మీ సృష్టికర్త—ఆయనెలాంటివాడో తెలుసుకోండి
“నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను.”—నిర్గమకాండము 33:19.
1. ఘనత పొందడానికి సృష్టికర్త ఎందుకు అర్హుడవుతాడు?
బైబిలులోని చివరి పుస్తక రచయిత అపొస్తలుడైన యోహాను, సృష్టికర్తను గూర్చి ఈ బలమైన ప్రకటనను నమోదు చేశాడు: “ప్రభువా [“యెహోవా,” NW], మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడ[వు].” (ప్రకటన 4:10, 11) దీని మునుపటి శీర్షిక నిర్ధారితంగా తేల్చినట్లుగా, ఆధునిక విజ్ఞానశాస్త్రం కనుగొన్న విషయాలు, అన్నింటినీ సృష్టించిన సృష్టికర్తను నమ్మడానికి కారణాలను పెంచుతూ పోతున్నాయి.
2, 3. (ఎ) సృష్టికర్తను గురించి ప్రజలు ఏమి తెలుసుకోవల్సిన అవసరం ఉంది? (బి) సృష్టికర్తను వ్యక్తిగతంగా కలుసుకోవడం ఎందుకు సహేతుకం కాదు?
2 సృష్టికర్త ఉన్నాడన్న విషయాన్ని అంగీకరించడం ఎంత ప్రాముఖ్యమో, ఆయన ఎలాంటి వ్యక్తో తెలుసుకోవడం—ఆయన వాస్తవికమైన వ్యక్తి అనీ, ప్రజల్ని తనవైపుకి ఆకర్షించుకునే వ్యక్తిత్వమూ విధానాలూ ఆయనకు ఉన్నాయనీ తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. మీరు ఎంతగా తెలుసుకున్నా, ఆయన గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవడం మీకు ప్రయోజనకరం కాదా? ఇలా చేయడానికి మనం ఇతర మానవుల్ని కలుసుకునే రీతిలో ఆయన్ను వ్యక్తిగతంగా కలుసుకోవాల్సిన అవసరం లేదు.
3 నక్షత్రాలకు కూడా యెహోవాయే మూలం, మన సూర్యుడు వాటిలో కేవలం ఒక మధ్యస్థాయి పరిమాణంగల నక్షత్రం మాత్రమే. సూర్యునికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించడం మన తలంపుకైనా వస్తుందా? ఎంతమాత్రం రాదు! దాదాపు అందరూ, చాలామంది దానివైపు చూడడం విషయంలో జాగ్రత్తపడతారు, లేదా దాని శక్తివంతమైన కిరణాలు తమ చర్మానికి ఎక్కువసేపు తగలకుండా ఉండేందుకు జాగ్రత్తపడతారు. దాని కేంద్రంలో ఉండే ఉష్ణోగ్రత 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ (2,70,00,000 డిగ్రీల ఫారన్‌హీట్). ఈ థెర్మోన్యూక్లియర్ కొలిమి ప్రతి సెకండుకు, దాదాపు నలభై లక్షల టన్నుల పదార్థాన్ని శక్తిగా మారుస్తుంది. అందులో కేవలం అత్యల్పం మాత్రమే భూమ్మీదికి ఉష్ణంగాను, కాంతిగాను చేరుతుంది, కానీ ఆ చిన్న మొత్తమే ఇక్కడున్న పూర్తి జీవజాలాన్ని పోషిస్తుంది. ఈ ప్రాథమిక వాస్తవాలు సృష్టికర్తకున్న సంభ్రమాశ్చర్యాలను గొలిపే శక్తి విషయంలో మనపై చెరగని ముద్ర వేయాలి. అందుకనే, “[సృష్టికర్త యొక్క] అధికశక్తి . . . [ఆయన] కలిగియున్న బలాతిశయము” గురించి యెషయా వ్రాయగలిగాడు.—యెషయా 40:26.
4. మోషే ఏమి కోరాడు, యెహోవా ఎలా ప్రతిస్పందించాడు?
4 అయితే, ఇశ్రాయేలీయులు సా.శ.పూ. 1513లో ఐగుప్తును విడిచిపెట్టిన కొన్ని నెలల తర్వాత, “దయచేసి నీ మహిమను నాకు చూపు”మని సృష్టికర్తను మోషే అభ్యర్థించాడని మీకు తెలుసా? (నిర్గమకాండము 33:18) సూర్యునికి కూడా దేవుడే మూలం అన్న విషయం గుర్తుంచుకుంటే, “నీవు నా ముఖము చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడ”ని ఆయన ఎందుకు చెప్పాడో మీరు అర్థం చేసుకోగలరు. సృష్టికర్త మోషేను “దాటి వెళ్లుచుండగా” మోషేను సీనాయి పర్వతంపైన ఒక బండసందులో ఉండనిచ్చాడు. అలా మోషే దేవుని “వెనుకపార్శ్వము”కు—అంటే సృష్టికర్త మహిమ యొక్క ఏదో ఒక విధమైన ప్రకాశానికి లేదా ప్రత్యక్షతకు బహిర్గతమయ్యాడు.—నిర్గమకాండము 33:20-23; యోహాను 1:18.
5. మోషే అభ్యర్థనను సృష్టికర్త ఎలా నెరవేర్చాడు, తద్వారా ఏమి రుజువు చేశాడు?
5 సృష్టికర్తను మరింత ఎక్కువగా తెలుసుకోవాలన్న మోషే కోరిక తీరకుండా పోలేదు. స్పష్టంగా ఒక దేవదూత ద్వారా మాట్లాడుతూ దేవుడు మోషేను దాటివెళ్తూ, “యెహోవా కనికరము, దయ దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.” (నిర్గమకాండము 34:6, 7) సృష్టికర్తను మరింత ఎక్కువగా తెలుసుకోవడం అంటే భౌతిక ఆకారాన్ని చూడటం కాదు గానీ, ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన లక్షణాలు ఏమిటి అన్నవాటిని పూర్తి భావంలో గ్రహించడం అని మనకు ఇది చూపిస్తుంది.
6. మన రోగనిరోధక వ్యవస్థ ఎలా ఒక అద్భుతంగా ఉంది?
6 అలా చేయడానికి ఒక మార్గం, దేవుడు సృష్టించిన వాటినుండి ఆయన లక్షణాలను వివేచనతో తెలుసుకోవడమే. మీ రోగనిరోధక వ్యవస్థను పరిశీలించండి. సైంటిఫిక్ అమెరికన్ అనే పత్రిక, రోగనిరోధక వ్యవస్థను గూర్చిన ఒక సంచికలో ఇలా చెప్పింది: “పుట్టుకకు మునుపు నుండి చనిపోయేంత వరకు రోగనిరోధక వ్యవస్థ ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. పరమాణువులూ, కణాలతో కూడిన వేర్వేరు రకాలైన సమూహాలు . . . మనల్ని పరాన్నజీవుల నుండీ వ్యాధికారకాల నుండీ కాపాడతాయి. ఈ రక్షక వ్యవస్థలు లేకపోతే మానవులు మనుగడ సాధించలేరు.” ఈ వ్యవస్థలకు మూలం ఏమిటి? ఆ పత్రికలోని ఒక శీర్షిక ఇలా చెప్పింది: “సూక్ష్మజీవుల దాడుల నుండి, వైరస్‌ల దాడుల నుండి శరీరాన్ని కాపాడే, ఒడుపుగా ఒకదాని మీద మరొకటి పని చేసే కణాల అద్భుతమైన సమూహం గర్భధారణ అయిన దాదాపు తొమ్మిది వారాల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమయ్యే పూర్వకణాల నుండి ఉద్భవిస్తుంది.” గర్భవతి కొంత రోగనిరోధక వ్యవస్థను తన గర్భంలో పెరుగుతున్న పిండానికి సంక్రమింపచేస్తుంది. తరువాత, పాలివ్వడం ద్వారా తల్లి తన బిడ్డకు కొన్ని రోగనిరోధక కణాలను, ప్రయోజనకరమైన రసాయనాలను కూడా అందిస్తుంది.
7. మన రోగనిరోధక వ్యవస్థను గురించి మనం ఏమి పరిశీలించవచ్చు, ఇది ఏ నిర్ధారణకు నడిపిస్తుంది?
7 ఆధునిక వైద్యశాస్త్రం మీకు ఇవ్వగల ఎటువంటి ప్రయోజనాన్నైనా మీ రోగనిరోధక వ్యవస్థ మించిపోతుందన్న విషయాన్ని మీరు నిస్సందేహంగా నమ్మవచ్చు. కాబట్టి, మిమ్మల్ని మీరు ‘దానికి మూలకర్త అయిన వ్యక్తిని గురించి, దాన్ని సరఫరా చేస్తున్న వ్యక్తిని గురించి ఇది ఏమి సూచిస్తుంది?’ అని ప్రశ్నించుకోండి. ‘గర్భధారణ అయిన దాదాపు తొమ్మిది వారాల తర్వాత, మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమయ్యే’ ఈ వ్యవస్థ, నవజాత శిశువును కాపాడటానికి సిద్ధంగా ఉన్న ఈ వ్యవస్థ తప్పకుండా లోతైన జ్ఞానాన్నీ ముందాలోచననూ ప్రతిబింబిస్తుంది. కానీ ఈ వ్యవస్థ నుండి మనం సృష్టికర్తను గురించి మరింత ఎక్కువ తెలుసుకోగలమా? అభాగ్య ప్రజలకు వైద్య సంరక్షణను అందించడానికి తమ జీవితాల్నే ధారపోసిన అల్బర్ట్ ష్వీట్జర్, ఇంకా అటువంటి మరితరుల గురించి మనలో చాలామంది ఏ నిర్ధారణకు వస్తాము? మనం సాధారణంగా అటువంటి సానుభూతిగల మానవతావాదులకు మంచి లక్షణాలను ఆపాదిస్తాము. అలాగే, పేదా ధనికా తేడా ఏమీ లేకుండా అందరికీ ఒక రోగనిరోధక వ్యవస్థను అందజేస్తున్న మన సృష్టికర్త గురించి మనం ఏ నిర్ధారణకు రావచ్చు? ఆయన ప్రేమగల, నిష్పక్షపాతియైన, సానుభూతిగల, న్యాయంగల వ్యక్తి అని స్పష్టం. సృష్టికర్తను గూర్చి మోషే విన్న వర్ణనకు ఇది పొందికగా లేదా?
తాను ఎలాంటివాడో ఆయనే వెల్లడిస్తున్నాడు
8. యెహోవా తనను తాను ఏ ప్రత్యేకమైన రీతిలో బయల్పర్చుకుంటాడు?
8 అయితే, మన సృష్టికర్తను గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి మరో శ్రేష్ఠమైన మార్గం ఉంది—ఆ మార్గం బైబిలే. ఈ విషయం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే విజ్ఞానశాస్త్రం గానీ, విశ్వం గానీ ఎంతమాత్రమూ చెప్పలేని ఆయన్ను గూర్చిన విషయాలు, బైబిల్లో మాత్రమే మరింత స్పష్టంగా ఉన్న మరితర విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన్ను గూర్చిన విషయాల్లో ఒక ఉదాహరణ సృష్టికర్త యొక్క వ్యక్తిగత నామము. కేవలం బైబిలు మాత్రమే సృష్టికర్త నామాన్నీ, దాని అసలు అర్థాన్నీ బయల్పరుస్తుంది. బైబిలు యొక్క హెబ్రీ వ్రాతప్రతుల్లో ఆయన నామము నాలుగు హల్లు అక్షరాలుగా 7,000 సార్లు కనిపిస్తుంది. దాన్ని ఇంగ్లీషులో YHWH లేదా JHVHగా లిప్యంతరీకరణ చేయవచ్చు, అది సాధారణంగా జెహోవా అని ఉచ్చరించబడుతుంది.—నిర్గమకాండము 3:15; 6:3.
9. సృష్టికర్త వ్యక్తిగత నామం యొక్క భావం ఏమిటి, దీన్నుండి మనం ఏ నిర్ధారణకు రావచ్చు?
9 సృష్టికర్తను మరింత శ్రేష్ఠమైన రీతిలో తెలుసుకోవడానికి మనం, ఏదో అమూర్తమైన “మొదటి కారణభూతుడు” అనే లేదా అస్పష్టమైన “నేను ఉన్నవాడను” అనే బిరుదులకన్నా ఆయన ఎంతో ఎక్కువన్న విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆయన వ్యక్తిగత నామమే దీన్ని చూపిస్తుంది. అది “అవుతాడు” లేదా “రుజువవుతాడు” అనే భావంగల హెబ్రీ క్రియాపదం యొక్క ఒక రూపం.a (పోల్చండి ఆదికాండము 27:29; ప్రసంగి 11:3, NW.) దేవుని నామం, “తానే కర్త అవుతాడు” అన్న భావాన్ని సూచిస్తుంది, ఆయన ఉద్దేశిస్తాడనీ చర్య కూడా తీసుకుంటాడనీ నొక్కిచెబుతుంది. మనం ఆయన నామాన్ని తెలుసుకుని ఉపయోగించడం ద్వారా, ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తాడనీ, తన ఉద్దేశాన్ని చురుకుగా వాస్తవరూపానికి తీసుకువస్తాడనీ మనం మరింత గ్రహింపుకు రాగలము.
10. ఆదికాండములోని నివేదిక నుండి అంతర్దృష్టిని కలిగించే ఏ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోగలం?
10 దేవుని ఉద్దేశాల గురించిన, ఆయన వ్యక్తిత్వం గురించిన జ్ఞానానికి బైబిలు మూలం. ఒకప్పుడు మానవజాతికి దేవునితో శాంతియుతమైన సంబంధం ఉండేదనీ, సుదీర్ఘమైన అర్థవంతమైన జీవితాల్ని గడిపే ఉత్తరాపేక్ష ఉండేదనీ ఆదికాండములోని నివేదిక వెల్లడిస్తుంది. (ఆదికాండము 1:28; 2:7-9) యెహోవా, తన నామంలో ఇమిడివున్న సారానికి అనుగుణ్యంగా, మానవులు ఎంతోకాలంగా అనుభవించిన బాధలకు నిరాశానిస్పృహలకు అంతాన్ని తీసుకువస్తాడని మనం నిశ్చయతను కలిగివుండగలము. తన సంకల్పాన్ని నెరవేర్చడాన్ని గురించి మనం ఇలా చదువుతాము: “ఈ భౌతిక ప్రపంచం నిరాశానిస్పృహలకు లోనుచేయబడింది, దాని స్వంత కోరిక ప్రకారం కాదు, కానీ సృష్టికర్త చిత్తప్రకారమే లోబడింది. ఆయన అలా చేస్తూ, ఒకరోజు . . . దేవుని పిల్లల మహిమకరమైన స్వాతంత్ర్యంలో పాలుపొందే ఒక నిరీక్షణనిచ్చాడు.”—రోమీయులు 8:20, 21, జె. డబ్ల్యు. సి. వాండ్ అనువాదం చేసిన ద న్యూ టెస్టమెంట్ లెటర్స్.
11. మనం బైబిలు వృత్తాంతాలను ఎందుకు పరిశీలించాలనుకుంటాము, అటువంటి వృత్తాంతాల్లో ఒకదానిలోని వివరాలు ఏమిటి?
11 మన సృష్టికర్తను గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి బైబిలు కూడా మనకు సహాయం చేయగలదు. సృష్టికర్త ప్రాచీన ఇశ్రాయేలుతో వ్యవహరించినప్పటి ఆయన చర్యలను, ప్రతిచర్యలను అది వెల్లడిచేస్తుంది. ఎలీషా, శత్రుదేశమైన సిరియా సైన్యాధిపతియైన నయమానూ ఇమిడివున్న ఒక ఉదాహరణను పరిశీలించండి. మీరీ వృత్తాంతాన్ని 2 రాజులు 5వ అధ్యాయంలో చదువుతుండగా, ఇశ్రాయేలులో ఉన్న ఎలీషా సహాయంతో నయమాను కుష్ఠరోగం నయమౌతుందని చెరలో ఉన్న ఇశ్రాయేలీయురాలైన ఒక అమ్మాయి చెప్పినట్లు, మీరు చూస్తారు. నయమాను అక్కడికి వెళ్లి ఎలీషా ఏదో ఆధ్యాత్మిక స్వస్థతా కర్మకాండల్లోలా చేతులు ఆడిస్తాడని ఆశించాడు. దానికి బదులుగా, ఎలీషా ఆ సిరియా దేశస్థునితో యొర్దాను నదిలో స్నానం చేయమని చెప్పాడు. నయమాను క్రిందనున్నవారు ఆయన్ను అందుకు ఒప్పించాల్సివచ్చింది, అయినా కూడా, ఆయన అలా స్నానం చేసినప్పుడు, స్వస్థత చేకూరింది. నయమాను అమూల్యమైన బహుమానాలను సమర్పించుకోవాలని చూసినప్పుడు ఎలీషా నిరాకరించాడు. అటుతర్వాత ఆయన సహవాసి దొంగచాటుగా నయమాను దగ్గరికి వెళ్లి అబద్ధంచెప్పి కొన్ని విలువైన వస్తువులు పొందాడు. అతని మోసం అతనికి కుష్ఠు వచ్చేందుకు దారితీసింది. ఇది ఆకర్షణీయమైన మానవసహజమైన ఒక వృత్తాంతం—మనం పాఠం నేర్చుకోగల ఒక వృత్తాంతం.
12. ఎలీషా నయమానుల వృత్తాంతం నుండి మనం సృష్టికర్తను గూర్చిన ఏ నిర్ధారణలకు రాగలం?
12 ఈ విశ్వం యొక్క మహాగొప్ప సృష్టికర్త ఒక చిన్నపాపపై అనుగ్రహం చూపలేనంత అహంభావి కాడని ఎంతో ఆకర్షణీయమైన రీతిలో ఈ వృత్తాంతం చూపిస్తుంది, ఇది నేటి అనేక సంస్కృతుల్లో సాధారణంగా ఉన్నదానికి విరుద్ధంగా ఉంది. ఒకే జాతిపై లేదా ఒకే దేశంపై సృష్టికర్త అనుగ్రహం చూపడని కూడా ఇది నిరూపిస్తుంది. (అపొస్తలుల కార్యములు 10:34, 35) ఆసక్తికరంగా, గతకాలాల్లోనూ ఇప్పుడూ సర్వసాధారణంగా ఉన్న “స్వస్థతలు చేసే వ్యక్తుల” అర్థంపర్థం లేని మంత్రతంత్రాలను ప్రజలు ఉపయోగించుకోవాలని అపేక్షించే బదులు, సృష్టికర్త అద్భుతమైన విచక్షణాజ్ఞానాన్ని ప్రదర్శించాడు. కుష్ఠరోగాన్ని ఎలా స్వస్థపర్చాలో ఆయనకు తెలుసు. మోసం గెలుపొందడాన్ని అనుమతించకపోవడంలో కూడా ఆయన అంతర్దృష్టినీ న్యాయాన్ని ప్రదర్శించాడు. మళ్లీ ఇది కూడా, మోషే విన్నటువంటి యెహోవా వ్యక్తిత్వానికి పొందికగా లేదా? ఆ బైబిలు వృత్తాంతం ఎంతో క్లుప్తంగా ఉన్నప్పటికీ, దాన్నుండి మనం మన సృష్టికర్త ఎలాంటివాడన్న దానిగురించి మనం ఎంతగా గ్రహించవచ్చు!—కీర్తన 33:5; 37:28.
13. బైబిలు వృత్తాంతాల నుండి మనం విలువైన పాఠాలను ఎలా గ్రహించవచ్చో సోదాహరణంగా చెప్పండి.
13 ఇశ్రాయేలీయులు కృతఘ్నతగా ప్రవర్తించిన వృత్తాంతాలు, అందుకు దేవుడు చూపిన ప్రతిస్పందన గురించిన ఇతర వృత్తాంతాలు యెహోవా నిజంగా శ్రద్ధవహిస్తాడని నిరూపిస్తాయి. ఇశ్రాయేలీయులు ఆయన్ను మాటిమాటికి శోధిస్తూ, ఆయన్ను దుఃఖపెట్టారనీ బాధపెట్టారనీ బైబిలు చెబుతుంది. (కీర్తన 78:40, 41) అంటే, సృష్టికర్తకు అనుభూతులు ఉంటాయనీ, మానవులు చేసే పనుల్ని ఆయన లక్ష్యపెడతాడనీ అర్థం. ప్రసిద్ధులైన వ్యక్తుల వృత్తాంతాల నుండి కూడా మనం నేర్చుకోవల్సింది ఎంతో ఉంది. ఇశ్రాయేలుకు రాజుగా దావీదు ఎంపిక చేయబడినప్పుడు “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును” అని దేవుడు సమూయేలుకు చెప్పాడు. (1 సమూయేలు 16:7) అవును, మనం అంతరంగంలో ఎవరమైవున్నామో సృష్టికర్త చూస్తాడు, కేవలం బాహ్య రూపాన్ని చూడడు. ఎంత ఆహ్లాదకరమైన విషయం!
14. మనం హెబ్రీ లేఖనాలను చదువుతుండగా, ప్రయోజనకరమైన దేన్ని చేయగలం?
14 బైబిలులోని ముప్ఫై తొమ్మిది పుస్తకాలు యేసు కాలానికి ముందు వ్రాయబడ్డాయి, మనం వాటిని చదవడం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కేవలం బైబిలు వృత్తాంతాల్ని లేదా బైబిలు చరిత్రను తెలుసుకోవడానికే కాకూడదు. మన సృష్టికర్త ఎలాంటి వ్యక్తి అన్న విషయం మనం నిజంగా తెలుసుకోవాలనుకుంటే, మనం ఆ వృత్తాంతాలను ధ్యానించాలి, బహుశ, ‘ఆయన వ్యక్తిత్వం గురించి ఈ వృత్తాంతం ఏమి బయల్పరుస్తోంది? ఆయన లక్షణాల్లో ఏది ప్రస్ఫుటమౌతోంది?’ అని ఆలోచించవచ్చు.b ఆ విధంగా చేయడం బైబిలు దైవికమైన పుస్తకమని గ్రహించడానికి సంశయవాదులకు సహితం సహాయం చేయగలదు. తద్వారా వారు బైబిలు యొక్క కర్తను తెలుసుకునేందుకు ఒక ఆధారాన్ని ఇస్తుంది.
సృష్టికర్తను తెలుసుకోవడానికి మనకు ఒక గొప్ప బోధకుడు సహాయపడతాడు
15. యేసు చర్యలూ, ఆయన బోధలూ మనకు నిర్దేశాలనిచ్చేవిగా ఎందుకు ఉండాలి?
15 సృష్టికర్త యొక్క ఉనికిని సంశయించే ప్రజలకు, లేదా దేవుని గురించిన భావన అస్పష్టంగా ఉన్న ప్రజలకు బైబిలును గురించి ఎక్కువగా తెలియకపోవచ్చన్నది నిజమే. బహుశ మీరు, మోషే మత్తయికి ముందు జీవించాడో తరువాత జీవించాడో చెప్పలేని వ్యక్తులను, యేసు చేసిన క్రియల గురించి బోధల గురించి బొత్తిగా ఏమీ తెలియని వ్యక్తులను కలిసివుండవచ్చు. అది చాలా విషాదకరమైన విషయం, ఎందుకంటే గొప్ప బోధకుడైన యేసు నుండి సృష్టికర్తను గురించి ఎంతో నేర్చుకోవచ్చు. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగివున్న ఆయన మన సృష్టికర్త ఎలా ఉంటాడో వెల్లడిచేయగలడు. (యోహాను 1:18; 2 కొరింథీయులు 4:5, 6; హెబ్రీయులు 1:3) ఆయన వెల్లడి చేశాడు కూడా. నిజానికి, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని ఆయన ఒకసారి అన్నాడు.—యోహాను 14:9.
16. సమరయ స్త్రీతో యేసు సంభాషించడం ఏ విషయాన్ని సోదాహరణంగా తెలుపుతుంది?
16 ఈ ఉదాహరణను పరిశీలించండి. ఒక సందర్భంలో యేసు ప్రయాణ బడలికతో ఉన్నప్పుడు ఆయన సుఖారనే ఊరిదగ్గర ఒక సమరయ స్త్రీతో మాట్లాడాడు. ‘ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాల్సిన’ అవసరతపై కేంద్రీకరిస్తూ, అద్భుతమైన సత్యాలను ఆయన ఆమెతో పంచుకున్నాడు. ఆ కాలంలోని యూదులు సమరయులకు దూరంగా ఉండేవారు. దానికి విరుద్ధంగా, ఎలీషా నయమానుల వృత్తాంతంలో కూడా మనం గమనించినట్లు, అన్ని జనాంగాలకూ చెందిన యథార్థవంతులైన స్త్రీపురుషులను స్వీకరించడానికి యెహోవాకున్న సుముఖతను యేసు ప్రతిబింబించాడు. ఇది, నేటి లోకంలో సర్వత్రా వ్యాపించివున్న సంకుచితమనస్తత్వం మతపరమైన శత్రుత్వ భావాలకు యెహోవా అతీతుడని మనకు పూర్తి నిశ్చయతను ఇవ్వాలి. యేసు ఒక స్త్రీకి అదీ, తన భర్తకాని వ్యక్తితో జీవిస్తున్న ఒక స్త్రీకి బోధించడానికి సుముఖత చూపించాడన్న వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. ఆమెను నిందించడానికి బదులుగా యేసు ఆమెకు గౌరవమిస్తూ ప్రవర్తించాడు, అది ఒకవిధంగా, ఆమెకు నిజంగా సహాయపడగల్గింది. అటుతర్వాత, ఇతర సమరయులు యేసు చెప్పినది విని, ‘ఈయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాము’ అనే నిర్ధారణకు వచ్చారు.—యోహాను 4:2-30, 39-42; 1 రాజులు 8:41-43; మత్తయి 9:10-13.
17. లాజరు పునరుత్థానము గురించిన వృత్తాంతము ఏ విషయాన్ని నిర్ధారిస్తుంది?
17 యేసు చర్యల్నీ, ఆయన బోధల్నీ మనం బాగా తెలుసుకోవడం ద్వారా మనం సృష్టికర్తను గురించి ఎలా నేర్చుకోగలమో చూడడానికి మనం మరో దృష్టాంతాన్ని పరిశీలిద్దాము. యేసు స్నేహితుడైన లాజరు మరణించిన సందర్భాన్ని ధ్యానించండి. మృతులను మరల సజీవులను చేయగల తన శక్తిని యేసు ముందే రుజువు చేశాడు. (లూకా 7:11-17; 8:40-56) అయితే లాజరు సహోదరియైన మరియ విలపించడం చూసి ఆయన ఎలా ప్రతిస్పందించాడు? యేసు ‘ఆత్మలో మూలుగుచు,’ ‘కలవరపడ్డాడు.’ యేసు ఉదాసీనంగానో తనకేమీ పట్టనట్టుగానో లేడు; ఆయన ‘కన్నీళ్లు విడిచాడు.’ (యోహాను 11:33-35) ఇది ఏదో కేవలం ఉద్వేగాన్ని ప్రదర్శించడం కాదు. యేసు సకారాత్మక చర్య తీసుకునేందుకు కదిలించబడ్డాడు—ఆయన లాజరును పునరుత్థానం చేశాడు. సృష్టికర్త యొక్క అనుభూతులను, ఆయన చర్యలను అపొస్తలులు గుణగ్రహించేలా వారికి అది ఎలా సహాయపడిందో మీరు ఊహించవచ్చు. అది సృష్టికర్త వ్యక్తిత్వాన్నీ ఆయన మార్గాలనూ అర్థం చేసుకోవడానికి మనకూ ఇతరులకూ కూడా సహాయం చేయాలి.
18. బైబిలును పఠించడం గురించి ప్రజలు ఎలా భావించాలి?
18 బైబిలును పఠించడానికీ, మన సృష్టికర్త గురించి మరింత ఎక్కువ తెలుసుకోవడానికీ సిగ్గుపడాల్సిన కారణమేమీ లేదు. బైబిలు, కాలం చెల్లిపోయిన ఒక పుస్తకం కాదు. దాన్ని పఠించి, యేసుకు సన్నిహిత సహచరునిగా మారిన ఒక వ్యక్తి యోహాను. ఆయన తర్వాత ఇలా వ్రాశాడు: “మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.” (1 యోహాను 5:20) “సత్యవంతుడైన” వానిని గురించిన జ్ఞానాన్ని పొందడానికి ‘వివేకాన్ని’ ఉపయోగించడం ‘నిత్యజీవానికి’ నడిపించగలదని గమనించండి.
ఆయన్ను గూర్చి తెలుసుకోవడానికి మీరు ఇతరులకు ఎలా సహాయం చేయగలరు?
19. సంశయవాదులైన ప్రజలకు సహాయం చేయడానికి ఏమి చేయడం జరిగింది?
19 మనపట్ల శ్రద్ధవహించే సానుభూతిగల సృష్టికర్త ఉన్నాడని నమ్మడానికీ, ఆయన ఎలాంటి వ్యక్తో గుణగ్రహించడానికీ కొంతమంది వ్యక్తులకు చాలా రుజువులు కావాలి. సృష్టికర్తను గురించి ఇంకా సంశయించేవారు లేదా బైబిల్లో ఉన్నదానితో పొందికలేని దృక్పథంగలవారు కోట్లాదిమంది ఉన్నారు. వారికి మీరు ఎలా సహాయపడగలరు? యెహోవాసాక్షుల 1998/99 జిల్లా మరియు అంతర్జాతీయ సమావేశాల్లో ఒక ప్రభావవంతమైన క్రొత్త ఉపకరణం—మీ పట్ల శ్రద్ధవహించే ఒక సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనే పుస్తకం—అనేక భాషల్లో విడుదల చేయబడింది.
20, 21. (ఎ) సృష్టికర్త పుస్తకాన్ని ఫలవంతంగా ఎలా ఉపయోగించగలం? (బి) సృష్టికర్త పుస్తకం ఇప్పటికే ప్రభావవంతంగా ఉన్నట్లు చూపించే అనుభవాలను చెప్పండి.
20 మన సృష్టికర్తయందు మీ సొంత విశ్వాసాన్నీ, ఆయన వ్యక్తిత్వంపట్లా ఆయన మార్గాలపట్లా మీ మెప్పుదలనూ పెంపొందించే ఒక ప్రచురణ అది. ఎందుకంత నిశ్చయంగా చెప్పగలము? ఎందుకంటే మీ పట్ల శ్రద్ధవహించే ఒక సృష్టికర్త ఉన్నాడా? అనే పుస్తకం ప్రత్యేకంగా అటువంటి లక్ష్యాలతోనే రూపొందించబడింది. “మీ జీవితానికి అర్థాన్ని ఏది చేకూర్చగలదు?” అనే ఒక విషయం పుస్తకం అంతటిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పుస్తకంలోని విషయాలు పెద్ద చదువులు చదివినవారికి కూడా చాలా ఆసక్తికరంగా ఉండే విధంగా సమర్పించబడ్డాయి. అయినప్పటికీ, మనలో ప్రతి ఒక్కరమూ వాంఛించే వాటిని అది చర్చిస్తుంది. సృష్టికర్త ఉనికిని సంశయించే, పాఠకులకు ఆసక్తికరమైన ఒప్పింపజేసే సమాచారం అందులో ఉంది. సృష్టికర్త ఉన్నాడని పాఠకుడు నమ్ముతాడని ఆ పుస్తకం అనుకోవడం లేదు. ఇటీవల బయల్పడిన వైజ్ఞానిక ఆవిష్కరణలు తలంపులు చర్చించబడిన విధానం సంశయవాదుల అవధానాన్ని ఆకట్టుకుంటుంది. అటువంటి వాస్తవాలు దేవుణ్ని నమ్మేవారి విశ్వాసాన్ని కూడా బలపరుస్తాయి.
21 ఈ క్రొత్త పుస్తకాన్ని చదువుతుండగా, అందులోని కొన్ని భాగాలు, దేవుని వ్యక్తిత్వంలోని అంశాలను ఉన్నతపర్చే విధంగా బైబిలు చరిత్రను సంగ్రహంగా అందిస్తున్నట్లు, తద్వారా పాఠకులు దేవుణ్ని మరింత ఎక్కువగా తెలుసుకునేలా సహాయపడుతున్నట్లు గ్రహిస్తాము. ఈ పుస్తకాన్ని ఇప్పటికే చదివేసినవారు తమ విషయంలో అది ఎంత నిజమో వ్యాఖ్యానించారు. (25-6 పేజీల్లోని తరువాతి శీర్షికను చూడండి.) మీరు ఈ పుస్తకంతో మంచి పరిచయం ఏర్పర్చుకుంటూ, తమ సృష్టికర్తను మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి ఇతరులకు సహాయపడటానికి మీరు దీన్ని ఉపయోగిస్తుండగా మీ విషయంలో కూడా అది వాస్తవం కావాలని ఆశిస్తున్నాము.
[అధస్సూచీలు]
a జెసూట్ వేదాంతి అయిన ఎమ్. జె. గ్రంధేనర్ ద క్యాథలిక్ బిబ్లికల్ క్వార్టర్లీకి ప్రధాన సంపాదకునిగా ఉన్నప్పుడు ఈ క్రియాపదానికి పోలిన మరో క్రియాపదాన్ని గురించి తాను ఈ విధంగా చెప్పిన విషయాన్ని వర్తింపజేశాడు: దీనికి “ఇంద్రియగోచరం కాని స్థితిలో ఉనికియన్న భావం ఏమాత్రం లేదు, కానీ ఎల్లప్పుడు అది ఇంద్రియాలతో మాత్రమే గుర్తించదగినదిగా ఉంటుంది లేదా గుర్తించదగినదిగా అవుతుందన్న భావాన్ని వ్యక్తపరుస్తుంది, అంటే ఆ క్రియాపదం వాస్తవరూపం దాలుస్తుంది.”
b తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబిలు వృత్తాంతాలను వివరిస్తుండగా, అటువంటి ప్రశ్నలను వేయడం ద్వారా వారికి సహాయపడగలరు. ఆ విధంగా యౌవనులకు దేవునితో మంచి పరిచయమేర్పడటమే కాక, ఆయన వాక్యంపై ధ్యానించడం ఎలాగో కూడా నేర్చుకుంటారు.
మీరు గమనించారా?
◻ సీనాయి పర్వతం మీద మోషే యెహోవాను గురించి మరెక్కువగా ఎలా తెలుసుకున్నాడు?
◻ దేవుడు ఎలాంటి వ్యక్తియన్నది తెలుసుకోవడానికి బైబిలును పఠించడం ఎలా సహాయం చేయగలదు?
◻ మనం బైబిలును చదువుతుండగా, మన సృష్టికర్తకు మరింత సన్నిహితులం కావడానికి ఏమి చేయగలం?
◻ సృష్టికర్త పుస్తకాన్ని ఏ విధంగా ఉపయోగించేందుకు మీరు పథకం వేసుకుంటారు?
[20వ పేజీలోని చిత్రం]
మన రోగనిరోధక వ్యవస్థ మన సృష్టికర్తను గురించి ఏమని సూచిస్తుంది?
[21వ పేజీలోని చిత్రం]
ఇది మృత సముద్రపు చుట్టల్లో ఒక భాగం, ఇక్కడ టెట్రాగ్రమాటన్ (హెబ్రీలో దేవుని నామము) ఉన్నతపర్చబడింది
[క్రెడిట్ లైను]
Courtesy of the Shrine of the Book, Israel Museum, Jerusalem
[23వ పేజీలోని చిత్రం]
మరియ దుఃఖాన్ని చూసి యేసు ప్రతిస్పందించిన విధానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు