది? జీవానికి ఉద్దేశం అంటూ ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు విజ్ఞానశాస్త్రం జవాబివ్వలేదు. విజ్ఞానశాస్త్రం, అనేకమైన విషయాలకు సంబంధించి, ‘ఎలా’ అనే ప్రశ్నల జవాబుల కోసం మాత్రమే పరిశోధిస్తుంది. కానీ ‘ఎలా,’ ‘ఎందుకు’ అనేవి పూర్తిగా భిన్నమైన ప్రశ్నలు. . . . ‘ఎందుకు’ అనే ప్రశ్నకు జవాబును తత్త్వశాస్త్రమూ, మతమూ—అన్నింటికీ మించి మనలో ప్రతి ఒక్కరమూ కనుక్కోవాలి.”
జవాబుల్నీ, అర్థాన్నీ కనుక్కోవడం
5. సృష్టికర్తను గురించి మరింత ఎక్కువ తెలుసుకోవడం ద్వారా ప్రాముఖ్యంగా ఎటువంటి ప్రజలు ప్రయోజనం పొందగలరు?
5 అవును, జీవం ఎందుకు ఉనికిలో ఉందో మరి ప్రాముఖ్యంగా—మనం ఎందుకు ఇక్కడ ఉన్నామో అర్థం చేసుకోవాలని కోరుకుంటాం. అంతేకాదు, ఒక సృష్టికర్త ఉన్నాడన్న నిర్ధారణకు ఇప్పటికీ రాని ప్రజల్లో, ఆయన మార్గాల గురించి ఏమాత్రం తెలియని ప్రజలపట్ల మనం ఆసక్తి గలవారమైవుండాలి. లేదా దేవుణ్ని గురించి బైబిలు చెప్పేదానికి పూర్తి భిన్నమైన తలంపు ఉన్న నేపథ్యాలవారి గురించి ఆలోచించండి. దేవుడనే ఒక వ్యక్తి, తనవైపు ప్రజల్ని ఆకర్షించే వ్యక్తిత్వంగల ఒక వాస్తవికమైన వ్యక్తి అంటూ ఒక వ్యక్తి ఉన్నాడన్న భావన లేని ప్రజలున్న ప్రాచ్య దేశాల్లోనూ లేదా మరితర ప్రాంతాల్లోనూ కోట్లాదిమంది ప్రజలు పుట్టి పెరిగారు. వారికి సంబంధించినంత మట్టుకు “దేవుడు” అన్న పదం ఏదో అస్పష్టమైన శక్తి లేదా ఏదో నిగూఢ కారకం మాత్రమే. వారు ‘సృష్టికర్తను’ గానీ, ఆయన మార్గాలనూ గానీ ‘తెలుసు’కోలేదు. వారికిగానీ, లేదా వాళ్ళ దృక్పథాలకు సాదృశ్యమైన దృక్పథాలున్న కోట్లాదిమంది ఇతరులకు గానీ సృష్టికర్త ఉన్నాడన్న నమ్మకం కుదిరితే, వారు పొందగల ప్రయోజనాలు ఎంత గొప్పవో కదా ! నేడు నిజంగా ఎంతో అరుదైనవాటిని, అంటే జీవితానికొక నిజమైన అర్థాన్ని, జీవితానికొక నిజమైన ఉద్దేశాన్ని, మనశ్శాంతిని కూడా వారు పొందగలరు.
6. పాల్ గాగిన్ అనుభవాలకూ, ఆయన వేసిన ఒక చిత్రానికీ నేడు అనేకమంది జీవితాలు ఎలా పోలిక కలిగివున్నాయి?
6 సోదాహరణంగా చెప్పాలంటే: 1891లో ఫ్రెంచి చిత్రకారుడైన పాల్ గాగిన్ ఒక సంతృప్తికరమైన జీవితాన్ని అన్వేషిస్తూ నిజంగా పరదైసే అన్పించేటువంటి ఫ్రెంచ్ పోలినేషియాకు వెళ్లాడు. కానీ ఆతని గతకాలపు విచ్చలవిడితనం త్వరలోనే ఆయన్ను, మరితరుల్ని వ్యాధికి గురిచేసింది. మృత్యువు సమీపించినట్లు తనకు అనిపించగా, ఆయన ఒక పెద్ద క్యాన్వాస్ మీద ఆయన, ‘జీవితం ఒక గొప్ప మర్మమని అభివర్ణిస్తున్నాడు’ అని అన్పించేటువంటి ఒక చిత్రాన్ని వేశాడు. ఆ చిత్రానికి గాగిన్ ఏమని పేరు పెట్టాడో మీకు తెలుసా? “మనం ఎక్కడి నుండి వస్తున్నాం? మనం ఏమిటి? మనం ఎక్కడికి వెళ్తున్నాం?” ఇతరులు అటువంటి ప్రశ్నలు అడగడం మీరు వినే ఉండవచ్చు. ఇతరులు వీటికి సాదృశ్యమైన ప్రశ్నలు వేయడం మీరు విని ఉంటారు. చాలా మంది అలా ప్రశ్నిస్తారు. కానీ తాము సంతృప్తికరమైన జవాబులను—జీవితానికి నిజమైన అర్థాన్ని—కనుగొననప్పుడు ఎక్కడికి వెళ్ళగలరు? తమ జీవితాలకూ జంతువుల జీవితాలకూ తేడా ఏమీ లేదన్న అభిప్రాయానికి వాళ్ళు రావచ్చు.—2 పేతురు 2:12.a
7, 8. విజ్ఞానశాస్త్ర పరిశోధనలు ఎందుకు సంపూర్ణము కావు?
7 అందుకనే, భౌతికశాస్త్ర ప్రొఫెసర్ అయిన ఫ్రీమన్ డైసన్‌లాంటి వ్యక్తి ఎందుకు ఇలా వ్రాయగల్గాడో మీరు అర్థం చేసుకోగలరు: “యోబు అడిగిన ప్రశ్నల్నే నేను మళ్ళీ అడుగుతున్నానంటే, అనేకమంది గౌరవనీయులైన వ్యక్తుల తలంపుల్ని పంచుకుంటున్నానన్న మాట. మనం బాధల్ని ఎందుకు అనుభవిస్తున్నాం? ఈ లోకం ఎందుకింత అన్యాయంతో నిండిపోయింది? బాధా, విషాదమూ అనేవి ఉండటంలో ఉద్దేశమేమిటి?” (యోబు 3:20, 21; 10:2, 18; 21:7) ముందు పేర్కొన్నట్లు, చాలామంది ప్రజలు జవాబుల కోసం దేవుని వైపుకు గాక విజ్ఞానశాస్త్రం వైపుకు తిరుగుతారు. జీవశాస్త్రజ్ఞులు, సముద్రశాస్త్రజ్ఞులు, మరితరులు మన భూగోళాన్ని గురించిన, దానిమీది జీవాన్ని గురించిన జ్ఞానపు భాండాగారానికి మరింత జోడిస్తున్నారు. ఖగోళశాస్త్రజ్ఞులు, భౌతికశాస్త్రజ్ఞులు మరో దిశలో పరిశోధన జరుపుతూ, సౌర కుటుంబాన్ని గురించి, నక్షత్రాల గురించి, చివరికి సుదూరాన్నున్న గ్యాలక్సీల గురించి ఇంకా ఇంకా నేర్చుకుంటునేపోతున్నారు. (పోల్చండి ఆదికాండము 11:6.) అటువంటి వాస్తవాలు సహేతుకమైన ఏ అభిప్రాయానికి రావడానికి నడిపించగలవు?
8 కొందరు శాస్త్రజ్ఞులు విశ్వంలో గోచరమయ్యే దేవుని “మనస్సు” గురించీ లేదా “చేతివ్రాత” గురించీ మాట్లాడతారు. కానీ అలా అంటే అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా పోతామా? “విశ్వశాస్త్రం దేవుని ‘మనస్సు’ను, ‘చేతివ్రాత’ను వెల్లడి చేస్తుందని పరిశోధకులు చెబుతున్నప్పుడు వారు దైవత్వానికి ఆపాదిస్తున్నది, ఈ విశ్వం యొక్క అప్రధానమైన అంశాన్ని, అంటే దాని భౌతిక నిర్మాణాన్నే” అని సైన్స్ పత్రిక అంటుంది. వాస్తవానికి, నోబెల్ బహుమతి గ్రహీత అయిన స్టీవన్ వైన్‌బెర్గ్ ఇలా వ్రాశాడు: “విశ్వం ఎంతగా గ్రహించదగినదిగా కన్పిస్తుందో అంత అర్థరహితంగా కూడా అన్పిస్తుంది.”
9. సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మనకు, మరితరులకు ఏ సాక్ష్యాధారాలు సహాయపడగలవు?
9 అయినప్పటికీ, ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి, జీవితం యొక్క నిజమైన అర్థం సృష్టికర్తను తెలుసుకోవడంతో ముడిపడి ఉందని గ్రహించిన లక్షలాదిమందిలో మీరు ఒకరై ఉండవచ్చు. అపొస్తలుడైన పౌలు ఏమి వ్రాశాడో జ్ఞప్తికి తెచ్చుకోండి: “దేవుని గురించి తమకు తెలియదని మనుషులు చెప్పలేరు. ఈ లోకారంభం నుండి దేవుడు చేసినవాటి ఆధారంగా ఆయన ఎలాంటివాడో మనుషులు చూడగలిగారు. ఇది నిత్యం నిలిచే ఆయన శక్తిని చూపిస్తుంది. ఇది ఆయన దేవుడని చూపిస్తుంది.” (రోమీయులు 1:20, హోలీ బైబిల్, న్యూ లైఫ్ వర్షన్) అవును, మన లోకాన్ని గురించిన, మన గురించిన కొన్ని వాస్తవాలు ప్రజలు సృష్టికర్తను గుర్తించడానికి, ఆయనతో ముడిపడివున్న జీవిత పరమార్థాన్ని కనుగొనడానికి సహాయం చేయగలవు. ఇందులో మూడు అంశాలను పరిశీలించండి: మన చుట్టూ ఉన్న విశ్వం, జీవావిర్భావం, మన సొంత మానసిక సామర్థ్యాలు.
నమ్మడానికి కారణాలు
10. మనం “ఆది”ని గురించి ఎందుకు ఆలోచించాలి? (ఆదికాండము 1:1; కీర్తన 111:10)
10 మన విశ్వం ఎలా వచ్చింది? మన విశ్వం ఒకప్పుడు ఉనికిలో లేదని సైంటిస్టుల్లో అత్యధికులు గ్రహిస్తున్నారని స్పేస్ టెలిస్కోపుల గురించిన, అంతరిక్ష పరిశోధనల గురించిన నివేదికల ద్వారా మీకు తెలిసేవుండవచ్చు. దానికొక ఆరంభం ఉంది, అంతేగాక అది వ్యాకోచిస్తూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది? ఖగోళశాస్త్రజ్ఞుడైన సర్ బెర్నార్డ్ లోవెల్ చెబుతున్నది వినండి: “ఒకవేళ గతంలో ఒకప్పుడు, విశ్వం అతి చిన్న పరిమాణంలోనూ అపరిమితమైన సాంద్రతతోను ఉన్న బిందువుగా ఉన్నట్లైతే, దానికి ముందు ఏముందని మనం అడగాల్సివుంటుంది . . . ఆరంభాన్ని గురించిన సమస్యను మనం ఎదుర్కోవల్సి ఉంది.”
11. (ఎ) విశ్వం ఎంత విస్తారంగా ఉంది? (బి) విశ్వంలోని ఖచ్చితత్వం దేన్ని సూచిస్తుంది?
11 మన భూమితో సహా ఈ విశ్వం యొక్క నిర్మాణం అద్భుతమైన శృతిని ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, దీర్ఘకాలిక సామర్థ్యం, స్థిరత్వం అనేవి మన సూర్యుని, అలాగే మరితర నక్షత్రాల గమనార్హమైన రెండు లక్షణాలు. ప్రస్తుత అంచనాల ప్రకారం, దృశ్య విశ్వంలో గ్యాలక్సీల సంఖ్య 5,000 కోట్ల (50,000,000,000) నుండి 125,000 కోట్ల వరకు ఉంది. మన పాలపుంత గ్యాలక్సీలో కోట్లానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించండి: మోటారు వాహనంలోని ఇంజన్‌కు ఖచ్చితమైన నిష్పత్తిలోని ఇంధనమూ, గాలీ అవసరమని మనకు తెలుసు. మీకు సొంతంగా ఒక కారు గనుక ఉన్నట్లైతే అది మరింత సాఫీగా మరింత చక్కగా నడిచేందుకు దాని ఇంజన్‌లోని తప్పిపోయిన అమరికను సరిచేసేందుకు మీరు మంచి శిక్షణ పొందిన మెకానిక్‌ను రప్పించుకుంటారు. కేవలం ఒక చిన్న ఇంజన్‌కే అంతటి ఖచ్చితత్వం అవసరం అయితే, ఉదాహరణకు, ఎంతో చక్కగా “మండుతూ” ఉండే సూర్యుని సంగతేమిటి? భూమ్మీద జీవం మనగలిగేలా తత్సంబంధిత కీలక శక్తులు ఖచ్చితమైన స్థాయిల్లో అమర్చబడి ఉన్నాయన్నది స్పష్టం. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? “నువ్వు ఆకాశాన్ని శాసించే నియమాలను ప్రకటించావా, లేక భూమ్మీది ప్రకృతి నియమాలను నిర్ణయించావా?” అని ప్రాచీన కాలంలోని యోబును ప్రశ్నించడం జరిగింది. (యోబు 38:33, ద న్యూ ఇంగ్లీష్ బైబిల్) ఏ మానవమాత్రుడూ అలా చేయలేదు. మరి అంతటి ఖచ్చితత్వం ఎక్కడినుండి వచ్చింది?—కీర్తన 19:1.
12. సృష్టి వెనుక ఒక శక్తివంతమైన మేదస్సు ఉందని పరిగణించడం ఎందుకు అసహేతుకం కాదు?
12 ఆ మూలం మానవ నేత్రాలు చూడలేని ఏదైనా వస్తువు నుండి వచ్చిందా లేదా అలాంటి ఒక వ్యక్తి నుండి వచ్చిందా? ఈ ప్రశ్నను ఆధునిక విజ్ఞానశాస్త్రపు వెలుగులో పరిశీలించండి. బ్లాక్ హోల్స్ అనే ఎంతో శక్తివంతమైన అంతరిక్ష దేహాలు ఉన్నాయని ఖగోళశాస్త్రజ్ఞుల్లో చాలామంది ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఈ బ్లాక్ హోల్‌లు కంటికి కనిపించవు. అయినా అవి ఉనికిలో ఉన్నాయని నిపుణులు పూర్తి నిశ్చయతతో ఉన్నారు. అదే విధంగా, కనిపించని శక్తిమంతులైన ప్రాణులు, అంటే ఆత్మ ప్రాణులు మరో జగత్తులో ఉన్నారని బైబిలు నివేదిస్తుంది. అటువంటి శక్తిమంతులైన అదృశ్య వ్యక్తులు ఉనికిలో ఉన్నట్లైతే, ఈ విశ్వం అంతట్లో మనకు కనిపించిన ఖచ్చితత్వం ఒక శక్తిమంతమైన మేదస్సు నుండి ఉద్భవించిందని నమ్మడం ఉచితం కాదా?—నెహెమ్యా 9:6.
13, 14. (ఎ) జీవావిర్భావాన్ని గురించి విజ్ఞానశాస్త్రం ఏ విషయాన్ని రూఢిగా స్థాపించింది? (బి) భూమ్మీద జీవం ఉనికిలో ఉండటం దేన్ని సూచిస్తుంది?
13 సృష్టికర్త ఉన్నాడని ప్రజలు గుర్తించడానికి సహాయపడగల రెండవ సాక్ష్యాధారం జీవావిర్భావానికి సంబంధించినది. జీవం ఉనికిలోనే లేనప్పుడు, నిర్జీవ పదార్థం నుండి సజీవ పదార్థం ఉత్పత్తికావడం ద్వారా జీవం అకస్మాత్తుగా ఉద్భవించదన్న విషయం లూయీ పాశ్చర్ పరిశోధనల కాలం నుండే అంగీకరించడం జరిగింది. మరి భూమ్మీది జీవం ఎలా ఆవిర్భవించింది? ఏదో పురాతనకాలం నాటి సముద్రంలో మొదట ఉండిన వాతావరణాన్ని మెరుపులు నిరంతరాయంగా ఢీకొన్నప్పుడు జీవం నెమ్మదిగా వికాసం చెందివుంటుందని రుజువు చేయడానికి 1950లలో సైంటిస్టులు ప్రయత్నించారు. అయితే, అటువంటి వాతావరణం ఎన్నడూ ఉనికిలో ఉండలేదు కాబట్టి భూమ్మీద అటువంటి జీవావిర్భావం సంభవనీయం కాదని ఇటీవల లభించిన రుజువు చూపిస్తుంది. తత్ఫలితంగా, కొందరు సైంటిస్టులు కాస్త ఎక్కువ లోపాలు లేని వివరణ కోసమైన వెదుకులాటలో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా అసలు విషయం నుండి ప్రక్కదారి పడుతున్నారా?
14 విశ్వాన్నీ అందులోని జీవాన్నీ దశాబ్దాలపాటు అధ్యయనం చేసిన తర్వాత బ్రిటీష్ సైంటిస్ట్ అయిన సర్ ఫ్రెడ్ హోయిల్ ఇలా వ్యాఖ్యానించాడు: “జీవం ప్రకృతి యొక్క గ్రుడ్డి శక్తుల మూలంగా ఉద్భవించే సంభవనీయత చాలా చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ దాన్ని నమ్మడం కన్నా, జీవావిర్భావం ఉద్దేశపూర్వకంగా తీసుకోబడిన మేధాపరమైన చర్య ఫలితం అని నమ్మడం శ్రేష్ఠం అన్పించింది.” అవును, మనం జీవాన్ని గురించిన అత్యద్భుతమైన విషయాల్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, జీవం ఒక మేధాపరమైన మూలం నుండి ఆవిర్భవించిందనడం అంత ఎక్కువ తార్కికంగా ఉంటుంది.—యోబు 33:4; కీర్తన 8:3, 4; 36:9; అపొస్తలుల కార్యములు 17:28.
15. మీరు సాటిలేనివారని ఎందుకు చెప్పవచ్చు?
15 తర్కంలో మొదటిది విశ్వాన్ని గూర్చినది కాగా, రెండవది భూమ్మీది జీవావిర్భావాన్ని గూర్చినది. మూడవది చూడండి—మన సాటిలేనితనము. మానవులందరూ అనేక రీతుల్లో సాటిలేనివారే, అంటే మీరు కూడా సాటిలేనివారేనన్నమాట. అదెలా? మానవ మెదడుని ఒక శక్తివంతమైన కంప్యూటరుతో పోల్చడాన్ని మీరు వినే ఉంటారు. అయితే, నిజానికి దానితో పోల్చడం సరికాదని ఇటీవలి వైజ్ఞానిక ఆవిష్కరణలు చూపిస్తున్నాయి. “చూసే, మాట్లాడే, కదిలే, లేదా విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించే సామర్థ్యాల్లో కనీసం 4 ఏండ్ల పిల్లవాని దరిదాపుల్లోకి కూడా నేటి కంప్యూటర్లు రాలేవు. . . . అత్యంత శక్తివంతమైన సూపర్‌కంప్యూటర్లలోని సమాచారాన్ని ప్రోసెస్ చేసే సామర్థ్యం కూడా ఒక చిన్న నత్తలోని నాడీ వ్యవస్థకు—[మీ] కపాలంలోని సూపర్‌కంప్యూటర్‌కు అవసరమయ్యే శక్తిలో అతి స్వల్పమైన పరిమాణానికి సమానమని అంచనా వేయబడింది” అని మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ఒక శాస్త్రజ్ఞుడు చెబుతున్నాడు.
16. మీ భాషా సామర్థ్యం దేన్ని సూచిస్తుంది?
16 భాష మాట్లాడే సామర్థ్యం మీకుండడానికి కారణం మీ మెదడే. కొందరు రెండు, మూడు, లేదా అంతకన్నా ఎక్కువ భాషలు మాట్లాడతారు, అయినా ఒక్క భాష మాట్లాడే సామర్థ్యమే ఉన్నా అది మనల్ని సాటిలేనివారినిగా చేస్తుంది. (యెషయా 36:11; అపొస్తలుల కార్యములు 21:37-40) ప్రొఫెసర్లైన ఆర్. ఎస్. ఫౌట్స్, డి. హెచ్. ఫౌట్స్‌లు ఇలా ప్రశ్నిస్తున్నారు: “భాష ద్వారా మనస్సులోని భావాలను తెలిపే సామర్థ్యమున్నది . . . కేవలం మనిషికి మాత్రమేనా? . . . ఉన్నత జంతువులు అన్నీ నిశ్చయంగా . . . సంజ్ఞల ద్వారా, వాసనల ద్వారా, కూతల ద్వారా, కేకల ద్వారా, పాడటం ద్వారా, తేనెటీగల విషయంలో చూస్తే చివరికి వాటి నృత్యం ద్వారా కూడా అవి సమాచారాన్ని తెలుపుకుంటాయి. అయినప్పటికీ మనిషి తప్పించి జంతువులకు వ్యాకరణ సహితమైన భాష ఉన్నట్లు కన్పించడం లేదు. అంతేగాక, జంతువులు చిత్రాలను వేయలేవు, ఇది చాలా విశిష్టమైన విషయం. మహా అంటే, ఏదో పిచ్చి గీతలను మాత్రం గీయగలవు.” నిజమే, కేవలం మానవులు మాత్రమే భాషను మాట్లాడేందుకూ, అర్థవంతమైన చిత్రాలను గీసేందుకు తమ మెదడును ఉపయోగించగలరు.—పోల్చండి యెషయా 8:1; 30:8; లూకా 1:3.
17. ఒక జంతువు అద్దంలో చూడటానికీ ఒక మానవుడు అద్దంలో చూడటానికీ ప్రాథమికమైన తేడా ఏమిటి?
17 అంతేగాక, మీకు మీ గురించి తెలుసు; మీకు మీ గురించిన స్పృహ ఉంది. (సామెతలు 14:10) మీరు ఒక పక్షి గాని, కుక్క గాని, లేదా పిల్లి గాని అద్దంలోకి చూసుకుని ముక్కుతో పొడవడమో, గుర్రుమనడమో, లేదా దాడి చేయడమో చూశారా? అది వేరే పక్షిని/జంతువుని చూస్తుందని అనుకుంటుందే గాని, అది తానేనని గుర్తించదు. దానికి భిన్నంగా, మీరు అద్దంలో చూసుకున్నప్పుడు అది మీరేనని మీకు తెలుసు. (యాకోబు 1:23, 24) అందులో మీ రూపాన్ని చూసుకుంటారు, కొద్ది సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారోనని ఆలోచిస్తారు. జంతువులు అలా చేయవు. అవును, మీ మెదడు మిమ్మల్ని సాటిలేనివారిగా చేస్తుంది. దీని ఘనతంతా ఎవరికి చెందుతుంది? మీ మెదడు దేవుని నుండి కాకపోతే, మరెలా వచ్చింది?
18. మీలో ఉన్న ఏ మానసిక సామర్థ్యాలు మిమ్మల్ని జంతువుల నుండి భిన్నమైనవారిగా చేస్తాయి?
18 మీ మెదడు మీరు కళను, సంగీతాన్నీ మెచ్చుకోవడానికీ, అలాగే నైతిక స్పృహ కలిగివుండటానికీ అనుమతిస్తుంది. (నిర్గమకాండము 15:20; న్యాయాధిపతులు 11:34; 1 రాజులు 6:1, 29-35; మత్తయి 11:16, 17) మీ విషయంలో మాత్రమే ఎందుకలా, జంతువులు విషయంలో ఎందుకు కాదు? జంతువులు ప్రాథమికంగా ఆహారం తెచ్చుకోవడం, జతను సంపాదించడం, లేదా ఒక గూడు నిర్మించుకోవడం వంటి తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి తమ మెదళ్ళను ఉపయోగిస్తాయి. కేవలం మానవులు మాత్రమే ప్రస్తుతానికి మించి ఆలోచిస్తారు. కొందరు తమ చర్యలు సుదూర భవిష్యత్తులో పర్యావరణాన్ని లేదా తమ వంశస్థులను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచిస్తారు. ఎందుకని? ప్రసంగి 3:11 మానవుల గురించి ఇలా చెబుతుంది: “ఆయన [సృష్టికర్త] శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు.” అవును, అనంతకాలం యొక్క అర్థాన్ని అన్వేషించడం లేదా అంతంలేని జీవితాన్ని గురించి ఆలోచించడం విషయంలో మీ సామర్థ్యం అసామాన్యమైనది.
సృష్టికర్త అర్థాన్ని చేకూర్చనివ్వండి
19. సృష్టికర్తను గురించి ఇతరులు ఆలోచించేలా మీరు ఏ మూడు భాగాల తర్కనా విధానాన్ని ఉపయోగించవచ్చు?
19 మనం కేవలం మూడు రంగాలను మాత్రమే చూశాం: అనంతమైన విశ్వంలో మనకు కనబడే ఖచ్చితత్వం, భూమ్మీద జీవావిర్భావం, త్రోసిపుచ్చలేని మానవ మెదడు యొక్క సాటిలేనితనమూ, వైవిధ్యభరితమైన దాని సామర్థ్యాలూ. ఈ మూడూ దేన్ని చూపిస్తున్నాయి? ప్రజలు ఒక నిర్ధారణకు చేరుకునేందుకు సహాయపడటానికి మీరు ఉపయోగించగల ఒక తర్కన విధానం ఇక్కడుంది చూడండి. మీరు ముందు ఇలా అడుగవచ్చు: విశ్వానికి ఆరంభం అంటూ ఉందా? ఉందని చాలామంది అంగీకరిస్తారు. అప్పుడు ఇలా అడగండి: ఏదీ కారణమవ్వకుండానే అది ఆరంభమయ్యిందా లేదా ఏదైనా కారణమయ్యిందా? విశ్వారంభానికి ఏదో ఒకటి కారణమయ్యుంటుందని అనేకులు గ్రహిస్తారు. ఇది చివరి ప్రశ్నకు దారితీస్తుంది: ఏదో ఒక కారకం వల్ల ప్రారంభమయ్యుంటుందా లేక శాశ్వతంగా ఉండే ఎవరో ఒకరి మూలంగా ప్రారంభమయ్యుంటుందా? ఈ విధంగా స్పష్టంగాను, తర్కబద్ధంగాను విషయాల్ని వారి ముందుంచినప్పుడు చాలామంది ఈ నిర్ధారణకు వస్తారు: ఒక సృష్టికర్త తప్పకుండా ఉండివుండాలి ! విషయం అదైనట్లైతే మరి జీవితానికి అర్థం కూడా ఉండివుండదా?
20, 21. మన జీవితానికి అర్థం ఉండటానికి సృష్టికర్తను తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
20 మన ఉనికి యావత్తును, మనకు నైతిక స్పృహతో సహా—అంతెందుకు, నైతికత అనే తలంపును కూడా—సృష్టికర్తతో ముడిపెట్టాలి. డాక్టర్ రాలో మే ఒకప్పుడిలా వ్రాశాడు: “సరైన నైతిక వ్యవస్థ అనేది ప్రాథమికంగా జీవితార్థంపై ఆధారపడి ఉంటుంది.” అదెక్కడ దొరుకుతుంది? ఆయనిలా కొనసాగించాడు: “ఆ ప్రాథమిక వ్యవస్థ నిర్మాణం దేవుని స్వభావమే. సృష్టి ప్రారంభం నుండి చివరి వరకు జీవానికి ఆధారభూతమైన సూత్రాలు దేవుని సూత్రాలే.”
21 అందుకని, “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు” అని సృష్టికర్తను అభ్యర్థించినప్పుడు కీర్తనల గ్రంథకర్త నమ్రతనూ జ్ఞానాన్నీ ఎందుకు ప్రదర్శిస్తున్నాడని మనం అర్థం చేసుకోగలం. (కీర్తన 25:4, 5) తన సృష్టికర్తను మరింతగా తెలుసుకుంటూ ముందుకు సాగేకొలది ఈ కీర్తనల గ్రంథకర్త జీవితం నిశ్చయంగా మరింత అర్థవంతమైనదిగా, మరింత ఉద్దేశసహితమైనదిగా, ఒక లక్ష్యం కలదిగా మారివుంటుంది. మనలో ప్రతి ఒక్కరి విషయంలోనూ అదే వాస్తవం కాగలదు.—నిర్గమకాండము 33:13.
22. సృష్టికర్త మార్గాలను తెలుసుకోవడంలో ఏమి ఇమిడివుంది?
22 సృష్టికర్త యొక్క “మార్గముల”ను తెలుసుకోవడంలో ఆయన ఎలాంటివాడు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన పద్ధతులేమిటి అన్నవి మరింత ఎక్కువగా తెలుసుకోవడం ఇమిడివుంది. కానీ సృష్టికర్త అదృశ్యుడూ, మహా శక్తిమంతుడూ కదా, మనం ఆయన గురించి మరింతగా ఎలా తెలుసుకోగలము? తర్వాతి శీర్షిక దీన్ని పరిశీలిస్తుంది.
[అధస్సూచీలు]
a నాజీ కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లో తన అనుభవాల నుండి డాక్టర్ విక్టర్ ఇ. ఫ్రాంకెల్ ఈ విషయాన్ని గ్రహించాడు: “జీవిత పరమార్థం కోసమైన మానవుని అన్వేషణ అనేది ఆతని జీవితంలో ఒక ప్రాథమికమైన బలం,” జంతువులకున్నటువంటి, “సహజప్రవృత్తి మూలంగా చేసే ‘అప్రధాన’ అన్వేషణ కాదు.” రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత ఫ్రాన్స్‌లో జరిపిన సర్వే, “జీవించడానికి ‘ఏదో ఒక’ సంకల్పం ఉండటం మానవునికి అవసరం అని అభిప్రాయ సేకరణలో పాల్గొన్నవారిలో దాదాపు 89% మంది ఒప్పుకున్నారని చూపించింది” అని కూడా ఆయన అన్నాడు.
మీరెలా ప్రతిస్పందిస్తారు?
◻ మనం మన విశ్వం గురించి మనం విజ్ఞాన శాస్త్ర సమాచారం కన్నా ఇంకా లోతుకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు ఉంది?
◻ సృష్టికర్తను గురించి ఇతరులు ఆలోచించేలా సహాయం చేయడానికి మీరు దేన్ని గురించి చెబుతారు?
◻ జీవితానికి సంతృప్తికరమైన అర్థాన్ని పొందాలంటే సృష్టికర్తను తెలుసుకోవడం ఎందుకు ఒక కీలకమైవుంది?
[18వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
మీరు ఏ నిర్ధారణకు వచ్చారు?
మన విశ్వానికి
↓ / ↓
ఆరంభం లేదు / ఆరంభం ఉంది
↓ / ↓
దానంతటదే ఆరంభమయ్యింది / ఏదో కారణమయ్యింది
↓ / ↓
అనంతకాలం నుండి ఉండే ఏదో కారణమయ్యింది / అనంతకాలం నుండి ఉండే ఒకరు కారణమయ్యారు
[15వ పేజీలోని చిత్రం]
విశ్వంలో కనిపించే విస్తృతీ, ఖచ్చితత్వమూ అనేకమంది సృష్టికర్తను గురించి ఆలోచించేలా నడిపించాయి
[క్రెడిట్ లైను]
Pages 15 and 18: Jeff Hester (Arizona State University) and NASA