యౌవనస్థులారా—మీ పాఠశాల విద్యాభ్యాస కాలాన్ని సద్వినియోగపరచుకోండి
1 వేసవి సెలవులను గడిపాక స్కూలుకు తిరిగి వెళ్ళే విషయం గురించి మీరెలా భావించారు? మరొక విద్యా సంవత్సరం నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారా? మీ తోటివిద్యార్థులతోను, ఉపాధ్యాయులతోను సత్యాన్ని పంచుకునేందుకు మీ స్కూల్ మీకిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారా? స్కూల్లో మీకు సాధ్యమైనంత మేరకు సాక్ష్యమివ్వాలని మీరనుకుంటారని మాకు నమ్మకముంది.
2 మంచి విద్యార్థిగా ఉండండి: మీరు క్లాసులకోసం బాగా సిద్ధమై, శ్రద్ధాపూర్వకమైన అవధానాన్నిస్తే, శాశ్వతమైన ప్రయోజనాలను పొందుతారు. మీ హోమ్ వర్క్‌లో మంచి శ్రద్ధ చూపండి, కానీ మీ స్కూల్ వర్క్ మీ దైవపరిపాలనా కార్యకలాపాలకు అంతరాయం కల్గించేందుకు అనుమతించకండి.—ఫిలి. 1:9.
3 పాఠశాలలో మరో సంవత్సరాన్ని ప్రారంభించే ముందు జెహోవాస్ విట్నెసెస్ అండ్ ఎడ్యుకేషన్ అనే బ్రోషూర్ చదవండి. ఆ తర్వాత, మీరు గానీ, మీ తల్లిదండ్రులుగానీ మీ ఉపాధ్యాయుల్లో ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రతిని ఇవ్వండి. వాళ్ళకు ఏమైన సంశయాలుంటే జవాబులు దొరుకుతాయని వాళ్ళకు తెలియజేయండి. మీ సిద్ధాంతాలనూ, నమ్మకాలనూ సరిగ్గా అర్థం చేసుకునేందుకూ, మీకు బోధింపబడిన విషయాలను మీరు ఆచరణలో పెడ్తుండగా మీతో సహకరించేందుకూ ఇది వారికి సహాయపడుతుంది. మీరు అమూల్యమైన విద్యనార్జించడానికి వారు మీకు సహాయపడుతుండగా మీరూ, మీ తల్లిదండ్రులూ వారికి సహకరించాలని కోరుకుంటారని కూడా మీ టీచర్లకు అది హామీ ఇస్తుంది.
4 మంచి సాక్షిగా ఉండండి: అనియత సాక్ష్యానికి పాఠశాలను మీ వ్యక్తిగత పరిచర్య ప్రాంతంగా ఎందుకు దృష్టించకూడదు? రానైయున్న విద్యా సంవత్సరంలో, సాక్ష్యమిచ్చేందుకు మీకు అనుపమానమైన అవకాశాలు లభిస్తాయి. మీకు అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానముంది. మీరు దానిని ఇతరులతో పంచుకున్నప్పుడు అది ‘మిమ్మల్నీ మీ బోధ వినేవారినీ రక్షించగలదు.’ (1 తిమో. 4:16) మాదిరికరమైన క్రైస్తవ నడవడిక ద్వారా, సముచితమైన ప్రతి అవకాశంలోను సాక్ష్యమివ్వడం ద్వారా, మీరు ప్రయోజనం పొందుతారు, అలాగే ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తారు.
5 ఒక యౌవన సహోదరుడు తన పాఠశాలలో తోటి విద్యార్థులకు అనియతంగా సాక్ష్యమిచ్చాడు. అందుకు అనుకూలంగా ప్రతిస్పందించినవారిలో, ఒక క్యాథలిక్కూ, దేవుడిని విశ్వసించేవారిని హేళనచేస్తుండిన ఒక నాస్తికుడూ, ఎడతెరిపి లేకుండా సిగరెట్లు త్రాగేవాడూ త్రాగుబోతూ అయిన ఒక యౌవనస్థుడూ ఉన్నారు. ఇలా తన తోటివాళ్ళు మొత్తం 15 మంది సమర్పించుకుని బాప్తిస్మం పొందేందుకు ఈ యౌవన సహోదరుడు సహాయపడ్డాడు!
6 కనుక, యౌవనస్థులారా, చదువులోనూ, మీ అనుపమాన పరిచర్య ప్రాంతంలో సాక్ష్యమివ్వడంలోను కృషి చేయండి. అలాగైతే, మీరు పాఠశాలకు వెళ్ళడం నుండి గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు.